డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను ఆమె ముందు ఎంత అల్పుడయ్యాడో అతను గ్రహించగలిగినా, అందుకు సిగ్గుపడలేదు సరికదా, గర్వపడ్డాడు కూడాను.
‘‘దానికి పెద్ద ఆలోచన దేనికి ప్రియా! అలెగ్జాండ్రియాలో ఏం తక్కువ? భూతల స్వర్గాన్ని నీకు చవి చూపుతాను.. నాతోరా!’’ అన్నదామె.
ఏంటనీ కాస్సేపు ఆలోచించాడు. తాను పర్షియన్ దండయాత్ర మిషతో ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ సైన్యాలు ఉన్నవి. ఇవన్నీ వదిలేసి తాను అలెగ్జాండ్రియా వెళ్తే, రోమన్ ప్రభుత్వం తనను గూర్చి ఏమనుకుంటుంది? తన అధికారాలను రోమన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటే, తాను వీధుల్లో తిరగాల్సిందే!
ఐతే, తన భార్య- పుల్వియా చాలా తెలివిగలది. ఆమె తన స్థానాన్ని కంటికి రెప్పవలె కాపాడగలదు. తరువాత ఏవౌతుందనేది ఒక లెక్కలోది కాదు. ఈ సుందరి కోసం తాను రుూ వెధవ ప్రపంచ సామ్రాజ్యానే్న వదులుకోలేదా? అందుకని ఎక్కువగా మధనపడకుండానే ఏంటనీ అన్నాడు:
‘‘సరే- రాణీ! నేను అలెగ్జాండ్రియా వస్తాను. కానీ నీతో కాదు. నీతోనే వస్తే, ఇక్కడి నా సేనాపతులు ఏమన్నా అనుకుంటారు. అదీగాక ఇక్కడ ఏదెలా జరగాలో అంతా ఒక పద్ధతిలో పెట్టి, రెక్కలు కట్టుకొని నీ దగ్గర వాలుతాను!’’
క్లియోపాత్రా తల తిప్పింది. ఏంటనీ ఆమెను సాగనంపాడు.
సీజర్ మరణానంతరం నీరు లేక ఎండిపోయిన లత, ఇప్పుడు ఏంటనీ సమాగమంతో తిరిగి పుష్పించింది. జీవమే లేనట్లు కనిపించే తమ రాణి, ఇప్పుడు ఏంటనీనీ కలుసుకొని తిరిగి వచ్చాక నిండు యవ్వనంతో, ఉత్సాహంతో, ఉజ్వలంగా ఉన్నందుకు ఆమె మంత్రులందరూ ఆశ్చర్యపడ్డారు. రోమ్‌వల్ల తమకు ప్రమాదం ఉండబోదనీ, తమ రాణి ఒక రాజును గెలుచుకొని ఉండాలనీ వారు తేలిగ్గా ఊహించారు.
క్లియోపాత్రా చిన్న తమ్ముడు, ఆమెకు భర్తగా ఉంటున్నవాడు- కొద్ది రోజుల క్రితమే మాయమయ్యాడు. వాడు బహుశా సజీవుడిగా వుండి ఉంటాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే, టాలమీ వంశంలోని రాకుమారులు, సింహాసనార్హత ఉన్నవారూ ఏ క్షణాన ఏ విధంగా రుూ లోకాన్ని విడిచిపోతారో ఎవ్వరికీ తెలియదు. భర్తను కోల్పోయినందుకు క్లియోపాత్రా సంతోషించింది. ‘యథారాజా! తథా ప్రజ’ అన్నట్లు ఎవ్వరూ దీన్ని గూర్చి పట్టించుకోలేదు.
టాలమీల వంశవృక్షం శాకాహారి కాదు. అది అనేకమంది రాచబిడ్డల రక్తమాంసాలను ఆహారంగా తీసుకొని పెరిగింది. ఈనాడు మరొక వంశీకుడు బలైపోయినందుకు ఎవ్వరికీ విచారం లేదు.
పోతే, నేడు టాలమీ వంశ వృక్షానికి మిగిలిన శాఖలు రెండే రెండు; ఒకటి- ఏడవ క్లియోపాత్రా రాణీ; రెండు- ఆమె కుమారుడు సీజర్ టాలమీ. ముందు రుూ వంశవృక్షంలో మరే యే శాఖలూ ఉండగలవో, ఏయే కుక్కమూతి పిందెలు ఉద్భవించగలవో ఎవ్వరూ ఊహించలేని స్థితిలో ఉన్నారు.
అనుకున్న ప్రకారం పక్షం తిరగమునుపే ఏంటనీ అలెగ్జాండ్రియాకు వచ్చిపడ్డాడు. రాణి ఆయన్ను సకల మర్యాదల్తోనూ ఆహ్వానించింది. తన సర్వస్వమూ ఈ ఏంటనీయేనని ఆమె గాఢంగా విశ్వసించింది.
క్లియోపాత్రా వాగ్దానం చేసినట్లు అలెగ్జాండ్రియాలో ఏంటనీకి ఏ లోటూ కనిపించలేదు. అతని పద్ధతీ, దినచర్యా, వ్యక్తిత్వం- ఒకటేమిటి అన్నీ మారిపోయినవి. పర్షియాను జయించి వశపరచుకుంటే, అక్కడి ధనరాశులేమిటో ఊహించవలసిందే కాని, నిజం ఎవరికీ తెలియదు. కాని, ఇక్కడ రుూ ప్రణయ రంగంలోని యుద్ధమే హాయి! తేలిక! ఈజిప్టులోని రుూ ధనరాశుల్ని విడిచి తాను ప్రయాసతో విశేష జననష్టంతో పర్షియా మీదికి వెళ్లటం అనవసరమనిపించింది.
చాలాకాలంగా విగతజీవిగా వున్న టాలమీల రాజభవనం తిరిగి సజీవమైంది. ఆనందానికి పుట్టినిల్లయింది. విలాసాలూ, వినోదాలూ, ప్రణయాలూ మినహా మరేమీ కనిపించటంలేదు. స్వర్గంలో ఇంతకన్నా ఎక్కువ ఏమైనా ఉంటవనుకుంటే అది బుద్ధిహీనత తప్ప మరేమీ కాదు.
సీజర్ మరణానంతరం క్లియోపాత్రాలో మాతృమూర్తికి తప్పమరి దేనికీ స్థానం లేకపోయింది. ఇప్పుడు, ఆమె జీవితంలోకి ఏంటనీ ప్రవేశించి, రెండవ అంకానికి ప్రారంభోత్సవం చేశాడు. ఇప్పుడామె మాతృత్వానికి దూరమైంది. ప్రణయమూర్తిగా మారిపోయింది. రాజకీయాలను పట్టించుకోవటం లేదు. పరిపాలన జరిపేందుకు మంత్రులున్నారు. అతి ముఖ్య విషయాలను కూడా ఆమె వాయిదా వేస్తోంది.. ఎందుకంటే, పధ్నాలుగేళ్ళు మనసులో ఆరాధించిన స్వామి నుంచి, ఈనాడు అనుభవాన్నంతా వడ్డీతో సహా లాక్కునేందుకు చేజిక్కిన సమయాన్ని ఆమె మరోవిధంగా దుర్వినియోగపరచలేని స్థితిలో వున్నది.
రాజభవనంలో ఏంటనీ, క్లియోపాత్రాలు గడిపిన విలాస జీవితాన్ని గూర్చి రాయటమంటే ఒక భారతవౌతుంది. వారికి బైటి ప్రపంచమే లేదు. ఉభయులూ తమకు తాముగా రుూ ప్రణయ సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఏలుకుంటున్నారు. ఇటు ఈజిప్టు క్లియోపాత్రాకు ఒక రాజ్యంగానూ, అటు రోమ్ ఏంటనీకి ఒక సామ్రాజ్యంగానూ తోచలేదు.
ఐతే, ఏంటనీ తన జీవితం, ఇక్కడ- అలెగ్జాండ్రియాలో సుఖమంతవౌతుందని, అక్కడ రోమన్ రాజకీయాలు దుఃఖాంతం అవుతవనీ పొరబడ్డారు. తనకు ప్రపంచం సంగతి పట్టకపోయినా, ప్రపంచానికి అతని సంగతి పట్టింది.
ముఖ్యంగా అతని భార్య పుల్వియా ఏంటనీ దుష్ట జీవితానికి పరితపించింది. మధ్యధరా సముద్రానికి ఒక వొడ్డున ఏంటనీ క్లియోపాత్రాతో కులుకుతూంటే, క్లియోపాత్రా అంత తెలివిగల పుల్వి యా, ఆవలి వొడ్డున గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేదు.
ఏంటనీ సౌందర్యవతులకు దాసుడేనని ఆమెకు తెలుసు. కాని సౌందర్యాన్ని జయించగల తెలివితేటలకు దాసుడవకుండా ఎలా పోగలడు? తాను పర్షియన్ దండయాత్ర కొరకై, ఈజిప్టు సహాయాన్ని అర్థిస్తూ అలెగ్జాండ్రియాలో ఉన్నానని ఏంటనీ రోమ్‌కు వార్తలు పంపుతున్నాడు. ఐతే, రోమన్ ప్రభుత్వ వేగులవాండ్రూ, పుల్వియా చారులూ నిజాన్ని నిజంగానే చేరవేశారు.
ఒకవైపు పుల్వియా, మరోవైపు రోమన్ ప్రభ్వుమూ, ఏంటనీని వెంటనే రోమ్‌కు తిరిగి రమ్మని మనిషిమీద మనిషిని పంపారు. కాని ఏంటనీ రుూ సుఖ సౌఖ్యాలను వదులుకునేందుకు ఇష్టపడక ఇదిగో, అదిగోనని గడుపుతున్నాడు. రోమ్‌లోని భార్యాబిడ్డల్ని కూడా అతను మరిచిపొయ్యాడు.
ఇక లాభం లేదని పుల్వియా తేల్చుకుంది. తన భర్తను రోమ్‌కు ఎలాగైనా సరే లాక్కురావాలి అంటే ఇక్కడ వొత్తిడి పెరిగి, ఏంటనీకి రోమన్ ప్రభుత్వంలో మరి స్థానం లేదనే పరిస్థితి వచ్చే దాకా చేస్తే, ఆ వేడికి కాని అతను క్లియోపాత్రా బిగి కౌగిలినుండి ఊడిరాడు.
అందుకని పుల్వియా అంతర్యుద్ధాన్ని జరిపించసాగింది. అంటే ఆక్టోవియన్ మీద ఆమె చేసిన తిరుగుబాటుతో, లోగడ జరిగిన సంధి షరతుల్ని అక్రమంగా అతిక్రమించినట్టయింది. ఇప్పుడు ఏంటనీ రోమ్‌కు ఆఘమేఘాలమీద పరుగులెత్తి, ముందు ఆక్టోవియన్‌తో రాజీపడకుంటే, అతనికి రోమ్‌లో కాలుపెట్టే హక్కు కూడా ఉండదు.
రోమ్ నుంచి వచ్చే వార్తలు రోజురోజుకూ భయంకరంగా ఉంటూన్నవి. పుల్వియా, రోమన్ ప్రభుత్వ సేనల తాకిడికి పలాయనం చిత్తగిస్తోంది. ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. కుట్రదారులందరూ హతమారి రెండు సంవత్సరాలు దాటాక కూడా ఇటలీలో శాంతి భద్రతలు లేకుండా, ఈ అంతర్యుద్ధాలేమిటని వారు అసంతృప్తి చెందుతున్నారు. దీనికంతకూ ఏంటనియే కారణమనీ, ఏంటనీ దేశద్రోహి అని కూడా ఒకప్రక్క ప్రచారం సాగుతోంది.
పుల్వియా యుద్ధంలో అపజయం పొంది, గ్రీస్‌కు పారిపోయింది.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు