డైలీ సీరియల్

దూతికా విజయం-100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన పాపలేగా అవి!... చూడు.. ఎలా చుంబిస్తున్నవో!’’ అని ఆమెను ఉద్రేకపరుస్తూ వాటిని చూపాడు.
ఆమె సిగ్గుపడి అటు చూడరాదనుకుంటూనే, వీరభద్రుడు గమనించనప్పుడు దొంగ చూపులతో తిలకిస్తూ ఆనందించసాగింది. వీరభద్రుడు అటు చూసేందుకు ప్రయత్నించినపుడల్లా ‘తప్పు కదూ!’ అంటూ, అతన్ని చూడనీకుండా చేతులు అడ్డం పెట్టింది. వీరభద్రుడు ఆ తామర తూళ్ళను తొలగించి, ప్రతిబింబాల ప్రణయరాధనను తిలకిస్తూనే ఉన్నాడు!
తిన్నది అరగాలని తాను చెప్పిన సూత్రాన్ని అమల్లో పెట్టేందుకు ఆ రాత్రి ఆ శయనాగారంలో ఒకర్ని జయించాలని మరొకరు తీవ్రంగా ఘర్షణపడి నానా అల్లరీ చేశారనే అనుమానం తెల్లవారుజాముకు దృఢపడిపోయింది.
***
పొంగి చల్లారిన పాలవలె వీరభద్రుడు ప్రశాంతంగా ఉన్న సమయం చూసి సరస్వతి రాణి ప్రస్తావన తీసుకువచ్చింది.
గత రాత్రివలె అతను చిరాకుపడటంలేదు. తాను చెప్పింది అతని చెవికి ఎక్కుతోందని గ్రహించిన సరస్వతి ఆశలు అర్రులు జాచినవి.
రాణివాసానికి చేరవలసిన విధానమూ, ఆ కష్టసుఖాలూ మెలకువలూ మొదలైనవన్నీ వివరంగా చెపుతూ, తన పరమపదసోపాన పటాన్ని పరిచిందామె.
‘‘ఇంత ప్రమాదకరమైన సాహసాన్ని ఎదుర్కొనేందుకు నిర్ణయించుకున్న నీ ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉన్నాను!’’’ అన్నాడు వీరభద్రుడు అంతా విని.
‘‘సరూ! ఇందులో నీకు జరిగే మేలేమిటి?’’
‘‘రాణి కోర్కె తీరితే మిమ్ము ఐశ్వర్యవంతుణ్ని చేస్తుంది. నేనప్పుడు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మీతో బహిరంగంగానే కాపరం పెట్టగలుగుతాను. అది మేలు కాదా?’’ అన్నదామె. తన స్వార్థాన్ని గత రాత్రే మార్చుకొని, ఒక నిశ్చితాభిప్రాయానికి రాగలిగింది.
‘‘నీలో ఈర్ష్య కూడా లేదేం సరూ!’’
‘‘రాజభక్తికి ప్రాణాలను నవ్వుతూ అర్పించగల మనస్తత్వం నాది. నిజానికి రాణి ఆదేశం మీదనే మీతో పరిచయం కలిగింది. నన్ను ఇంత విశ్వసించిన రాణికి ద్రోహాన్ని తలపెట్టటం నాక తలకు మించిన పని!’’
‘‘చిత్రం! పరార్థ దూతికగా బయలుదేరావు. స్వార్థ దూతికగా రూపొందావు. అంతటితో ఆగక ఇపుడు భార్యాదూతికగా మారావు. రెండు రోజుల్లోనూ మూడు అవతారాలు. బాగుంది.. బాగుంది!’’ అని వీరభద్రుడు తెరలు తెరలుగా నవ్వాడు.
‘‘నన్ను ఆట పట్టించి, వేళాకోళం చేయటమే మీ ప్రధానోద్దేశం! ఏం చేస్తాం కానీండి.. ఈ పనికి ఒప్పుకున్నాక తప్పుతుందా?’’ అని సరస్వతి మూతి బిగించుకున్నది.
వీరభద్రుని చుంబనంతో ముడివడిన ఆమె పెదవులు విడివడినవి.
‘‘సరూ! నిజంగా, హృదయపూర్వకంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా?’’
‘‘దైవసాక్షిగా చెపుతున్నాను. మిమ్ము ప్రాణసమానంగా ప్రేమిస్తున్నాను!’’
‘‘సరూ! ఒకవేళ నేను చనిపోతే’’
సరస్వతి అతని నోటికి తన చేతిని అడ్డుపెట్టి ‘‘అలాంటి మాటలనకండి.. ఒకవేళ అదే సంభవమై తీరేట్లయితే, నేనొక్కతెనూ బతికి బావుకునేదేమన్నా ఉన్నదనుకుంటున్నారా? నేనూ మిమ్ము వెన్నాడుతాను!’’ అందామె, లోనుంచి వచ్చిపడిన దుఃఖ తరంగాల్ని ఎలాగో దిగమింగుతూ.
‘‘పులి నోట్లో తలపెట్టి బతికి బైటపడిన సాహసానికి గర్వపడటంకన్నా, అసలు దాని జోలికే పోకుండా, సాధారణ జీవితాన్ని అనుభవించటం ఉచితమని నీవు అనుకోవా?’’
‘‘ఇపుడు నా అభిప్రాయాలెందుకులెండి! మీరు రాణి కోర్కెను తీరిస్తే మనిద్దరికీ ఈ జీవితాంతం వరకు సుఖసౌఖ్యాలు రాసి పెట్టి ఉంటవి!’’ అన్నది సరస్వతి.
‘‘్భవి మీద ఇంత పెద్ద ఆశలు పెట్టుకొని, అవి ఈడేరక ఏడవటం కన్నా మనకు అందుబాటులో ఉన్నవాటితోనే తృప్తిపడటం మంచిది కదా!’’
‘‘ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉండమంటారా? అదృష్టదేవత ఆహ్వానిస్తూంటే, సిరి రా మోకాలు అడ్డటమెందుకు?’’
‘‘కళ్లు బైర్లు కమ్మి వివశమైతే దురదృష్టదేవత కూడా అదృష్ట దేవత వలెనే కనిపిస్తుంది ప్రియా! నీ ఈ పథకంలో మృతువు ఎన్ని రూపాలలో, ఎన్ని మార్గాలలో నక్కి ఉంటుందో, ఎలాంటి హెచ్చరికా లేకుండానే ఎప్పుడు, ఏ విధంగా మీదికి ఉరుకుతుందో తెలియదు కదా! ఇంత ప్రమాదమని తెలిసి వుండీ, ఈ సుడిగుండంలోకి ఉరకటం ఈ సాలెగూటిలో చిక్కుకోవటం ఎంత అవివేకమో ఉద్రేకపడకుండా, ఎండమావులను చూసి భ్రమించకుండా, దూరదృష్టితో చూడగలిగితే అర్థమవకపోదు! మన వయస్సును బట్టి మృత్యుదేవత కొన్ని యోజనాల్లో వున్నదాన్ని బారల్లోకి, మూరల్లోకి, జానల్లోకి, బెత్తెల్లోకి తెచ్చుకోవటవౌతుంది’’
‘‘ఆడదాన్ని నాకున్న మాత్రం ధైర్యసాహాలైనా లేవేం మీకు?’’ అని సరస్వతి దెప్పిపొడిచింది.
‘‘ఈ వ్యవహారంలో ధైర్యమూ, సాహసమూ అనే పద ప్రయోగాలు అనవసరం సరూ! జీవితం మీదా, ప్రాణాలమీదా వుండే ఆశా, తీపీ చావనివాడూ, దేనికైనా సిద్ధమేనని మొండికేసిన వ్యక్తికైతే ఇదంతా మధురంగా, కర్ణోపేతంగా ఉంటుంది. చివరకు నా విషయం కూడా వొదిలెయ్. నాతోపాటూ నీకూ మరణదండన విధించబడితే నేను భరించలేను.. మొన్నటివరకూ నీవెవరో నేనెవరో, కాని నిన్నటినుంచీ మాత్రం మనం ఏక శరీరులం మాత్రమే కాదు సరూ, ఏక ప్రాణులమయ్యాం! చూస్తూ చూస్తూ నన్ను అగ్నిగుండంలోకి తోసేస్తావా? నిండు ప్రాణాలను బలిపెట్టమంటావా? నాకు బొత్తిగా ఇష్టంలేని పని బలాత్కారంగా చేయించదలిచావా? నీవే నాకు పెన్నిది వనుకున్నాను. ఇంకెక్కడో చిటారుకొమ్మన వుండే మిఠాయి పొట్లాన్ని ఎరగా చూపి నన్ను పైకి పాకమంటే, తీరా కాలూనితే ఆ బరువుకు ఆ కొమ్మే విరిగితే ఏవౌతుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.. ఆలోచించు!’’
వీరభద్రుడు చెప్పినదాంట్లో సబబు కానిదేమీ లేదు. ఐతే రాణి తన మీద ఉంచిన ఆశలను తాను నిరాశలు చేయటమెలా? మరోవిధంగా మాట్లాడన్నా సరే వీరభద్రుని అంగీకారాన్ని పొందటం తన విధి.
‘‘మా రాణి ఎంత అందమైనదో, ఎంత రసికురాలో మీకు తెలియదు. ఆమె తోడి ఒక్క రాత్రి అనుభవానికి ప్రాణాన్ని అర్పించే మహాపురుషులు నా తల వెంట్రుకలంతమంది ఉన్నారు!’’
‘‘మరి వాళ్ళందర్ని వదిలేసి నా దగ్గరికి ఎందుకొచ్చావూ?’’
‘‘రాణి మనసుకు మీరు నచ్చారు!’’
‘‘మరి నా మనసుకు రాణి నచ్చవద్దా!’’
‘‘తప్పక మిమ్ము అమితానందపరచగల చతురురాలామె!’’
‘‘నా మనసంతా నీమీదనే ఉండగా, మీ రాణి మీదికి మళ్లవద్దా?’’’
‘‘ఆమే మళ్ళించుకుంటుంది మీరు సహకరిస్తే!’’
‘‘అంత హామీ ఇస్తున్నావే! నిజంగా రాణి నుంచి నేను ఊహించలేనంత ఆనందాన్ని పొంది, ఆమెకే అతుక్కొనిపోతే? నిన్ను విడనాడితే? నీ మొహమే చూసేందుకు ఇష్టపడకుంటే?’’
‘‘నా కర్మ అనుకుంటాను!’’అన్నది సరస్వతి.
‘‘కర్మ సిద్ధాంతంమీద అంత బరువు మోపవద్దు సరూ! తనకు తాను సహాయం చేసుకోని వ్యక్తికి విధి కూడా సహాయపడదు.. నీవు ఎంత అమాయకంగా ప్రవర్తిస్తున్నావో నీకే తెలియకుండా వున్నది. నాలుకకూ, హృదయానికీ మధ్య వున్న ఆ చిన్న చోటులో ఎంత కుత్సితాన్ని దాచవచ్చో నీకింకా అర్థమవలేదు!’’
‘‘నిష్కల్మషంగా వున్నానని నిందలేస్తున్నారా? కుత్సితాన్ని ప్రదర్శించనందుకు నన్ను తప్పుపడుతున్నారా?’’ అన్నదామె, వీరభద్రుని అసలు ఉద్దేశ్యమేమిటో అర్థంకాక!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు