డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా కాకుండా టాలమీ ఆధిక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నించటంతో ఆమె క్షణంలో తన నిశ్చయాన్ని మార్చుకోవలసి వచ్చింది.
ఇప్పుడు తాను ఈజిప్టుకు వెళ్తే, తాను ఓడిపోయినట్లే అవుతుంది. ఈ సంవత్సరం పాటు అనేక కష్టనష్టాల్ని భరించింది ఇందుకేనా? పైపెచ్చు తీరా ఈజిప్టు వెళ్లాక, తనను దేశద్రోహిలాగా విచారణ చేసినట్లయితే, తనకు మరణదండన తప్పదు.
ఈజిప్టు అంటే ఒక్క టాలమీయే కాదు. టాలమీ తనను మనసారా ప్రేమిస్తున్నంత మాత్రాన, అతని ప్రభుత్వం, ప్రభుత్వాధికారులూ, ఈజిప్టు ప్రజలూ తనను క్షమిస్తారని ఏమిటి? కనుక తాను తిరిగి వెళ్లటం ఏ విధంగానూ క్షేమకరం కానేరదు. ఈజిప్టు వెళ్తే అధికారంతో వెళ్లాలి కాని లొంగి మాత్రం కాదు.
ఈ ఆలోచనలతో క్లియోపాత్రా కళ్ళనుంచి అగ్నికణాలు రాలినవి. క్షణంలో ఆమె ముఖం ఏర్రబడింది.
‘‘రాయబారివి కనుక వదిలేస్తున్నాను. ఇక ఈజిప్టు నుంచి ఏ రాయబారులూ నా కొరకై రానవసరం లేదు’’ అన్నదామె.
క్లియోపాత్రా ఇచ్చిన జవాబుతో అందరూ నిరాశపడ్డారు. తమ రాణికి ఎదురు చెప్పే సాహసం ఆ క్షణంలో ఎవ్వరికీ లేకపోయింది. తలలు వేళ్ళాడవేసిన అనుచరుల్ని ఒక్కసారి చూసి, చర్చలకు అవకాశమంటూ ఇవ్వకుండా ఆమె తన డేరాకు వెళ్లిపోయింది.
ఆ లోపల ఆమె ఎంత కుమిలిపోయిందో, ఎంత దుఃఖపడిందో రెండు రోజులవరకూ ఎవ్వరికీ తెలియదు. లోపల ఆమె వున్నదో ఆమె శవమే ఉన్నదో కూడా ఎవ్వరూ ఊహించలేకపోయారు.
మూడోనాడు మనస్సు రాయి చేసుకొని, ఆమె బైటి ప్రపంచాన్ని చూసేందుకు సాహసించింది. ఈజిప్టు ప్రభువు టాలమీ ఆజ్ఞాపత్రంలో విషయాల్ని గూర్చి ఆలోచించాక సైనికులందరికీ క్లియోపాత్రా మీద సానుభూతి కలిగింది. ఎందుకంటే, ఆమెతోపాటే వారు కూడా బానిసలుగా ఈజిప్టు గడ్డమీద కాలుమోపేందుకు నిరాకరిస్తారు. తమకు ఈజిప్టులో ఎలాంటి మర్యాద జరగగలదో వారు ఊహించగలిగారు. అందుకే ఇన్నాళ్ళూ తమను కడుపులో పెట్టుకొని కాపాడుతూన్న రాణికి ద్రోహం చేయలేని స్థితిలో పడ్డారు. ఈ విధంగా తనమీద తనకు కలిగిన జాలితోపాటు, క్లియోపాత్రా ఇతరుల సానుభూతిని కూడా సంపాయించగలిగింది.
ఆ రోజే సైనికులందరూ తమ ఆయుధాల్ని తమ రాణి కాళ్ళముందుంచి, తమ శరీరాల్లోని చిట్టచివరి రక్తకణం వరకూ ఆమె కొరకై పోట్లాడుతామమని బాస చేశారు. ఆమెకు తన అనుచరులమీద ఇప్పుడు గాఢమైన నమ్మకం కలిగింది.
తాను చేసింది పొరపాటు అని గత రెండు దినాలూ ఆమె ఎంతో మధనపడింది. ఇప్పుడు ఒక్కరూ తనను ఎదుర్కోలేదు. అందుకని తాను సరైన మార్గానే్న అనుసరిస్తూన్న ఆత్మవిశ్వాసం కలిగింది.
ఇదివరకల్లే తననెవ్వరూ ఈర్ష్యతో చూడటంలేదు. రాజ్యాన్ని కోల్పోయి, నానా అవస్థలూ పడుతున్నందుకే ప్రతివారికీ తనమీద సానుభూతి ఏర్పడింది. తన రుూ జీవితాశయం నెరవేరగలదనే ఆశైతే లేదు కాని, కనీసం రుూ సమయంలో దాన్ని వదులుకోవలసిన దుర్గతి మాత్రం పట్టలేదు.
ఇక జరగబోయేదేమిటో తెలిసినప్పుడు, తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఏ క్షణాన ఈజిప్షియన్ సైన్యాలు వచ్చి మీద పడతాయో తెలియదు. ఎవ్వరికైనా మంచిదని ఆమె సైనికులకు తగిన హెచ్చరికలు చేసింది. ఇన్నాళ్లవలె గాక, ప్రతివారూ ప్రాణభయంతో చాలా మెలకువగా ఉన్నారు.
రోమ్ నుంచి వినవస్తున్న వార్తలు కూడా ఆమెకు ఆశాజనకంగా లేవు. తిరిగి పాంపే సర్వాధికారి కాగలుగుతే, తాను రోమ్ వెళ్లి, అతని కాళ్ళావేళ్లాపడి, ఈజిప్టుకు రాణిగా తిరిగి వెళ్లాలని కలలుగన్నది. కానీ, పాంపే రోమ్‌లో ఉండటం లేదు. యుద్ధ్భూమిలోనే ఆయన మకాం. ఇప్పుడు జరిగేది అంతిమ పోరాటమనీ, రుూ దెబ్బతో రోమ్ సర్వాధికారాలు తేలిపోగలవనే వార్తలు వస్తూన్నవి. ఐతే క్లియోపాత్రాకు పాంపే వీరత్వంమీద ఎంతో నమ్మకమున్నది. అతను అజేయుడని ఆమె విశ్వాసం.
కష్టాలకు తానెంతో అలవడిపోయింది. కొత్తగా జరిగిన మార్పులంటూ ఏమీ లేవు. రోజుల్ని దొర్లించటం ఒక్కటే మిగిలింది.
ఈ విధంగా ఆరునెలలు గడిచింది.
ఒకనాడు రోమ్ నుంచి వచ్చిన వార్తావహుడు తెచ్చిన అశనిపాతంలాంటి వార్తల్లో ఆమె ఆశలన్నీ అడుగంటినవి. గ్రీస్‌లో జరిగిన అంతిమ పోరాటంలో పాంపే పూర్తిగా ఓడిపోయాడు. జూలియస్ సీజర్ విజయాన్ని పొందాడు. పాంపే ప్రాణాల్ని రక్షించుకునే నిమిత్తం కొద్దిమంది సైనికులతో ఓడలో బయలుదేరాడు. సీజర్ వెంటాడుతున్నాడు. బహుశా పాంపే ఈజిప్టుకే వచ్చి ప్రాణరక్షణ చేసుకుంటాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.
అజేయుడనుకున్న పాంపే ఓడిపోవటమేమిటి? ప్రతిదీ తనకు చుక్కెదురుగానే ఉన్నది. తాను సహాయపడింది పాంపేకు! ఇక పాంపే నుంచి కలిగే మేలంటూ ఉండదు. ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని పారిపోయిన పాంపే తనలాంటి అనాథను శరణుజొచ్చినా ఆశ్చర్యముండదు.
పోతే సీజర్. సీజర్‌ను గూర్చి తనక్కూడా అంత బాగా తెలియదు. బహుశా ఇరాస్‌కు తెలిసి ఉంటుంది; ఆయన్ను అడిగితే వివరాలు తెలుస్తవి.
కానీ, రుూ సీజర్‌వల్ల తనకు మేలు కలగదు సరిగదా, కీడే జరుగుతుంది. ఎందుకంటే, ఆయన ప్రతిపక్షీయుడు పాంపేకు తాను సహాయపడింది. టాలమీ, సీజర్ శత్రువుకు సహాయపడనందున ఈజిప్టుకు ఇప్పుడు తన తమ్ముడే రాజుగా సుస్థిరమైపోతాడు.
ఎందువల్లనే కాని, ఇన్నాళ్ళూ ఈజిప్టు తన మీద దాడి చేయలేదు. ఇప్పుడు తప్పక దాడి చేసి తననూ, తన సైన్యాన్నీ సర్వనాశనం చేస్తుంది. దీనికి సీజర్ ప్రోద్బలం కూడా ఉంటుంది. సీజర్‌కు కావలసిన సొమ్ము టాలమీ ఇవ్వగలుగుతాడు. తనకు మేలు చేసే ఉద్దేశ్యమంటూ సీజర్‌కు ఏకోశానన్నా ఉన్నప్పటికీ, తనవల్ల ప్రత్యుపకారమంటూ జరగదు కనుక, ఆయన రుూ అనవరపు శ్రమపడడు.
ముందు సీజర్ చరిత్ర వినాలని ఆమె కుతూహలపడింది. ఎందుకంటే తనకు మేలంటూ జరిగితే, సీజర్ ద్వారానే రజగాలి. ఇదే చివరి పాచిక. కనుక వెంటనే ఇరాస్‌ను పిలవనంపింది.
ఆయన రాగానే ప్రణామం జేసి ‘సీజర్ ఎవరు? అతని చరిత్ర తమకు తెలిసినంతవరకూ వివరంగా చెప్పండి’ అన్నది.
ఇరాస్ చెప్పసాగాడు.
‘‘నిన్నమొన్నటిదాకా ఆయన ఒక ప్రసిద్ధ రోమన్ సేనాని. సర్వాధికార వర్గంలో సభ్యుడు. ఈనాడు ఒక్క రోమ్‌కే కాకుండా, ఈ ప్రపంచానికంతకూ ప్రభువు. ఈ అంతిమ పోరాటంలో ఆయన పొందిన విజయమే ఈనాడు ఆయన్ను ప్రపంచ పురుషుల్లో ఒకనిగా చేసింది.
‘‘సీజర్- ఆయన పూరితపేరు జూలియస్ సీజర్. తన కుమార్తెను పాంపేకు ఇచ్చి పెళ్లిచేశాడు. కాని ఆమె చనిపోయింది. అంటే రుూ జరిగిన యుద్ధం మామాఅల్లుళ్ళమద్యనన్నమాట!’’
‘‘ఐతే ఆయన వయస్సు?’’ అన్నది క్లియోపాత్రా.
‘‘దాదాపు యాభై ఏళ్ళుండొచ్చు. ఐతే ఆయనమీద ముసలితనం కనిపించదంటారు. ఆజానుబాహువు. ఏనుగు దంతంవలె తెల్లగా, నున్నగా ఉంటాడట! అతి బలాఢ్యుడు. ఆయన మాట్లడుతూంటే వినబుద్ధి అవుతుందే కాని, ఎదురు మాట్లాడబుద్ధి కాదట! ముఖ్యంగా యుద్ధరంగంలో బల్లేలకూ, బాణాలకూ, కత్తులకూ ఎదురువెళ్తూ ఆవేశంతో సైన్యాన్ని ఉరికించటంలో సిద్ధహస్తుడట!
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు