డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా ప్రాణం పోయినా మీకు మాత్రం హాని జరగకుండా చూస్తాను తల్లీ!.. ఎత్తుకుంటున్నాను!’’’
వాడు అతి తేలికగా తివాసీని ఎత్తుకొని, ఆమెకు హాయిగా ఉండేట్లు భుజంమీద జాగర్తగా మోపుకున్నాడు. ఎద్దు మొద్దు స్వరూపం, మోటు మనిషని తలచిన క్లియోపాత్రకు వీడు ఎంత సున్నితంగా తన పని నిర్వర్తిస్తున్నాడో అర్థమైంది.
తివాసీలో ఎంతో సుఖంగా ఉన్నప్పటికీ క్లియోపాత్రాకు నిద్రపట్టలేదు. ఆమె కళ్ళు మూసుకొనే కొత్త కొత్త ప్రపంచాలను సృష్టించుకొని ఆనందిస్తోంది. అంతా తాను ఊహించినట్లే జరుగుతుందని ఆమె నమ్మకం. ఒకవేళ జరగకపోయినా తన కష్టాలకు ఒక అంతమంటూ ఇపుడు ఏదో విధంగా వచ్చి తీరుతుంది.
తాను ఏలిక ఐనప్పటికీ, స్వదేశానికి అతి రహస్యంగా వెళ్ళవలసిన దుర్గతి పట్టింది. ఈజిప్టులో తన మీద ప్రజలు కారాలూ, మిరియాలూ నూరుతున్నారు. తననెవరైనా చూసినట్లయితే, దేశద్రోహిగా చిత్రించబడింది కనుక చంపివేయవచ్చు లేదా ప్రభుత్వోద్యోగులే పసిగడితే తనను బందీగా టాలమీకి అప్పగించవచ్చు.
టాలమీకి తాను చిక్కినట్లయితే, ఇక తన జీవితమంతా అతణ్నే నాధుడుగా పూజించాలి. లేదా ఆత్మహత్య చేసుకోవాలి. తనకు వ్యక్తిత్వమంటూ ఉండదు. టాలమీని భర్తగా అంగీకరించలేకనే కదా, ఇన్నాళ్ళూ అజ్ఞాతవాసంలో గడిపింది! టాలమీ భార్యగా తనకసలు సీజర్ దర్శనమే దొరక్కపోవచ్చు. తనకు మేలంటూ ఏమన్నాజరుగుతే, సీజర్ ద్వారానే జరగాలి. కనుక తాను సరాసరి సీజర్‌ను దర్శించాలి. అందుకే తివాసీలో దాక్కొని ప్రయాణన్ని సాగించవలసి వచ్చింది. తరువాత.. ఏవౌతుందోననే ఆలోచనలతో ఆమె వేగిపోతూన్నది..
సూర్యోదయానికి నావ ఈజిప్టు తీరాన్ని జేరింది. బానిస తివాసీని జాగ్రత్తగా భుజంమీద ఎత్తుకున్నాడు. తివాసీలో తన ప్రాణమే ఉన్నంత భద్రంగా అతి సున్నితంగా దాన్ని మోసుకొని నడవసాగాడు. చకచకా నడుస్తే, రాణికి శరీరం నొచ్చుతుందేమోనని అదురులేకుండా మెల్లిగా ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నాడు.
రాజభవనం దగ్గిర వాణ్ని అటకాయించారు.
‘‘ఏమిటది?’’ అన్నారు రోమన్ రక్షకులు.
‘‘కనిపించటంలా- తివాసీ!’’
‘‘ఐతే?’’’
‘‘ఇది మా రాణి క్లియోపాత్రా, జూలియస్ సీజర్ ప్రభువుకు కానుకగా పంపింది. వారికి అందజేయాలి’’.
‘‘అలాగా? ఐతే ఇవ్వు.. మేము పంపుతాము’’.
‘‘వీల్లేదు. నేనే స్వయంగా ఇచ్చి, అందినట్లుగా రసీదు కూడా తీసుకొని వెళ్లాలి’’.
రక్షకభటులు విరగబడి నవ్వారు. వారిలో నాయకుడు కలుగజేసుకొని ‘‘వీడితో వాదనేమిటి? ఒరేయ్ కుక్కా! బానిసా! నీ జిడ్డుకారే మొహంతో సీజర్ ప్రభువు దగ్గరికి వెళ్తావా?.. పో బైటికి!’’ అన్నాడు.
తివాసీలోని క్లియోపాత్రా వొణికిపోయింది. రక్షకులు బానిసను తూలనాడినందుకు వాడు ఉద్రేకపడి తివాసీ అక్కడ పడేసి, వాళ్లమీద తిరగబడతాడేమోనని ఆమె భయపడింది. కాని వాడికి శారీరక బలంతోపాటు, కొద్దో గొప్పో బుద్ధిబలం కూడా ఉన్నదని ఆమె త్వరలోనే తెలుసుకుంది.
‘‘మా రాణి పంపిన కానుకను తిరస్కరిచేందుకు మీరెవ్వరు? నేను మా రాణికి బానిసనైతే, మీరు రుూ రోమన్ ప్రభువుకు బానిసలు. నాకన్నా ఏ విధంగా గొప్పవాళ్ళూ?’’ అన్నాడు వాడు.
కాపలావాళ్ళు నోళ్ళుమూసుకోక తప్పలేదు.
‘‘ఆలస్యవౌతోంది.. నాకు దారి వొదలండి!’’ అన్నాడు బానిస, కొంత అధికారాన్ని స్వరంలో మేళవింపజేస్తూ.
‘‘వీల్లేదు.. ఆ తివాసీ అక్కడుంచు, మే పంపుతాం’’ అన్నాడు రక్షక భట నాయకుడు.
‘‘వీల్లేదన్నారుగా! మీకంత అనుమానమైతే, వెంటనే సీజర్ ప్రభువుకు కబురు చేయండి. క్లియోపాత్ర రాణి దగ్గర్నుంచి రాయబారిని వచ్చాడనీ, తమకు కానుక తీసుకొని వచ్చాడనీను’’ అన్నాడు బానిస.
రక్షణ శాఖ వాళ్ళు తమలో తాము తర్కించుకుంటున్నారు. ఈ బానిసను పంపుతే ఏవౌతుందో, పంపకుంటే నేరమే అవుతుందో వాళ్లకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి బానిస చెప్పినట్లే, అనుమతి కోరటానికి ఎవ్వరూ సాహసించలేకోయారు. అయితే ఈ బానిస కానుక తీసుకొని వెళ్తున్నాడు కనుక, అందునా రాణిగారి దగ్గర్నుంచి వస్తున్నాడు కనుకనే, రాజభవన ప్రవేశానికి వీడికొక హక్కున్న ధోరణిలో మాట్లాడుతున్నాడు. చివరకు బానిసను లోపలికి వదిలేందుకే నిశ్చయించుకున్నారు.
‘‘సరే నిన్ను పోనిస్తాము. కాని నీ దగ్గిర ఆయుధాలు ఏమున్నాయ్?’’ అన్నాడు నాయకుడు.
‘‘కైజారొక్కటే వున్నది. అదిక్కడే ఉంచుకోండి. నేను వెళ్ళేప్పుడు తీసుకెళ్తాను’’ అని బానిస తన బొడ్డులో వున్న బాకును లాగి అందించాడు
‘‘వీణ్నొకసారి వెతకండి!’’ ఆజ్ఞాపించాడు నాయకుడు.
ఇద్దరు భటలు చప్పున వాణ్ని తడివి చూసి, ఇంకే ఆయుధమూ వాడి దగ్గర లేనట్లు తేల్చారు.
‘‘ఆ తివాసీ కూడా విప్పు.. చూసి పంపాలి!’’ అన్నాడు నాయకుడు.
క్లియోపాత్రాకు ముచ్చెమటలు పోసినయ్. ఐతే ఈ ప్రమాదాన్ని కూడా బానిస ఎదుర్కొన్నాడు.
‘‘వీల్లేదు. ఇది సీజర్ ప్రభువుకు ఉద్దేశించబడిన కానుక. మీ ప్రభువుకు సంబంధించిన కానుకలమీద చేతులు వేసే ధైర్యం మీలో ఎవరికున్నదో ముందుకు రండి!’ అన్నాడు వాడు.
నాయకుడు కూడా అదిరిపొయ్యాడు. ఏం చేసేందుకూ అతనికి తోచలేదు.
‘‘తివాసీయేగా!’ అన్నాడొక భటుడు పరిశీలనగా చూస్తూ.
‘‘అంతకన్నా ఇందులో ఏముండేందుకూ వీల్లేదు. చాలా విశాలమైంది కావటవంల్ల చాలా పెద్ద చుట్టగా తయారైంది!’’ అని మరో భటుడు సమర్థించాడు.
‘‘నన్నిలా నిలబెట్టటం మీ ప్రభువుకు అపచారం చేయటం!’’ అన్నాడు బానిస.
వీడు లోపలికి పోయి తమమీద ఏం వాగుతాడోననే భయం నాయకుడికి కలిగింది. అందుకని ఒక పక్కకోపంతోనో ‘‘పోరా బాబూ! పో!’’ అన్నాడు.
క్లియోపాత్రా ఈ బానిస కౌశలానికీ, విశ్వసానికీ అచ్చెరువొందింది. వీణ్ని ఏ విధంగా సత్కరించటమా అని ఆలోచిస్తోంది.
బానిస విశాలమైన మెట్లెక్కి వెళ్లాడు. అక్కడ కూడా విచ్చుకత్తులతో ఫారా ఉన్నది. వాళ్ళు సింహద్వారం దగ్గిరున్న ఫారావాళ్ళకు సైగ చేశారు. సింహద్వారం దగ్గిరున్న నాయకుడు లోపలికి పంపమని సౌంజ్ఞ చేశాడు. బానిసను ఎవరూ అడ్డగించలేదు. వాడు సరాసరి సీజర్ వున్న విశాలమైన గదిలోకి జొరబడ్డాడు.
ఆ గదంతా చాలా చక్కగా అలంకరించబడి ఉంది. ఒక పక్క దేశ పటాలూ, మరోపక్క దస్తరాలూ, ఇంకోవైపున విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా మంచం వేసి ఉన్నవి. సీజర్ ఒక్కడే కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. బానిస తన గదిలోకి ప్రవేశించిన విషయం కూడా ఆయన గమనించలేదు. ఉన్నట్లుండి తన గదిలోకి ఎవరో జొరబడినట్లు అనుమానం వేసి చప్పున తల ఎత్తి నలువైపులా చూశాడు.
బానిస మెల్లిగా తివాసీని కిందకు దింపి చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
సీజర్ ‘ఎవరూ?’ అన్నాడు గంభీరస్వరంతో.
ఈ స్వరం సీజర్‌దేనని క్లియోపాత్రా గ్రహించింది. రోమన్ రాజసమంతా ఆ కంఠస్వరంలో తొణికిసలాడింది. గొంతును బట్టి మనిషిని ఊహించుకుని, ఈ పురుషోత్తముని ముందు తానెంత అల్పురాలోనని ఆమె గ్రహించుకుంటోంది.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు