డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీజర్ పేరు వినేందుకే ఆమె ఇష్టపడదు. ఎందుకంటే యవ్వనపు ప్రథమ పుష్పాలన్నీ, ఆ మహనీయుని పాదాలమీదనే ఉంచిందామె. అదంతా తలచుకుంటే మధ్యధరా సముద్రమంతా దుఃఖంలో మునిగిపోతుందామె. అందుకని ఆమె సీజర్‌తో తాను గడిపిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతోంది.
ఐతే సీజర్ స్వప్నం ఏమిటో ఆమెకు తెలుసు. అది అలెగ్జాండర్ స్వప్నం కూడాను. ఆ స్వప్నం ఎంతవరకూ నిజవౌతుందోననే అనుమానం తనక్కూడా వున్నది. కాని అంతమాత్రంచేత, ఆ స్వప్నం ఈనాటికీ కొత్తదనాన్ని కోల్పోలేదు.
దాన్ని సాధించాలంటే ఒక మహావీరుడు అవసరం. సీజర్ మరణంతో ఆ ఆశలు చల్లారినవి. కాని, ఏంటనీ తనకు సహాయపడతాడని ఆమె ఆశించింది. అతను ఏథెన్స్‌లో విలాసాలలో మునిగిపొయ్యాడని విన్నాక, ఇక ఆ కలను, కలలో చూసేందుక్కూడా ఆమె నిరాకరించింది. ఇప్పుడు తిరిగి ఏంటనీ ఆ స్వప్నాన్ని తాను మరచిపోలేదని, దాన్ని సత్యంగా పరిణమింపజేసేందుకుగాను తాను ప్రయత్నిస్తూ పశ్చిమాన ఉండిపోయ్యాననీ అంటూంటే, క్షణంలో ఆమెకా స్వప్నమంతా, నిజంగా జరుగుతూన్నట్లే తోచి శరీరం పులకించింది.
క్లియోపాత్రా ముఖం వికసించటాన్ని ఏంటనీ కనిపెట్టాడు; క్లియోపాత్రాను వశపరచుకునేందుకు తనకు గట్టి పట్టు ఇప్పటికి చిక్కిందని గ్రహించాడు.
‘‘నిజం రాణీ!’’ అన్నాడతను. ‘నేను నా బాగే కోరుకోలేదు. పోతే ఏ పరిస్థితుల్లో నేను పశ్చిమానికి వెళ్ళానో జ్ఞాపకం చేసుకో. అక్కడ రోమన్ ప్రభుత్వంలో నాకు భాగమే లేనట్లయితే, మనమిద్దరం ప్రపంచంలో కేవలం భార్యాభర్తలుగా మాత్రమే చలామణీ అయ్యేవాళ్ళం.
అందుకని కొంత అధికారాన్ని చేజిక్కించుకోనిదే, నీకూ నాకూ కూడా విలువలనేవి ఉండవని, ఆ అధికారం కోసం చేయరాని పనులు కొన్ని చేశాను. ఐతే, వాటి ఫలితాలనుచూసినట్లయితే, అవి మన ఉభయులకూ చేసే మేలును నీవు గ్రహించగలవు. ఇక్కడ ఈజిప్టులోనే నేను ఉండిపోయినట్లయితే రోమ్ మనిద్దర్నీకూడా శత్రువులుగానే పరిగణించే ప్రమాదం వాటిల్లేది. నాకైతే, ఎటూ సర్వాధికార వర్గంలో స్థానం ఉన్నది. నేను రోమన్‌గా, వీరుడుగా, గౌరవ మర్యాదల్తో హాయిగా రోమ్‌లోనే కాలం గడిపి ఉండే అవకాశాలున్నవి. కాని,, నీ గూర్చి, మన సంతానాన్ని గూర్చి ఆలోచించాను. ఇప్పుడీ తూర్పు దేశాల పాలన నా చేతుల్లో వున్నది. పర్షియా కూడా మన వశమైతే, దాన్ని రోమ్‌కు కట్టబెడతాననుకున్నవా? అది ఈజిప్టుకే సంక్రమిస్తుంది. ఈజిప్టుకోసం, ముఖ్యంగా నీకోసం నేను ఏదైనా చేయగలను.. నా ప్రాణాన్నయినా సరే ఇవ్వగలను!’’ ఉద్రిక్తపూరితమైన ఆ కంఠస్వరానికి క్లియోపాత్రా కళ్ళు మెరిసిపోతున్నవి.
‘‘నిజమా! నిజంగా ఇదంతా ఆలోచించావా?’’ అన్నదామె.
‘‘ప్రమాణం చేసి చెప్పగలను’’
‘‘నీవు విలాసపురుషుడివే కాని, యోధాన యోధుడివౌతావని అనుకోలేదు సుమా! అలెగ్జాండరంత గొప్పవాడివయ్యే ఆశయాలు నీకు నిజంగా ఉన్నవనీ తలచలేదు. నీలాటి పురుష సింహుణ్నే రుూ క్లియోపాత్రా కోరుతోంది’’ అన్నదామె.
తన్నుకు గారెలబుట్టలో పడినట్టయింది అతనికి. వెంటనే ఆమెను తన బాహుపంజరంలో బంధిద్దామని ప్రయత్నించాడతను. కాని, ఆమె వారించింది.
‘‘కొంచెం తమాయించు ఏంటనీ!’’ అన్నదామె. ‘‘ఈసారి నేను నీకు అంత తేలిగ్గా లొంగిపోలేను. పురుషుణ్ణి నమ్మకూడదని నిశ్చయించుకున్నాను. కానీ, నమ్మక తప్పేదీ లేదు. ఐతే, ఈసారి రుూ నమ్మకమనేది అతి పవిత్రంగా ఉండి తీరాలి’’’.
‘‘నీవు ఏం చేయమన్నా నేను సిద్ధమే’’
‘‘నన్నుపెళ్ళాడాలి. పవిత్ర దేవాలయంలో, పెద్దల సమక్షంలో రుూ వివాహం జరగాలి’’ అన్నదామె.
ఏంటనీ ఆలోచించి కాని జవాబివ్వడనుకున్నదామె. కాని, మన్మథుడు అతన్ని నిలవనీయటంలేదు కనుక, ముందు వెనుకల ఆలోచనలు లేకుండానే అతను జవాబులు ఇవ్వగలుగుతున్నాడు.
‘‘నేను సిద్ధమే!’’
‘‘అంతేకాదు; నా పిల్లలందరికీ నీవే తండ్రిగా అంగీకరించాలి’’
‘‘తప్పకుండా’’
‘‘ఈజిప్టుకు నేను రాణిని కదా! నా భర్తగా నీవు రాజువౌతావు. కనుక, ఈజిప్టు రాజుగా నిన్ను నీవు ప్రకటించుకోవాలి’’
ఈ మాట వినేప్పటికి ఏంటనీ, తన తలమీద పిడుగు పడ్డంతగా భయపడ్డాడు. కామమైకం నుంచి బైటపడ్డాడు.
‘‘రాణీ! ఇది మాత్రం నా వల్ల కాదు. నీకు అండగా ఉంటానే కాని నాకు మాత్రం ఈజిప్టు రాజరికాన్ని అంటగట్టవద్దు. ఇందువల్ల చాలా ప్రమాదాలున్నవి. ముందుగా రోమ్, నన్ను దేశద్రోహిగా గుర్తించి, మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. పర్షియన్ దండయాత్రల సంగతి దేవుడికెరుక. మన బుర్రల్ని మనం కాచుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అదీగాక రాజరికాన్ని నేను ఖండిస్తూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించే యోధుడుగా రోమ్‌లో ప్రసిద్ధికెక్కాను. సీజర్ నియంత స్థానం నుంచి, రాజరికానికి ఎగబాకేందుకు చేసిన ప్రయత్నంలో హత్య చేయబడ్డాడు. రోమన్ చరిత్రలో, రాజుల తలలు ఎగిరిపోయి చాలా కాలమైంది. ఇపుడు పిలిచి రాజును చేస్తానంటే రోమన్ జాతివాడెవడికైనా, అది తన కంఠానికి బిగించుకొనే ఉరితాడేననే జ్ఞానం ఉన్నది. ఎటుచూసినా రుూ రాజరికంవల్ల మనకు కీడే కాని, మేలు జరగదు. కనుక ఈ షరతులకు మాత్రం నేను ఒప్పను’’ అన్నాడు ఏంటనీ.
ఈమాటలతో ఏంటనీకి రాజ్యకాంక్ష లేదని తేలిపోయింది. కనుక అతను ఆక్రమించగల సామ్రాజ్యమంతా తనకే చెందుతుంది. రాజరికమంటే వొణికిపోతున్నాడు. అందుకని కేవలం తన వెనుక ఉండి, తన రాజ్యాన్ని విస్తరింపజేయటమే అతని ప్రధానాశయమని నమ్మకంగా నమ్మవచ్చు.
ఐతే, తన కోసం ఏమీ చేసుకోలేని వ్యక్తి, ఇతరులకోసం ఏమైనా చేస్తాడనుకోవటంలో అర్థం లేదు. కాని, మానవ సహజమైన లక్షణాలను సైతం విడనాడేవారు లేకపోలేదు. ఏంటనీ రుూ రెండో తెగకు చెందినవాడని తాను నిశ్చయంగా తేల్చుకోవాలి. ఎందుకంటే, తిరిగి తనను వశపరచుకునేందుకు అతను రుూ నాటకమంతా ఆడుతూ, తన బలహీనతను కనిపెట్టి, దాన్ని స్వలాభం కొరకు ఉపయోగించుకుంటున్నాడేమో?
తనను అగ్నిసాక్షిగా పెళ్ళాడుతానన్నాడు. కాని, అదొక్కటే అతని పట్ల విశ్వాసాన్ని పెంచదు. ఎందుకంటే, అతనికిది మొదటి పెళ్లికాదు. నాలుగోది. ఇదివరకు పెళ్లాలమీద అతనికెంత మమత ఉన్నదో తెలుసు. అందాకా దేనికి- నిన్న మొన్నటిదాకా ఆక్టోవియాలాంటి సుందరిని, మహా ఇల్లాలిని వివాహమాడినందుకు గర్వపడ్డాను కదా - ఇప్పుడు ఆమెను తీరతీరాలు విడిచి, ఇక్కడికొచ్చి, తనను పెళ్లాడి సుఖపడేందుకు సిద్ధపడుతున్నాడు. అంటే, రుూ బొమ్మల పెళ్లిళ్ళమీద అతనికి ఎంత దృఢవిశ్వాసముండి ఉంటుందో తనకు అర్థవౌతోంది.
పోతే, ఈసారి ఏంటనీని కేవలం మంగళసూత్రంతోనేగాక, బలమైన ప్రేమ పాఠశాలతో బంధించివేయాలి. అతని మనస్తత్వం చంచలమైనప్పటికీ, తన సౌందర్యం, తెలివితేటలు, ప్రణయ కళానుభవం- మొదలైనవాటి మైకంలో అతను తనను తాను మరిచిపొయేట్లు చేయగల కౌశలాన్ని తాను ప్రదర్శించి, గెలుపొందాలి. అపుడు రుూ వివాహబంధాలనేవి ఎంత బలహీనమైపోయినా ఇబ్బంది ఉండదు కదా!
ఇదంతా ఆలోచించి ఆమె అన్నది: ‘‘ఏంటనీ! నిన్ను నేను పెళ్ళాడమని కోరింది అసహజమైన కోరికే కావచ్చు. ఎందుకంటే, ఒక భార్య ఇంకా బతికి ఉండగా, మరొకతెను భార్యగా స్వీకరించటం రోమన్‌ల ఆచారం కాదు. మరొక స్ర్తిని అనుభవించటమంటే- ఆమెను ఉంపుడుకత్తెగా మాత్రమే చూడటమనీ నాకు తెలుసు. ఐతే, ఈజిప్టుకు రాణివైన నేను, నా వ్యక్తిగత జీవితం ఏమైనప్పటికీ, నలుగుర్లోనూ తలెత్తుకు తిరిగేందుకూ, గౌరవంగా బతికేందుకూ, కనీసం బహిరంగంగా విమర్శించబడకుండా ఉండేందుకూ చూసుకోవాలి.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు