మెయిన్ ఫీచర్

కొంత మోదం.. కొంత ఖేదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్ది గంటల్లోనే కొత్త సంవత్సరం అడుగిడబోతోంది.. అన్ని రుచుల్ని వడ్డించి జారుకుంటోంది 2015.. ఆనందాల అనుభూతులతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలనూ మిగిల్చింది కనుమరుగవుతోన్న ఈ ఏడాది.. మహిళలకు సంబంధించి చూస్తే 2015 పలు ఘన విజయాలను నమోదు చేసింది. ఎప్పటిలాగే కొన్ని విషాద స్మృతులనూ వదిలివెళ్లింది. కోటి ఆశలు రేకెత్తిస్తున్న కొత్త సంవత్సరానికి కోలాహలంగా స్వాగతం పలికేముందు- ఈ ఏడాదిలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే కొన్ని జ్ఞాపకాలు ఆనందం కలిగిస్తాయి.. మరికొన్ని సంఘటనలు ఆందోళనకు గురి చేస్తాయి.
రాజకీయాలు, క్రీడలు, కళలు, ఉపాధి, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతోమంది మగువలు అద్భుత సంచలనాలు సృష్టించారు. పురుషులకు ఎందులోనూ తాము తీసిపోమని సత్తా చాటుకున్నారు. అయితే, భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఇంకా మహిళల పట్ల వివక్ష ఏదో ఒక రూపంలో కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ‘మానవ అభివృద్ధి నివేదిక’ ప్రకారం 155 దేశాల్లో ‘లింగవివక్ష సూచీ’కి సంబంధించి మన దేశం 130వ స్థానంలో నిలిచింది. ఆర్థిక స్వేచ్ఛ, ఉన్నత విద్య, శారీరక, మానసిక ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళల పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ‘ఆడపిల్ల పుడితే కుటుంబానికి కష్టాలే..!’ అన్న భావజాలం ఇంకా మారకపోవడంతో కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టింది. లింగ నిర్ధారణ పరీక్షలు, ప్రమాదకర గర్భస్రావాలు, భ్రూణహత్యల ద్వారా ఆడశిశువుల రాకను అడ్డుకుంటున్నందున హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇపుడు వధువులకు కొరత ఏర్పడింది. దీంతో పెళ్లి సంబంధాల కోసం యువకులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లింగవివక్ష ఇలా కొనసాగుతుండగా మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక నేరాల జోరు తగ్గడం లేదు. మూడేళ్ల క్రితం దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం తర్వాత ఆసేతుహిమాచలం ఆందోళన సెగలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో కేంద్ర ప్రభుత్వం ‘నిర్భయ చట్టాన్ని’ తెచ్చినప్పటికీ అత్యాచారాలు, లైంగిక నేరాల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. మహిళల పోరాటం ఫలితంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘బాలనేరస్థుల న్యాయ చట్టాని’కి సవరణలు చేయక తప్పలేదు. ‘నిర్భయ’ కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించిన అనంతరం అప్పటి బాలనేరస్థుడు బాహ్య ప్రపంచంలోకి విడుదల కావడానికి వీల్లేదని మహిళా సంఘాలు తాజాగా ఉద్యమించాయి. దీంతో అత్యాచారాలు, హత్యలు వంటి తీవ్ర నేరాల్లో శిక్షలు విధించే వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ బాల నేరస్థుల న్యాయచట్టాన్ని ప్రభుత్వం సవరించింది. అతివల ఆందోళనల ఫలితంగా కొత్తచట్టాలు ఎప్పటికప్పుడు కార్యరూపం దాలుస్తున్నప్పటికీ కేసుల విచారణ, దోషులకు శిక్షల అమలులో మాత్రం ఏళ్ల తరబడి తాత్సారం జరుగుతోంది. అకృత్యాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ మహిళలు నిరసన గళం విప్పి గర్జిస్తున్నా చట్టాల అమలులో మాత్రం పాలకుల్లో చిత్తశుద్ధి కానరావడం లేదు.
ఓటేసిన సౌదీ మహిళ..
సంప్రదాయ ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో ముస్లిం మహిళలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరికి ఓటు హక్కుతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా మొట్టమొదటిసారిగా దక్కింది. ‘స్ర్తిలు వాహనాలు నడపరాదు.. భర్త తోడు లేనిదే బయటకు వెళ్లరాదు.. శరీరం కనిపించకుండా ముసుగు వేసుకోవాలి..’ అన్న కఠిన నిబంధనలున్న దేశంలో మహిళలు మొట్టమొదటిసారిగా ఓటు వేశారు. మగ ఓటర్లను కలవకూడదన్న నిబంధన ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసిన మహిళలు ఆన్‌లైన్‌లోనే తమ ప్రచారం కొనసాగించారు. సౌదీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 979 మంది మహిళలు పోటీ చేయగా ఇరవై మంది మాత్రమే గెలుపొందారు. గెలుపు,ఓటముల సంగతి పక్కన పెడితే పురుషాధిక్య సమాజంలో ఇదెంతో ముందడుగేనని చెప్పాలి. ఇక, బాలికల విద్య కోసం కృషి చేస్తున్న పాకిస్తాన్ సాహస బాలిక మలాలా నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది అందుకుంది.
సూకీ చారిత్రక వియం..
మయన్మార్‌లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘నేషనల్ లీగ్ ఫర్ డమొక్రసీ’ (ఎన్‌ఎల్‌డి) పార్టీ అధినేత్రి అంగ్‌సన్ సూకీ చరిత్ర సృష్టించారు. రెండు దశాబ్దాల పాటు జైలు జీవితాన్ని గడిపిన సూకీ 2010లో విడుదలయ్యాక మయన్మార్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణానికి పోరాటం సాగించారు. మయన్మార్ పార్లమెంటులో ఎన్‌ఎల్‌డి పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించినప్పటికీ, సైనిక పాలకుల నిబంధనల కారణంగా ఆమె పదవిని చేపట్టే అవకాశం లేకుండా పోయింది.
ప్రపంచ సుందరి.. స్పెయిన్ యువతి
చైనాలోని సాన్యా నగరంలో జరిగిన ‘మిస్ వరల్డ్-2015’ పోటీలో స్పెయిన్‌కు చెందిన సౌందర్యరాశి మిరేయా లలగున రొయే (23) కిరీటాన్ని కైవసం చేసుకుంది. తుది పోటీలో వివిధ దేశాలకు చెందిన 114 మంది ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టేసి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ సుందరి పోటీల్లో ‘బికినీ రౌండ్’ను ఈ ఏడాది రద్దు చేశారు.
కోర్టుకు హాజరైన సోనియా..
‘నేషనల్ హెరాల్డ్’ పత్రికకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలు తప్పలేదు. ఇక, ఐపిఎల్ మాజీ అధిపతి లలిత్ మోడీ పట్ల ఆశ్రీత పక్షపాతం చూపారన్న ఆరోపణలు రావడంతో విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలను పదవుల నుంచి తప్పించాలని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పార్లమెంటులో రోజుల తరబడి దుమారం లేపాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విముక్తి లభించడంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరోసారి బాధ్యతలు చేపట్టారు.
ఒత్తిడిపై పోరు..
తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు, ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు వౌనాన్ని ఛేదిస్తున్నట్లు బాలీవుడ్ యువనటి దీపికా పదుకొనె ప్రకటించడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ‘లివ్..లవ్..లాఫ్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఆమె ప్రారంభించారు. పారితోషికంతో పాటు మరికొన్ని విషయాల్లో సినీ పరిశ్రమలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆమె పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేశారు. మరో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’ టీవీ షో నిర్వహిస్తూ అమెరికన్ చానళ్లలో సంచలనం సృష్టించారు. ‘ఆసియా శృంగార భామ’ అవార్డును కూడా ఆమె తన ఖాతాలో వేసుకుంది.
13 ఏళ్ల తర్వాత సొంతగడ్డకు..
భారత సరిహద్దుల్లో తప్పిపోయి పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన మూగ, బధిర బాలిక కేంద్ర ప్రభుత్వం చొరవ ఫలితంగా పదమూడేళ్ల అనంతరం తిరిగి సొంతగడ్డకు చేరుకుంది. గీత భారత్‌కు చేరుకున్నప్పటికీ ఇంతవరకూ ఆమె తల్లిదండ్రులు ఎవరన్నది నిర్ధారణ కాలేదు.
మరికొన్ని ఘనతలు..
దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సాయుధ దళానికి చెందిన మహిళా బృందం తొలిసారిగా పాల్గొంది. ఈ బృందానికి 25 ఏళ్ల కెప్టెన్ దివ్యా అజిత్ నేతృత్వం వహించింది. 2015కు సంబంధించి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ప్రకటించిన ‘వందమంది శక్తిమంతమైన మహిళల జాబితా’లో మన దేశం నుంచి ఏడుగురికి స్థానం లభించింది. గాయని ఆశా భోంశే్ల, టెన్నిస్ తార సానియా మీర్జా, నటి కామిని కౌశల్, మహిళా రైతు రింపి కుమారి, మహిళా పారిశ్రామికవేత్త స్మృతి నాగ్‌పాల్, ప్రచారకర్త ముంతాజ్ షేక్‌లకు ఈ గౌరవం దక్కింది.
బాలికలను బడిబాట పట్టించేందుకు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. పదకొండు మంది బాలికలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తేనే తాను పెళ్లికి అంగీకరిస్తానని హర్యానాలో పూనమ్ కుమార్ అనే వధువు వరుడు సందీప్‌కు షరతు విధించడం సంచలనం సృష్టించింది. ఇక, వివాహిత మహిళలు భర్తకు దూరంగా ఉంటున్నప్పటికీ ఆస్తిపాస్తులపై అన్ని హక్కులూ కలిగి ఉంటారని సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజకీయ, ఉపాధి రంగాల్లో హిజ్రాలు సైతం సత్తా చాటుకుంటున్నారు. తమిళనాడులో ఓ హిజ్రా సబ్-ఇన్‌స్పెక్టర్‌గా, పశ్చిమ బెంగాల్‌లో మరో ట్రాన్స్‌జెండర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌లో ఓ హిజ్రా మేయర్ పదవికి ఎన్నికయ్యారు. రుతుస్రావ సమస్యలపై మాట్లాడేందుకు మహిళలు వౌనం వీడాలన్న ఉద్యమం దేశవ్యాప్తంగా బలపడుతోంది. పాటియాలా (పంజాబ్)కు చెందిన ఇరవై ఏళ్ల విద్యార్థిని నిఖితా ఆజాద్ ఈ విషయమై అంతర్జాలంలో ప్రారంభించిన ప్రచారోద్యమం విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత్‌కు సంబంధించి అంతర్జాలంలో ప్రముఖ వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందింది. మహేష్ ఖండేల్వాల్ అనే శాస్తవ్రేత్త పది రూపాయలకే ఆరు శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తూ ‘రుతుస్రావం- పరిశుభ్రత’పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు వచ్చే ఏడాది నుంచి 26 వారాల ప్రసూతి సెలవు దక్కేలా ఆదేశాలిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమ మంత్రి మేనకా గాంధీ ప్రకటించారు. అత్యంత పిన్న వయసులో పీజీ చదువుతున్న విద్యార్థినిగా లక్నోకు చెందిన 15 ఏళ్ల సుష్మా వర్మ రికార్డు సృష్టించింది. మైక్రోబయాలజీలో పరిశోధన చేసేందుకు ఆమెకు యుపిలోని బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది. ఇక, ‘గూగుల్ సెర్చి’లో భారతీయులు ఎక్కువగా అనే్వషించింది శృంగారతార సన్నీ లియోన్ కోసమే. ఈ విషయంలో ప్రధాని మోదీ, బాలీవుడ్ నటుడు అమితాబ్, ప్రముఖ క్రికెటర్లు సైతం వెనుకబడ్డారు.

విషాదం మిగిల్చి..
కళలు, సంఘసేవ తదితర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఏడాది కన్నుమూసి విషాదం మిగిల్చారు. భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి, రచయిత్రి సువ్రా ముఖర్జీ ఈ ఏడాది ఆగస్టు 18న గుండెపోటుతో కన్నుమూశారు. మదర్ థెరెసా వారసురాలిగా కోల్‌కతలోని ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’కి నాయకత్వం వహిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి జూన్ 22న తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్ స్మారక ఆస్పత్రిలో 1973లో అత్యాచారానికి గురై 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా షాన్‌బాగ్ (66) మే 18న మృత్యుఒడిలోకి చేరారు. రెండు దశాబ్దాల పాటు అగ్రహీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి సాధన శివదాసాని (74) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగుచిత్రాల్లో మేటి నటిగా గుర్తింపు పొందిన మనోరమ (78) చెన్నైలో అక్టోబర్ 10న తుది శ్వాస విడిచారు. కొవ్వు తగ్గేందుకు ‘లిపోసక్షన్ సర్జరీ’ చేయించుకున్న దక్షిణాది నటి ఆర్తి అగర్వాల్ (31) తీవ్ర అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. *

ఆటల్లో ఖ్యాతి..
హైదరాబాద్‌కు చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ‘బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్’ (బిడబ్ల్యుఎఫ్) ర్యాంకింగ్‌ల ప్రకారం ప్రపంచంలో ‘నెంబర్ వన్’ ర్యాంకును సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ‘మకావు ఓపెన్ టైటిల్’ను మూడోసారి తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ సాధించింది. సంచలన టెన్నిస్ తార సానియా మీర్జా డబ్ల్యుటిఎ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో హింగిస్ (స్విస్)తో కలిసి టైటిల్ సాధించి మహిళల డబుల్స్‌లో ‘ప్రపంచ నెంబర్ వన్’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ‘ఖేల్త్న్ర’కు ఎంపికైన ఆమె వరుస విజయాలు సాధిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. అండమాన్, నికోబార్ దీవులకు చెందిన యువతి దెబొరా హెరాల్డ్ ప్రపంచస్థాయి సైక్లింగ్ ర్యాంకుల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

విస్మయం కలిగించేలా..
మన దేశంలో మహిళలకు సంబంధించి నెలకొన్న పరిస్థితులు విస్మయాన్ని కలిగించేలా ఉన్నాయి. దేశం మొత్తమీద ఇప్పటికీ పాఠశాల ముఖం చూడని వారి సంఖ్య 415 మిలియన్లు కాగా, ఇందులో 58 శాతం మంది మహిళలు ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా మహిళల్లో ధూమపానం పెరగడం ఆందోళనకర పరిణామం. 2012లో దేశంలో ధూమపానం చేసే మహిళల సంఖ్య 5.3 మిలియన్లు కాగా, 2012 నాటికి ఆ సంఖ్య 12.7 మిలియన్లకు చేరుకుందని ఓ సర్వేలో తేలింది. సామాజిక మీడియాలో మహిళల పట్ల వేధింపులు అంతకంతకూ అధికం అవుతుండగా సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు కారని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. వరల్డ్ కప్ పోటీల్లో భారతీయ క్రికెటర్ విరాట్ కొహ్లీ పదే పదే విఫలం కావడానికి అతడి గర్ల్‌ఫ్రెండ్, సినీ నటి అనుష్క శర్మ కారకురాలని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్‌లో పురుషాధిక్యత, పారితోషికంలో వివక్ష కొనసాగుతున్నట్లు దీపికా పదుకొనె, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ వంటి యువ నటీమణులు ఆరోపిస్తుండగా, తాము ఎంత మాత్రం ‘స్ర్తివాదులం’ కా మంటూ సీనియర్ నటీమణులు మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా ప్రకటించడం చర్చనీయాంశమైంది. ‘శృంగారతార సన్నీ లియోన్ నటించిన కండోమ్ ప్రకటనల వల్లే దేశంలో అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయ’ని సిపిఐ నేత అతుల్ అంజాన్ వ్యాఖ్యానించడం, ‘రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు అనవసరమని, పిల్లల్ని కనడానికే వారు సరిపోతార’ని కేరళకు చెందిన ముస్లిం మత నాయకుడు ఎపి అబూబకర్ అనడంపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.