డైలీ సీరియల్

దూతికా విజయం-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నవరాత్రీ ఉత్సవాల్లో చూశాను మహారాజా! ఆ తరువాత నాకు అతనితో పరిచయమూ లేదు. నేను ఎరగనే ఎరగను.. ఇప్పుడు అతని పురుష రూపం బైటపడేదాకా ఎవరో కూడా నాకు తెలియదు!’’
‘‘మరి ఇంతకుముందు ‘ఇతను’ అని పురుషవాచకాన్ని ప్రయోగించావే.. స్ర్తి వేషంలో ఉన్నవాణ్ణి ఎలా గుర్తుపట్టావు? రుూ చీకట్లో అదెలా సాధ్యమైంది?’’ అన్నాడు ధర్మపాలుడు.
రాజువేసిన ప్రశ్నకు ప్రేక్షకులు హడలిపొయారు. తామెవరికీ తట్టనిదాన్ని, రాజు పట్టుకున్నాడు. నిజమనేది పాతాళంలో వున్నా , దాన్ని జుట్టు పట్టుకుని పైకి తీసికొనిరాగల సామర్థ్యం రాజుకు ఉన్నదనటం కేవలం ప్రతీతి మాత్రమే కాదని, ప్రయోగాత్మకంగా తామిప్పుడు వీక్షించగలమనే ధైర్యం అందరికీ కలిగింది.
ఆ ప్రశ్నకు జయపాలుడు సగం చచ్చాడు. అయితే తన శరీరాన్ని కప్పి వున్న ప్రియమైన తన చర్మాన్ని కాపాడుకునేందుకు అతనొక కథను- నలుగురూ నమ్మదగ్గదాన్ని ఇంతకుముందే అల్లుకొని, చుట్టూ తగినంత రక్షణను ఏర్పాటుచేసుకొని ఆ లోపల ముడుచుకొని కూర్చున్నాడు. యుక్తిగా చేసిన రుూ అల్లికను ఎవ్వరూ భేదించలేరనే నమ్మకం అతనికి ఏర్పడింది.
ఐతే ‘సత్యం’ ఇమడని మాట ప్రాణహీనమైనదనీ, అలాంటి అబద్ధాలు ఎప్పుడూ అసందర్భంగానూ, నిర్జీవంగానూ, లోతు లేనివిగానూ ఉంటవనీ, ముఖ్యంగా తెలివితేటల ముందు అవి ఛిన్నాభిన్నవౌతవని జయపాలుని లాటి మూర్ఖులు ముందుగా గ్రహించలేరు. తాబేటి డిప్పలాటి రక్షణలో ఉన్నామనుకొని కాస్సేపు సురక్షితంగా ఉన్నామనే ఆనందాన్ని పొందవచ్చుగాక! త్వరలోనే ఆ డిప్ప పప్పు పప్పుగా నిజస్వరూపాన్ని ప్రదర్శించక తప్పదు.
‘‘అసలు జరిగిందంతా చెప్పేందుకు అనుమతించండి మహాప్రభూ!’’ అన్నాడు జయపాలుడు.
‘‘చెప్పు’’
జయపాలుడు తొణకక, బెణకక ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించేట్లుగా ఇలా చెప్పాడు.
‘‘రుూ రాత్రి దక్షిణద్వార రక్షణ నా విధి. నేను గస్తీ తిరుగుతున్నాను.. ఉద్యానవన సరిహద్దులో ఎవరో తిరుగుతున్నట్లు అనుమానం వేసింది. రాణివాసపు స్ర్తిలై ఉంటారనుకున్నాను. ఐతే వారెవరైనా దక్షిణ ద్వార సమీప్యానికి రావలసిన అవసరం ఏముంటుందనే సందేహం కలిగింది. ఒకవేళ రాణి వాహ్యాళికి వచ్చి ఉంటారా అని ఆలోచించాను, ఎవరని ప్రశ్నించవచ్చా కూడదా అని మనసులోనే తర్జన భర్జన చేసుకున్నాను.. ఆ ఆకారాలు ఉద్యానవనంలోకి మాయమై ఉంటే నేను మిన్నకుండేవాడిని. కాని అవి అక్కడే తిరుగులాడుతుండటంవల్ల అది భ్రాంతి కాదనీ, వారు ఎవరైనప్పటికీ తెలుసుకోవలసిన బాధ్యత నాకు ఉన్నదనీ తోచింది. ఇంత రాత్రివేళ ద్వార సామీప్యానికి ఎవరువచ్చినా ప్రశ్నించి, సరైన సమాధానాన్ని రాబట్టుకోవడమూ, లేని పక్షంలో వారిని రక్షణ నాయకునికి విచారణ నిమిత్తం అప్పగించటమూ నా బాధ్యత, హక్కు అనే నిశ్చయించుకున్నాను.. ఎందుకైనా మంచిదని, ఆయుధాన్ని సిద్ధంగా ఉంచుకుని కొంచెం ముందుకు వెళ్లి ‘ఎవరూ?’ అని స్పష్టంగా విన్పించేట్లు అడిగాను. ‘నేను.. చిన్నరాణి ప్రియసఖిని సరస్వతిని’ అని జవాబు వచ్చింది. ఇంతదూరం వచ్చాక నిశ్చయంగా కళ్ళతో చూసి తెలుసుకొందామనే ఉద్దేశ్యంతో దివిటీని ఒక చేత్తో పట్టుకుని వారి సమీపానికి వెళ్ళాను.. ‘‘ఆమె ఎవరు?’’ అని రెండో ప్రశ్న వేశాను. ‘మా చెల్లెలు శారద.. ఇటీవలే చిన్నరాణి కొలువులో జేరిందిలే!’ అని సరస్వతి జవాబిచ్చింది. ‘ఇంత రాత్రివేళ ఇటెందుకు వచ్చారు?’ అన్నాను. ‘వాహ్యాళికి వచ్చాం.. ఏం రాకూడదా?’ అన్నది సరస్వతి నన్ను సవాలు చేస్తున్న ధోరణిలో. ‘‘రావచ్చును.. కాని ద్వార సామీప్యానికి రారాదు. ఇక వెళ్లండి’’ అన్నాను, ఈ వాద ప్రతివాదాలను పొడిగించటం ఇష్టం లేక. ‘రావే చెల్లీ!’ అని సరస్వతి రుూ రెండో ఆమెను చెయ్యి పట్టుకొని నడవనారంభించింది. రుూ ‘చెల్లి’ అనబడే ఆమె పైకి స్ర్తిగా కనిపించినప్పటికీ ఆమె నడకలో, కాలువేసే తీసే తీరులో పురుషత్వం గోచరించింది. మరోసారి నిశితంగా చూసేటప్పటికి నా అనుమానం చాలా బలపడింది. ‘ఆగండి’ అన్నాను. వారిద్దరూ ఆగారు. దివిటితో వారి సమీపానికి వెళ్ళాను. ‘ఏమిటి నీ ఉద్దేశ్యం? రాణివాస స్ర్తిలను అవమానిస్తున్నావు జాగ్రత్త!’ అని సరస్వతి హెచ్చరించింది. ఆ రెండో ఆమె కాళ్ళు వణుకుతున్నవి. ‘ఆ పక్కన ఎవరు?’ పురుషుడే- సందేహం లేదు. ఎవరు నీవు? అని దబాయించాను.
‘నీకేం మతిపోయిందా?’ అని సరస్వతి ఇంకేమో చెప్పబోతోంది. నేను ఆమె మాటల్ని లెక్క చేయకుండా మరింత దగ్గరికి వెళ్లబోయాను. ఆ రెండో ఆమె నేను సమీపమవటం గ్రహించి, సరస్వతి చేయి విదిలించుకొని, పట్టు వదిలించుకొని, నాలుగడుగులు చకచకా ముందుకు వేసింది. నేను వెంటపడి తరిమాను. సప్తదర్పణ శయనగార ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ నీచుడు రాణి ప్రాణాలకే అపాయాన్ని తెచ్చిపెడతాడేమోనని భయపడి బల్లెం విసిరాను. ఆ దెబ్బతో నేలకొరిగాడు!’’
సరస్వతి- ఈ కథను ఎవరు ఎంతవరకూ అంగీకరించి జీర్ణించుకున్నారో తెలుసుకునే ఉద్దేశ్యంతో అందరి ముఖాలను ఒక్కసారి పర్యవేక్షించింది. అందరూ చివరకు మంత్రి కూడా తనను చులకనగా చూస్తూ, జయపాలుణ్ణి ఘనంగా చూస్తున్నాడు. నౌకాభంగ సమయంలో బరువైన వస్తువులు వెనువెంటనే మునిగి జలసమాధి కావటం, తేలికైనవి తేలి అలల మీద ఆటలాడటం జరుగుతుంది. అదేవిధంగా అధికులైనవారు చీకటిపాలైతే, అల్పులైనవారు వెలుగులోకి వస్తారు. ఐతే గుడారాన్ని నిలబెట్టిన నాలుగు తాళ్ళలోను ఏవైపుది తెగినప్పటికీ, ఆ మొత్తం గుడారమే పడిపోతుందనే సిద్ధాంతాన్ని ఎవ్వరూ గమనించలేదని సరస్వతికి అర్థమైంది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు