డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో పాంపే చివరి వారసుడూ, కొడుకూ అయిన సెక్స్‌టన్ పాంపియన్ రక్షణలో వున్నట్లు వార్తలు వచ్చినవి. పాంపేయులు ఇంకా తాము బతికి ఉన్నట్లూ, వీలైనపుడల్లా రోమన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే యత్నాలలో ఉన్నట్లూ అర్థవౌతోంది. ఇపుడు ఏంటనీ ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నాడు. వెనువెంటనే రోమ్ వెళ్లి, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోకుంటే, తనకున్న కాస్త అధికారమూ ఊడుతుంది. పుల్వియా కావాలని చేసిన తప్పులన్నిటికీ పరోక్షంగా బాధ్యుడౌతాడు.
రోమ్‌లో పరిస్థితుల్ని చూసి పర్షియన్‌లు ఆసియా మైనర్‌లోకి చిన్న చిన్న దండయాత్రల్ని సాగించారు. దీన్ని బట్టి ఏంటనీ తూర్పు దేశాల్లో ఏం చేస్తున్నదీ రోమన్ ప్రభుత్వానికి వేరుగా చెప్పనవసరం లేదు. కొత్త సామ్రాజ్యం లేకుంటే మానె, ఉన్నది కూడా చేయిజారిపోతున్నందుకు ఏంటనియే బాధ్యుడయ్యాడు.
ఏంటనీని ఎదుర్కొన్న ప్రమాదానికి క్లియోపాత్రా కూడా చాలా చింతించింది. ఏంటనీ క్షేమమే తన క్షేమమని ఆమెకు తెలుసు. రోమన్ దాస్యం నుంచి ఈజిప్టు ఎటూ విడుదలయే అవకాశాలు లేవు. కనీసం రోమ్‌తో స్నేహంగానన్నా వుంటే తప్ప, ఈజిప్టు పేరుకన్నా స్వాతంత్య్ర దేశంగా ఉండదు. దీన్ని కాస్త రోమన్ సామ్రాజ్యంలో కలుపుకుంటే, అలాటి పరిస్థితులకు తాను తావిస్తే, తన గతి కుక్కలకూ, నక్కలకూ ఎరుక!
అందుకని ఏంటనీకి కావలసిన ధనాన్నీ, సైన్యాన్నీ, ఓడల్నీ ఇచ్చి సాగనంపింది. వెళ్ళే ముందు మాత్రం కళ్లు తడిచేసుకుని ‘‘స్వామీ! నన్ను మరిచిపోతారా?’’ అన్నది.
సీజర్ ఈజిప్టు విడిచి వెళ్ళేనాడు కూడా ఆమె ఇలాగే బాధపడింది. సీజర్ ప్రణయాన్ని నమ్మినంతగా ఆమె ఏంటనీ ప్రణయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఏంటనీ చపలచిత్తుడు. ప్రపంచమంతటా సౌందర్యవతులున్నారు. ఏ క్షణాన అతని మనస్సు మారిపోతుందో ఎవరికీ తెలియదు. ఎక్కడుంటే అక్కడే పాతుకుపోతాడు. అలాంటి వ్యక్తిని నమ్మటమెలా?
కానీ ఏంటనీ క్లియోపాత్రాను హృదయపూర్వకంగా ప్రేమించాడు. కనీసం అలా అని నమ్మాడు.
‘‘రాణీ! నేను జీవితంలో మరువలేని సుఖాన్నిచ్చావు. రోమ్‌లోని వ్యవహారాల్ని ఎంత త్వరలో వీలైతే, అంత త్వరలోనే ఒక పద్ధతిలో ఉంచి, రెక్కలు కట్టుకొని వాలుతాను.. నన్ను నమ్ము’’ అన్నాడు.
క్లియోపాత్రా నమ్మింది. ప్రేమ మైకంలో ఎన్ని అబద్ధాలయినా నిజాలుగానే ధ్వనిస్తవి. ఎవరి స్వార్థం కొరకు వారు ప్రయత్నిస్తున్నప్పటికీ- ఉభయుల స్వార్థమూ ఇమిడి వున్న సంఘటనల్లోనన్నా ఒకరినొకరు గాఢంగా నమ్మక తప్పదు కదా!
ఏంటనీ రోమ్ వైపు ప్రయాణాన్ని సాగించాడు.
క్లియోపాత్రాకు తిరిగి ఒంటరి బతుకు ఆరంభమైంది. ఇప్పుడామె గర్భవతి! మొదటిసారి గర్భాన్ని ధరించినపుడు సీజర్ దగ్గరనుండి, తాను పురుడు పోసుకున్నాక వెళ్లాడు. ఇప్పుడీ రోమన్ తనకు గర్భాదానం చేసి, దులుపుకొని తన దారిన తాను వెళ్లాడు.
తనకు కలగబోయే సంతానంతో ఇద్దరు పిల్లలవుతారు. వీరికి తండ్రులు వేరు. మొదటి సంతానం తండ్రి చచ్చి స్వర్గాన ఉన్నాడు. ఈ రెండో సంతానం తండ్రి బతికి ఉండీ దూరతీరాల్లో ఉన్నాడు కనుక చచ్చినవాడి కిందనే జమ! పూర్వం ఒక ప్రియుని వియోగంతోనే తల్లడిల్లిపోతే, ఇప్పుడా దుఃఖం రెండింతలైంది.
కనీసం తాను పురుడు పోసుకునేవరకన్నా తన దగ్గిర ఉండమని క్లియోపాత్రా ఏంటనీని కోరాలనుకుంది. కాని రోమన్ రాజకీయాలలో ఏంటనీ నిలదొక్కుకోనిదే అతనితోపాటు తాను కూడా సర్వనాశనానికి గురవవలసి వస్తుందని ఆమెకు తెలుసు. అందుకనే ఏంటనీని త్వరగా రోమ్‌కు పంపవలసిన తన బాధ్యతను ఆమె గుర్తించింది.
ముందు ముందు పరిస్థితులు దారుణంగా రూపొందుతవనే భయం కూడా ఆమెను పీడిస్తోంది. ఎందుకంటే ఏంటనీ రోమ్‌పట్ల దేశద్రోహిగా నిర్ణయించబడితే, అతనితోపాటే తాను కూడా దేశద్రోహి కాగలదు. లేనిపోని తద్దినాన్ని మెడకు చుట్టుకున్నానా అని ఆమె ఆలోచించింది.
సీజర్‌తో తన ప్రణయం యుద్ధరంగంలో ఆరంభమైంది. కాని, ఇతనితో విందుతో ప్రారంభమైంది. ఇది యుద్ధంతో ముగిసేట్లయితే ఆ పరిణామాలు ఊహించేందుకు భయానకం!
తాను మొదటిసారి పురుడుపోసుకొని ఏడేళ్లయింది. ప్రపంచం లెక్కల్లో అది ఏడేళ్ళే అయినా, తనకు డెబ్భైఏళ్ళు గడిచినట్లుగా ఉన్నది. తన రుూ కొత్త ప్రియుడు ఎన్నో ప్రమాణాలు చేసి వెళ్ళాడు కాని, అవి నాలుక చివర్లనుంచి వెలువడివో, హృదయపు లోతుల్లోంచి వచ్చినవో తనకు అనుమానమే!
తన దారికి అడ్డుగా ఏంటనీ భార్య పుల్వియా ఉన్నది. ఆక్టోవియన్ సర్వాధికారిగా ఉన్నాడు. ఆక్టోవియన్‌తో స్నేహంగా ఉండడం కన్నా బతకాలి, లేదా అతన్ని గెలిచన్నా బతకాలి. మొదటిదే సాధ్యం. ఇందులో ఏంటనీ ఎంతవరకు విజయవంతుడవుతాడో తెలియదు. ఏంటనీ తన దగ్గరగా ఉన్నపుడున్న దైర్యం ఈనాడు లేదు. ఉభయుల మధ్యా అంతులేని సముద్రం అడ్డుగా వున్నది. తను తిరిగి అనాధ అయింది. విధి తన అదృష్టాకాశంలో అపుడప్పుడూ రుూ మెరుపుల్ని మెరిపిస్తూ, మురిపిస్తూ, కాంతి కురిపిస్తూ, తరువాత కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో నింపుతోంది.
ఏంటనీ తిరిగి వెళ్లాక, ఆమె తిరిగి స్వదేశీ రాజకీయాల గూర్చి శ్రద్ధ తీసుకోసాగింది. అతను పెనుతుఫానల్లే వచ్చిపడ్డాడు. ఈజిప్టు చరిత్ర రూపురేఖలు మారిన విధంగా అంతా తలక్రిందులు చేసిపారేశాడు. ఇపుడు ఆ తుఫాను తగ్గాక, ఆమె అన్నిటినీ సక్రమ పద్ధతిలో పెట్టుకుంటోంది. ఒక విధంగా చూస్తే, అతను వెళ్లిపోవటమే మంచిదనిపిస్తోంది. లేనట్లయితే ప్రపంచ సామ్రాజ్యం సంగతి దేవుడికెరుక - ముందు ఈజిప్టు తన చేతుల్లో నుంచి జారిపొయ్యేదేమో?
కాని ఏది ఏమైనా, రుూ ప్రపంచమే తలక్రిందులైనా తనకు తన ప్రియుడు ఏంటనీ అన్నా దక్కివుంటే బాగుండేది. ఈ రాజరికభారంతో తాను ఒంటరిగా బతకలేదు. తన వయసునూ, వలపునూ స్వీకరించగల పురుషోత్తముడొకడు అండగా ఉండాలి. అయితే, ప్రపంచ చరిత్రంతా తన చేతుల్లోనే ఉన్నదా? నిజానికి లోక చరిత్ర రూపమంతా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు రోమ్‌కే ఉన్నవి. అక్కడే తన భావి, చరిత్ర ఉండగా, ఇక్కడ ఈజిప్టు గడ్డమీద ఏమున్నది? ఆతృతతో ఏ రోజుకారోజు రోమ్‌లో జరుగుతున్న సంఘటనల్ని గూర్చి తన చారుల ద్వారా ఆమె తెలుసుకుంటోంది.
అధికారం కోసం ఆక్టోవియన్‌తో ఏంటనీ పోరాడవలసిన అవసరం వున్నది. కాని, రోమన్ రాజ్యాంగంలో అంతరాంతరాల్లో నిప్పు రగులుతున్నప్పటికీ, ఏంటనీ, ఆక్టోవియన్‌లు పైకి స్నేహంగానే ఉన్నారు. అయితే పుల్వియా లేవదీసిన రుూ తిరుగుబాటుతో రాజకీయ వాతావరణం అల్లకల్లోలమైంది.. ఈ కారణంగా ఏంటనీ, పుల్వియాకు విడాకులిస్తాడా? అదే జరిగితే, పుల్వియా ఎంతకైనా సాహసిస్తుంది. ఆమె గాయపడిన పులి అవుతుంది!
ఆక్టోవియన్‌కు యుద్ధమంటే భయం! ఎలాగైనా తెలివిగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకే అతను ప్రయత్నిస్తాడు. పాంపేయుల్లో మిగిలిన సెక్స్‌టన్ పాంపేతో సంధి చేసుకోవటం ఉత్తమంగా భావించి, అక్టోవినయ్- తన భార్య (పుల్వియా కుమార్తె)కు విడాకులిచ్చి, పాంపేయుల మేనకోడల్ని పెళ్లాడు. దేశంలో శాంతి నిలిచింది కదా అని ప్రజలు సంతోషించారు.
ఏంటనీ ఏథెన్సు జేరాడు. అక్కడి పరిస్థితులు తెలుసుకొని, తన భార్య పుల్వియా చేసిన నిర్వాకానికి మండిపడ్డాడు. ఇక తప్పనిసరై సేనల్ని తీసుకొని రోమ్ వైపు బయలుదేరాడు. కాని సైనికులు తమకు బంధు మిత్రులూ, స్వదేశస్థులూ అయిన రోమన్‌లమీద యుద్ధం చేసేందుకు నిరాకరిస్తున్నారు.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు