డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదంతా క్లియోపాత్రాకు చెప్పి చారుడు అన్నాడు. ‘‘ఆయన అన్న మాటల అర్థం వేరు, ఆ కంఠస్వరం వేరూను. ఆ స్వరంలో నాకంత ఆశ కనిపించలేదు రాణీ!’’
క్లియోపాత్రా నిట్టూర్చింది. ఇప్పుడు విచారపడి, దుఃఖించే ఓపిక కూడా ఆమెకు లేదు. ఎందుకంటే, దాదాపు నెలలు నిండిన గర్భవతి ఆమె. అద్దంలో చూసుకుంటే తనను తాను గుర్తించలేనంత వికృతంగా మారిపోయింది. తాను తన యవ్వనాన్నీ, అందచందాల్నీ తన నుంచి వేరుచేసుకొని హృదయపూర్వకంగా ఏంటనీకి అర్పించింది. ప్రతిఫలంగా అతను శారీరకంగానూ, మానసికంగానూ తనను ఏ స్థితికి దిగలాగాడో ఆమె గ్రహించింది. దేవతల్లే వచ్చి అంతర్థానమై, దెయ్యమల్లేవచ్చి తనను పీడిస్తున్నాడు. ప్రణయానికి మారుగా, ఈర్ష్యతో ఆమె దగ్ధమైపోతోంది.
రోమన్‌లందరూ విశ్వాసఘాతకులు! స్వార్థపరులు! వారి ప్రేమంతా నటన మాత్రమే! అధికారం కోసం, తమ పనులకు సానుకూలంగా ఉండేందుకు వారు ఏమైనా చేస్తారు! తన సహాయం అవసరమైననాడు, తన పాదాలు ముద్దెట్టుకుంటారు. తీరా అవసరాలు తీరాక, తనను శత్రువల్లే చూస్తారు. ఈ వెధవ మగజాతే అంతనుకోవాలి. అందునా ఆ పురుషుడు రోమన్ ఐతే, ఇక చెప్పవలసింది లేదు. తన జీవితంలో ఎదురైన రెండు అనుభవాల సారాంశమేమిటో ఆమెకు బాగా తెలిసివచ్చింది.
ఐతే, తాను మాత్రం స్వార్థంతో ఏంటనీని ఆకర్షించలేదా? కేవలం ప్రేమకోసమే అతన్ని జేరదీయలేదు. రాజకీయంగా అతను తనకు సహాయం చేస్తాడనీ, రోమన్ సామ్రాజ్యాన్ని గెలిచి తనకు అంటగడతాడనీ తాను ఆశించలేదా? అందుకనే అతనికి లొంగినట్లే నటించి, లొంగదీసుకున్నది. కాని మొదటిది నిజం, రెండోది అబద్ధమైంది.
అందుకే ఆ తన మీద తాను మండిపడుతోంది. తనను తాను నీచపరచుకున్నది. ఒక వ్యభిచారిణిగా రెండోసారి కూడా ప్రవర్తించింది. తనమీద తనకు భరించలేనంత అసహ్యం కలుగుతోంది. ఈ గర్భాన్ని నాశనం చేసే శక్తులేమైనా ఉంటే బాగుండు! కాని ఇప్పుడిదంతా మించిపోయింది. తాను పొందిన సుఖాలకు జరిమానంగా ఇప్పుడీ శిక్ష తనకు పడింది. దాన్ని భరించడం కన్నా మార్గాంతరం లేదు.
మనోవేదనతోనే ఆమె పురుడు పోసుకున్నది. ఈసారి ఆమెకు కవలలు జన్మించారు. ఒక మగబిడ్డా, ఒక ఆడబిడ్డా పుట్టారు. ఆమె ప్రణయినిగా భంగపాటు చెందినందుకిప్పుడు విచారపడటంలేదు. ఎందుకంటే, ప్రణయదేవత పూనకం పూర్తయింది. మాతృదేవతే ఇప్పుడామెను ఆవహించింది. తన స్ర్తిత్వం సార్థకతను పొందినందుకు ఆమె పొంగిపోయింది.
కొడుకును సూర్యదేవుడని ముద్దుగా పిలుస్తుందామె, కూతుర్ని చందద్రేవతగా భావిస్తున్నది. కొడుక్కు అలెగ్జాండర్ అని పేరు పెట్టింది. కూతురికి క్లియోపాత్ర పేరే పెట్టింది.
తన సంతానాన్ని చూసుకోవాలని ఏంటనీ ఉవ్విళ్లూరాడా అని ఆమె ఆలోచించింది. కాని, అలాంటది ఏంటని పితృహృదయంలో ఉంటుందనుకోవడం శుద్ధ పొరపాటని తేల్చుకున్నది. ఎందుకంటే తనతో గడిపినన్నాళ్ళూ అతను ఎన్నడూ రోమ్‌లోని తన సంతానాన్ని కనీసం తలచనన్నా తలచలేదు. అతని హృదయమొక పాషాణం, దానికి జీవాన్ని ఇవ్వాలని తాను వృథా ప్రయాసపడింది.
ఏమైతేనేం, తనకీ పిల్లలే దక్కారు. తన ప్రణయ పుష్పాలివి. అందుకు నిజంగానే గర్వపడిందామె చిత్రం- పెద్దవాడు సరిగ్గా సీజర్ పోలిక, ఈ కవలల్లో కొడుకు సరిగ్గా తన పోలిక. తన అందచందాలు పంచుకొని మగజన్మ ఎత్తాడు. తాను స్ర్తి కాకుండా, పురుషుడే ఐతే ఎలా ఉండేదో వీణ్ణి చూస్తే అర్థవౌతుంది. కూతురు ఏంటనీ పోలిక. అతని కఠినత్వమంతా ఆమెలో ప్రతిఫలిస్తోంది. ఈ పిల్లల్లో ఆడుకుంటూ, వారిని చూసుకుంటూ క్లియోపాత్రా మాతృదేవిగా కొంతకాలంపాటు ఈ ప్రపంచానే్న మరిచిపోగలిగింది.
మూడు సంవత్సరాల వరకూ ప్రపంచ చరిత్రలో ఏ కదలికా లేదు. మధ్యధరా సముద్రానికి ఒక వొడ్డున క్లియోపాత్రా ఒక్కతే ఈజిప్టు పాలిస్తోంది. రెండో వొడ్డున రోమన్ ప్రభుత్వం పాలన సాగించింది.
ఈజిప్షియన్ రాజ్యం శిథిల స్థితిలో ఉండటంవల్ల, విస్తరణ విషయంలో ఆలోచనలు క్లియోపాత్రాకు లేవు. ముందు స్వదేశ పరిపాలనను ఒక పద్ధతిలో పెట్టేందుకు ఆమె ప్రయత్నించింది. అక్కడ రోమ్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వం, రాజరికం వైపు మొగ్గుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే పేరుకు మాత్రమే ప్రజాస్వామికం కాని, దాని లక్షణాలూ, కదలికలు మాత్రం చక్రవర్తిని స్థాపించేందుకు దోహదమిస్తూన్నవి. ఈ విధంగా ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఒకరి జోలి మరొకరు పట్టించుకోకుండా ఉండటంవల్ల, రెండు దేశాలకూ మధ్యవున్న చిన్న దేశాలవారు కాస్త శాంతి వాయువుల్ని పీల్చగలిగారు.
ఈ మూడేళ్ళలోనూ క్లియోపాత్రా చాలా నిరుత్సాహపడింది. ఆమె కలల్లో చిన్నభాగం కూడా నిజమవలేదు. తనకు అన్నివిధాలా అన్యాయమే జరిగింది. యోధుడుగా కానీ, నాథుడుగా కానీ, ఏంటనీ తనకు చిక్కలేదు. ఇప్పుడు ఏంటనీవల్ల కలిగిన ఈ పిల్లల్ని చూస్తేనే కాని అతను గుర్తుకు రావడంలేదు. ఇదివరకల్లే అతను తనను విడనాడిన దిగులు ఇప్పుడామెకు లేదు. అందుకని జీవితంమీద ఆసక్తీ లేదు. నిర్జీవంగా, కేవలం ఎవరో నడిపిస్తూన్న విధంగా ఆమె కాలం గడిపింది. ఇక రోమ్ నుంచి తాను ఆశించవలసిందేమీ లేదు. ఈజిప్టు, రోమన్ సామ్రాజ్యంలో కలవకుండా కాపాడుకుంటే చాలు. నైతికంగా కూడా తాను చాలా పతనమైపోయినందుకు క్లియోపాత్రా పశ్చాత్తాపపడింది. తానిప్పుడు ముగ్గురు బిడ్డల తల్లి, పితృప్రేమ నెరుగని ఈ రాజవంశీకులు తల్లినే తల్లిదండ్రులుగా చూసుకుంటున్నారు. తనకు అధికారమంటూ ఉన్నది కనుక ఎవ్వరూ విమర్శించేందుకు సాహసించటంలేదు కానీ, లేకుంటే తనేమయ్యేదో?
అయితే ఎల్లకాలమూ తాను రాణిగా ఈజిప్టుమీద అధికారాన్ని కలిగి ఉండగలదనేమిటి? టాలమీల వంశంలోకి, ఇతర జాతుల రక్తంపడి కలుషితం కాకుండా, రాజవంశీకుల్లోనే వివాహాలు జరిగి, సంతానాన్ని పొందే ఆచారాన్ని సైతం తాను అతిక్రమించింది. ఇందువల్ల తన సంతానం అటు రోమన్‌లూ కాదు, ఇటు ఈజిప్షియన్‌లూ కాదు.
ఈ సంకరజాతిని రేపు ప్రజలు తమ ప్రభువుగా స్వీకరిస్తారనేమిటి? తాను సరైన వారసుణ్ణి ఇవ్వని కారణాన, ప్రజలు తనను భరిస్తారనే హామీ ఏమిటి? ప్రభుత్వోద్యోగులు ఏ క్షణాన తనకు విషమిచ్చి చంపినా, తాను చేయగలిగిందేమిటి? అసలే అబల, అందునా అనాథ ఐన తాను, తన శక్తి సామర్థ్యాలమీద మాత్రమే ఆధారపడి బతకవలసి వచ్చింది.
బతుకు భారమంతా నెత్తినపడింది. ఈ మూడేళ్ళలోనే ముప్ఫై సంవత్సరాల అనుభవంమీద పడినట్లయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఆమెకు తెలియంది కాదు. తనకింకా అధికారమంటూ ఉన్నప్పుడే మెల్లిగా తన సంతానాన్ని ఈజిప్షియన్ సింహాసనంమీద కూర్చోబెట్టి తీరాలి. ఇంతకుముందు తన సుఖసౌఖ్యాలనే ఆమె చూసుకున్నది. ఇప్పుడు తన సంతానం కొరకు ఏదైనా చేసి తీరాలనే పట్టుదల ఆమెలో అధికమైంది. నిత్యజీవితం మీద ఆమెకు శ్రద్ధ తగ్గింది. చివరకు కాలకృత్యాల్ని తీర్చుకునేందుకు కూడా ఆమెకు విసుగ్గా వున్నది. రోమ్‌లో ఏం జరుగుతున్నదో, ఏంటనీ ఎలా ఉంటున్నాడో ఆమెకు వార్తలు వస్తూనే వున్నవి. కాని, వాటిని గూర్చి పూర్వంవలె గంటల తరబడి తనలో తను తర్కించుకొని, బుర్ర చెడగొట్టుకోవటంలేదు.
పెద్దవాడి వయసిప్పుడు పదేళ్లు. వాడు సీజర్ వలెనే పొడుగ్గా బలిష్టంగా ఉంటాడు. మాట తీరు, కంఠస్వరం సీజర్‌ను జ్ఞాపకం చేస్తూంటవి.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు