డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి దృష్టిలో ఏంటనీ భోగలాలసతో మూర్ఖుడై, పతనమైపోతున్నాడు. తీరా యుద్ధం ఆరంభమైతే, రోమన్ సైనికులు తమ సోదరులైన రోమన్‌లతో పోరాడేందుకు నిరాకరిస్తే ఏం గతి?
అధవా ఈ యుద్ధానికి, ప్రజాస్వామ్య సంరక్షణ అనే పేరు తగిలించేందుక్కూడా వీలు లేకుండా క్లియోపాత్రా అడ్డుపడుతోంది. ఎందుకంటే, ప్రజాస్వామ్య రక్షణ కొరకు ఏంటనీ బద్ధకంకణుడైతే, అతనొక్కడే ఈ యుద్ధాన్ని పోరాడి ఉండవలసింది. అలాగాక, క్లియోపాత్రా పక్షంలో మాత్రమే సమరానికి సంసిద్ధుడైతే, అది సామ్రాజ్యవాదాన్ని బలపరిచే యుద్ధమే కాగలదు.
ముఖ్యంగా క్లియోపాత్రా మీద రోమన్‌లు మండిపడుతున్నారు. పండంటి ఏంటనీ కాపరాన్ని కూలద్రోసిందామె. మహాఇల్లాలు, పతివ్రత అయిన ఆక్టోవియాను క్లియోపాత్రా కారణంగా, ఆమె సలహాలను పాటించి, ఏంటనీ విడనాడాడు. చివరకు మాతృదేశంమీద కూడా కత్తిదూశాడు. అలాటి క్రూరురాలైన క్లియోపాత్రా మీద ప్రతీకారాన్ని సాధించేందుకు సిద్ధపడిన ఆక్టోవియన్‌కు రోమన్‌లందరూ హృదయపూర్వకంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆమెను వెనకేసుకొచ్చినందుకు, ఇప్పటికీ తన అధోగతిని తెలుసుకోలేని వ్ఢ్యౌంలో పడి కొట్టుకుంటున్నందుకు, ఏంటనీ కూడా బద్ధవిరోధిగా తయారౌతున్నాడు.
విషయాలన్నీ సమగ్రంగా వివరించి, ముందు క్లియోపాత్రాను ఈజిప్టు పంపివేయమని సేనానులు ఏంటనీని హెచ్చరించారు.
కాని ఏంటనీ ఒక్కమాట కూడా చెవినిబెట్టలేదు. చివరకు యుద్ధ రంగంలో తాను పైఎత్తున ఉన్నప్పటికీ, నిజంగా పోరాడవలసిన వారూ, సైన్యాల్ని నడిపించి, ఉత్సాహపరిచి, ఉత్తేజపరచవలసినవారూ ఈ సేనానులేననీ, వీరి సలహాలను తాను పాటించనట్లయితే, వారు గాయపడి, సమయం చిక్కుతే తనకు బుద్ధి చెప్పేందుక్కూడా సిద్ధపడతారనే చిన్న విషయాన్ని కూడా ఏంటనీ గమనించలేదు.
మొత్తంమీద రుూ స్థావరంలో ప్రతిదానికీ కనీసం రెండు భేదాభిప్రాయాలన్నా ఏర్పడినవి. ఒక రకం గందరగోళం ఆరంభమైంది. మరికొంతదూరం ఏంటనీకి చెప్పి చూసేందుకు సేనానులు ఎంతో ప్రయత్నించారు. కాని క్లియోపాత్రా ఏంటనీని ఒంటరిగా ఉండనివ్వటంలేదు. ఆమె ఈ క్లిష్ట పరిస్థితిని పసిగట్టింది. ఏంటనీ ఏ తాగుడు మైకంలోనన్నా ఈ యుద్ధాన్ని విరిమించేందుకు సమ్మతిస్తే, తాను కాదు కదా, తన శవం కూడా ఈజిప్టు చేరదని ఆమెకు తెలుసు. అందుకని, పూర్వంకన్నా ఎక్కువ అనురాగాన్ని వర్షిస్తూ తన వలయం నుంచి, పలుకుబడినుంచి ఏంటనీ బైటపడేందుకు వీల్లేకుండా ఆమె జాగ్రత్తపడింది.
ఒకనాటి ఉదయం ఏంటనీ ముఖ్యమిత్రుడొకాయన, రోమ్ నుంచి రహస్యంగా పారిపోయి ఏంటనీని కలుసుకునేందుకు గ్రీస్ జేరాడు. ఏంటనీ అతన్ని చూడగానే గుర్తించి, ఎదురువెళ్లి కావలించుకున్నాడు. అతన్ని ఎంతో గౌరవించాడు. మధువుతోనూ, రాజభోజనంతోనూ మత్తెక్కించాడు.
ఐతే ఆ మిత్రుడికి రుూ గౌరవాలేమీ అక్కర్లేదు. ఎలాగైనా ఏంటనీతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడాలని అతను విశ్వప్రయత్నం చేశాడు. కాని క్లియోపాత్రా పడనీయటంలేదు. ఒక్క క్షణం కూడా ఏంటనీని విడిచి ఉండటంలేదామె.
ఈ జగదేకసుందరికి ఏంటనీ బానిసైపొయ్యాడని తేల్చుకున్నాడా మిత్రుడు. ఏంటనీలాంటి మహాపురుషుడిలా మారిపోవటం కాలమహిమేననుకున్నాడు. ఇతను తానెరిగిన యోధుడు, ప్రజాస్వామ్య సంరక్షకుడు అయిన ఏంటనీ కాదు. భోగలాలసలో మానవత్వానే్న మరిచిపోయి, ఎప్పుడూ సగం మత్తులోనే ఉండి అదే స్వర్గమని, శాశ్వతమని భ్రమపడుతూన్న పరమ మూర్ఖుడు రుూ ఏంటనీ!
ఇంతదూరం, ప్రాణానిక్కూడా తెగించి, గుండెలవిసేట్లు పరుగెత్తుకొచ్చిన ఆ స్నేహితుడికి ఇక్కడి ఇంద్రసభా, దేవాంగనల నాట్యాలు చూసేప్పటికి రుూ భూగోళానికే ఏదో మూడిందనిపించింది. అతను ఎంతో దుఃఖపడ్డాడు. అసహ్యంతో తిరిగి పోదామనుకున్నాడు. కాని, ఎటూ ఇంత దూరం రానే వచ్చాడు కదా, చెప్పదలుచుకున్న నాలుగు ముక్కలూ చెప్పి చూద్దామని నిశ్చయించుకున్నాడు.
బ్రహ్మప్రళయంమీద, ఏంటనీతో ఏకాంతంగా మాట్లాడే సావకాశం దొరికిందతనికి. తన మాటల్ని శ్రద్ధగా వినేట్లు చేయాలనే ప్రయత్నంలో ఆ స్నేహితుడు ఏంటనీని మత్తునుంచి మేల్కొల్పాలని ప్రయత్నించాడు.
‘మిత్రమా! నేను బాగా తెలివిగానే ఉన్నాను.. చెప్పు’ అన్నాడు ఏంటనీ.
కళ్ళు సగానికే తెరిచి తనవంక చూస్తున్న ఏంటనీ, తాను తెలివిగా ఉన్నానని చెపితే తెలివిలో వున్న ఆ స్నేహితుడెలా నమ్మగలడు? అయినా అర్థమైనంతవరకే అర్థవౌతుందనీ, మళ్లీ సమయం దొరకదనీ అతను చెప్పసాగాడు.
‘‘చెలికాడా ఈనాడు నేను నీ మంచికోరి చెపుతున్నాను. గత ఇరవై ఏళ్ళుగా నీవు దేశభక్తుడుగా ఉన్నావు. నీవంటే ప్రజలకు ఎంతో గౌరవం. నీవు మాట్లాడే ప్రతి మాటా వారికి అర్థవౌతోంది. ఆక్టోవియన్ పరిపాలన ప్రజారంజకం కాదు. సీజర్ వారసుడుగా మాత్రమే వారు అతన్ని గౌరవిస్తున్నారు. తాను తిరిగి చక్రవర్తి కావాలని అతని ఆంతరంగిక వాంఛ! అతని అధికారాన్ని కూలద్రోయకుంటే, ప్రజాస్వామ్యమనేది రోమ్‌లో ఉండనేరదు.. కాని, ఈనాడు ప్రజలు అతని పక్షానే ఉన్నారు. నీవు మాతృదేశం మీద కత్తిదూస్తున్నావనే మాట ప్రతి పౌరుని హృదయంలోనూ ఒక కత్తిపోటుగానే ఉన్నది.. ఇప్పటికైనా అంతా మంచిపోలేదు. నీవు రోమ్‌కు తిరిగిరా. నిన్ను ప్రజలు గౌరవిస్తారు; వారి హక్కుల్ని కాపాడినవాడివౌతావు’’ అన్నాడా మిత్రుడు.
‘‘రోమ్‌కు ఎలా తిరిగి రాను?’’ అన్నాడు ఏంటనీ పిచ్చిగా నవ్వుతూ. ‘‘సాధారణ పౌరునివలెనా? దేశద్రోహిగానా?.. అసంభవం! ఇక గౌరవా గౌరవాలంటావా? వాటిమీద నాకు నమ్మకం పోయింది. ప్రజాస్వామ్యమంటావా- అదీ ఎండమావిగానే నాకు కనిపిస్తోంది. పేరుకు ఎన్నికలు, ప్రజాప్రతినిధుల పరిపాలనా జరుగుతోంది. ఇది బహిరంగ విషయం.. కాని అంతరంగికంగా జరిగేదేమిటి? సర్వాధికారులనేవాళ్ళు ప్రజాప్రతినిధుల్ని లంచాలతో కొనేస్తున్నారు. నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. ఈ మాట మనం పైకి అనలేకపోవచ్చు. ప్రజల్ని పరిపాలనంతా తమదేనని కూడా మనం నమ్మించొచ్చు. కాని, సర్వం తెలిసిన మనకు అసలు కీలకమేమిటో వేరుగా చెప్పాలా? ఈ కాస్తా కూడా ఊడిపోవచ్చునని ప్రజాక్షేమాన్ని కోరే మీరంతా భయపడుతుండవచ్చు. కాని, దానికి నేనే బాధ్యుణ్ణవాలా?.. ఇక కీర్తి అంటావా, ఏం చేసుకోను? అంత కీర్తి సంపాయించిన పాంపే ఏమయ్యాడు?.. ప్రతి రోమన్‌కూ పూజనీయుడుగా ఉండి, జగదేకవీరుడని పేరుగాంచిన జూలియస్ సీజర్ కీర్తి ఎలా పరిణమించింది? మిత్రమా! ఇదంతా మిథ్య. ఈ మిథ్యకోసం శ్రమపడటం వొట్టి వ్ఢ్యౌం కాదా?’’
‘‘ఇదంతా మిథ్యగా గ్రహించిన వేదాంతివి క్లియోపాత్రా ప్రేమను మాత్రం మిథ్యగా ఎందుకు గ్రహించకపోతున్నావో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను’’ అన్నాడా స్నేహితుడు.
‘‘ఈ మిథ్యా పపంచంలో ఆమె ఒక్కతే సత్యమనిపిస్తోంది. నీవు చూశావు కదా- ఆమె అందాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చు’’
మాట మధ్యలోనే అడ్డుపడి ‘‘నీవు ఆమె అందాన్ని చిదిమి దీపం పెట్టుకున్నావు ఏంటనీ! ఐతే నీవు మాత్రం శలభానివయ్యావు? ఆ దీపపు సెగలో కాలి, మసయిపోతావు. గుర్తుంచుకో!’’ అన్నాడతను.
‘‘ఐతే సరే! మనం శాశ్వతం కనుకనా, రుూ అనుభవాలన్నీ శాశ్వతాలు కావని ఏడిసేందుకు?’’ అన్నాడు ఏంటనీ.
‘‘ఏంటనీ! నీ వాదానికి తలా తోకా లేదు. కొంతసేపు ప్రపంచమే మిథ్య అంటావు. మరికొంతసేపు ఈ ప్రపంచంలోని కొంతభాగం, నీకు అవసరమనుకున్నది మాత్రం సత్యమంటావు. కాసేపు అదే శాశ్వతమనే ధోరణిలో పొంగిపోవు. ఇంకాస్సేపు ఒకవేళ అది అశాశ్వతమైతే మాత్రం దాని విలువలేం తగ్గుతాయంటావు. ఈ విధంగా నీ మాటలకు అన్వయమే ఉండటంలేదు!’’
- ఇంకాఉంది-

ధనికొండ హనుమంతరావు