డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ద సన్నాహాలు జరుగుతూన్న సమయంలో, పుల్వియా హఠాత్తుగా గుండెజబ్బుతో చనిపోయింది. వయసు 30 సంవత్సరాలే అయినా, మానసికంగా చాలా దిగజారిపోయిందని వైద్యులన్నారు.
పుల్వియా మరణంతో రోమ్‌మీద దండయాత్ర చేయవలసిన అవసరం చాలావరకు తగ్గిపోయింది. సైన్యాధిపతులు సంధి చేసుకొనేందుకు ఏంటనీని వొత్తిడి చేశారు. గత పదిహేనేళ్లుగా రోమ్ అంతర్యుద్ధాలతో చితికిపోయింది. దీన్నింకా సాగించటంలో అర్థముండదు. అటు ఆక్టోవియన్ కూడా యుద్ధం తప్పినందుకు ఆనందించాడు. సంధికి అంగీకరించాడు.
పుల్వియా మరణం క్లియోపాత్రాను సంతోషపెట్టలేదు. ఏంటనీ భార్యగా ఆమె తనకు విరోధి, సవితి అయినప్పటికీ, అక్కడ రోమ్‌లో పుల్వియా తన పలుకుబడితో, రోమన్ రాజ్యాధికారిగా ఏంటనీని తీసుకొని రావాలని ప్రయత్నించింది. ఇప్పుడు ఏంటనీ తిరిగి ఈజిప్టు వస్తే, అక్కడ రోమ్‌లో అతని పలుకుబడి తగ్గితీరుతుంది. తాను ఆశించిన రోమన్ సామ్రాజ్యం చేజిక్కదు. ఐతే, ఏంటనీ మీద తనకింకా మమత తగ్గలేదు. అతను తిరిగి వస్తే అదే పదివేలనుకున్నదామె.
రెండోవసారి ఏంటనీ, ఆక్టోవియన్‌ల మధ్య రాజీ జరగటమంటే తనకు ప్రమాదకరమేనని క్లియోపాత్రాకు తెలుసు. వారి స్నేహంతో, ఈజిప్టు ఉభయులకూ శత్రురాజ్యంగానే తోస్తుంది. ముందు వెనుకలు ఆలోచించకుండా ఈజిప్టును రోమన్ సామ్రాజ్యంలో కలుపుకోవచ్చు.
క్లియోపాత్రా ఊహలు సరైనవి. ఈజిప్టుకు కలగబోయే హాని ఎంత ఘోరంగా ఉంటుందో ఏంటనీ, ఆక్టోవియన్‌ల సంధి షరతుల్ని చూస్తే అర్థమైపోయింది.
సీజర్ సంపాయించిన రాజ్యాన్ని రెండు భాగాలు చేసుకున్నారు. పశ్చిమ దేశాల పరిపాలనంతా ఆక్టోవియన్‌కు సంక్రమించింది. తూర్పు దేశాల పరిపాలన ఏంటనీది. రోమ్ విడిచి, ఏంటనీ తూర్పు దేశాలకు వస్తే అది దాదాపు దేశ బహిష్కారం వంటిది. ఇక రోమన్ సామ్రాజ్యం మీది ఆశలు అడుగంటినట్లే లెక్క. పాంపే కుమారుడు సెక్స్‌టన్ పాంపేకు సిసిలీ, సార్దినియా రాజ్యాలు ఇవ్వబడినవి. ఈ సంధి శాశ్వతంగా కాపాడబడేందుకు ఆక్టోవియన్ సోదరి ఆక్టోవియాను ఏంటనీ వివాహమాడాడు.
అంతర్యుద్ధాలతో విసుగెత్తిపోయిన రోమన్‌లు, చివరకు శాంతి దేవత నిజంగా తమను కరుణించిందని నమ్మారు. ప్రజలు ఆనందబాష్పాలు రాల్చారు.
ఈ వార్తలు విని క్లియోపాత్రా మనసు వికలమైపోయింది. ఏంటనీ రోమ్‌మీద దండయాత్రకని వెళ్లి, కొత్తగా పెళ్లిచేసుకుని కులుకుతున్నాడు. తనను పూర్తిగా మరిచిపోయి ఉంటాడు. మొగాళ్ళ మాటల్ని నమ్మటం ఎంత ప్రమాదమో ఆమె గ్రహించింది. మనసిచ్చినందుకు సీజర్ వీలునామాలో తన పేరు కూడా ఉదహరించలేదు. రెండోసారి తన హృదయాన్నిచ్చినందుకు శిక్షగా, రుూ ఏంటనీ తనను విడనాడి మరొకతెను చేసుకొని, రోమ్‌కు బానిసగా బతికేందుకు సిద్ధపడ్డాడు.. ఇప్పుడంతా చేయిజారిపోయింది! రోమన్ రాజ్యాంగం, ఈజిప్టు మీద యుద్థాన్ని ప్రకటించినా ఆశ్చర్యమేమిటి? ఈజిప్టును దిగమింగుతే తాను చేయగలిగిందేమిటి?
అయితే, ఏంటనీ క్లియోపాత్రా తనకు ప్రియురాలు కాదని అనలేదు. కాని ప్రియురాలు భార్య కాదు కదాననే అభిప్రాయాన్ని వెలిబుచ్చి, ఆక్టోవియాను భార్యగా స్వీకరించాడు. ఇది కేవలం రాజకీయ వివాహమేననేందుకూ వీల్లేదు. ఎందుకంటే, ఆక్టోవియా కూడా చాలా అందమైనదేగాక, పతివ్రత అనే పేరు పొందింది. స్ర్తి పురుషుని చెప్పుచేతల్లో ఉండటానికి ఆక్టోవియా వేరొక రూపమని క్లియోపాత్రా విన్నది. పురుషులు చంచల స్వభావులు. అమిత వేగంతో ప్రయాణించే మెరుపు తీగెను పట్టబోయి భంగపాటుకు తాను గురయ్యానని క్లియోపాత్రా భావించింది.
ఆక్టోవియాను పెళ్లాడటంతో క్లియోపాత్రాను విడనాడటం జరుగకపోయినా, కనీసం తాను శాశ్వతంగా ఈజిప్టుకు అంకితం కాకుండా, తనను కాపాడుకున్నానని ఏంటనీ భావించాడు. ఎందుకంటే, తాను ఈజిప్టులో సుఖపడినప్పటికీ, ఇక్కడ రోమ్‌లో తన పలుకుబడులను కోల్పోయాడు. రేపు తిరిగి పర్షియా మీద దండయాత్ర సాగించాలంటే, రోమ్ సహాయం అత్యవసరం. అయితే, అప్పుడు ఈజిప్టు సహాయం కూడా కావలసిందే! కనుక ఏ ఎండకు ఆ గొడుగు పట్టక తప్పదు!
ఈ సత్యాలనన్నిటినీ క్లియోపాత్రా గ్రహించింది. సముద్రానికి ఈవలి వొడ్డున వున్న తాను, ఆవలి ఒడ్డున వున్న ఏంటనీని తన దగ్గరికి ఎలా జేర్చుగోలదు? తన నతను ఎంత ప్రేమించినా హృదయాంతరాల్లో అతను రోమన్! రోమ్ మీదనే అతని ఆశలుంటవి. రోమన్‌గానే బతుకుతూ, రోమన్‌గానే పోరాడి, రోమన్‌గానే మరణించి, రోమన్‌వలెనే అంత్యక్రియలు జరిపించుకుంటాడు. అతన్ని ఈజిప్షియన్‌గా మార్చటం బ్రహ్మతరం కాదు; తాను రోమన్‌గా మారటమూ అంతే!
ఐతే, విధి తామిద్దర్నీ ప్రణయ పిపాసులుగా శాసించి, కొన్నాళ్లపాటు ఏక శరీరులుగా బతికే అవకాశాన్నిచ్చింది. దాన్నిప్పుడు ఉపసంహరించుకున్నది. ఈ సందర్భాల మధ్య తన ఆశలు ఏంటనీ చుట్టూ తిరుగులాడటంలో అర్థం ఉండబోదు. మానవ ప్రయత్నం ఎంతగా ఉన్నప్పటికీ, అదెంత ఆశాజనకంగా తోచినప్పటికీ, దైవనిర్ణయాలను అతిక్రమించేందుకు తనలాంటి మానవ మాత్రురాలికి సాధ్యంకాదనే సత్యం ఆమెకు తెలియకపోలేదు.
రోమ్ రాజకీయాల్లో పుల్వియా కారణంగా కాచిన కుక్కమూతి పిందెలు తుంచివేయబడినవి. వీటన్నిటికీ పరోక్షంగా క్లియోపాత్రాయే కారణమని ఏంటనీ నమ్మకం. తన భావి జీవితాకాశంలోని విశ్వవిహారానికి క్లియోపాత్రా పెద్ద అడ్డంకి. ఐతే, ఆమె సహాయ సహకారాలు కూడా కావాలి. కాని, ఆమెకు పూర్తిగా లొంగిపోయి ఆ మైకంలో పడితే, తాను కేవలం ఒక ప్రియుడిగా ప్రసిద్ధి చెందవచ్చునేమో కాని యోధుడుగా, రాజకీయవేత్తగా, పాలకుడుగా రూపొందలేదు.
అనేకమంది అందగత్తెల పొందు చవిచూసిన తాను, ఈ స్ర్తి మాయలో పడిపోవటమేమిటి? ‘ప్రేమ’ అనే పదానికి వేరొక అర్థం ‘సుఖ’మని ఏంటనీ భావం; అయినప్పుడు, అందినంతవరకూ సుఖపడి బైటపడితే సరిపోతుంది. జీవితమంతా ప్రేమమీదనే ఆధారపడి వుంటుందని తాను ఎన్నడూ నమ్మలేదు. తనలాంటి ప్రముఖుడికి రాజకీయాలే శరణ్యం కాని, ప్రణయం కాదు. అందుకని క్లియోపాత్రాను మరచిపొయ్యేందుకూ, ఇన్నాళ్ళుగా రోమ్‌లో తాను లేనందువల్ల కోల్పోయిన పలుకుబడిని తిరిగి సంపాదించేందుకే ఏంటనీ విశ్వప్రయత్నం చేయసాగాడు.
క్లియోపాత్రా కూడా ఏంటనీని తూర్పు దిక్కుకు ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఆమె అంతరంగిక చారుడు వచ్చి ‘‘ప్రభూ! తూర్పు దిశనే తమ అదృష్టం పండే అవకాశం వున్నది. ఇక్కడ రోమ్‌లో ఆక్టోవియన్ పక్కన ఉంటే మీ కీర్తి విస్తరించదు. మీకు మీరుగా సాధించగలిగినదంతా తూర్పునే వున్నది. సమయం మించుతే తరువాత విచారపడి లాభం ఉండదు. కనుక మీరు సాధ్యమైనంత త్వరలోనే పర్షియన్ దండయాత్రకు సన్నాహం చేయండి. మా రాణి మీ రాకకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. ఈజిప్టు సహాయ సహకారాలతో మీరు ఈ ప్రపంచానే్న జయించగలరు!’’ అని హెచ్చరించాడు.
ఏంటనీ మనస్సు తిరిగి ఈజిప్టువైపు లాగుతోంది. ఐతే, తాను అనుసరిస్తున్నామనుకున్న ఆశయాలు వేరు, నిజంగా అనుసరించేవి వేరుగానూ పరిణమించకుండా చూసుకోవాలి. ముందుగా తనకు రోమ్ సహాయం కావాలి. ఆ తరువాతనే తానేదైనా చేయగలడు.
‘‘త్వరలోనే వస్తానని మీ రాణికి చెప్పు’’ అని ఏంటనీ చారుణ్ణి పంపివేశాడు.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు