డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకని ఈసారి ఆమెను ఏకాంతంగా కలుసుకొని చివరకు హాస్యాస్పదంగా వున్నా కూడా ఆమె హృదయం ద్రవించేట్లు మాట్లాడాలి. ఆ సంఘటన కొరకై రకరకాల సంభాషణలనూ ఆలోచించి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించవలసిందీ ఊహించి వేచి కూర్చున్నాడు.
మర్నాడంతా అతను ఒంటరిగానే ఉన్నాడు. తన వలెనే క్లియోపాత్రా కూడా ఆలోచిస్తూండి ఉండాలనీ, ఈసారి మొదటిసారంత కఠినంగా ఉండదు లెమ్మనీ సరిపెట్టుకున్నాడు. ముందు క్లియోపాత్రా దగ్గిర తన స్థానాన్ని నిర్ణయించుకొనేదాకా సరిగా గడ్డమీద తనకు మరో పనిలేదు.
మూడోనాడు రాత్రి చారుడొచ్చి ‘‘ఇవాళ రాణి ఉత్సాహంగా ఉన్నారు. ఎంతో ప్రసన్నంగా ఉన్నదామె ధోరణి’’ అన్నాడు.
ఏంటనీ ఇలాంటి వార్త కోసమే కలలు కంటున్నాడు.
‘‘ఇప్పుడెక్కడున్నది?’’ అని అడిగాడు.
‘‘గుడారానికి వెనుక ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూస్తోంది’’.
ఏంటనీ కూడా చప్పున ఆకాశంలోకి చూశాడు. చందమామ మబ్బుల్లో దాగుడుమూతలాడుతున్నాడు. తనను కరుణించి మన్మథుడు క్లియోపాత్రా పరిసరాల్లో తిరుగులాడుతూంటే, తనకు విజయం తప్పదు. నాలుగేళ్ళుగా ఒంటరి జీవితంతో మధనపడిన క్లియోపాత్రా రుూ రాత్రి వెనె్నల స్నానం చేస్తోందంటే, ఆమె మనస్తత్వం ఎలా వుండి ఉండగలదో అతను గ్రహించాడు.
వెంటనే ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు.
సేవకుడొచ్చి అల్లంత దూరంలో నిలబడటాన్ని క్లియోపాత్రా గ్రహించింది. దగ్గరికి రమ్మని చేయెత్తి పిలిచింది. సేవకుడు భయపడుతూ కాస్త దూరంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘ఏంటనీ వచ్చాడా?’’ అని ఆమే అడిగింది.
సేవకుడు వొణికిపోయాడు. దైవత్వమే రుూమె కు లేకుంటే ఎక్కడో దూరాన, అందునా గుడారాలకు అవతలెక్కడో వున్న ఏంటనీని ఆమె ఎలా చూడగలిగి ఉంటుందో వాడు ఊహించలేకపోయాడు. వాడి మాట పెగలలేదు.
‘‘రమ్మను’’ అన్నదామె.
వాడు వినయంగా నమస్కరించి వెళ్లిపోయాడు.
కాస్సేపట్లోనే ఏంటనీ ప్రవేశించాడు. క్లియోపాత్రా చందమామలోకి చూస్తోంది. ఆ వెనె్నల్లో ఆమె కళ్ళు ధగధగ మెరిసిపోతూన్నవి. ఆమె రెండు కనుగుడ్లలోనూ రెండు చందమామలు దోబూచులాడుతూన్నవి. ఏంటనీ రాకను ఆమె గమించింది. కాని అతనివైపు చూడకుండానే కూర్చోమని దగ్గర్లో వున్న కుర్చీ చూపించింది.
ఏంటనీ మెత్తని కుర్చీలో కూర్చున్నాడే కాని, అతనికి ముళ్ళమీద కూర్చున్నట్టే వున్నది. ఎందుకంటే, క్లియోపాత్రాకు ఈనాడు ఆకాశంలో కొత్తగా ఏం కనిపిస్తోందో అతనికి అర్థం కావటంలేదు. ఒకవేళ ఆమె కొత్త సంగతుల్ని అంతరిక్షం నుంచి తెలుసుకోగలిగినా, భూమిమీది సమస్యలు తీరేందుకు అవి తనకు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఇది తన అభిప్రాయం కావొచ్చు. ఏమైనా ఆమే ముందుగా మాట్లాడితే బాగుండుననుకున్నాడు. కాని కొన్ని నిమిషాలపాటు ఆమె కదలలేదు. మెదలలేదు. అందుకని ముందుగా తానే మాట్లాడక తప్పలేదు.
‘‘రాణీ!’’ అన్నాడు మెల్లిగా ప్రాధేయపడే ధోరణిలో.
‘‘ఆఁ’’ అన్నదామె ఇప్పుడే స్వప్నసీమ నుంచి బైటపడినట్లు.
‘‘రాణీ! ఈ నాలుగేళ్ళలో నేనెప్పుడైనా గుర్తుకొచ్చానా?’’ అన్నాడు ఏంటనీ.
నిజానికి రుూ ప్రశ్న క్లియోపాత్రాయే అడిగి ఉండవలసినది. అడుగుదామని కూడా అనుకున్నది. కాని, అదే ప్రశ్నను తాను విన్నపుడు, రుూ నాలుగేళ్ళూ తాను భరించిన ఒంటరితనం గుర్తుకొచ్చి, ఆమెలో దుఃఖం పొంగి పొర్లింది. ఆనందంతో మెరిసిపోయ్యే ఆమె కనుకొలకుల నుంచి మంచి ముత్యాలవలె మెరుస్తూ రెండు కన్నీటి బిందువులు వెలువడినవి. క్షణంలో ఆమె గొంతు మారిపోయింది. కాని, అంతలోనే గొంతు సరిజేసుకొని నిలవతొక్కుకుంది.
‘‘ఏంటనీ! పురుషులు నీచులని నా ఉద్దేశం’’ అన్నదామె, అసలు ప్రశ్నకు జవాబు చెప్పకుండానే.
ఏంటనీ సిగ్గుపడ్డాడు. కాని, రుూ రాత్రి రాణి ధోరణి మారింది. ఆమె కంఠస్వరంలో ఈర్ష్య ధ్వనిస్తోంది. తనకు కావలసిందదే ఎందుకంటే ప్రేమంటూ వున్నచోటనే ఈర్ష్యక్కూడా తావున్నదని అతనికి తెలుసు. అదీగాక, ఇప్పుడీ స్థితిలో ఆమె నటించలేదు. నటిస్తున్నానని అనుకుంటూనే సహజ రూపాన్నీ, వర్ణాన్నీ బైటపెట్టేస్తుంది. తాను పరిచిన ఉచ్చులోకి రాక తప్పదు.
‘‘నిజమే రాణీ!’’ అన్నాడు ఏంటనీ, ‘‘కానీ..’’
క్లియోపాత్రాకు నవ్వాగలేదు. విరగబడి నవ్వటాన్ని మాత్రం ఎలాగో ఆపుకున్నది. ‘‘కాని నీవు మాత్రం కాదు- ఔనా?’’ అని అతని మొహంలోకి సవాలుగా, చిలిపిగా హేళనగా చూసింది.
ఏంటనీ అన్నాడు: ‘‘రాణీ! నేను దూరతీరాల్లో ఉన్నాను కనుక, నీ ఊహకు అందిన విధంగా ఆలోచించి, నన్ను నీచుడనే నీవు నిర్ణయించి ఉండొచ్చు. అది నా తప్పు, నీ తప్పుకాదు. కాని కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే నీలాటి తెలివిగలదానికి పరిస్థితుల ప్రభావం ఎలాంటిదో అర్థమవుతుంది. నేను- నా క్షేమం, నీ క్షేమం, మన పిల్లల క్షేమం-’’
ఆమె చకితురాలైనట్లు సర్దుకు కూర్చున్నది. ఇది గమనించి ఏంటనీ మాట మధ్యలోనే ఆగాడు.
‘‘ఏమిటీ?.. ఏమన్నావ్?’’ అన్నదామె. తాను ఊహించని కొత్త మాటలేవో విని, ఒకవేళ తాను పొరపాటున విన్నానేమోననే అనుమానంతో.
‘‘ఔను రాణీ! మన పిల్లలు! నీవు నాకు ఏమీ కావని అనుకునేటంత మూర్ఖుణ్ణీ, నీచుణ్ణీ మాత్రం కాదు. నా సంతానం ఈజిప్టు గడ్డమీద ఉన్నదనే సంగతి నాకు తెలుసు!’’
‘‘వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారులే- మనకెందుకనుకున్నావా?’’ అన్నది క్లియోపాత్రా. తనను ఆమె ఇంకా అపార్థం చేసుకుంటున్నదని ఏంటనీకి తెలుసు. అందుకని విసుగు జెందితే, దూముడిగా రూపొందినదాన్ని, తిరిగి పీటముడిగా చేయవలసి వస్తుంది. అందుకని ఎలాగైనా రాణి ఆదరాన్ని పొందటం అత్యవసరం.
‘‘రాణీ! కులదేవతల సాక్షిగా నేను నిన్ను భార్యగానూ, నీ పిల్లవాడినీ, నీ సంతానాన్నీ నా సంతానంగానూ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నా ప్రణయానికి అంతకన్నా తార్కాణం మరేం కావాలి?’’
ఆమె మాట్లాడలేదు. ఏంటనీ అన్న రుూ మాటలు నాలుక చివర్నుంచి వచ్చినవా, హృదయపు లోతుల్లోంచి వెలువడివనా అని ఆమె తర్కించుకుంటున్నది.
‘‘నిజం చెప్పు ఏంటనీ!’’ అన్నదామె. ‘‘ఈ నాలుగేళ్ళలోనూ నేనెప్పుడైనా గుర్తుకొచ్చానా? నీ పిల్లల్ని చూసుకోవాలని ఎన్నడన్నా అనుకున్నావా?’’అన్నదామె ఏంటనీ వేసిన ఇదే ప్రశ్నకు జవాబు చెప్పకుండా, ఆ ప్రశ్ననే అతనిమీద విసిరివేసింది.
‘‘ప్రమాణం చేసి చెపుతున్నాను రాణీ! శరీరం ఒక్కటే ఏథెన్స్‌లో ఉన్నది నా మనస్సంతా అలెగ్జాండ్రియాలోని టాలమీల రాజప్రాసాదం చుట్టూ తిరుగులాడుతోంది. ఎన్నోసార్లు పిల్లల్ని చూడాలనుకున్నాను. ఆడపిల్ల సరిగ్గా నా పోలికని విని నవ్వుకున్నాను కూడా!’’
‘‘అయినా ఇన్నాళ్ళూ ఇటు వచ్చేందుకు తీరలేదు. నేను చచ్చానో బతికానో కూడా విచారించిన పాపాన పోలేదు.. చివరకు నేను రాయబారుల్ని పంపితే, ఏ ధోరణిలో వారికి జవాబిచ్చావో, బహుశా నీకు జ్ఞాపకం లేదనుకుంటాను’’ అన్నదామె, ఏంటనీ వాదనలన్నింటినీ ఖండిస్తూ.
‘‘రాణీ! కనీసం మాట్లాడేందుకన్నా నాకు అవకాశమివ్వు.. నేను నా స్వార్థానే్న చూసుకొంటూ అక్కడ బతికాననుకుంటున్నావు. కాదు సీజర్ కన్న కలల్ని, నిజాలుగా చేద్దామని ప్రయత్నించాను.’’
చచ్చిపోయిన సీజర్ హఠాత్తుగా బతికి సింహంవలె గర్జిస్తూ ఎదుట నిలబడ్డంతగా ఆమె భీతిల్లింది.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు