డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడికి రాజకీయాలలో ప్రవేశాన్ని కలిగిస్తూ, ఎవరెవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, రాజరికాన్ని ఎలా ప్రదర్శించాలో ఆమె తెలియజెప్పసాగింది.
వాడిప్పుడిప్పుడు లోకాన్ని అర్థం చేసుకుంటున్నాడు. అమ్మ ఎప్పుడూ దిగులుగా ఎందుకుంటుందోనని ఆలోచిస్తున్నాడు. దేశదేశాలనుంచీ రాయబారులు వచ్చినపుడు తన తల్లి నిజంగానే మహారాణి అని ఆమెను చూస్తేనే అర్థవౌతుంది.
ఒక దేవతవలె కూర్చుంటుందామె. వరాలకోసం ఘోర తపస్సు చేసినవారిలాగు, రాయబారులు భయభక్తులతో మాట్లాడుతారు. అప్పుడామె మొహంలోకి చూస్తే, రాజరికమనే పదానికి నిజమైన అర్థమేమిటో తెలుస్తుంది.
చిత్రం! ఆమె ఏ దేశ రాయబారితో ఆ దేశ భాషను, మాతృభాషవలెనే మాట్లాడుతుంది. రాయబారి తెల్లబోయి ఆశ్చర్యపోవటాన్ని సీజర్ టాలమీ అనేకసార్లు చూశాడు. తాను కూడా తల్లివలెనే ఈజిప్టుకు పాలకుడై ప్రవర్తించాలి. కాదు- అనేకసార్లు అమ్మ అన్నట్లు, సీజర్ పుత్రుడైన తాను, సీజరంత ప్రచండ యోధుడు కావాలి! ఈ భూవలయాన్నంతా ఏలాలి! రాజ్యకాంక్ష వాడిలో తీవ్రంగా పనిచేస్తున్నందుకు క్లియోపాత్రా ఎంతో సంతోషించింది. ఐతే ఆ కోరికలు తీరేందుకు తనకు బైటి సహాయం లేదు కనుక, తనకు తానే సహాయపడాల్సి వుంటుందని కూడా ఆమెకు తెలియకపోలేదు.
సీజర్ చాలా తెలివిగలవాడవుతాడని క్లియోపాత్రా నమ్మింది. పదేళ్ళ వయస్సులోనే వాడు ఉత్తమాశ్వాన్ని ఎన్నుకోగలడు, గుర్రపు స్వారీ చేయటంలోనూ, కత్తియుద్ధంలోనూ ప్రావీణ్యాన్ని సంపాయించాడు. రాయబారిని దూరం నుంచి చూచి, అతని దుస్తుల తీరునుబట్టి ఏ దేశం నుంచి వస్తున్నాడో చెప్పగలడు. అలెగ్జాండ్రియా రేవులోకి ఓడరాగానే దాని తారువాసనను బట్టి అది ఏ దేశానిదో గుర్తుపట్టగలడు.
ఏయే దేశాలలో ఏమేమి దొరుకుతవో, ముఖ్యంగా రోమ్‌కూ, ఈజిప్టుకూ వున్న సంబంధమేమిటో వాడికి అర్థమైంది. టాలమీ వంశానికి అలెగ్జాండర్ మూలపురుషుడనే ప్రతీతి ఉన్నది. ఆ వంశ చరిత్రంతా వాడికి తెలుసు. బహుశా అప్పట్నుంచే వాడి మనసులో కూడా ప్రపంచ సామ్రాజ్యం ఏర్పడి, వాడి స్వప్నాలన్నీ భూప్రదక్షిణం చేస్తూనే వుండి ఉండాలని క్లియోపాత్రా అనుకునేది.
మధ్యాహ్నం నుంచీ సాయంత్రందాకా క్లియోపాత్రా అటు రాణి కాదు, ఇటు తల్లీ కాదు. తన గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఆమె ఊహలకు భంగం కలిగించే సాహసం ఎవ్వరికీ లేదు. ఆమె ఏం ఆలోచిస్తూ వుంటుందో, లేక నిద్దరేపోతుందో ఎవరికీ తెలియదు. కాని, గదినుంచి బైటికి వచ్చినపుడు మాత్రం ఆమె మనస్సు వికలమైనదని ఆమె మొహం చూస్తే గ్రహించవచ్చు. ఐతే, ఆమె అంతలోనే తిరిగి మనిషవగలదు. తనను కలత పెట్టే విషయాలే లేవన్నట్లుగా ఆమె ప్రవర్తించగలదు. అది ఆమె సహజ గుణమనే అనుకోవాలి.
ఇప్పటికీ తన సౌందర్యాన్ని గూర్చి రోమ్‌లో కథలు చెప్పుకుంటున్నారనే వార్తలు విని ఆమె నవ్వుకునేది. తాను అధికారమున్న, ప్రమాదకరమైన స్ర్తి అట! ప్రపంచానే్న తల్లక్రిందులు చేయగల శక్తి తనకున్నదట! కానట్లయితే, సింహం లాంటి సీజర్‌నూ, పులిలాంటి ఏంటనీని పాదాక్రాంతుల్ని చేసేదా అని అనుకుంటున్నారట! ఇవన్నీ విన్నప్పుడు ఒకవైపు గర్వం, మరోవైపు తన అథోగతీ గర్తొచ్చేవి. తన జీవితగాథలో సుఖంకన్నా బాధ ఎక్కువ. తనకు తాను పర్యావలోకనం చేసుకుంటే, తన బతుకు నవ్వులపాలేననుకోవాల్సి వస్తుంది!
ఇక పశ్చిమాన ఏంటనీ గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో, ఆక్టోవియాతో కాపురం చేస్తున్నాడు. అతను సుఖంగా, ప్రశాంతంగా ఉన్నాడని వార్తలు వస్తూన్నవి. రోమ్ రాజకీయాలను అతనిప్పుడు పట్టించుకోవటంలేదు. ఇటలీకి దూరంగా ఉన్నాను కదానని తృప్తిపడుతున్నాడు కూడాను. ఆక్టోవియా ఏంటనీకొక కూతుర్ని కన్నది. కాని, అతనికి పుత్రుడు ఐతే అక్టోవియాను వొదిలించుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నవి. సంధి షరతుల ప్రకారం , తూర్పుదేశాల పాలన తనది. ఈ మూడేళ్లలోనూ తాను ఆ దేశాల వైపే చూడలేదు. ఏథెన్స్‌లో విలాస జీవితాన్ని గడుపుతూ చిన్న చిన్న రాజ్యాలకు రాజుల్ని మారుస్తూ కూర్చున్నాడు.
ఇపుడు తిరిగి పర్షియన్ దండయాత్ర సాగిస్తానన్నట్లయితే ముందు ఇక్కడి సంసారికి బంధనాలను తెంచుకుని తూర్పుదేశాలకు జారుకోవచ్చు. దండయాత్రకు ఎటూ రోమన్ ప్రభుత్వం తప్పక సహాయపడుతుంది. తన ప్రయాణానికి తగిన కారణమూ ఉంటుంది.
తన అంతరాంతరాల్లో యేమున్నదో అక్టోవియస్‌కు తెలుసు. అతను కూడా అడ్డుచెప్పలేదు. ఐతే. తను ఆ ప్రాంతాల లేకుండా వెళ్తే రోమ్‌లో తన పలుకుబడి తగ్గవచ్చు. కాని, అక్టోవియా తన నార్య కనుక బంధుత్వాన్ని చూసయినా అక్టోవియన్ తనకు హాని కలిగించేందుకు సాహసించడు. అక్టోవియా ఉత్తమ ఇల్లాలు కనుక, పుల్వియా వలె సాహసకృత్యాలకు అసమర్థురాలు. ఈ పథకమంతా చాలా చక్కగా అతికింది.
ఇదంతా విన్న క్లియోపాత్రా ఏంటనీ ఏమేమి ఎలా ఆలోచించి ఉంటాడో తేలిగ్గా గ్రహించింది. ఈసారి అతను దండయాత్రల కోసమై ఇటు రావటం లేదు. తన నుంచి పొందిన సౌఖ్యాన్ని మరువలేక వస్తున్నాడు. మూడేళ్ల వియోగ భారమంతా ఇప్పుడు అతని మీద పనిచేస్తూండి ఉండాలి. ఐతే ఈసారి అతన్ని జేరనీయరాదు. ఈ మూడేళ్లు తనెంత కుమిలిపోయిందో ఈ విశాల ప్రపంచంలో ఒంటరిగా బతకవలసి వచ్చిందో ఎంత మాధావహమైనదో ఆమె మరిచిపోలేదు. అలాటి బాధకు ఏంటనీనీ కూడా గురి చేస్తేనే కానీ అతనికి బుద్ధి రాదని తనకు కసి తీరదనీ ఆమె నిశ్చయించుకున్నది.
ఏంటనీ పర్షియన్ దండయాత్రను గూర్చి ప్రస్తావించగా, అక్టోవియన్ ఎంటనీ అంతర్గతాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొన్నాడు. పర్షియా నుజయించిరోమన్ సామ్రాజ్యంలో కలపటం సీజర్ కోరిక. ఆ పవిత్రమైన కోరికను రోమ్‌లో ఎవ్వరూ గౌరవించలేదు. కానీ ఎంటనీ తూర్పుకు ప్రయాణాన్ని సాగించి మెల్లిగా క్లియో పాత్రాతో జేరిపోయి రోమ్ మీదనే యుద్ధాన్ని ప్రకటిస్తాడనే భయం అక్టోవియన్‌కు ఉన్నది. ఐతే పైకి మాత్రం ఈ కారణం చెప్పలేదు. అందుకని తాను సైన్యాలనైతే సమకూర్జగలను కానీ కావలసిన ధనాన్ని ఇవ్వలేనని అన్నాడు.
ఏంటనీ పకపకా నవ్వాడు. ‘‘బావగారు! మీరింకా దొడ్డిదోవనే ఉన్నారు. పర్షియా మీద దండయాత్రంటే సరాసరి పర్షియాకే వెళ్తామనాః మ ధ్య దారిలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించడం వాటిని దోచుకోవడం జరుగుతుంది. ఇక్కడ రోమ్‌లో ఏముందయ్యా? బంగారం కావాలంటే తూర్పుదేశాలే శరణ్యం. ఇక్కణ్నుంచి ధరరాశులు తీసుకొని వెళ్లటం బరువు చేటు.’’ అన్నాడు.
అక్టోవియన్‌కు ఎటూ పాలుపోలేదు. సర్వాధికార వర్గం ఏంటనీ పధకం అంగీకరించింది. ఈసారి పర్షియాను జయించాలనీ ఏంటనీ చాలా పట్టుదలతో ఉన్నాడు. అందుకు కావలసిన ధనరాశులు ఈజిప్టులో ఉన్నవనే సంగతి అతనికి తెలుసు. ఈజిప్షియన్ రాణి తన ప్రేయసి కనుక ఆ ధనరాశులు కూడా తనవే కాగలవని అతని నమ్మకం.
రోమన్ సైన్యాలతో నిండిన ఓడలు తూర్పుకు బయలుదేరినవి. మధ్యదరా సముద్ర తీరాన ఉన్నచిన్న చిన్న రాజ్యాలు యుద్ధానికి కాలు దువ్వలేక ఏంటనికీ లొంగిపోయినవి. అతను సిరియాలో మకాం వేశాడు.
ఇక క్లియోపాత్రా ను ఇక్కడికి పిలవనంపి పర్షియన్ దండయాత్ర విషయంల ఆమెకు నచ్చచెప్పి ఈ ఖర్చులన్నీ ఆమె నెత్తిన వేయాలి. అంతకన్నా ప్రియుడిగా తాను క్లియో పాత్రా ను పిలవనంపటం మంచిది. ఆప్పుడామె దురూహలకు గురికాదు.
క్లియోపాత్ర కూడా ఈ పిలుపుకోసమే దాదాపు నాలుగేళ్ల నుంచి ఎదురు తెన్నులు చూస్తూన్నది.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు