డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘క్లియోపాత్రా రాణి తమకీ కానుకను పంపింది!’’ అన్నాడు బానిస తల వొంచుకొని.
‘‘క్లియోపాత్రా రాలేదా?’’ అన్నాడు సీజర్.
‘లే’దన్నట్లు బానిస తల తిప్పాడు.
‘‘నినె్నవరు లోపలికి రానిచ్చారు? ఈ కానుకలను స్వీకరించే తీరిక నాకెక్కడున్నది?’’ అని ఆయన విసుక్కున్నాడు.
బానిస లెక్క చేయలేదు. మాట్లాడకుండా తివాసీకి కట్టిన కట్టు విప్పాడు. లోపలున్న క్లియోపాత్రా ఇది గ్రహించి, నాటకరంగంమీద తన పాత్రాభినయానికి సిద్ధపడుతోంది. ఇంతవరకూ కొంచెం ఇరుకుగా వున్న చోటునుంచి తాను విశాలంగా వున్న తావులోకి రాబోతోంది కనుక వొళ్లు విరుచుకుంది.
సీజర్ లాంటి జగత్ప్రసిద్ధ పురుషుని ముందు నిలబడేందుకు ఆమెకు నిజానికి ఎంతో భయంవేసి ఉండవలసింది. కాని, తాను అన్నింటికీ తెగించాననీ, ఈ తుది ప్రయత్నంలో తాను ప్రాణాల్ని కోల్పోయేందుకు కూడా సిద్ధపడ్డాననీ ఆమె నమ్మటంవల్ల, మిగతావన్నీ అల్ప విషయాలుగా ఆమెకు తోచినవి.
‘‘ఏరా! బానిసా! మాట్లాడవేం?’’ అని సీజర్ గర్జించాడు.
బానిస జవాబు చెప్పలేదు. రాణిచే ఆజ్ఞాపించబడినట్లుగా తన పని పూర్తయింది కనుక వెళ్ళేందుకు సిద్ధంగా లేచి నిలబడ్డాడు.
సీజర్‌కు ఇదేమీ అర్థంగాక, ఆశ్చర్యంతో తివాసీ వైపు, బానిసవైపూ చూస్తున్నాడు. తివాసీ దానంతటదే విడిపోనారంభించింది. ఒకపక్క ఆ తివాసీ అందాన్ని చూస్తూ ఆశ్చర్యపడుతున్నాడు. మరోపక్క ఇంద్రజాలానికి లోబడిపోయినట్లు చుట్టూ తిరుగుతూన్న తివాసీని చూసి ఆశ్చర్యపడుతున్నాడు.
ఒక్క క్షణంలో ఈ తివాసీలో ఏదో మోసం ఉన్నదన్న ఊహ ఆయనకు కలిగింది. బహుశా ఏదైనా ప్రమాదం కూడా దాగి ఉండొచ్చు. ఎందుకైనా మంచిదని ఆయన రెండడుగులు వెనక్కు వేసి, కత్తిమీద తన కుడి చేతిని సిద్ధంగా ఉంచాడు.
తివాసీ పూర్తిగా విప్పుకున్నది. సువిశాలమైన ఆ తివాసీమీదనే అందాల బరిణె, క్లియోపాత్రా మెల్లిగా లేచి నిలబడింది. ఇప్పుడే పుష్పించి పుష్పంలోంచి అందాలు చిందే సీతాకోక చిలుక రెక్కలు విప్పుకొని ప్రపంచాన్ని చూసేందుకుగాను సిద్ధపడ్డ స్థితిలో ఎలా వుంటుందో, క్లియోపాత్రా రుూ భంగిమ అలాగే ఉన్నది. సీజర్ క్షణంసేపు శిలాప్రతిమయ్యాడు. కుడిచేయి దానంతటదే కరవాలంమీదినుంచి జారిపోయింది.
ఈమె నిజంగా జగదేకసుందరే! తాను క్లియోపాత్రా గూర్చి విన్నదానిలో ఏదీ అతిశయోక్తి కాదు. తాను ఊహించలేనంత అందచందాలు ఈమెలో కన్పిస్తున్నవి. ఈమె ఈజిప్షియనంటే ఎవరు నమ్ముతారు? రోమన్ అంటే ఎవరు నమ్మరు?
సీజర్ ఊహకు చప్పున అంతరాయం కలిగింది. ఈ రాజప్రసాదంలో తనకు రక్షణ ఎక్కడున్నది? విచ్చుకత్తులతో ఫారాకాస్తున్న కాపలావాళ్ళు పేరుకు మాత్రమే ఉన్నారు. వాళ్ళు మెడకాయలమీద తలకాయ వున్న ప్రతివారినీ లోనికి ఎందుకు పంపుతున్నారు? ఈ తివాసీలో క్లియోపాత్రా కాకుండా ఏ బలాఢ్యుడన్నా విచ్చుకత్తులతో ముందుకు దూకినట్లయితే ఏమయ్యేది!
ఆయన వెంటనే గంట వాయించాడు
బైట ఆజ్ఞల కొరకై వేచివున్న ఇద్దరు రాజోద్యోగులు వెంటనే ప్రవేశించారు.
క్లియోపాత్రా భయపడిపోయింది. సీజర్ తన ఈ పద్ధతికి నవ్వుకుంటాడనీ, తనను సానుభూతితో చూస్తాడనీ ఆమె ఆశించింది. కాని, ఎప్పుడైతే రాజోద్యోగులకోసం గంట వాయించాడో, తనను బంధించమని ఆజ్ఞలిస్తాడని ఆమె గ్రహించింది. నాకు ఇప్పుడు చేసేది మాత్రమేమున్నది? సింహం గుహలోకి వెళ్ళనే కూడదు, తీరా వెళ్ళక ఎందుకైనా సిద్ధపడే ఉండాలి.
ఆమె ఆశాజ్యోతి చడీ చప్పుడూ లేకుండా దానంతటదే ఆరిపోయింది, తాను పన్నిన వలలో తానే చిక్కుకుంది. నిలబడి ఉన్న క్లియోపాత్రా క్షణంలో నీరైపోయి గడ్డకట్టి మద్దగా మారినట్లయింది.
రాజోద్యోగులు సీజర్ ఆజ్ఞలకు వేచి ఉన్నారు.
‘‘బంధించండి!’’ అన్నాడు గర్జించినట్లు.
రాజోద్యోగులు క్లియోపాత్రాను చూసి, ఆమె సౌందర్యానికి ఒక్కసారిగా మూర్ఛిల్లినట్లయి ఎలాగో నిలవత్రొక్కుకున్నారు. ఈమెను బంధించడమా, మానవటమా వాళ్లు తేల్చుకోలేదింకా.
‘‘బైట సింహద్వారం దగ్గిర కాపలా వున్న నాయకుణ్ని బంధించండి. కాపలా వాళ్లను మార్చండి. మీ నాయకుడి ప్రాణానికి రక్షణ కావాలి! నా గదిలోకి ఎవర్నీ పంపవద్దు.. వెళ్ళండి!’’ హూంకరించాడు సీజర్.
ఉద్యోగులు వొళ్ళు దగ్గిరించుకొని మరీ జారుకున్నారు.
మృత్యుదేవత మొహంలో నవ్వి, పలకరించి, ఉత్సాహాన్ని అందించి, క్షణంలో మాయమైనట్లు తోచింది క్లియోపాత్రాకు. ఈ కుదుపునుంచి తట్టుకునేందుకు ప్రయత్నిస్తూ. ఇప్పుడిప్పుడే కొత్తగా ధైర్యాన్ని పొందుతూ తన చుట్టూ వున్న వాతావరణాన్ని ఆమె పరిశీలించసాగింది. ముఖ్యంగా సీజర్‌ను కన్నులెత్తి నిశితంగా చూడగల నిబ్బరం ఆమెకు ఇప్పుడే కలిగింది.
చేయి పైకెత్తితేగాని అందని విగ్రహం! ఏ రోమన్ దేవతా విగ్రహమో ప్రాణం పోసుకుని కొన్నాళ్లపాటు భూమి మీద తిరిగేందుకు వచ్చిందేమో ననిపించేట్లున్నాడాయన. తలమీద వెంట్రుకలు లేవు. కోడిగుడ్డల్లే ఉన్నది. ముసలితనం తన ఛాయల్ని ఆయన ముఖంమీద విస్తరింపజేస్తోంది. కాని, దాన్ని లెక్క చేయవలసిన పనిలేదన్నట్లు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడా అనిపిస్తోంది.
వయసుతో నిమిత్తం లేని ఉత్సాహం, జీవకళ, వేగం ఆయనలో ప్రతిఫలిస్తున్నవి. తాను కలలుగన్న పురుషుడే, ఈయనని క్లియోపాత్రాకు అనిపించింది.
ఇంతవరకూ భయం కొట్టుకొనే ఆమె హృదయం, ఇప్పుడు అపారమైన అనురాగంతో వేగంగా కొట్టుకోసాగింది. నిజానికి సీజర్‌ను మోసం చేసి, తన సౌందర్యంతో ఆయన కన్నులు కప్పాలని ఆమె అనుకున్నది. ఇప్పుడు ఆ మోసమే సత్యమై, తనను తాను మోసగించుకున్నానని తెలుసుకోగలుగుతోంది. ఎందుకంటే, నిజంగానే తాను సీజర్‌ను మొట్టమొదటి చూపులో గాఢంగా ప్రేమంచానని ఆమె నమ్మింది. ఇక ఆయన తనను ఏలుకుంటే తాను ధన్యురాలవగలదు!
ఆమె ఊహలిలా ఉండగా, సీజర్ ఆమె సౌందర్యానికి చకితుడై, ఆమెకన్న తక్కువగా మాత్రం ఆశ్చర్యపడటం లేదు. ఈ జీవితమంతా తాను చేసిన తపస్సుకు, ప్రాణాల్ని కూడా లెక్క చేయక యుద్ధ్భూముల్లో ముందుకురికిన సాహసాలకు, ఆ దేవతలకే రుణించి రుూ దేవసుందరిని తన దగ్గిరికి పంపారేమోనని ఆయన అనుకుంటున్నాడు. తన చేతుల్లో వున్న అధికారాలన్నిటికీ, ఈనాడే ఎంతో గర్వం కలిగింది. తన జీవితమే ధన్యమైందనే భావం ఆయనలో కలిగింది. కన్నార్పకుండా క్లియోపాత్రా వైపు చూస్తున్నాడాయన!
ఈ విధంగా వారిద్దరూ మాటల్లో ఇమడ్చలేని భావాల్ని చూపుల్తోనే వ్యక్తపరుచుకున్నారు. కొద్దిక్షణాల్లో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ దృక్కుల ప్రభావమేమో కాని, ఒకర్నొకరు పరిపూర్ణంగా ఎరిగి ఉన్నంత స్నేహం వారిద్దరిలోనూ వేళ్లు తన్నుకున్నది.
ఊహా ప్రపంచంలోనుంచి భూమి మీదికి ముందగు సీజరే దిగాడు.
‘‘మహారాణి క్లియోపాత్రా?’’ అన్నడాయన.
తనను ఇట్టే గ్రహించడంవల్ల, తనను తాను పరిచయం చేసుకోవలసిన బాధ తప్పిందామెకు.
‘‘జగదేకవీరుడు- జూలియస్ సీజర్?’’ అన్నదామె.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు