డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర రాక్షసి, శాంతిదేవత ధరించే దుస్తుల్ని వేసుకుంటుంది. అప్పుడు తనను ఈ యుద్ధాన్ని లేవదీసినందుకు శపించినవారే, తన సౌభాగ్యానికి గెలుచుకున్న సామ్రాజ్యానికి అచ్చెరువొంది తనను కొలుస్తారు. ఆ సుదినం కోసమే కదా, తాను వేయిదేవుళ్ళకు మొక్కుకొని ఈ దండయాత్రను స్వయంగా నడుపుతూన్నది!
ఇలాంటి పగటి కలలతో, ఆకాశ హర్మ్యాలతో ఆమె సుఖంగా ప్రయాణం చేసింది.
గ్రీస్‌లో యుఫెసిస్‌లోనే ఆమె ముందుగా పంపిన సైనిక బలాలు స్థావరాన్ని ఏర్పరచుకున్నవి. యుఫెసిస్ కొన్ని శతాబ్దాలుగా గ్రీక్ సంస్కారానికి పట్టుకొమ్మగా ఉన్నది. అల్లంత దూరంలో సముద్రం, తన నౌకాబలమూ, కాల్బలమూ, అశ్వికదళాలు కనుపూపు మేరలో ఉంటవి. చాలా అనువైన స్థలంలో ఈ స్థావరం ఉన్నందుకు ఆమె సంతోషించింది.
గ్రీస్‌లోని అనేక ప్రదేశాలను క్లియోపాత్రా చూసి తన్మయత్వం చెందింది. పాలరాతి నిర్మాణాలకు గ్రీస్ శిల్పం సుప్రసిద్ధమైనది. అలెగ్జాండ్రియాలో కూడా అనేక కట్టడాలున్నవి. కాని వాటిని చూసి తానేమీ అర్థం చేసుకోలేకపోయింది. కాని, ఇక్కడి ప్రతి శిల్పమూ తనకెంతో పరిచయమైనదిగానూ, తనకు అర్థమయ్యే భాషలో మాట్లాడేదిగానూ ఆమెకు తోచింది.. ఈ యుద్ధం ఈజిప్టుకూ, రోమ్‌కూ మధ్య కాదు. గ్రీస్‌కూ, రోమ్‌కూ మధ్య జరగబోతూన్నదని ఆమె అంచనా వేసింది.
ఈ వార్తలు వినగానే ఆక్టోవియన్‌కు చెమట పట్టింది. కోరి కొరివితో తలగోక్కున్నందుకు అతను చాలా పశ్చాత్తాపపడ్డాడు. బహుశా ఇది తన అంతానికి దారితీస్తున్నదని కూడా భయపడ్డాడు. ఏమైనా ఇప్పుడు ఏమనుకొనీ లాభం లేదు. ఓర్పు నశించిన తరువాత, దాని వెనుక దాగిన ఉద్రేకాలే బైటికి ఉరకక తప్పవు కదా!
అందుకని ఆక్టోవియన్ కేవలం యుక్తితో ప్రజాదరణను పొందాలని నిశ్చయించుకున్నాడు. అతని ఘీంకారాలతో సర్వాధికార వర్గ సమావేశమేమి, రోమ్ పట్టణమేమి, ఇటలీ మొత్తమేమీ ప్రతిధ్వనించినవి. లక్ష అబద్ధాలను అల్లి, వాటినొక క్రమంలో ఉంచి, నగ్న సత్యాలుగా వాటికి రంగులు పూసి, ప్రజలను నమ్మించేందుకు అతను విశ్వప్రయత్నం చేశాడు.
‘‘రోమన్ సామ్రాజ్యానికి చెందిన సగభాగం- ప్రాచ్య దేశాల పరిపాలన ఏంటనీకి అప్పగించినందుకు అతను తన మాతృదేశానికే ద్రోహం తలపెట్టాడు. ధనికురాలైన క్లియోపాత్రాతో జేరి, రోమన్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కాకుంటే, ఇంత పెద్ద సైన్యంతో గ్రీస్‌లో ఎందుకు దిగాడు?.. అతను రోమ్ వీరుడుగా, దేశభక్తుడుగా రోమ్‌కు రాదలచుకుంటే సైన్యాలెందుకు.. రాజ్యపాలనలో భాగం కావాలంటే రుూ వొత్తిడి దేనికి? సరాసరి వస్తే మనం కాదన్నామా? అతన్ని గౌరవించమా? ఇప్పటికైనా అతనీ సత్యాన్ని గ్రహించి, తాను చేసిన ఈ ఘోరకృత్యాలకు పశ్చాత్తాతపడినట్లయితే, రోమ్ అతనితో విరోధాన్ని పెట్టుకోవలసిన పనిలేదు.
‘‘వ్యక్తిగత జీవితంలో అతనికి క్లియోపాత్రా అంటే మమత ఉండొచ్చు. ఐతే, అంత మాత్రాన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను గౌరవించే ఏంటనీ, అటు ఈజిప్టులోని రాజరికాన్ని ఆరాధిస్తున్నాడు. అంతతో పోక, మనను అసమర్థులుగా భావించి, ఇక్కడ చక్రవర్తిత్వాన్ని స్థాపించాలనీ, క్లియోపాత్రాను రాణిగా చేయాలనీ సంకల్పించాడు. ఇది దేశద్రోహం గాక మరేవౌతుంది?.. ఆమె మద్దతు ఉన్నంత మాత్రాన, స్వదేశం మీద దండయాత్రకు సిద్ధపడే నీచత్వానిక్కూడా వొడిగట్టాడు. లోగడ రుూ విషయాల్ని ప్రస్తావించినపుడు సగంమంది మాత్రమే నమ్మారు. ఈనాడు మిగతా సగంమంది చెప్పగలిగే సంజాయిషీ ఏమిటి? సమరం ద్వారా తప్ప శాంతి జరగదని ఏంటనీ భావించేందుకు తగిన వాతావరణం ఇక్కడ ఏర్పడిందా? అతని వ్యక్తిగత వాంఛలకు రోమన్ ప్రభుత్వం బలి కావలసిందేనా?
సర్వాధికార వర్గ సమావేశంలో ఇలాంటి గర్జనల్ని సాగించాడతను.
‘ఏంటనీ ఇంకా మనమీద యుద్ధాన్ని ప్రకటించలేదు కదా?’’ అనే బలహీనమైన వాదనను, ఏంటనీ మిత్రులు లేవదీశారు.
ఇప్పుడు తనకు ఎంతో బలం చేకూరిందని ఆక్టోవియన్ గ్రహించాడు.
‘‘ఇల్లు అంటుకోబోతున్నదని గ్రహించిన మరుక్షణం నుంచే, ఆ నిప్పును ఆర్పేందుకు సన్నాహాలు చేసుకోవాలి. తీరా ఇల్లంటుకున్నాక, దైవశక్తుల్ని ప్రార్థించి ప్రయోజనమేమిటి?’’ అన్నాడు ఆక్టోవియన్.
ఏంటనీ పక్షంవారు నోరెత్తకుండా చేయగలిగాడతను.
‘‘కనుక మనమే యుద్ధాన్ని ప్రకటించి, రోమన్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి!’’ అన్నాడు ఆక్టోవియన్.
మరికొంత వ్యవధి కావాలని ఏంటనీ పక్షంవారు కోరారు. కాని, ఆక్టోవియన్ అంగీకరించలేదు. హఠాత్తుగా సభ ముగిసినట్లు ప్రకటించి, మరొక అవకాశమంటూ లేకుండా చేశాడు.
ఇటలీ అంతటా ఆక్టోవియన్ తయారుచేసిన ఉపన్యాసాలను రాజకీయ నాయకులనేకమంది ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు నమ్మక తప్పటంలేదు. ఇదివరకు మరొక అంతర్యుద్ధమనేది సన్నని తెరవలె అస్పష్టంగా కనిపిస్తే, ఇప్పుడు లోహపు తెరవలె స్పష్టంగా దట్టంగా కనిపిస్తూన్నది.
ఈ విషయాలన్నీ గ్రీస్‌లోని ఏంటనీకి చేరవేయబడినవి. ఆక్టోవియన్ తనను రాజకీయాలలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ కూడా ఎదుర్కొన్నాడు. తనను నీచాతినీచంగా చిత్రిస్తున్నాడు. వాణ్ణి బతకనివ్వటం తన మరణానికేనని ఏంటనీ నిశ్చయంగా తెలుసుకున్నాడు.
ఈ యుద్ధం ఇక తప్పదు. అయితే యుద్ధాన్ని తాను ప్రకటించటమా? రోమ్ ప్రకటనకు వేచి ఉండటమా? అనేదే ఇంకా తేల్చుకోలేదు. ఎలాగైనా ప్రకటన అటునుంచే వస్తే బాగుంటుంది. తగినంతగా ఆక్టోవియన్ ఉద్రేకపడుతున్నాడు. తాను మరొక్క దెబ్బ తీస్తే, ఆక్టోవియన్ తనను తాను నిలవదొక్కుకోలేకపోతాడు. అందుకని ఏంటనీ తనకు ఇష్టం లేకపోయినా, పని జరిగేందుకని, అవసరార్థం- ఆక్టోవియాకు తాను విడాకులిచ్చినట్లు ఆక్టోవియన్‌కు తెలియపరిచాడు.
ఇది విని క్లియోపాత్రా పరమానందభరితురాలైంది. కాలచక్రం తన ఇష్టానుసారమే దొర్లుతోంది. ఇదివరకు తాను ఎంత చెప్పినా ఒప్పని ఏంటనీ, తనంతట తానే ఆ మహాపతివ్రత, ఆక్టోవియాను ఇపుడు విడాకులిచ్చి గౌరవించాడు. ఇప్పుడు ఏంటనీ వ్యక్తిగత జీవితాన్ని తనతోపాటు పంచుకొనేవారు తను తప్ప వేరెవ్వరూ లేరు. ఏంటనీ తనవాడు! తనకోసం ఏదైనా సరే చేయక తప్పదు. రోమ్ అతనికి పరదేశం. ఈజిప్టుకే అతను బలికావాలి; అతను ఈజిప్షియన్‌గానే బతికి తీరాలి!
ఈ వార్తకు ఆక్టోవియన్ మండిపడ్డాడు. కల్లుతాగిన కోతికి తేలు కుట్టిన విధంగా అతని చిందులు తొక్కాడు. లోగడ ఏంటనీ వీలునామా రాసి దేవాలయాధికారి దగ్గర ఉంచాడు. ఆక్టోవియన్ బలాత్కారంగా దాన్ని బైటికి లాగాడు. అందులో విషయాలివి.
నా మరణానంతరం రుూ వీలునామాను చదివి వినిపించవచ్చును;
‘‘నేను మార్క్ ఏంటనీని. శారీరకంగానూ, మానసికంగానూ పరిపూర్ణారోగ్యంతో ఉండి రుూ వీలునామాను వ్రాస్తున్నాను. సీజర్ క్లియోపాత్రాల సంతానం, సీజర్ టాలమీనే నేను సీజర్ వారసుడుగా గుర్తిస్తున్నాను. సీజర్ ఏ ధోరణిలో ఆక్టోవియన్‌ను తనకు వారసుడుగా వీలునామాలో ఉదహరించి ఉంటాడో నేను ఊహించలేకుండా ఉన్నాను.
‘‘నా మరణానంతరం నా శరీరాన్ని రోమ్‌లోనే దహనం చేయాలి. కాని, నా అస్థికలను ఈజిప్టు పంపి, నా ప్రాణంలో ప్రాణంగా జీవించిన క్లియోపాత్రా సమాధి పక్కనే ఉంచాలి. ఇదే నా అంతిమ కోర్కె
-మార్క్ ఏంటనీ’’
ఈ వీలునామా ప్రతులు ఇటలీ అంతటా పంచబడ్డాయి.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు