డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ఆశయాలకూ, కోర్కెలకూ ముడిపెట్టుకోవడం వల్లనే ఆ రెంటికీ సమన్వయం కుదరటంలేదు. తాను రోమన్ నాయకునికి కనీసం ప్రియురాలిగానన్నా శేషజీవితాన్ని గడపటమన్న కోర్కె సఫలీకృతమవుగాక! కాని, తనకు రాజ్యం దక్కదు. రాజ్యాన్ని దక్కించుకోదల్చుకుంటే, తన కోర్కెల్ని బలిపెట్టాలి.
ఇలాంటి సంఘర్షణలతో ఆమె అలిసిపోయింది. తన నింత నీచ స్థితిలో దయారహితంగా తోసిపారేసిన విధిని నిందించింది. అది లాభం లేదని తనను తాను నిందించుకుంది. చివరకు దుఃఖంతో, మనోవేదనతో పక్కమీద బోర్లా పడుకుని, వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
దుఃఖసాగరంలో కొట్టుకుపోతూండగా క్లియోపాత్రా, ఎవరో తట్టి లేపగా చప్పున ఒడ్డునపడినట్లయింది.. చూస్తే ఆయా!
తన కష్టదినాల్లో కూడా తనను విడనాడకుండా, తనకు భాగస్వామినిగా, తోడునీడగా ఉంటూనే ఉందీమె. కనకపోయినా, ఆ పెంచిన ప్రేమ, మాతృప్రేమకన్నా గొప్పదని రుజువు చేస్తూనే వుంది. ఈ ముసలితనంలో కూడా ఆమెకీ కష్టాలేమిటి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణాన్ని తాను తీర్చుకోగలదు?
క్లియోపాత్రాను ఒళ్ళోకి లాక్కుంది ఆయా. చెదిరిపోయిన ముంగురుల్ని సరిదిద్దింది. దుఃఖభారంతో ఎరుపెక్కి వాచిపోయిన కళ్ళను తుడిచింది.
‘‘పిచ్చితల్లీ! ఎందుకమ్మా బాధపడతావు? ఈ రాజకీయాలు నాకైతే అర్థంకావు కానీ, నీవుబాధపడుతూంటే మాత్రం చూడలేను తల్లీ! నిన్ను బాధించిన దుర్మార్గుల్ని నాకు శక్తే వుంటే చీల్చి చెండాడేదాన్ని కదా! ఎందుకమ్మా ఏడుస్తావు?’’ అన్నది ఆయా బుజ్జగిస్తూ.
‘‘నేనేడవటంలేదు ఆయా!.. నిజంగా ఏడవటంలేదు!’’ అంటూనే భోరున ఏడ్వసాగింది క్లియోపాత్రా.
‘‘నీవు నిజంగా పిచ్చిపిల్లవేనమ్మా! ఒక పక్క ఏడుస్తూనే ఏడవటంలేదని నన్ను మోసం చెయ్యాలనుకుంటున్నావా?’’
బలవంతంగా దుఃఖాన్ని దిగమింగగలిగింది క్లియోపాత్రా.
‘‘రాణీ! నిజంగా నీకు మతిపోతోంది!’’ అన్నది ఆయా.
‘‘నిజమే ఆయా! నాకు మతిపోతోంది. కాదు, పోయింది. ఏం చెయ్యను?’’
‘‘ఏం కష్టమొచ్చిందని? మా తల్లి రాజ్యపాలన చెయ్యాలనీ, సంతానాన్ని కంటే రుూ చేతులమీద ఎత్తుకొని పెంచాలనీ కలలు కంటున్నాను. నీవు నిజంగా రాణివౌతావు! నేను జీవితంలో ఎవ్వరికీ హాని తలపెట్టనిదాన్ని. ఆ సుకృతం ఏదన్నా ఉంటే, నా రుూ దీవెన తప్పక నిజవౌతుంది. కాస్త ఓర్పుకావాలమ్మా!’’ అంది.
తిరిగి జీవితం మీద పరిధులు లేని మమతలు క్లియోపాత్రాను చుట్టిముట్టినవి. ఆయా దీవెనలు నిజమైనట్లే, తాను ఆనందసాగరంలో మునిగి తేలుతున్నట్లే తోచిందామెకు.
‘‘అమ్మా! ఒక్కమాట విను. ముసలిదాన్ని, బతికినన్నాళ్ళు బతకబోను. ఈ సంవత్సరంలోనూ నీ ఆరోగ్యం ఎంత చెడిపోయిందో తెలుసుకోలేకుండా ఉన్నావు. మనస్సు పాడు చేసుకుంటున్నావు. జరిగేదేమో జరుగుతుంది. నీ యవ్వనం, నీ సౌందర్యం అంతా అడవిగాచిన వెనె్నలవుతోంది. సరిగా తిండన్నా తినవు. ఎప్పుడూ దిగులుగానే ఉంటావు. నీ దిగులుతోనే నీ ఆయుష్షు కూడా క్షీణించిపోతోందంటే నమ్ము’’
క్లియోపాత్రా ఆయా ముఖంలోకి చూస్తూ ఊరుకున్నది. ఈ ముసలిది తననేదో ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడుతోంది. తనను ప్రాధేయపడేవాళ్ళు తన నుంచి ధనధాన్యాదుల్నికోరేవారే కాని, రుూమె మాత్రం తన క్షేమాన్ని హృదయపూర్వకంగా కోరుతోంది. ఇలాంటి అమృతమూర్తి తిరిగి తన జీవితంలో బహుశా ఎదురవదేమో!
‘‘రాణీ! దిగులు మాను.. తిరిగి మన దేశానికి వెళ్లిపోదాం. సుఖంగా నీ తమ్మునితో కాపరం చెయ్యి. మనకన్నీ సానుకూలవౌతవి. చేతులారా ఎందుకీ కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు?’’ అన్నది ఆయా.
ఇంతకుముందే తాను కూడా అలాంటి నిర్ణయానికే వచ్చింది. లోకమంతా ఒక తోవన నడుస్తూంటే, తనొక్కతే మరొక తోవలో నడవటంవల్ల ఒంటరితనం తప్ప మరొకటి లభ్యమవదు. ఇక తర్కవితర్కాలతో పనిలేదు అందుకని అన్నదామె- ‘‘పై వారంలో మనదేశం వెళ్దాం ఆయా!’’
ఆయా ముఖం విప్పారింది. కళ్ళు మూసుకొని ‘‘మా తల్లి కదూ! నీవు దేవతమ్మా! ఈ మనుషులు గుర్తించలేదు కాని, నిజంగా నీవు దేవ సుందరివి!’’ అన్నది ఆయా.
రాణి నిశ్చయాన్ని విని అందరూ సంతోషించారు. కొద్ది రోజుల్లోనే తామంతా స్వదేశం వెళ్లిపోతున్నాము కదాననే ఆనందంలో మునిగిపొయ్యారు. ఒక్ల క్లియోపాత్రాలో తప్ప మిగతా అనుచరులందరిలోనూ ఉత్సాహం కట్టలు తెంచుకుంది.
ఆమె మనస్సులోని సంఘర్షణ మాత్రం శాంతించలేదు. తీరా నిశ్చయాన్ని ప్రకటించాక ఒక విధంగా పశ్చాత్తాపపడుతోంది. తన పట్టుదల ఇంత బలహీనమైనదని లోలోన సిగ్గుపడుతోంది. ఐతే తన చుట్టూవున్న ప్రపంచం తాను చేసే త్యాగానికి ఆనందిస్తూండటం ఒక్కటే, తను పెడదారిని పట్టలేదనే తృప్తిని ఇస్తోంది.
తరవాతి వారంలో ఈజిప్టు నుంచి రాయబారి వచ్చాడు. రాణి రుూసారి రాయబారితోపాటే తరలి వెళ్తుందని అందరూ ఆశించారు. కాని, టాలమీ పంపిన లేఖ రుూ విధంగా వున్నది.
‘‘రాణీ!
ఈజిప్టు ప్రజలందరికీ ప్రభువునైన నేను అర్సినోయ్ టాలమీని- అగ్నిసాక్షిగా వివాహమాడిన నిన్ను తిరిగి స్వీకరించేందుకు ఆఖరుసారిగా అంగీకరిస్తూ ఈ లేఖను పంపుతున్నాను.
ప్రపంచంలో ఏ భాగంలో వున్నా, ఈజిప్షియన్లందరి మీదా నాకే అధికారం ఉన్నది. ఆ ఆజ్ఞల్ని తిరస్కరించటం రాజద్రోహం కాగలదు. రాజవంశజవని నీ దుష్కార్యాలను ఇన్నాళ్లూ సహించాను. స్వదేశంమీదనే కత్తికట్టి, బైటినుంచి తిరుగుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నావని తెలుస్తోంది. నీ మీది అనురాగంవల్లా, ఈజిప్టు సింహాసనానికి నీక్కూడా భాగం ఉండటంవల్లా కొంతవరకూ సహించాను.
కాని, ఇలాటి పనులు నా వ్యక్తిగత జీవితానికి ఎంత తలవొంపులనేది ఒకటి, రెండవది దేశద్రోహం. ఈ రెండో నేరాన్ని క్షమించడమనేది నా చేతుల్లో లేనిది. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా సంచరిస్తూ దేశ విద్రోహకర కార్యకలాపాల్లో నిమగ్నులైనవారికి, చట్టం మరణదండనను విధిస్తుందని నీకు తెలుసు.
జరిగినదంతా మరిచిపోయి నిన్ను తిరిగి ఈజిప్టుకు ఆహ్వానిస్తున్నాను. ఈ సదవకాశాన్ని తిరస్కరించినట్లయితే, నిన్ను నీ అనుచరుల్ని అణచటం నా వొంతవుతుంది. అప్పుడు పశ్చాత్తాపపడి కూడా ప్రయోజనం ఉండదు.
కనుక, రాజునైన నా ఆజ్ఞలకు బద్ధురాలవై నీవు వెంటనే నీ అనుచరులతో సహా తిరిగి వచ్చి నాకు లొంగిపోవలసింది.
ఇట్లు
అర్సినోయ్ టాలమీ
ఈజిప్షియన్ ప్రభువు’’
ఈ లేఖలోని ప్రతి అక్షరమూ క్లియోపాత్రా ఆత్మాభిమానికి గొడ్డలిపెట్టుగానే తోచింది. గతవారంలో రోమన్ ప్రభుత్వం టాలమీని రాజుగా అంగీకరించేప్పటికి, అతను తన మీద ఆజ్ఞల్ని జారీ చేశాడు. నిజానికి వాడికి ఈజిప్టు సింహాసనంమీద ఎంత హక్కు ఉన్నదో, తనకూ అంత హక్కు ఉన్నది.
ఈ స్వల్ప విషయాన్ని విస్మరించి, తనను నీచపరిచేందుకు ప్రయత్నించటాన్ని ఆమె భరించలేకపోయింది. ఇన్నాళ్ళవలె తనను ప్రాధేయపడుతూ లేఖ పంపినట్లయితే, తాను తప్పక ఈజిప్టు ప్రయణానికి సన్నాహాలు చేసేది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు