డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతే సీజర్‌కు రాక మునుపు పూర్వమే ఈజిప్టులో రోమన్ సైన్యాలు స్థావరాల్ని ఏర్పరచుకొని, కొంత దేశాన్ని ఆక్రమించుకొని ఉన్నవి. వారు తమ దేశస్థులతో కలుస్తారా, లేక ఈజిప్టు పక్షమే ఉంటారా అనేది తేలవలసి వున్నది.
లోగడ పాంపేను సంహరించినపుడు ఒక్క రోమన్ సైనికుడూ అభ్యంతరం చెప్పి ఉండలేదు. అలాంటప్పుడు సీజర్‌ను చంపుతే మాత్రం వాళ్ళకేం? వాళ్లు ఈజిప్టులోనే స్థిర నివాసాల్ని ఏర్పరచుకొని, ఇక్కడే పెళ్లిళ్ళు చేసికొని హాయిగా సంసారాలు చేస్తున్నారు. ఇపుడు పోరాటానికి వారు సోమరులైపొయ్యారు. ముఖ్యంగా వారి నాయకుడు అఛిలాస్ ఇంతవరకూ ఈజిప్షియన్ ప్రభుత్వపక్షమే వహిస్తున్నాడు.
తీరా యుద్ధం ప్రకటించబడితే ఎలా వుంటుందో చూడాలి. అంతగా అతను తిరగబడితే, అతన్ని నొక్కివేయటం ఈజిప్షియన్‌లకు అంత కష్టమైన పని కాదు. పోతే రోమన్ ఆక్రమిత సిరియానుంచి రోమన్ సైనికులు రావటానికి కాలయాపన జరుగుతుంది. వారు అలెగ్జాండ్రియా రేవులో దిగకుండానే చూడవచ్చు. అసలు ఈలోగా ఇక్కడంతా నేలమట్టమైతే, ఈ సంగతి తెలసుకోగానే ఈజిప్టు గడ్డమీద కాలు మోపి, ఇక్కడే తమ సమాధుల్ని ఏర్పరచుకునేందుకు ఎవరు సాహించగలుగుతారు?
రాత్రి పొందిన దివ్యానుభూతుల్ని తలుచుకుంటూ పడుకున్నాడు సీజర్! ఒకపక్క తన మీద తిరుగుబాటు జరుగుతోందనే ఊహకు కూడా ఆయన బుర్రలో తావులేదు. తాను సృష్టించుకొన్న రుూ కొత్త ప్రపంచం శాశ్వతమనుకున్నాడాయన.
కాని, రాజకీయాలోచన మందిరం నుంచి తన సేనానులు నిమిషానికొక వార్తావహుణ్ణి పంపుతూనే ఉన్నారు. ‘ఇదిగో వస్తున్నా! అదిగో వస్తున్నా!’ అని ఆయన విసుక్కుంటూనే కాలయాపన చేశాడు. మొత్తంమీద కలలన్నీ కరిగిపోగా, బారెడు పొద్దెక్కాక కాని, ఆయన ఆలోచనా మందిరాన్ని జేరలేదు.
అక్కడ సేనానులు చాలా ఆందోళనతో ఉన్నారు. ఒక్కరి మొహంలోనూ నెత్తురున్న సూచనలు లేవు. తన రుూ కొత్త అనుభవంతో, కనీసం పది సంవత్సరాలు వయసులో వెనక్కు వచ్చినట్లూ, ఆనందంతో గాలిలో తేలిపోతూన్నట్లూ ఉంది సీజర్‌కు. తన వలెనే రుూ ప్రపంచమంతా ఆనంద డోలికల్లో ఊగిసలాడుతోందని ఆయన భ్రమించాడు. ఇప్పుడు రుూ వాతవారణాన్ని చూసేప్పటికి, ఏదో నగ్నసత్యాన్ని ఎదుర్కోబోయే సాహసాన్ని ఆయన వెదుక్కోసాగాడు.
‘‘కొంప మునిగింది సీజర్’’ అన్నాడు సర్వసేనాని. ‘‘ఈజిప్షియన్లు పెద్ద తిరుగుబాటుకు సిద్ధపడుతున్న వార్తలు వస్తున్నవి’’.
ఈ మాటలతో సీజర్ భయాన్ని వెల్లడిస్తాడనుకున్న వారందరికీ నిరాశ కలిగింది.
ఆయన చిరునవ్వు నవ్వాడు.
‘‘తిరుగుబాటుదేనికి? ఏమైంది?’’ అన్నాడాయన.
సేనానాయకులు ఒకరి మొహలు మరొకరు చూసుకున్నారు. సీజర్ నిజంగానే ఏమీ తెలియక అడుగుతున్నాడా? లేక తెలిసినా, తెలియనట్లే నటిస్తున్నాడా? ఇక రుూ డొంక తిరుగుడు పద్ధతి పనికిరాదని తెల్సుకొని సర్వసేనాని హెచ్చరిక చేసి సూటిగా చెప్పసాగాడు. ‘‘సీజర్! పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, తననెరూ చూడలేదనుకొంటుందనే సామెతల్లేవున్నది. తెల్లవారకముందే అలెగ్జాండ్రియా పట్టణమంతా మీరు క్లియోపాత్రాతాతో ప్రణయ కలాపాల్లో మునిగి ఉన్నారనే వార్తతో అట్టుడికినట్లు ఉడికిపోయింది. ప్రజలు మండిపడుతున్నారు. టాలమీ ప్రభుత్వం నిన్నటిదాకా మనతో సుముఖంగా ఉన్నది. మనతో రాజీపడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఈనాడు మన సమాధులు ఈజిప్టులోనే నిర్మించబడుతవని ప్రకటిస్తోంది. మనను నమ్మకద్రోహులుగా ముద్రవేసింది’’.
పెద్దగా, హాలు మారుమ్రోగేట్లు నవ్వాడు సీజర్.
ఈయన ధోరణి ఎవ్వరికీ అర్థంకాకుండా వున్నది. నిప్పుతో చెలగాటాలాడుతున్న సంగతి ఆయనెందుకు గ్రహించడు?
‘‘సింహంమీదికి చిట్టెలుకలు దూకుతే?’’ అన్నాడు సీజర్.
తాను చేసింది తప్పనీ, అవినీతనీ బాధపడేందుకు మారుగా, అధికారం చేతుల్లో ఉన్నది కదానని, అన్యాయమే న్యాయమని ఆయన అందర్నీ నమ్మించేందుకు ఎందుకు వృథా ప్రయాసపడతాడు? సేనానులు రుూ విచిత్ర వ్యక్తిని చూసి అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి సహనం కూడా అంతరించింది.
‘‘బోనులో పడిన సింహంమీదికి, చిట్టెలుకలు కూడా దూకుతవి!’’ అన్నాడు సర్వసేనాని; ‘‘మనం కావాలని గొంతుకు ఉరిబోసుకుంటున్నాం. దేశం కాని దేశంలో యాచనకైవచ్చిన మనకు ఎలాంటి మర్యాద జరగాలో దాని రూపమే మారిపోయింది సీజర్! ముందసలు మనం బతికి బైటపడే మార్గం ఆలోచించండి. ఈజిప్టులో పరాభవమైనా, అపజయమైనా, మనం ఈ ప్రపంచంలో మరి దమ్మిడీకి మారం. మనను రోమన్‌లు సైతం పిచ్చికుక్కల్ని తన్నినట్లు తన్నుతారు. మీరు కొంచెం ప్రశాంతంగా ఆలోచించాలి. చాలా క్లిష్టపరిస్థితుల్లో పడ్డాం. ఇదేం చదరంగం కాదు!’’
తాను క్లియోపాత్రాతో చదరంగం ఆడుతూ ఆడుతూ, సేనానుల వొత్తిడివల్ల తిరిగి వచ్చాడు. ఇప్పటిదాకా వేడుకకు ఆడే చందరంగంవలెనే ఇంతవరకు భావించాడు. కాని ఇప్పుడా పొరలు విచ్చిపోయినవి. యుద్ధరంగంలో రొమ్మిచ్చి బాణాలకు ఎదురెళ్ళిన రుూ సేనానులే భయపడుతున్నారంటే, గొప్ప ప్రమాదమే ఎదురవుతోందని గ్రహించాడాయన.
ఏమీతోచక చాలాసేపటిదాకా హాలులో చిరాకుగా పచార్లు చేశాడు. ఏ క్షణంలో ఏ ఊహ వచ్చిపడి చటుక్కున ఆగిపోయి తెలివిగా రుూ వలలోంచి తప్పించుకొనే మార్గం చెపుతాడోనని, సేనానులు ఆతృతగా ఆయన వైపు చూస్తున్నారు.
కానీ సీజర్ బుర్రలో ఇపుడు ఈజిప్టు లేదు. రోమ్ అంతకుముందే లేదు. తానూ, క్లియోపాత్రా ప్రశాంతంగా ప్రణయ సామ్రాజ్యంలో విహరించగల అవకాశాలకోసం ఆయన వెతుకుతున్నాడు. తామిద్దరూ ఏ దూర తీరానికైనా పారిపోయి, ఏ అడవుల్లోనో పర్ణశాలలోనో రుూ సమస్యలకు దూరంగా బతకగలుగుతే చాలు. ఈ ఒక్క వరం కోసం ఆయన తాను గెలుచుకున్న రోమన్ సామ్రాజ్యాన్ని కూడా త్యాగం చేయగలడు. ఇప్పుడు తనతో వున్న మొత్తం సైన్యాన్ని ఆహుతిచ్చయినాసరే, క్లియోపాత్రాను దక్కించుకుంటే చాలనుకున్నాడు. ఐతే తన మనసులోని భావాల్ని ఇతరులెవ్వరూ గమనించేందుకు వీల్లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
భరించలేని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడాయన. ‘‘ఆక్రమిత ఈజిప్టులోని మన రోమన్ సేనాని అఛిలాస్‌కు కబురంపి, రోమన్ సైనికులందరితోనూ వెంటనే హాజరుకమ్మని నా ఆజ్ఞగా చెప్పండి’’.
సర్వసేనాని నవ్వాడు. సీజర్ ఆజ్ఞలకు నవ్వే సందర్భాలు కూడా ఉంటవని చరిత్రలో మొట్టమొదటిసారి రుజువైంది. సీజర్ దిమ్మెరపోయాడు.
‘‘ఏమిటి నీ ఉద్దేశ్యం?’’’ అని గర్జించడాయాన. ఇప్పుడిప్పుడే తిరిగి పూర్వపు సీజర్‌గా మారుతున్నాడు. ఆకాశపుటంచుల్లోంచి దిగివచ్చి, ఇపుడు భూమిమీద కాలూనుతున్నాడు.
‘‘నా ఉద్దేశ్యంతోనూ, మీ ఉద్దేశ్యంతోనూ ప్రపంచం నడుస్తోందని భ్రమించకండి సీజర్ మన రక్షణను గూర్చి నేను తక్కువ జాగ్రత్తలు తీసుకోలేదు. నిన్ననే అఛిలాస్‌కు కబురుచేశాను. అతను ఇక్కడికి వచ్చేందుకు నిరాకరించడమే గాక, తాను ఈజిప్టుకు ద్రోహం చేయలేననీ, ఈజిప్టు రక్షణార్థం, దాని స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకోసం తానూ, తన సైనికులూ స్వదేశస్థుల్ని కూడా ఎదుర్కొని, చివరి రక్తకణం వరకూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామనీ, ఇకముందు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి, తనకు కబుర్లు పంపవద్దనీ హెచ్చరించాడు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు