డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోగడ నీకు పెళ్లి కట్నంగా ఇచ్చిన సైన్యాలను, తన సైన్యాల్లో కలుపుకున్నాడు. దేశద్రోహి చేతికి చిక్కినపుడు ప్రభుత్వం అమలుపరిచే వొత్తిడులనన్నింటినీ అతను ప్రయోగిస్తున్నాడు. ఇప్పటికీ నీలో వేడంటూ కనిపించినందువల్ల, ప్రజలు నిజంగా నీవు ప్రభుత్వానికేదో గొప్ప ద్రోహం చేశావని, ఆక్టోవియన్ పనుల్ని విమర్శించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
‘‘ఇదీ ఇక్కడి పరిస్థితి! రోమ్‌లో తిరిగి నీవు ప్రముఖ వ్యక్తివి కావటానికి ఇపుడు అవకాశాలు చాలా కొద్ది అనిపిస్తూన్నవి. ఐతే, వ్యక్తిగత గౌరవమర్యాదలనేవి దేశ క్షేమ పరంగా చూసినట్లయితే, అతి స్వల్పాలేననే నమ్మకం నీకున్నది.
‘‘కనుక ప్రజాస్వామ్యాన్ని రక్షించటమెలా? అక్రమ పద్ధతిలోనైనా సరే, ఒక సత్కార్యాన్ని సాధించవలసిందే కదా! ఈనాడు రోమన్ ప్రజాస్వామ్య సిద్ధాంతాలన్నీ, సర్వనాశనం కాకుండా చూడమని నిన్ను అర్థిస్తున్నవి. ఈనాడు కాకపోయినా, రేపైనా నీ దేశభక్తిని రుజూ చేసుకోగలవు. కనుక, కర్తవ్యాన్ని ఆలోచించు. మా ఉద్దేశ్యంలో మరొక అంతర్యుద్ధం తప్ప, మరో మార్గం లేదు. ఐతే, ఈ యుద్ధం ప్రజాస్వామ్యానికీ, చక్రవర్తిత్వానికీ మధ్య జరుగుతుంది. మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నవి. సమయం మించనీయకు.
-మిత్రబృందం, అభినందనలతో
ఈ లేఖ చదివాక ఏంటనీ మనస్సు వికలమైంది. లేఖాంశాలన్నీ సత్యాలేనన్నట్లు, తనను ఆక్టోవియన్ నిందితుణ్ణిగా చేసిన నేరాలన్నిటికీ తనకు బాధ్యత ఉన్న విధంగా తోచిందతనికి. ఇంత దూరం రాకముందే తాను ప్రక్రియలు ఆలోచించి ఉండవలసింది.
తాను అస్త్ర సన్యాసం చేశానని కొద్దికాలం క్రితం అనుకున్నాడు. కాని, ఇపుడు తిరిగి యుద్ధరంగానికి తన దేశంమీదికే వెళ్ళవలసిన విషమ పరిస్థితి దాపురించింది. రోమ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తాను చివరి రక్తకణం వరకూ పోరాటాన్ని సాగించవలసిందే! తాను జీవితంలో ఇంతకన్నా ఘనకార్యాన్ని సాధించలేడు!
-కాదు, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలే సాధించుకుంటారు. అక్కడ నాయకులున్నారు. వారంతా ఏకమై ఏమైనా చేసుకోనీ గాక! ఈమధ్య తనకు అలవడిన వైరాగ్యంతో తను దూరంగానూ, అతీతంగానూ ఉండాలనే నిశ్చయించుకున్నాడు కదా! నిమిత్తమాత్రుడుగా తాను ఉండగలిగినా, పరిస్థితులు తనను విధి విలాసానుసారంగా తరుముతవి. ఇందులో తప్పెవరిదనే చర్చ లేదు. తన మీద లేని పోని నిందలు పర్వత ప్రమాణంలో పడుతున్నప్పుడూ, తానెలా ఊరుకోగలడు? రేపు చరిత్రకారులు ఏమంటారు?
క్లియోపాత్రా అధర సుధను గ్రోలుతూన్న సమయంలో తాను మైకంలో పడిపొయ్యాడు. అప్పుడే రోమన్ రాజకీయాల్లో దుమారాలు లేచి అంతా తల్లక్రిందులైంది. దాంతో తన బతుక్కు కూడా పెద్ద దెబ్బ తగిలింది. ఇదంతా జరిగిపోయిన సంగతి, ఇక జరగవలసినదానికే ప్రాధాన్యత.
తన మిత్రబృందం వ్రాసినట్లు ఈ యుద్ధానికి తానే తొడ కొట్టవలసి వస్తోంది. ఇదివరకు ఇలాంటి ఊహలను నిరసించాడు. ఎందుకంటే, అదొక అంతర్యుద్ధంగానూ, మాతృదేశం మీద తనా నడపవలసిన తిరుగుబాటుగానూ పరిణమిస్తుందని.
ఇపుడు కూడా అదే యుద్ధం వేరొక ఆశయాన్ని ఆశ్రయించింది. అదే మహత్తరమైన ప్రజాస్వామ్య రక్షణ! ఈ ఒక్క కారణమూ తననూ, చరిత్రనూ కూడా సమర్థించగలదు. ఐతే, మొదట్లో తననూ ఎవ్వరూ నమ్మకపోవచ్చు. కాని, చివరకు ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించిన నాడైనా తన పవిత్రాశయాన్ని అందరూ నమ్మక తప్పదు కదా!
ఇదంతా ఆలోచిస్తూంటే మళ్లీ ముళ్ళమీద కూర్చున్నట్లున్నది. ఈసారి క్లియోపాత్రా సలహాలను పాటించనక్కర్లేదు. లోగడ ఆమె చెప్పిన సలహాలకు అనుగుణంగా ప్రవర్తించినట్లయితే, ఈపాటికి అంతా తనకు అనుకూలంగా సాగిపొయ్యేది. ఇప్పుడు తాను యుద్ధానికి సంసిద్ధుడవుతున్నాడంటే ఆమె హేళనగా నవ్వుతుంది! పూర్వం తనమీద ఏర్పడిన ద్వేషాన్ని సూచించేందుకు కసిగా ఆమె సహాయపడకుంటే, సాధారణ మానవుని అంతమే తనకూ గతమవుతుంది. నిజానికి ఆమెకు ఇందువల్ల వచ్చిపడే లాభముంటుంది కనుక? ఏదైనా ఆమెను ఒప్పించేందుకు శ్రమ పడక తప్పదు.
అంతఃపురంలో వున్న క్లియోపాత్రాకు వార్త వచ్చిందది. శీఘ్ర గమన వార్తావహుడొకడు రోమ్ నుంచి వచ్చాడని, అతను తెచ్చిన లేఖ చదవగానే ఏంటనీ ముఖంలోని నవ్వు మాయమైందనీ, ముఖం వివర్ణమైందనీ, చాలా ఆందోళనలో ఉన్నాడని తెలిసింది.
ఈ వార్త ఏమై ఉంటుందో క్లియోపాత్రా తేలిగ్గా పసిగట్టగలిగింది. తన పన్నాగాలన్నీ పరిపక్వవౌతూన్న సమయం సమీపించిందని ఆమె ఆనందించింది. ఇంతలోనే ఏంటనీ, వెంటనే రమ్మని ఆమెకు కబురు పంపాడు.
ఏంటనీ మొహం చూడగానే తాను ఊహించినదానికన్నా, ఎక్కువ విషాదమే కనిపించిందామెకు. ఏంటనీ మాట్లాడకుండా, తనకు వచ్చిన లేఖను ఆమెకు అందించాడు. ఆమె చదివింది కాని ముఖంలో ఎలాంటి అందోళనా కనబరచలేదు.
‘‘నీ ఉద్దేశం ఏమిటి రాణీ?’’ అన్నాడు ఏంటనీ, ఆత్రుతతో.
‘‘మీ ఉద్దేశమే నా ఉద్దేశం. నాకు వేరు అభిప్రాయాలనేవి లేవు’’ అన్నదామె
ఇది తన పట్ల ఆమె చూపే గౌరవం, అనురాగం కావని ఏంటనీకి తెలుసు. ఏం మాట్లాడితే, ఏం విధంగా పరిణమిస్తుందోనన్న సందేహంతో ఆమె తప్పించుకోజూస్తున్నదని గ్రహించాడతను. ఆమె మనస్సును తెలుసుకునేందుకు తాను కొంత హామీ ఇచ్చి చూడాలి.
‘‘రాణీ! నాకు వ్యక్తిగత జీవితమనేది ప్రత్యేకంగా లేదు. నేను నీ అనురాగ ప్రవాహంలో కొట్టుకొనిపోతున్నాను. ఈ కష్ట సమయంలో నీవు సరైన సలహా ఇస్తావని ఆశిస్తున్నాను’’.
‘‘మీ దేశ రాజకీయాలలో నేను కల్పించదలుచుకోలేదు. చూశారుగా- ఆక్టోవియన్ మీతోపాటు నన్నూ కలపటమేగాక, నేనట రోమ్‌మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నానట! ఇది ఎవరైనా నమ్మగలరా? నేను సైన్యాలను సమీకరిస్తున్నానంటే పర్షియన్ దండయాత్ర కోసమే కాని’’-
ఆమె మాటలకు అడ్డుపడి ఏంటనీ అన్నాడు: ‘‘నేను అస్త్ర సన్యాసం చేశానని నీకు తెలుసు కదా! పర్షియన్ దండయాత్ర సన్నాహాలెందుకు చేసినట్లు?’’
‘‘ఏమో! మీరు మనసు మార్చుకుని, సీజర్ స్వప్నాన్ని నిజం చేసేందుకు నిశ్చయించుకుంటారనుకున్నాను. ఒకవేళ మీరు నిరాకరించినా, తన తండ్రి అడుగుజాడల్లో నడుచుకోవలసిన సీజర్ టాలమీయే ఈ దండయాత్రను సాగించేవాడు!’’ అన్నదామె.
ఏంటనీ పకపకా నవ్వాడు.
‘‘ఏమిటీ! సీజర్‌ను దండయాత్రు పంపదలిచావా? రాణీ! నీకీ రాజ్యకాంక్షతో మతిపోతోంది సుమా!’’
ఆమె తల వంచుకున్నది, జవాబు చెప్పలేదు.
‘‘అది పోనివ్వు.. ఇపుడు కర్తవ్యమేమిటి?’’
‘‘నేను చెప్పాను కదా- మీరెలా నిర్ణయించుకున్నా నాకు సంబంధం లేదు. ఇదివరకు నాకు జరిగిన హాని చాలు’’
‘‘రాణీ! నా మీద కోపంతో ఉన్నావు. అది లాభం లేదు. మనం, మన సంతానం తాలూకు భావిని నిర్ణయించే సమయమిది. నీవు అలిగి మూల కూర్చుంటే నేను ఒప్పుకోను!’’ అని హెచ్చరించాడు ఏంటనీ.
‘‘సర్వమూ తెలిసినవారు. ఆ భవిష్యత్తును మీరు ఏ విధంగా నిర్ణయించినా, నేను ఎదురుచెప్పను’’ అన్నదామె.
ఇక రుూమె నోటి వెంట తన నిర్ణయాలను పలికించటం అసంభవమని ఏంటనీ తెలుసుకున్నాడు. పోతే, తన నిర్ణయాలను ఆమె చేత ఆమోదింపజెయ్యాలి.‘‘రాణీ! నేను నిశ్చయించుకున్నాను. అవసరమయ్యేట్లయితే, రోమ్‌మీద యుద్ధాన్ని ప్రకటించాలని!’’
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు