డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలమీ మనస్సులోని పరిణామాలు ఎలా వుంటాయో కూడా ఆమె ఆలోచించక పోలేదు. తన ఆశలన్నీ రోమ్‌మీదనే కేంద్రీకరించబడినట్లు, టాలమీ ఆశాసౌధాలకు తనే పునాదిరాయిగా వున్నది. తాను జగదేక సుందరిగా ప్రసిద్ధికెక్కింది. తనను వశపరచుకోవాలని టాలమీ ఎంత హాస్యాస్పదంగా ప్రవర్తిస్తున్నాడో కూడా తనకు తెలుసు. తన నుంచి ఒక్క అనురాగపూరితమైన వీక్షణానికి అతను తహతహలాడుతున్నాడు.
ఈజిప్టులో ఉండగా అతను తన పడకగదిముందు ప్రేమభిక్ష కోరుతూ తెల్లవార్లూ మోకరిల్లటం తనకు తెలుసు. రాజభవనంలోని ప్రతి జీవికీ తెలుసు! రుూ నీచుడికి లొంగకూడదని తాను నిశ్చయించుకున్నది. ఏనాటికైనా తనకు దయ కలుగుతుందని వాడి ఆశ. అందుకే ఇంకా రాయబారుల్ని పంపుతున్నాడు.
ఆచార్యుడు చెప్పినట్లు టాలమీకి భార్యగా ఈజిప్టు గడ్డమీద కాలుపెడితే, ఉత్తరోత్రా సర్వాధికారిణి అయ్యే అవకాశాలున్నవి. ఇక్కడ పడే బాధలకూ అంతమంటూ ఏర్పడుతుంది. తాను సుఖపడినా, సుఖపడకపోయినా, అనేకమందిని సుఖపెట్టినదవుతుంది. ముఖ్యంగా ఈజిప్టు పరిపాలన స్వహస్తాలనుంచి సాగుతుంది. తన జీవితాశయం నెరవేరుతుంది.
కాని ఈ సులభ మార్గం వైపు తన మనస్సు మళ్లటంలేదు. ఏదైనా సాహసం చెయ్యాలనీ, శత్రువులను ఒక్కదెబ్బతో రూపుమాపి తాను మహారాణి కావాలనీ ఆశించగలదే కాని, టాలమీని భర్తగా అంగీకరించే నీచ స్థితికి దిగజారేందుకు సుతరామూ ఒప్పుకోలేదు. ఈ సాహసం చెయ్యటమనేది కూడా రోమన్‌ల లక్షణమే కనుక, తన మనస్సులోని ఆరాటమంతా అటే మొగ్గుతోందేమో!
తన సౌందర్యాన్ని గూర్చి గర్వపడటం తనకు తెలుసు. తాను అపురూప సుందరిగా పేరొందింది. ఇరాస్ సూచించినట్లు తనకన్నా ఏ మాత్రం బలవంతుడైన సైనాపతి, లేదా రాజు తనను తేలిగ్గా జయించగలడు. అప్పుడు తాను బానిసగాక తప్పదు. తాను అబల. టాలమీని నిరాకరించగలిగింది కాని, బలవంతుల్ని ఎదురాడి నిలవగలదా? ఆ మాటకొస్తే టాలమీని ఎదురించి మాత్రం నిలవగలదా?
బలాత్కరించబడి తాను నీచమైనపోతూన్న దృశ్యాన్ని తలచుకొని ఆమె కంపించింది. బలవంతుడు బలహీనుణ్ని పెట్టే అవస్థలన్నీ ఊహించుకున్నది. తనకు దిక్కెవరు? న్యాయాన్యాయ వీక్షణలు కోర్కెలకు అడ్డుతగలుతవా? - ఆ దుస్సంఘటనలకు తాను గురికాక పూర్వమే ఏదన్నా మార్గం ఆలోచించాలి!
తనెంత స్వార్థచింతన గలది! తన సుఖం కోసమై దేశాన్ని, ప్రజల్ని వదిలేసింది. తనతో తెచ్చుకున్నవాళ్ళూ, ఇక్కడ సైనికులుగా జేర్చుకోబడినవాళ్ళూ, ఎవరూ తనను అభినందించటంలేదు. తన ఉప్పు తింటున్నందుకు మాత్రం కిక్కురుమనకుండా ఉన్నారు. అంతే! కాని, వారి మనసులు తనమీద భగ్గుమంటున్నవి. ఆ జ్వాలల్లో పడి తాను భస్మంకాకపూర్వమే మేలుకోవాలి.
స్వార్థపరులు ఇతరుల్ని కష్టపెట్టయినా సరే, తాము సుఖపడగలుగుతారు. కాని, తన స్వార్థం తన సుఖాలకు కూడా దోహదం కాకుండా నిరుపయోగంగానే ఉండిపోయింది.
అబ్బ! ఎంత జీవితం గడిచిపోయిందీ! ఇప్పుడు తన వయస్సు 20 సంవత్సరాలు! టాలమీతో కాపురం చేసినట్లయితే, ఈపాటికి బిడ్డల తల్లయేది కదా! తన సౌందర్యమంతా అడవిగాచిన వెనె్నల! అది తనకూ, ఇతరులకూడా గొప్పదిగా తోచినప్పటికీ, ఉపయోగపడనిదానికి విలువ లేని సామెతగా మారుతుంది! తన జీవిత సౌరభమంతా ఇలాగే క్రమంగా మట్టిలో కలిసిపోవలసిందేనా? ఈ సౌందర్యంతో ఒక్కసారి ఈ యావత్ ప్రపంచాన్నీ మెరిపింపజెయ్యాలనీ, భూలోకాన్ని ఏలాలనీ తాను కనిన కలలన్నీ మిథ్యలేనా? అవకాశాలు జారవిడుచుకుంటే తరువాత పశ్చాత్తాపమే కదా మిగిలేది?
కనుక తాను అనుసరించవలసింది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసిపోతోంది. ఈసారి ఈజిప్షియన్ రాయబారి వస్తే, తాను టాలమీకి భార్యగా సకల మర్యాదల్తోనూ రాజభవనానికి తరలి వెళ్ళాలి. అక్కడ మనస్సెంత ఒప్పకున్నా, తాను టాలమీ పట్ల అనురాగాల్ని నటించి తీరాలి. అప్పుడే రాణిగా గుర్తించబడుతుంది. ఆ తరువాత పరిస్థితులు అనుకూలిస్తే- అప్పుడు తన భర్త నుంచి స్వాతంత్య్రాన్ని సంపాయించి, ఏకఛత్రాధిపత్యాన్ని వహిస్తుంది.
చిత్రం- నిరాకరించి దేశాన్ని విడిచి వచ్చిన తన మీదనే టాలమీ మనస్సుంచాడు. సామాన్య మానవుడైతే, దారం తెగిన గాలిపటంలాటి భార్యను గాలికి వదిలి, మరో పెళ్లి చేసుకునేవాడు. నిజానికి రుూడుకు వచ్చిన తన చెల్లెలు వున్నది. అతను దాన్ని పెళ్లి చేసుకుంటే సరిపొయ్యేది. ఆ చెల్లెలు కానీ, అందరికన్నా చిన్నవాడైన టాలమీ కానీ తనకు ఏనాడూ అర్థంకారు.
తనకు కనిపించే ప్రతీదీ, తనకు ఎదురుగానే ఉన్నది. పొద్దెదురైన సమయంలో విధికి లొంగిపోవటంకన్నా మార్గాంతరంలేదు. మనసు రాయి చేసుకొని రుూ దుర్ఘటనల్ని ఎదురాడి, కొంతకాలం గడుపుతేనే కాని, తిరిగి తనకు మంచి రోజులు రావు.
ఈ యవ్వనదశ తనకు ప్రశాంతినిచ్చేది కాదు. తగిన పురుషుని కోసం తాను తహతహలాడుతూనేవుంది. ఐతే తన మనుస్సను ఆకర్షించగలిగిన వాడంటూ అందుబాటులో లేడు. అధికారమన్నా చేతిలో లేదు. ముఖ్యంగా అబలగా తాను ఎవర్నో ఒకర్ని- పురుషుణ్ని- ఆధారంగా చేసుకొని తీరాలి. ఇదంతా ఆలోచించి, చివరకు టాలమీకి రాణిగా ఈజిప్టు వెళ్ళేందుకే ఆమె నిశ్చయించుకుంది.
అర్థరాత్రి దాటింది. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ, గుడారంలో ఆమెకు ఊపిరి సలపనట్లుంది. ఆలోచనలవేడితో దేహం కాగిపోతున్నట్లు తోచింది. లోపల నిలవలేక, డేరా బైటికి వచ్చింది.
పున్నమి చంద్రుడు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. అల్లంత దూరాన వున్న సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాడు. గుడారాల చుట్టూ పారావాళ్ళు నెగళ్ళు వేసుకొని చలి కాచుకుంటూ, ఒక పక్క కునుకుతున్నారు. రాత్రి చాలా పొద్దుపోయి ఉంటుంది.
తన నిశ్చయం గుర్తుకురాగానే ఆమె వొణికిపోయింది. తనమీద తనకే అసహ్యం వసింది. తనెంత నీచురాలుగా తయారవబోతోందో తలుచుకొని కంపించింది.
నిజానికి తనకూ, వ్యభిచారిణికీ తేడా ఏమిటి? ధనాసతో వ్యభిచారిణి చేయరాని పని చేస్తోంది. రాజ్యతృష్ణతో తాను కూడా హృదయం నిరాకరిస్తున్నా శరీరాన్ని టాలమీకి అప్పగించబోతోంది! ఇంతకన్నా చావటం మేలు. ప్రాణం పోయినా మానం నిలుస్తుంది!
కాని బతకడం ఎంత కష్టమో, చావటం అంతకన్నా కష్టమని కూడా ఆమెకు తెలుసు. చావు భయంతోనే తాను అనేక రాత్రులు నిద్రాహారాలు మానింది. దానంతటది వచ్చే మృత్యువుకే తాను తల్లడిల్లుతే, చేతులారా ఆత్మహత్య చేసుకోవటం అనుకున్నంత తేలిక కాదు. చావదలుచుకున్నట్లయితే, ఇన్నాళ్ళ వరకూ జీవించి ఉండటంలో అర్థమేమిటి? గడిచిపోతున్న కష్టాలకు సంతోషించాలి కాని, వాటికి కుంగిపోయి ప్రాణత్యాగం చేయటం నిజంగా వ్ఢ్యౌమే కదా!
ఐనా తనెంత జీవితాన్ని చూసిందనీ? రెండు దశాబ్దాలకే నూరేళ్ళు నిండినట్లా? తానేం సుఖపడింది? తెలిసి ఉన్నంతవరకూ తను బాధల్లోనే గడిపింది. కనీసం ఇన్ని బాధలు పడ్డందుకన్నా విధి కరుణించి, తనకు జీవితంలో కొంత సుఖాన్ని అందుబాటులో ఉంచదా? గడచిన జీవితం ఎలా ఉన్నప్పటికీ, ముందుచూపులో కూడా నిరాశే కనిపిస్తూన్నప్పటికీ, మానవుడు సహజంగా చూడగల, లేదా చూస్తున్నానని భ్రమించే ఆశాసౌధాలను కూలద్రోసుకోవటం జరగదు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు