డైలీ సీరియల్

దూతికా విజయం-102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ భయం నీకు అక్కర్లేదు సరూ! నేను ఇక్కణ్నుంచి గుడారం పీకిపారేస్తాను!’’
‘‘ఆమె అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తుందా? ఏదో మిషమీద కసి దీర్చుకుంటుంది.. మీ సంగతి అలా వుంచండి. నేనే మీ మీద మనసుపడి మిమ్ము లోబరచుకున్నానని ఆమె నమ్మితే, నాకు ఎంత ప్రమాదమో ఆలోచించండి. రాజదండనకు కళ్ళూ, చెవులూ ఉండవు; కాఠిన్యమొక్కటే కనిపించే లక్షణం.. అంతేకాదు.. నేను ఇక్కడికి రాకుండా కట్టడి చేస్తే?’’
వీరభద్రుడు పకాలున నవ్వాడు.
‘‘సరూ! రాణిలో మొలకెత్తిన ఆశ అంత త్వరలో చల్లారదు. నాకూ ఆమెకూ మధ్య ఏర్పడిన వంతెనవు నీవు. నీవు ఇక్కడికి రాకుంటే, ఆమెకూ నాకూ ఉండే సంబంధమేదన్నా సరే, శాశ్వతంగా తెగిపోయినట్లే అవుతుంది. అంత త్వరలో రాణి ఆశలు అడుగంటవు. నిన్ను కాదని మరెవర్నీ నమ్మదామె. కొంతవరకూ భేదించి నీవే తనకు దిక్కని ఆమెకు బాగా తెలుసు. నిజానికి నీవు నాకు లొంగటం కూడా తన పథకానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పరచిందనే రాణి నమ్మకం..’’
‘‘ఎన్నాళ్ళు నమ్ముతుంది? ఎప్పటికైనా మనం ఆమె కోర్కెను తీర్చవలసిందే కదా!’’
‘‘చూద్దాం.. ఆమెకు ఎన్నాళ్ళు నమ్మించవచ్చో అన్ని రోజులూ దొర్లిద్దాం. అంతగా గొంతుమీదకి వచ్చినపుడు చూసుకుందాం. ఈలోగా విధి అనుకూలించి మరో మార్గాన్ని చూపుతాడని నా నమ్మకం!’’
‘‘నేను నమ్మలేకుండా ఉన్నాను. మనం ఈ ఎత్తు ఎత్తామని విజ్ఞురాలైన రాణి వెంటనే గ్రహిస్తుంది.. నన్నిక్కడికి రానీదు.. నేను లేకుండా మీరు సుఖపడగలరా?’’ అన్నది సరస్వతి, వీరభద్రుని మొహంలోకి విచిత్రంగా చూస్తూ.
‘‘ఉహూ! నీవు లేకుండా బతకలేని అసమర్థతను ప్రసాదించావు. ఐతే నాకో గొప్ప నమ్మకమున్నది. నీవు కూడా సామాన్యురాలవేం కాదు. రాణి కట్టడి చేస్తే, ఏదో ఒక సూక్ష్మమార్గాన్ని అనే్వషించి, అవసరమైతే రాణిని మోసం చేసైనా సరే నా దగ్గరికి వస్తావు. నా కోసం కాదు నీవు పొందే సుఖం కోసం! ఎవరెలా ప్రవర్తించినా, ఎవరి ఆదర్శం ఏదైనప్పటికీ స్వసుఖం కోసం ప్రయత్నించటమనే ఆదర్శాన్ని ఎవ్వరూ, ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడలేరు. అందుకని సరూ! నేను నినె్నలా విడనాడలేనో, నన్ను నీవు కూడా అలాగే విడిచిపెట్టలేవు. మనిద్దరి స్వార్థాలూ మనను చెరో దిక్కునుంచీ బలవత్తరంగా తరుముతూండటంవల్ల, ఉభయులమూ మధ్య దారిలో కలుసుకునేందుకు ఉరుకులు పరుగుల్తో పయనిస్తూనే ఉంటాం! ఆ వేగానికి ఒకరిలో ఒకరు లీనమైపొయ్యాం! విడివడటం చాలా కష్టం! ‘నేను’ అనే దాంట్లో ఉభయులమూ ఇమిడిపోయాం!’’
వీరభద్రుడు చెప్పినదంతా కాచి వడకట్టిన సత్యంగానే తోచింది సరస్వతికి. అయితే స్వార్థమనే ఆదర్శం వేరూ, దాన్ని ప్రయోగించి సాధించటం వేరూనూ.
వీరభద్రుడు తన అభిప్రాయాన్ని విశదీకరించాడు:
‘‘మీ రాణి చాలా గొప్పదని ఆశ పెట్టావు కదా! అంత గొప్ప రాణిని పొందే అర్హత నాకేమన్నా ఉన్నదా? నీవూ, రాణీ కలిసి ఆ అర్హతను నాకు ఆపాదించి, నన్ను నమ్మించ జూస్తున్నారు- కేవలం నాతో పని పడింది కనుక! రాణి వాంఛ తీరగానే మీరు నాకు కప్పిన అర్హతావస్త్రం కూడా మాయమై, తిరిగి మామూలు వ్యక్తిని అవుతాను. ఇంతకు క్రితం నేను ఆక్రమించిన ఉన్నతస్థానాన్ని తలచుకొని, ఈ హీనస్థితికి ఎంతో కుమిలిపోతాను. అదీగాక నాకు అర్హత లేని స్థానాన్ని ఆక్రమించజూడటం కన్న అక్రమం ఉన్నదా? ఇతరుల సంగతి అలా వుంచి, నాకు నేనే నచ్చజెప్పుకోలేని పరిస్థితి ఇది! ఇంత ఆత్మద్రోహాన్ని నాకు నేనై చేసుకోలేను!’’
వీరభద్రుడు ఎంత నిష్కర్షగా మాట్లాడుతున్నాడు! ఇతనికి నచ్చజెప్పగల సామర్థ్యం తనకు వున్నదా అనే అనుమానంలో పడింది సరస్వతి!
‘‘అంతేకాదు’’ అన్నాడు. ‘‘నేను సుఖపడుతున్నాను, ‘ఎవరికన్న?’ అనే ప్రశ్న రానంతవరకూ అసంతృప్తి లేదు. ఎప్పుడైతే మరో వ్యక్తిని పోల్చి చూస్తామో అప్పుడే పెద్ద లోపం కనిపిస్తుంది. నిజానికి ఆ ఇంకో వ్యక్తి ఎంత సుఖపడుతున్నాడో నాకు తెలియదు. ఊహతో తప్పుడు అంచనాలు వేసి నన్ను నేనే మోసం చేసుకోవటవౌతుంది.. అందుకని ఈ ఉన్నదే చాలు. తృప్తీ, సుఖం ఈ రెండూ కూడా ఎవరి రక్తాన్ని వారు తయారుచేసుకున్నవిధంగా ఎవరికివారే రూపొందించుకోవాలి!’’
‘‘మీరు రూపొందించుకున్న ఈ సౌఖ్యంకూడా చేయిజారిపోయే ప్రమాదం కనుచూపు మేరలో వున్నది కదా!’’ అన్నది సరస్వతి.
‘‘దూరాన వున్న ప్రమాదాన్ని భూతద్దంలో చూసినట్లు గోరంతలు కొండంతలు చేసుకొని, తికమకపడటం దేనికి? దాపునకు వచ్చేటప్పటికిని దాని రూపం ఎలా మారుతుందో స్పష్టంగా తెలుస్తుంది కదా! అప్పుడు చూద్దాం!’’
‘‘నా పరిస్థితిని గూర్చి మీరు నిశితంగా ఆలోచిస్తే, ఈ సమస్యా రూపం తెలియకపోదు. రాణి వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెను నమ్మించటం నా తరం కాదు.. ఇది అయ్యే వ్యవహారంగా ఆమెకు తోచని క్షణం నుంచీ నా బతుకు నరకప్రాయవౌతుంది. ఏ విధంగానూ నేను కోట దాటి రాలేను.. ఆ ఆశలేమీ ఉంచుకోవద్దు..’’
వీరభద్రుడు అడ్డుపడలేదు. కనుక ఈ ధోరణిని సాగిస్తే అతను లొంగుతాడనే ఆశ సరస్వతికి ఏర్పడి, సాగించింది.
‘‘అదీగాక మీతో కుదరదని తెలిశాక, తనకు తగిన మరో పురుషుణ్ని వెతికి, నచ్చజెప్పి, తోడ్కొని రమ్మని ఆజ్ఞపించవచ్చు! అప్పుడు నా స్థితి ఎలా తయారౌతుందో ఆలోచించండి. ఆ మరో పురుషుడు కూడా, మీలాంటి చిలిపివాడూ, పిరికివాడూ అయితే సరిగ్గా ఇక్కడ జరిగిన సంఘటనలే తిరిగి ఎదురైతే!’’
తన భార్య మరో పురుషునికి లొంగవలసిన దారుణ పరిస్థితి ఏర్పడే ప్రమాదాన్ని, వీరభద్రుడు ఊహించి తదనుగుణంగా రెచ్చిపోయి, ఆ ప్రమాదం సంభవించకుండా తన రాణి కోర్కె తీరుస్తాడనే గుడ్డి నమ్మకం ఏర్పడింది సరస్వతికి.
ఐతే వీరభద్రుని ఆలోచనలు వేరొక దిక్కున ప్రవహిస్తూన్నవని ఆమె ఊహించలేకపోయింది.
వీరభద్రుడు అన్నాడు:
‘‘అదీ మంచిదేగా సరూ! నన్ను మెప్పిస్తూ మచ్చిక చేస్తున్నాననీ, నా పిరికితనాన్ని పారద్రోలి పురి ఎక్కిస్తున్నాననీ, నేనింకా నిర్ణయానికి రాలేదనీ, మరికొంత వ్యవధి కావాలనీ కొన్నాళ్ళు గడపవచ్చు. ఎల్లకాలమూ మోసం చేయటం కుదరదు. అదీకాక గడువు సమీపిస్తున్నకొద్దీ ఆత్రుత హెచ్చుతుంది. చివరకు వీరభద్రుడు ఒప్పటంలేదని మొండి చెయ్యి బైట పెట్టు.. అప్పుడు మరొక పురుషుణ్ణి ప్రయత్నించమని రాణి ఆదేశిస్తుంది కదా! ఆ పురుషుని వేటకై బయలుదేరి, ఈ పురుషుని దగ్గరికే వస్తూండు. ఇలా మరికొంతకాలం సాగుతుంది!’’ సరస్వతికి మండిపోతోంది.
‘‘అన్నీ మీ సానుకూలాలే చూసుకుంటున్నారు!’’ అన్నదామె. ‘‘కాదు. ఏ సమస్యలనైతే ఈ క్షణంలో ఎదుర్కొని పరిష్కరించలేమో, వాటిని కాలమే ఒక రూపానికి మార్చి, తీర్చగలిగే అనుకూలతను ప్రసాదిస్తుంది. అందుకని కాలం గడవనీ, ఈలోగా నేను కూడా తీవ్రంగా ఆలోచించి, సరైన మార్గాన్ని అనే్వషిస్తాను!’’ అన్నాడు వీరభద్రుడు.
వీరభద్రుడు చెప్పిన ఉపాయమే ప్రస్తుతానికి శరణ్యమని సరస్వతి భావించింది. తీవ్రంగా ఆలోచించి ఈ క్లిష్ట పరిస్థితినుంచి బైటపడే మార్గాన్ని అనే్వషించాలి. అంతవరకూ రోజులు కాదు రాత్రులు వెళ్ళబుచ్చటమే జీవిత పరమావధి.
‘‘తెల్లవారుతోంది.. వెళ్లొస్తాను!’’ అన్నదామె.
తన వాదాన్ని సరస్వతి ఆమోదించినందుకు వీరభద్రుడు చాలా ఆనందించాడు.
సరస్వతి కొంటెగా నవ్వి, తల ఊపి రాణివాసానికి బయలుదేరింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు