డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి పిలుపును నిరాకరిద్దామని ఆమె లోగడ నిశ్చయించుకున్నది. తీరా ఆహ్వానం వచ్చాక అంతలోనే మనసు మార్చుకున్నది.
రోమ్‌తో విరోధపడి బతకటం దుర్లభం. అదీగాక ఈసారి ఏంటనినీ తాను ప్రణయ బంధంలో శాశ్వతంగా బిగించి పారేయ్యాలి. దాంతో ఏంటనీ విజయాలు తన విజయాలే కాగలవు. ఏనాటికైనా రోమ్‌ను ఎదురించి గెలుస్తాడనే ఆశలింకా చావలేదు. ఇవన్నీ చూస్తే తాను వెళ్లటం మంచిది.
అయితే ఈసారి మాత్రం తన ఏంటనీ తనకు పాత ప్రియుడే అయినా, తేలిగ్గా లొంగరాదు. తాను రాణినని, తన ఆజ్ఞల్ని శిరసావహించాల్సిన బాధ్యత ప్రియుడుగా సర్వ సేనానిగా అతనికున్నదనీ అర్థమయ్యేటట్లు చేయాలి. తన ఈ సౌందర్యం యవ్వనం అతన్ని ముగ్ధుణ్ణి చేసి గుడ్డివాణ్ణి చేస్తే తనే తన ఇష్టానుసారం అతన్ని నడిపించవచ్చు. అదంతా ఆమెకు నల్లేరు మీద బండి నడక లాగే తోచింది.
తన ఆహ్వానాన్ని తోసిపుచ్చక క్లియోపాత్రా వస్తున్న వార్తలు విని ఏంటనీ భయపడ్డాడు. ఎందుకంటే తాను ఆమెకు చాలా అన్యాయం చేశానని అతనికి తెలుసు. ఈ కల్మషాత్మతో ఆమె దగ్గర ఏం మాట్లాడగలడుః అదీగాక ఆమె నిరాకరించినట్లయితే తానే అలెగ్జాండ్రియా వెళ్లి ఆమెను ప్రాధేయ పడదామనుకొన్నాడు. కానీ అలా జరుగలేదు. నిజానికి తన ఆహ్వానాన్ని రోమన్ ఆజ్ఞగానే శిరసావహించిందామె. అందుకు తన అహంకారాన్ని గుర్తించటానికి మారుగా ఏంటనీ సిగ్గుపడ్డాడు. ఇక ఆమె దగ్గర చెప్పుకోవలసిన సంజాయిషీలనూ క్షమార్పణలనూ గూర్చి తీవ్రంగా ఆలోచించసాగాడు.
ఆమె సిరియా వచ్చింది. ఏంటనీ సకల మర్యాదలతోనూ ఆమెకు ఘనస్వాగతం ఇచ్చాడు. ఆమెను చూడగానే ఈ నాలుగేళ్లలోనూ ఆమె ఎంత మారిపోయిందే అనిపించింది. అనుభవంతో బొప్పెలు కట్టి మోడుబారిన మనస్తత్వం ఆమెలో కనిపించిందతనికి. హుందాతనం, గర్వం, అహంకారం ఆమెలో బలిశాయి. ముఖ్యంగా తనతో నవ్వుతూ మాట్లాడలేదు. కనీసం తన కవలలకు తండ్రనే గౌరవాన్ని కూడా ఆమె చూపలేదు. సంవత్సరానికి పైగా అనుభవించిన స్వర్గ సౌఖ్యాలేమీ ఆమెకు గుర్తు లేనట్లే ప్రవర్తించింది. ఒకేసారి జయించిన స్ర్తిని తిరిగి జయించుకోవలసిన దుస్థితిలో పడ్డాడతను.
చిత్రం. నాలుగేళ్లు గడిచినా, ఇప్పుడు ముగ్గురు బిడ్డల తల్లయినా క్లియోపాత్రా ఇప్పటికీ చిదిమి దీపం పెట్టుకోవచ్చుననిపిస్తుంది. వయస్సుతోపాటు తగ్గవలసిన శరీర పటుత్వం, యవ్వనం హెచ్చాయి. ఇపుడామె వయస్సు పాతికేళ్లంటే నమ్మటం కష్టం,. పద్దెనిమిదేళ్ల పిల్ల చిలిపితనం, పొంగులూరే యవ్వనం, జీవితమే ఒక పూలబాటని ధ్వనించే కళాకాంతులూ ఆమెలో చూసేటప్పటికి తాను ఎంత మూర్ఖుడై నాలుగేళ్లపాటు ఆమెకు దూరంగా ఉన్నాడో ఏంటనీకి తెలిసి వచ్చింది. టాలమీ వంశజులు దైవాంశ సంభూతులంటే తాను నమ్మేవాడు కాదు. కానీ, ఇప్పుడీ క్లియోపాత్రాను చూస్తే నిజంగా ఆమె ప్రణయ దేవతని ఒప్పుకునేందుకు అతనికేమి అభ్యంతరం లేదు.
ప్రస్తుతం ప్రపంచం అంతా రెండు భాగాలుగా ఉన్నది. ఒక భాగం పశ్చిమ దేశాలు, రోమన్ పరిపాలనలో ఉన్నది. రెండో భాగం తూర్పుదేశాలు. ఏంటనీ పాలనలో ఉన్నవి. రెండో సగానికి తాను గురి చూస్తే తరువాత మొదటి సగాన్ని కబళించే అవకాశం ఉంటుందని క్లియోపాత్రా నమ్మింది.
అందుకనే ఈసారి అభిసారికగా కాకుండా కేవలం కొంత వ్యాపారాన్ని జరిపించేందుకు గాను క్లియోపాత్రా ఏంటనీనీ కలుసుకున్నది. ఐతే అది వ్యాపార విషయం ఏంటనీ లాంటి విలాస పురుషులకు తెలియనివ్వకుండా సమర్థించుకోగల చాకచక్యం ఒక్క క్లియోపాత్రకే ఉన్నదనటం అతిశయోక్తి కాదు.
ఆమె గౌరవార్థం పెద్ద విందు ఏర్పాటు చేయబడింది. ఆమె మాత్రం సంతోషించనట్లు కనిపించలేదు. బతుకు నుంచి నేర్చుకున్న కఠినమైన పాఠాల అనుభవమొక్కటే ఆమె ప్రతి కదిలికలోను కనిపిస్తున్నది. ఈ దేవతను తపస్సుతో తిరిగి ప్రసన్నను చేసుకోవాలనే సంగతి ఏంటనీ గ్రహించాడు.
ఈజిప్టు సౌభాగ్యమంతా వెల్లివిరిసే పట్టు గుడారంలో విలాసంగా విశ్రాంతి తీసుకుంటున్నదామె. ఈ సమయంలో రాణి ఏకాంతాన్ని భంగపరిచే సాహసం ఎవరికీ లేదు. ఏంటనీ వచ్చి గుడారాల బైట నిలబడి, కబురు చేశాడు. ఆమె రావొచ్చన్నది.
ఏంటనీని చూసి ఆమె లేచి కూర్చోలేదు. ‘నేను పాలకురాల్ని!’ అని ఆమె ప్రవర్తన చెపుతూనే ఉన్నది. ‘నేను సేవకుణ్ణి మాత్రమే! ఆ సంగతి నాకూ తెలుసు!’ అన్న ధోరణిలో ఏంటనీ వొంగి, తన తక్కువతనాన్ని సూచించాడు.
ఆమె మంచంమీద ఆమె పక్కన కూర్చునే సాహసం లేక అతను పక్కనే వున్న చాలా చిన్న ఆసనంమీద, దాదాపు మోకరించిన స్థితిలో కూలబడ్డాడు.
‘నన్ను లక్ష్యపెట్టనివారి గతి అంతే!’ అన్నట్లు హేళనగా చిరునవ్వు నవ్విందామె.
ఎలాగైనా ఆమె ప్రసన్న వదనాన్ని చూడాలని తహతహలాడే ఏంటనీకి ఇది అగౌరవంగా తోచలేదు. ఇంతకన్నా పెద్ద శిక్ష- చర్మమంతా కమిలిపోయేవరకూ బైట తీవ్రమైన సూర్యకిరణాల్లో నిలబెట్టనందుకు అతను సంతోషించాడు. తాను చేసిన తప్పులకు ఇప్పుడిప్పుడే శిక్షను అనుభవిస్తూన్నట్లూ, కనుక అందుకు విచారపడటం అనవసరమనే ధోరణిలో ఉన్నాడతను.
ఆమె ఏమీ మాట్లాడలేదు. అసలు మాట్లాడదలచుకోలేదో, లేక మాట్లాడవలసిందేమీ లేక ఊరుకున్నదో ఏంటనీకి అంతుపట్టడంలేదు. ఇది ప్రణయకోపమో, లేక ప్రళయ కోపమో అర్థంకాక అవస్థపడ్డాడు. అవసరం తనది కనుకా, ప్రాధేయపడవలసింది తాను కనుకా తనే మాట్లాడసాగాడు.
తాను ఈజిప్టు విడిచింది మొదలూ ఏమేం జరిగిందో, తాను ఎందుకని ఆక్టోవియాను వివాహమాడవలసి వచ్చిందో, ఇపుడు ఏ మిషమీద తాను ఇటువచ్చాడో- మొదలైన విషయాలన్నీ చెప్పుకున్నాడు.
ఆ చెప్పేది చరిత్రకాదు. కథ అంతకన్నా కాదు; చివరకు జీవిత చరిత్ర, యథార్థ గాథ కూడా కాదు. ఒక నేరస్థుడు నిందితుడై, తన నేరాలకు సంజాయిషీ చెప్పుకొనే ధోరణిలో మాట్లాడాడతను.
ఐతే, క్లియోపాత్రా అతని మీద నేరాలేమీ మోపలేదు. కనీసం ఇన్నాళ్ళూ తనను ఎందుకు మరిచిపొయ్యావనన్నా అడగలేదు. అసలు ఏంటనీని జీవితంలో మొదటిసారిగా ఇప్పుడే కలుసుకున్నట్లుగా ప్రవర్తించిందామె. తన నేరాలను తానే గ్రహించి, న్యాయాధిపతి అడగకపూర్వమే, తనను తాను కాపాడుకునే బాధ్యతను గుర్తెరిగిన నేరస్థుని విధానంలో ఏంటనీ చెప్పుకుపోతున్నాడు.
అతను చెప్పటమేగాని ఆమె వింటూన్నదో, లేదో ఆమె మొహం చూస్తే అర్థమవలేదతనికి. నిర్లిప్తంగా ఉన్నదామె. ఏ భావమూ తెలియబుచ్చటంలేదు. అసలామె ఏమీ వినదల్చుకోలేదేమో? కనీసం తనను తిట్టి కొట్టినా ఏంటనీకి కొంత తృప్తి ఉండేది. తన నేరాలు రుజువై తాను నేరుస్థడుగానే ముద్రపడ్డాడో, లేక రుజువుకాక విడుదల చేయబడుతున్నాడో తెలియటం లేదనతనికి. అతను చెప్పే విషయాల్ని ఆమె ఆమోదించనూ లేదు. చివరకు చాలాసేపటి వరకూ తాను అనవసరంగా వాగి అలసిపొయ్యానని ఏంటనీ పశ్చాత్తాపపడవలసి వచ్చింది.
అతను అలాగే ఆమెవైపు చూస్తూండిపోయాడు. ఆమె కూడా వౌనం వహించింది; అయితే దీన్నతను భరించలేపోయాడు.
‘‘రాణీ! ఎంత మారిపొయ్యావ్!’’ అన్నాడతను.
‘‘నేనా?’’ అన్నదామె. ‘‘ఔను.. ఈ ప్రపంచమేమీ మారలేదు. కేవలం నేనొక్కదానే్న మారిపొయ్యాను కదూ?’’
తనలో కలిగిన మార్పుల్ని గూర్చి ఏంటనీకి గుర్తుచేసిందామె.
‘‘చెప్పానుగా రాణీ! రోమన్ రాజకీయాలు నన్ను కట్టిపారేసినవి.. నిన్ను స్మరించని రోజుంటూ లేదంటే నమ్ము!’’
పకపకా, హేళనగా నవ్విందామె.
‘‘నన్ను ప్రియురాలుగా మోసం చేయగలవు గాక!
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు