డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా గోటితో సాధించేదానికి గొడ్డలివరకూ పోనవసరం లేకుండా ఉంటుంది. తీవ్రంగా యోచించి చూడు’’.
‘‘మీరు లక్ష చెప్పండిగాక! నేను సర్వనాశమయ్యేందుకు సిద్ధపడగలను కానీ, టాలమీకి భార్యగా మాత్రం ఉండలేను’’ అన్నదామె- నిశ్చయాన్ని వ్యక్తం చేసే కంఠస్వరంతో.
ఇరాస్‌కు రుూ జవాబు ఆశాభంగాన్ని కలిగించింది. ఐనప్పటికీ చివరిసారి ప్రయత్నించి చూద్దామనుకున్నాడు.
‘‘రాణీ! క్షణికోద్రేకాలకు లోబడిపోతున్నావు. ఐతే నీలాటి ఉద్రేకాలే ఇతరులకూ ఉంటవనీ, అవి తీవ్రతరమైనప్పుడు విషాదంగా పరిణమిస్తవనీ మరచిపోతున్నావు. టాలమీ నిన్నింకా ప్రేమిస్తూండబట్టి సరిపోయింది కానీ నీ మనోగతాన్ని తెలుసుకున్నట్లయితే, తనకు దక్కని సౌందర్యాన్ని సర్వనాశనం చేస్తాడే కాని, ఇతరులకు దక్కనీడు కదా! ఈనాడు అతను ప్రభువు! అధికారం చేతుల్లో వున్నది. ముఖ్యంగా రోమ్ అతన్ని రాజుగా గుర్తించింది. అతని ఆజ్ఞలను ఈజిప్టు భూఖండమంతా శిరసావహిస్తుంది. నిన్ను రుూ పళంగా కాళ్లు, చేతులూ కట్టి, తన ఎదుటికి తెప్పించుకోగలిగిన సామర్థ్యం అతనికున్నది. ఐనప్పటికీ నీకతను హాని తలపెట్టలేదు.
బతిమాలి, భంగపడి నీ జాలినీ, నీ ప్రేమనూ సంపాయిద్దామనే అతను కలలు కంటున్నాడు; ఎన్నిసార్లు నీవు తిరస్కరించినా, అతను నీ వెంటపడుతూనే ఉన్నాడు. ఇక కోర్కెలంటావా? ఏ మానవునికి తన కోర్కెలన్నీ తీరినవి? తీరే అవకాశాలున్నవి? నీకు నీ కోర్కెలు ఎంత ముఖ్యమైనవో, ఎంత పవిత్రమైనవో, వాటిని తీర్చుకునేందుకు ఎంత సాహసానికైనా వెనుదీయని స్థితిలో ఉన్నావో, అదేవిధంగా టాలమీ మనఃస్థితి కూడా ఉండి ఉంటుందనే స్వల్ప విషయాన్ని ఎందుకు గ్రహించవు? అన్నిటికన్నా ముఖ్యమైనది- ప్రస్తుత నీ విషమ పరిస్థితులకు అంతఃపురాల్లో ఎండ కనె్నరుగక, దాసదాసీల సేవలనందుకుంటూ, హాయిగా కాలం గడుపవలసినదానివి, ఇక్కడ రుూ అటవీ ప్రదేశంలో- ఎందుకు ఎండుతూ, వానకు తడుస్తూ, నానా బాధలూ పడటమేమిటి? ప్రకృతి బాధల్తోపాటు ఏ క్షణాన ఏ సేనాని, రాజు, నీమీద మోహంతో దండెత్తినా ఆశ్చర్యం లేదు.
ప్రపంచంలో సౌందర్యానికున్న విలువ నీకు తెలియంది కాదు. చరిత్రలో సౌందర్యవతుల్ని పొందేందుకై సామ్రాజ్యాల్నే పోగొట్టుకున్నవారూ, సౌందర్యాన్ని చేజిక్కించుకొని, అందుకు విచారించనివారూ ఉన్నారు. ఒక్క స్ర్తికోసం సర్వనాశనమయేందుక్కూడా సిద్ధపడినవారున్నారు. అలాటి సౌందర్యాన్ని ఆయుధంగా కలిగివున్న నీవు దాన్ని సరైన సమయంలో, సరైన వ్యక్తిమీద ప్రయోగించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నావో నాకు అర్థం కావటంలేదు. టాలమీ మాట అటుంచి, ఏ పరాయి ప్రభువన్నా నీ మీద దండెత్తి నిన్ను బలవంతంగా తన రాణిని చేసుకుంటే నీవేం అడ్డగలవు? నీకు దిక్కెవరు? అందునా యవ్వనంలో ఉన్నావు. జీవితాన్ని అనుభవించవలసిన రుూ సమయంలో నీకీ ఆలోచనలూ, బాధలూ ఏమిటి? ఇప్పటికైనా నీవు సుఖపడే అవకాశం వున్నది. ఈ కాస్తా జారవిడుచుకుంటే, తర్వాత పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదు. ఇంతకుమించి చెప్పేది కూడా ఏమీ లేదు.. తీవ్రంగా ఆలోచించు. తొందరపడొద్దు. ఈసారి ఈజిప్టునుంచి రాయబారి వచ్చినపుడు, నీ నిశ్చయం మీదనే నీ భావి జీవితమంత ఆఆధారపడి ఉంటుందని గుర్తుంచుకో.. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నేను వెళ్తున్నాను.. రాణీ! నీ రుూ సమస్యల్ని ఛేదించుకోవలసిందీ, ఆ శక్తి సామర్థ్యాలున్నదానివీ నీవే. మేమంతా నిమత్తమాత్రులం’’.
క్లియోపాత్రా ఏమీ మాట్లాడలేకపోయింది. నాగస్వరం వింటూన్న నాగుబామువలె ఉండిపోయింది. తన మాటలు కొంతమేరకైనా ఆమెలో ఆలోచనలకు పదునుపెట్టి ఉండగలవనే ఆశతో ఇరాస్ ఆమె జవాబు చెప్పకముందే, తన గుడారం వైపు చకచకా నడిచి వెళ్లాడు.
***
క్లియోపాత్రా చాలా తీవ్రంగా ఆలోచించసాగింది. ఆమెకు మతిపోయినట్లయింది. ఈ ప్రపంచంలో ఒక్కరూ తన అభిప్రాయాలు సరైనవని అనటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తన వాళ్ళనుకునేవాళ్ళూ, తనకోసం ప్రాణాన్ని కూడా లెక్కచేయక పోరాడేందుకు సిద్ధపడి ఉన్నారని తాను నమ్మినవాళ్ళు కూడా, త్వరలోనే తననొక్కతెనూ ఈ అడవిలో వదిలేసి, ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదేమో!
తన చుట్టూ వున్న ప్రపంచమంతా తనకు శతృరూపంలోనే ఉన్నది. చివరకు ప్రకృతి తాకిడికి తట్టుకునేందుకు తగిన భవనాలు కూడా తనకు లేవు. స్వదేశంలో కాలుమోపే భాగ్యమే లేదు. ఈజిప్టు మొత్తం తనమీద కత్తి కట్టింది. ఈజిప్టు ప్రభువు టాలమీ అంగీకరించడు కాని, అతను తల ఊపితే ఈజిప్టు గడ్డమీదనే తను ప్రాణాల్ని బలిపెట్టవలసి వుంటుంది.
ఐతే ఇంతకంతకూ తన నేరమేమిటి? తన ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు తనకు లేదు; చివరకు కేవలం తన వ్యక్తిగత విషయమైన దాంపత్య జీవితంలో కూడా తనకు స్వేచ్ఛ లేదు! తాను భర్తను విడనాడిన కులటగా పరిగణించబడుతోంది! ఎంత ప్రయత్నించినా ఆ టాలమీ మీద తనకు అనురాగం కాదు కదా, చివరకు జాలి కూడా కలగటంలేదు.
వాడు తనలాటి భూలోక రంభకు తగిన భర్త కాదు. తాను దైవాంశ సంభూతురాలనే కథలు ఈజిప్టులో ప్రచారమై ఉన్నవి. తాను కూడా ఆ మాట గాఢంగా నమ్ముతోంది.
నిజానికి తన విజ్ఞానం, సంస్కారం, ప్రవర్తన- ఒకటేమిటి, తన శరీరంలోని ప్రతి రక్తకణమూ విదేశాలకు సంబంధించిందిగానే తనకు తోస్తుంది; తనకు రోమ్ అంటే ఎంతో మక్కువ. రోమన్‌లను లోలోన మెచ్చుకోని క్షణం లేదు. రోమన్ వీరులను ఆదర్శ పురుషులుగానూ, అత్యుత్తములుగానూ తాను అనుక్షణమూ భావిస్తూనే వున్నది. ఒకపక్క రోమన్ దాస్యాన్ని ఏవగించుకుంటూనే, మరోపక్క రోమ్‌మీద మమతల్ని పెంచుకున్నది. తాను రోమ్‌కు సంబంధించిన స్ర్తి అని హృదయాంతరాళంలో ఎవరో ఘోష పెడుతున్నారు; అది కాచి వడబోసి సత్యమని తన నమ్మకం. కారణాలేమిటో తనకు తానే చెప్పుకోలేదు.
అలాంటి తన అందచందాలు ఏ రోమన్ వీరుడికన్నా దక్కాలి కాని, రుూ టాలమీకి మాత్రం కాదు. ఆనాడు తన తండ్రి రోమ్ నుంచి ఈజిప్టు రాజుగా ముద్రపడి వచ్చినవాడు- తాను విందులో కలుసుకున్న రోమన్ సేనాని రూపాన్ని తాను మరచిపోలేకపోతోంది. ఎండమావువలె అతను తన జీవితంలో దూరాన కనిపించి మభ్యపెట్టి మమత రేపి మాయమయ్యాడు.
మొదటి చూపుల్లోని ప్రణయమంటే ఏమిటో తనకు ఆనాడే అర్థమైంది కాని, అది రుూ జన్మకు సఫలీకృతవౌతుందనేది కేవలం స్వప్నంగానే తోస్తోంది. ఏమైనప్పటికీ తన మనస్సు మాత్రం ఆ సుందరుని మీద లగ్నమైంది. ఏ ఉన్నత పదవిలో వున్న రోమన్‌ను చూసినా తాను పరవశురాలవుతుంది. ఒక రోమన్ నాయకుని భార్యగా కాకపోయినా కనీసం ప్రియురాలుగానన్నా ఉండగలుగుతే, తన జన్మ సార్థకమవుతుందని అనేకసార్లు తను తలపోసింది.
ఈ విధంగా తన మనస్సంతా రోమ్‌మీదా, రోమన్ ప్రభువులమీదా ఉంచి దేహాన్ని మాత్రం టాలమీకి అప్పగించేందుకు ఆమెలోని ప్రతి రక్తకణమూ నిరాకరిస్తూనే వుంది. పైపెచ్చు తన భావి జీవితానికి రుూ టాలమీ ఒక పెద్ద అడ్డంకి, భర్తగా తన మీద అధికారాన్ని చెలాయించాలని పాకులాడే దుర్మార్గుడు! వీణ్ని అంతమొందించే అవకాశాలుంటే, వాటిని తానెన్నడూ దుర్వినియోగపరచుకోలేడు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు