డైలీ సీరియల్
జగదేకసుందరి క్లియోపాత్రా--90
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆమె మృదుమధుర కంఠస్వరాన్ని వింటూన్నంతసేపు ఏంటనీలో కూడా అలాటి భావాలే మెరుపులవలె మెరిసి ఉంటవి. కనుకనే అతను కూడా ఎంత ప్రయత్నించినా కన్నీటిని అరికట్టలేకపొయ్యాడు.
ఏంటనీ ఆమె ముందు మోకరించాడు.
‘‘రాణీ! నా తప్పు క్షమించు. నిన్ను అర్థం చేసుకోబోయి అపార్థం చేసుకున్నాను. ఈ కష్ట సమయంలో నన్ను విడిచివెళ్తే, చివరకు నా శవం కాకులకూ, గద్దలకూ ఆహారవౌతుంది’’ అన్నాడు ఏంటనీ.
క్లియోపాత్రా పకపకా నవ్వింది.
‘‘రోమన్ సర్వాధికారి కాదగిన మహావీరుడు ఒక అబల సహాయాన్ని అర్థించటమేమిటి? అందితే జుట్టూ, అందకుంటే కాళ్ళూనా?’’ అన్నదామె.
‘‘రాణీ! తప్పు తెలుసుకున్నాను. అందుకని నీవిప్పుడు ఎలా దూషించినా, ఏం చేసినా ఓర్చగలను. కృతజ్ఞుడుగా ఈ జన్మంతా గడుపుతాను. రాణీ! ఇక జీవితంలో నిన్ను విడువను. అది నా అంతమే అయేట్లయితే, నవ్వుతూ స్వీకరిస్తాను. నీవు అమృతమూర్తివి! ప్రణయదేవతవు. నన్ను ఆరాధకుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను’’ అన్నాడతను.
‘‘బాగున్నది! ఏంటనీ నీవు నన్ను పూజించావు. కాదనను. కాని, నీ అవసరాలనేవి నిన్ను పీడిస్తున్నప్పుడు నన్ను పూలతో పూజించావు. అవి తీరాక రాళ్ళతో పూజించావు - అంతే తేడా!’’
‘‘నన్ను నేను సమర్థించుకునే స్థితిలో లేను రాణీ! నీవు నన్ను మనసారా ప్రేమించావనే సంగతి ఇంతకుముందే తెలుసుకున్నాను. కనుకనే నాకు ప్రాణదానం చేయగలిగావీనాడు. ఆ దాతృత్వాన్ని ఆధారం చేసుకొనే వేడుకుంటున్నాను. నన్ను కరుణించు రాణీ’’ అన్నాడతను కళ్ళవెంట నీరు కారుస్తూ.
‘‘మొగవాడివి - ఏడుస్తావేమిటి?’’ అన్నదామె.
ఆమె కళ్ళు మిలమిలమెరుస్తూన్నవి.
ఏంటనీ సిగ్గుపడ్డాడు. అయితేనేం ఆ సిగ్గుచాటునే తానిప్పుడు దాక్కోగలిగినందుకు సంతోషపడ్డాడు. మాట్లాడేందుకు మాటలు కూడా రావటం లేదతనికి.
‘‘ఏంటనీ! ఇంత అమాయకుడివైనందుకు ఒక పక్క జాలివేస్తూన్నది!’’ అన్నదామె.
చాలు - క్లియోపాత్రా సానుభూతి ప్రసరిస్తే, దానికి అంతుండదని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. తన బతుకు హాస్యాస్పదమైపోయింది. అయినప్పటికీ ఆ పతనంలోనే తనకు సానుభూతి చిక్కింది.
‘‘రాణీ! నన్ను నేనిప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. నిన్ను ఎనె్నన్ని మాటలన్నానో అన్నిటికీ పశ్చాత్తాపపడుతున్నాను’’
‘‘సమయం మించిపోయంది కానీ’’
‘‘రాణీ! కాలచక్రమనే నీ చేతుల్లో వున్నది. నీవు తలచుకుంటే, దాన్నిప్పుడే వెనక్కు తిప్పగలవు’’
‘‘ఎందుకు నాకా శ్రమ?’’
‘‘నాకోసం రాణీ! నీ ప్రణయాన్ని ఆరాధించి తరించే ఈ దీన మానవుడికోసం’’!
‘‘నన్నింకా ప్రేమిస్తున్నావా ఏంటనీ? చాలా చిత్రంగా వున్నది! నీ ప్రేమ దాని ఇష్టానుసారంగా రంగు మార్చుకుంటూ ఉంటుందా? ఇంతకుముందు నన్ను కులటని కూడా పిలిచావు కదా! కులటదగ్గిర ప్రేమ, ఎండమావులోని నీరులాంటిదని నీకు తెలియదా? ఏంటనీ! నీది ప్రేమ కాదు, బహుశా వాంఛ- గాఢమైన వాంఛ అయి ఉండొచ్చు. ఆ వాంఛ తీరాక, అదెంత నీచమైనదోనని కూడా బాధపడవలసి వుంటుంది. నిన్ను రోమ్‌లో దేశద్రోహిగా ప్రకటించారు కదా! నేనప్పుడన్నా అలా అన్నానా? నిన్ను అగౌరవించేందుకు ప్రయత్నించానా? కాని, నీవు ననె్నలా అగౌరవించావు? రోమన్ సామ్రాజ్యానికి సర్వాధికారిననే గర్వంతో ఆక్టోవియన్ నన్ను ‘కులట’ అన్నాడు. నీవూ అన్నావు కదా! నీ మెదడులో ఏ మాత్రం ఆలోచనా తరంగమనేది ఉన్నప్పటికీ, అంత తేలిగ్గా అనగలిగి ఉండేవాడినా? మాటలు అతి చౌక! నాలుక వుంటే ఎన్ని మాటలన్నా మాట్లాడవచ్చు కదా! అదే రుజూ చేశావు. కాని, మాటల వెనుక దాగిన అర్థతాత్పర్యాలూ, అవి చేయగల మహత్తర కార్యాలూ, వాటి శక్తి సామర్థ్యాలూ నీకు తెలియలేదు. అదే నాలుకతో సరిగ్గా విరుద్ధంగా మాట్లాడగలుగుతున్నావు కదా! ఏంటనీ, నన్ను ‘నైల్నది విషనాగు’ అన్నావు. కాని నీకు రెండు నాలుకలున్నవని రుజువైంది. మరి నేనా పామును? నీవా?’’ అన్నదామె.
‘‘రాణీ! నీ క్షమ ఒక్కటి మాత్రమే నన్నీ ప్రపంచంలో సర్వనాశనం కాకుండా కాపాడగలదు. జరిగింది మరిచిపోగల విశాల హృదయమున్నది నీకు. ఆ హృదయంలో నన్ను తలదాచుకోనిమ్మని ప్రార్థిస్తున్నాను!’’ అన్నడు ఏంటనీ.
‘‘మరిచిపొయ్యేదా? ఏంటనీ! నీ అంత తేలిగ్గా మరిచిపోగలమా? బహుశా ఆ మరుపు నీకు అలవాటే అయి వుంటుంది. ఏ కళ్ళతో దేవతామూర్తి క్లియోపాత్రాను చూశావో, ఆ కళ్ళతోనే మహమ్మారిని చూశావు మరి! నీవిప్పుడు జ్ఞాపకం చేసే మన ప్రణయోపాసనను ఇందాక, ఒక్క క్షణంలో ఎలా మరిచిపోగలిగావు. ఆ జ్ఞాపకాల మీదనే కదా ఆధారపడింది.. ఏంటనీ! ఈ వ్యర్థ ప్రసంగం దేనికి? పురుషునివలె ఎదుర్కొని, నీ ఖర్మను అనుభవించు. నేను కూడా విధి విలాసాన్ని స్వీకరిస్తాను. అంతకన్నా నీకు చెప్పవలసిన సందేశం కానీ, సలహా కానీ లేదు’’ అన్నదామె.
ఏంటనీ వలవలా ఏడ్చాడు.
‘ఏంటనీ! లేచి ఇట్లా కూర్చొని ఆలోచించు. ఏడుస్తే ఏం ప్రయోజనం?’’ అన్నదామె.
‘‘నేను లేవలేను రాణీ! నన్ను భూమికి దిగదొక్కేశావు పైకి తీయగల సమర్థురాలివి కూడా నీవే! నా విధివి నీవు. నీ ఆజ్ఞల్ని పాలించే బానిసగానన్నా నన్ను స్వీకరించు. రాణీ! నేనెంత దీనాతిదీనమైన స్థితిలో ఉన్నానో చెప్పగలిగే భాషా విజ్ఞానం నాకు లేదు!’’ అన్నాడతను.
క్లియోపాత్రా ద్రవించిపోయింది. ఏంటనీ ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు. వాగ్వాదాన్ని ఎదుర్కోలేని వాడిమీదికి ఒంటికాలిమీద వెళ్ళటం కూడా న్యాయంగా తోచలేదామెకు.
ఏంటనీని క్షమించినట్లయితే అతను ఎందుకూ కొరగాకుండా పోతాడు. అదీగాక, ఏంటనీయే తన చివరి పావు. దీన్ని వదులుకుంటే తనకు మరొక ఆధారమంటూ ఉండదు. ఎటూ లొంగిపొయ్యాడు కనుక, అతన్ని బాధించటం, శవాన్ని బాధించటంతో సమానమే కాగలదు! తనకు ప్రియుడు, ఆరాధ్య దైవం, ఇలవేలుపు- బానిసగానన్నా బతకనిమ్మని ప్రార్థిస్తుంటే, ఇక అంతకన్నా దిగజారిపోవటమనేది ఉండబోదు. పూర్వంవలె తాను ఏంటనీని లొంగదీసుకోవాల్సిన శ్రమ లేదు. అతను పూర్తిగా లొంగిపొయ్యాడు. తన తుది అస్త్రంగా ఇతన్ని తన ఇష్టానుసారంగా ఉపయోగపెట్టుకునే సదవకాశం వచ్చిపడినందుకు ఆమె ఆనందించింది.
‘‘పిచ్చి ఏంటనీ! ఎంత మారిపొయ్యావు?’’ జాలిగొలిపే విధంగా అని, ఆమె అతనికి తన మృదువైన చేతిని అందించింది.
తన నోములన్నీ ఇంత తేలిగ్గా ఫలిస్తవని అతను అనుకోలేదు. నడి సముద్రంలో పడి కొట్టుకొని పొయ్యేవాడికి నావ దొరికినప్పుడు, దాన్ని ఎంత గాఢంగా పట్టుకుంటాడో, అదేవిధంగా ఏంటనీ తన హస్తాన్ని పట్టుకొని లేచి నిలబడ్డాడు.
ఏంటనీ క్లియోపాత్రా కన్నా కొంచెం పొడగరి. లేచి నిలబడ్డాక కూడా అతనికి ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేకపోయింది. ఆమే అతని ముఖాన్ని తుడిచింది. తనమీద తనకు కలిగిన జాలితో ఏంటనీ వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.
- ఇంకాఉంది