డైలీ సీరియల్

దూతికా విజయం-101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీ విషయం కాదు సరూ! రాణి నిన్ను నా మీద ఎందుకు ప్రయోగించింది? మనిద్దరి మధ్య గాఢానురాగం ఉన్నదని తెలిసి కూడా, తనకది ప్రస్తుతానికి దక్కదని గ్రహించి కూడా, నిన్ను ఇక్కడికి ఎందుకు పంపింది? నాకీ బహుమానాలు ఎందుకు ప్రసాదించింది? సూక్ష్మంగా ఆలోచిస్తే ఏ విధంగానైనా సరే నన్ను ఆకర్షించి, తన కోరికను తీర్చుకోవటమే ఆమె ఆదర్శం.. ఇక నీ ఆదర్శమంటావా- ముందు రాణి కోర్కెను దీర్చి, మిగిలినదాన్ని అనుభవించ్చులెమ్మని అనుకుంటున్నావు. ఇక నేనో- నాకు దొరికిన నీవే చాలులెమ్మని తృప్తిపడేందుకు ప్రయత్నిస్తూంటే పెద్ద పెద్ద ఎరలు చూపి నన్ను ప్రాణాంతకమైన పనులకు పురిగొల్పాలని చూస్తున్నావు; నాలో దురాశ రేకెత్తనంతవరకూ మనం ముగ్గురమూ - నీవూ, నేనూ, రాణి కూడా సురక్షితంగా ఉంటాము. సరూ! నా మాట విని ఇంతటితో ఆగితే అందరికీ శ్రేయస్కరం. తెగించి, మొండికేసి ముందుకు సాగటం ఎంతమాత్రం తగదు. నేను మాత్రం ఒప్పను, సరూ! అనవసరంగా నన్ను వేధించి ఈ అగ్ని పర్వత శిఖరం మీదనుంచి సరాసరి పర్వతంలోకి శక్తివంతమైన రసాయన పదార్థాల మధ్యకు మాహాగ్నిగుండంలోకి నన్ను తోసి, నాతోపాటు నీవు కూడా పడొద్దు!’’ అన్నాడు వీరభద్రుడు నిశ్చయ కంఠస్వరంతో.
ఆ దుస్స్వప్నం గుర్తుకురాగా ఒక్కసారి సరస్వతి శరీరంలోని ప్రతి రక్తకణమూ జలదరించింది. వీరభద్రుడు తన భర్త, ప్రియుడు, బాంధవుడు. కోటలోకి రావటం ఎంత ప్రమాదకరంగా పరిణమించవచ్చునో తన ఊహకు అందని విషయం కాదు. వెధవ కల తాలూకు ఛాయామాత్రపు అనుభూతుల్ని తలచుకుంటేనే ఇంత వికారంగా వున్నది! ఇతను అన్నట్లు ఇంతటితో ఈ ప్రయత్నానికి శాశ్వతంగా తెర దింపెయ్యటమే ఉత్తమం!
ఐతే తన చేతుల్లో ఏమున్నది? తన ఇష్టానుసారంగా జరిగే అవకాశాలు మాత్రం ఏమున్నవి? కేవలం ఆ విధిమీదనే భారం వేయటం కూడా కుదరదు. క్లిష్ట సమస్యల్లోంచి బైటపడాలంటే, రాణి కోర్కె తీరటం ఒక్కటే మార్గమని తనకు నిశ్చయంగా తెలుసు. వీరభద్రునికి నచ్చజెప్పటం మాత్రం తాను తలచినంత తేలికేం కాదు. ఐనప్పటికీ మరికొంత ప్రయత్నంమీద సాధించవచ్చేమో చూడాలి.
‘‘ఫలితాల విషయం తరువాత చూద్దాం.. ముందు ప్రయత్నం జరిగి తీరాలి కదా!’’ అన్నది సరస్వతి.
‘‘ఫలితమేమిటో ముంజేతి కంకణానికి దర్పణం ఎందుకన్న విధంగా స్పష్టంగా తెలుస్తూనే వున్నది కదా! మనకేం దివ్యశక్తులున్నవా? అలనాడు అనిరుద్ధ కుమారుణ్ణి రాత్రిపూట అవలీలగా ఉషాకుమారి శయన మందిరానికి జేర్చిన చిత్రరేఖకు వలె నీకేమన్నా ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార విద్యలేమన్నా తెలుసు కనుకనా? లేక అష్టదిక్పాలకులు దమయంతి మందిరంలో జొరబడేందుకు వీలుగా, తాను అదృశ్య రూపానుండే విధంగా సహాయపడే ఉంగరాన్ని నల మహారాజుకు ప్రసాదించారే అలాంటి ఉంగరమేమన్నా మన దగ్గర ఉన్నదా? లేక నేనేమన్నా కామరూప విద్య తెలిసిన వ్యక్తినా? అలాటి సహాయముంటే అలనాడు ఇంద్రుడు గౌతమ ముని వేషంలో, గౌతమ ముని పత్ని అహల్యను సంగమించిన విధంగా, ఎవరికీ తెలియరాకుండా కార్యసాఫల్యత ప్రాప్తించవచ్చు. కనీసం ప్రవరునికి సిద్ధుడు ప్రసాదించిన అంజనంలాంటిదన్నా మన దగ్గర లేదు కదా!.. లేదా మణిమేఖలుడు కామరూప విద్యా ప్రయోగంతో ప్రవరుడై, వరూధునిని తృప్తిదీరా అనుభవించిన విధానాన్ని అనుసరిద్దామంటే ఆ కామరూప విద్య మన దగ్గర లేదాయె.. ఇవేమీ లేకుండా, కేవలం మన శక్తి సామర్థ్యాల మీద, సామాన్యుని వలె జన పథాన్ని అనుసరించి సాధించదగిన కార్యమేనా ఇది? అందునా మన శక్తి సామర్థ్యాలను గూర్చి మనకు తెలియందేమున్నది?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘మరో మార్గం లేనప్పుడు ఏం చేయాలి?’’’
‘‘నీవు ఇంతగా బతిమాలి, భంగపడుతున్నావు కనుక, నాకు బొత్తిగా ఇష్టం లేనప్పటికీ, రాణి కోర్కె తీర్చటం ద్వారా ఉభయులకూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే నమ్మకమున్నది కనుక, నేనొక ఉపాయం చెపుతాను’’
‘‘చెప్పండి.. త్వరగా చెప్పండి!’’ అన్నది సరస్వతి ఆత్రుతో.
‘‘మెల్లిగా రాణినే ఇక్కడికి తీసుకొనిరా!’’’
సరస్వతి మండిపడింది.
‘‘మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియటంలేదేమో? రాణి మిమ్ము కోరినంత మాత్రాన ఆమెను నాలాటి సామాన్యురాలుగా మీరు భావిస్తున్నారు! ఆమె ఇక్కడికి రావాలా? ఇది సంభవమేనా? రాణివాసాన్ని విడిచి ఆమె రావటం ఎంత ప్రమాదకరమో ఆలోచించారా? ఎవరి కంటా పడకుండా రావటం అసంభవం!’’ అన్నదామె.
‘‘రాణి అంత భయపడితే, మనమేనా నిర్భయంగా ప్రవర్తించవలసింది? మనకు మాత్రం ఇది ప్రమాదకరం కాదా?.. అబ్బో! రాణిని వెనకేసుకొచ్చేందుకు ముందు వెనుకలు ఆలచోంచని నీవు, నన్ను కోటలోకి లాక్కువెళ్ళేందుకు మాత్రం ఎన్ని పన్నాగాలు పన్నుతున్నావ్!’’’
సరస్వతి నివ్వెరపోయింది. వీరభద్రుడు తననే అనుమానిస్తున్నట్లున్నాడు! పద్ధతి మార్చి చూడటం అవసరమనుకున్నదామె.
‘‘మిమ్ము బలాత్కరించటం, అనవసరంగా ప్రమాదాలకు గురిచేయటం నా ఉద్దేశం కానే కాదు. కాని నాకూ కొన్ని విధులు ఉన్నవి. అవి పూర్తిచేసుకొని మీతో కలిసి జీవిత శేషాన్ని గడపాలనుకుంటున్నాను!’’ అన్నదామె.
‘‘దానికేం? రేపే బయలుదేరి దూర దేశాలకు వెళ్ళిపోతాం. నేను ఏదో ఒక ఉద్యోగం సంపాయిస్తాను. రోజుకు ఒక్క పూట భోజనం దొరికినా చాలు సరూ! ప్రాణగండాలు లేని ప్రశాంత జీవితాన్ని గడుపుదాం. పరుగెత్తి పాలు తాగటంకన్నా, నిలబడి నీళ్ళు తాగటం మేలు.. సరేనా?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘మీరు చెప్పింది అంత తేలికేం కాదు. రాణి ఇష్టపడి నన్ను విడుదల చేస్తేనే కాని నేను మీతో రాలేను!’’
‘‘పారిపోదాం!’’
‘‘అది మరీ ప్రమాదం. రాజరికపు దీర్ఘబాహువులకు వెంటనే చిక్కిపోతాం. రాణివాసంలోంచి పారిపోయినందుకు నాకు మరణశిక్షపడుతుంది; నన్ను లేపుకొని పోయినందుకు మీకు మరణదండన తప్పదు. అందుకని ఏదో విధంగా రాణిని ఒప్పించి, నా రాజీనామాను ఆమె అంగీరించేట్టు చేస్తే తప్ప ఈ సమస్య తీరదు. ఇంత దూరం మీకు నచ్చచెప్పేందుకు నేను ప్రయత్నించే కారణమే అది!’’’
‘‘నేను అల్పసంతోషిని సరూ! దొరికినదానితోనే తృప్తిపడే తత్వమున్నవాణ్ని. దురాశ దుఃఖానికి చేటు అనే సామెత నమ్మేవాణ్ని. సప్త సముద్రాలూ ఈది ఈ సప్త దర్పణ శయన మందిరానికి జీవన్మరణాల మధ్య ఊగులాడుతూ జేరటం కన్నా, అక్కడ భయంతో శరీరం చెమటలు కమ్ముతుండగా ఎంత ప్రయత్నించినా నిలువ దొక్కుకోలేక నీళ్ళు కారిపోయి, మదనుని నిశిత శరాలు నిష్ప్రయోజనం కాగా చేతకాని దద్దమ్మవలె బుర్రగోక్కుంటూ అవమానంతో, వ్యధతో, నిరాశతో తిరిగి రావటం కన్నా, ఇక్కడ నేను ఏర్పరచిన ఏకదర్పణ శయన మందిరంలో నిర్భయంగా, ఇష్టానుసారంగా, తృప్తిదీరా శృంగారాన్ని అనుభవించటం లక్ష రెట్లు నయం. నా మనసు పోనిదానిమీదికి నీవెందుకు బలాత్కరిస్తావు?’’
‘‘ఇంకో మార్గమేదన్నా ఆలోచిస్తేనే కాని, మనిద్దరికీ విముక్తి లభించదని మీరు గ్రహించాలి మరి!’’ అన్నదామె.
వీరభద్రుడు ఆలోచనలో పడ్డాడు. అతను కాస్త మెత్తపడే అవకాశమున్నదని సరస్వతికి తోచింది. ఈసారి భయపెట్టి చూద్దామనుకున్నదామె.
‘‘మనమీ విషయంలో త్వరలోనే ఒక నిశ్చయానికి రావాలి. మీరు మొండికెత్తారని రాణి గ్రహించినట్లతే మీకేమైనా అపకారాన్ని తలపెట్టవచ్చు!’’ అని సరస్వతి హెచ్చరించింది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు