జాతీయ వార్తలు

ఎంత కష్టం.. ఎంత నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో ఇప్పటికీ వరద నీటిలోనే అనేక ప్రాంతాలు
పాక్షికంగా మొదలైన రైలు, బస్సు సర్వీసులు
ఇంకా ప్రారంభం కాని విమాన సర్వీసులు
పాలు, కూరగాయలు, నీళ్లకు కరవే
ఎటిఎంలు, పెట్రోలు బంకుల వద్ద క్యూలు
చెన్నై, డిసెంబర్ 5: కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై మహానగరం ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. వరదలతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో పాడైపోయన వస్తువులను, వంట సామగ్రిని ఆరు బయట వేసుకుని శుభ్రం చేసుకునేవారు కొందరయతే, ఇంటిలోని పప్పులను, అపరాలను ఎండలో ఆరబెట్టుకుంటున్నవారు కొందరు కనిపించారు. వారు పడుతున్న కష్టం, పొందిన నష్టాన్ని అంచనా వేయడం ఎవరి తరమూ కాదు. అయతే శనివారం అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టి రోడ్లు వాహనాలు తిరగడానికి అనుకూలంగా మారడంతోపాటు రైలు సర్వీసులు, టెలీ కమ్యూనికేషన్ సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరణ కావడంతో నగర ప్రజలు మళ్లీ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది. చాలాప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ కొట్టుపురంతోపాటు కొన్ని శివారు ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. దీంతో భవనాలపైన, పై అంతస్థుల్లో తలదాచుకున్న ప్రజలు పాలు, నీళ్లు లాంటి అత్యవసర సాయంకోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే రేపటికల్లా నగరంలో పాల సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తామని ప్రభుత్వ డెయిరీ ‘ఆవిన్’ ప్రకటించింది. శనివారం 10.20 లక్షల లీటర్ల పాల పాకెట్లను సరఫరా చేసినట్లు తెలిపింది. అలాగే చెన్నై కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు 75 మెట్రిక్ టన్నులు, కడలూర్, కాంచీపురం జిల్లాలకు 105, 108 మెట్రిక్ టన్నుల పాలపొడిని సరఫరా చేసినట్లు కూడా సంస్థ తెలిపింది. కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువుల కొరత మాత్రం ఇంకా ఎక్కువే ఉంది. చాలా పెట్రోలు బంకులు, ఎటిఎంలు పనిచేయక పోగా, పని చేస్తున్న కొద్దిపాటి పెట్రోలు బంకులు, ఎటిఎంల వద్ద మైళ్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. మరోవైపు నిన్న రాత్రి చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు గండిపడిందన్న పుకార్లు రావడంతో జనం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన 30 మందికి పైగా మృతదేహాలను తీసుకువచ్చినట్లు అనధికారిక వార్తలు పేర్కొన్నాయి. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయిన 18 మందిలో 14 మృతదేహాలను కూడా ఇక్కడికే తీసుకువచ్చారు. సహాయక చర్యలు ప్రధానంగా తివిధ దళాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే స్థానిక అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. (చిత్రం) చెన్నైలో పాలప్యాకెట్లకోసం ఎగబడుతున్న వరద బాధితులు
శాంతించిన అడయార్ నది
చెంబరంబాక్కం, పుజల్, పూండి, రెడ్‌హిల్స్ రిర్వాయర్లనుంచి నీటి విడుదలను తగ్గించడంతో అడయార్, కూవం నదుల్లో ప్రవాహం తగ్గిపోవడంతో నగరంలో వరద పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆర్మీ, పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ లాంటి వివిధ ఏజన్సీలు మొత్తం మూడున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె జ్ఞాన దేశికన్ చెప్పారు. ప్రతి బాధితుడ్ని ఆదుకోవడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు అసాధారణ కృషి చేస్తున్నాయని చెప్పారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఒపి సింగ్ శనివారం నగరంలో పరిస్థితిని సమీక్షించారు. ఎన్‌డిఆర్ సిబ్బంది ఇప్పటివరకు 16 వేల మంది బాధితులను కాపాడాయని, రాష్ట్ర ప్రజలను శాయశక్తులా సేవ చేయడానికి కృతనిశ్చయంతో ఉందని ఆయన చెప్పారు. 1600 మంది సిబ్బంది, 200 రబ్బరు బోట్లతో కూడిన 50 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. ఎన్‌ఢిఆర్‌ఎఫ్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇంత పెద్దఎత్తున సిబ్బందిని రంగంలోకి దించలేదని కూడా ఆయన చెప్పారు.
బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ నెల 8దాకా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నగరంనుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతోపాటు సిటీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రత్యేక రైళ్లు
శనివారం నగరంనుంచి రాష్ట్రంలోని మదురై, తిరుచిరాపల్లి, తిరుచెందూర్, కారైకల్ తిరునెల్వేలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. అలాగే రద్దీ మార్గమైన ఎగ్మోర్-తాంబరం మార్గంలో సబర్బన్ రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించడంతో నగర ప్రజలకు ఎంతో ఊరట లభించినట్లయింది.
మరో 24 గంటలు వర్షాలు
మరో 24 గంటలు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైలో ఆకాశం మేఘావృతమై ఉండి, ఒకటి, రెండు జల్లులు కురవవచ్చని పేర్కొంది. శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ ఉదయం తెరపి ఇవ్వడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.