మెయిన్ ఫీచర్

మారింది మనమే! మార్పుని స్వాగతిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరి నోటంట విన్నా ఒకటే మాట. ‘కాలం మారిపోయింది, మునుపటి రోజులు కావు, బతకలేకపోతున్నాం’. నిజమే! మారింది కాలమా? మనుషుల తీరుతెన్నులా?
‘‘మా చిన్నప్పటి పెళ్లి పందిళ్లు ఇప్పటికీ జ్ఞాపకం. కొబ్బరాకుల పెళ్లిపందిరి, పదహారు రోజుల వరకూ తీసేవారు కాదు. పదహారు రోజు లూ ఎంతో హడావుడీ. హరికథలు, బుర్రకథలు, సంగీత, సాహిత్య సమ్మేళనాలు- ఇలా ఎన్నో.. ఇప్పుడేవిటి? అంతా కృత్రిమమే! తలంబ్రాలు పేరుతో బియ్యం, కొంచెం రంగు రంగుల పూసలు ఎన్నో.. పూల అలకరణలుండవలసినచోట ఎలక్ట్రిక్ బల్బులు, అవే తోరణాలు. సంప్రదాయపు వంటలా పాడా.. బూరెలు, బొబ్బ ట్లు ఎవరు చేస్తున్నారు? ప్రతీ పండగకీ బిర్యానీలూ, పూరీ కర్రీలు, మిర్చిబజ్జీలు, ఏవో బజా ర్లో తయారయ్యే బర్ఫీలూ, కారప్పూసా, లడ్డూ.. మాములుగా హోటళ్లకు వెళితే అవే తిళ్లు.. పసుపు దంచడాలూ, కందిపాళ్లు విసురుకోవడాలు, అప్పడాలొత్తుకోవడాలూ, వొడియాలు పెట్టుకోవడాలూ ఏవీ?’’ ఇవే ముచ్చట్లు. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి.
శ్రీరమణగారి పుస్తకం ‘మిథునం’లాగా లేకపోతే ఇటీవలే వచ్చిన సోమరాజు సుశీలగారి పెళ్లిపందిరి పుస్తకంలాగా, మనసును మంచి తేనెలో ముంచిన నేతి గారెల్లా నోరూరిస్తాయి. కానీ అవన్నీ చెయ్యడానికి మనుషులేరీ? అప్పట్లో (గ్రామంలో ఒక లంకంత ఇళ్లుంటే ప్రతీవారింట్లో పెళ్లికి అం దరూ హాజరయ్యేవాళ్ళు. సమిష్టిగా పసుపు దంచుకోవడాలూ, కారం కొట్టుకోవడాలూ, అన్నీ అందరూ చేసుకునేవారు, ఒకరికొకరు సహాయంగా.
ఇప్పుడు పట్నాల్లో ఆ జీవితం ఎలా వస్తుంది? ఇరుకు సందుల్లోనైనా, తారురోడ్లపైనా, అంతస్థుల భవనాలు స్థూపాల్లా వెలుస్తున్నాయి. కరెంటుంటే నీళ్ళకొరత, నీళ్ళొస్తే లిఫ్టు బాధ, మెట్లెక్కలేక బాధ. జీవితంలో అంతస్ధులు పెరిగినకొద్దీ, ఇళ్ల అంతస్థుల మెట్లెక్కలేక, ఆఫీసుల్లోనూ లిఫ్టు పాడయినా, కరెంటు పోయినా ఈ బెడదే. ఉదయం లేచినప్పటినుంచీ పడుకునేదాకా ఉరుకులూ పరుగులే.. హోటళ్ల తిళ్ళు లేదా అన్నీ కూరలు పడేసి పప్పూ బియ్యంతో ఉడికించుకోవడాలూ, నాలుగు మెతుకులు. పెళ్లికి సెలవు పదిరోజులు దొరికితే ఎక్కువ.
అప్పుడే పెళ్లి, అప్పుడే హనీమూనూ అంతా అందులోనే. పైగా బంధువులూ, స్నేహితులు ఎవరి ఆఫీసుకి దగ్గరగా వాళ్ళు ఇళ్లు తీసుకుంటే ఎంతెంత దూరాలో! వెళ్లడం రావడం మహాకష్టం.
మన కాంప్లెక్స్‌లలో పక్కన ఎవరుంటారో, ఏం చేస్తారో ఏమీ తెలియదు. ఒక్కొక్కసారి రోజుల తరబడి కలవరు. పట్నాల్లో, ఆడ మగా అందరూ ఉద్యోగస్థులే! వాళ్లలో వాళ్లు మొగుడు పెళ్లాలు మాట్లాడుకోవాలన్నా, పిల్లలతో సరదాగా గడపాలన్నా కుదరని వ్యవహారం. దానికితోడు ఎక్కడా ఉమ్మడి కుటుంబాలు లేవు. అమ్మా నాన్నలు ఒక ఊళ్లో, పిల్లలు మరొక ఊళ్లో..! దానికితోడు పెద్దవాళ్లు కూడా వాళ్ళ రోజుల్లో రుబ్బిన పప్పులూ, బియ్యాలూ, దం చిన పొడులూ, ఆ రోకళ్ళూ రోళ్ళూ తలచుకుని ‘‘బాబోయ్!’’ అంటూ గుండె చేత్తో పట్టుకుంటున్నా. అప్పుడంటే తప్పలేదు. ఇప్పుడు మాకూ చేతకావడంలేదు బాబూ! అంటున్నారు. అమెరికాకెళ్లినా, ఆఫ్రికా వెళ్లినా అమ్మమ్మలూ, బామ్మలూ, ఇల్లూ, పిల్లలూ, పసిపిల్లల గుడ్డలూ, లంగోటీలూ, వాళ్లకి స్నానాలూ, వాషింగ్ మెషీన్ల పనే కావచ్చు, టబ్ స్నానాలే కావచ్చు, తప్ప, ఆరునెలలున్నా ఎక్కడికి వెళ్లకుండా తిరిగొచ్చేవాళ్లూ వున్నారు. మాకు ఉమ్మడి కుటుంబాలొద్దు, ఆ బాధ్యతలొద్దు. మాకొచ్చే పెన్షన్‌తో మేము బతికేస్తాం అనుకునేవారే ఎక్కువమందున్నారు. ఆవకాయలు ఇంట్లో పెట్టుకోలేమని, మార్కెట్లో అమ్మే రకరకాల ఆవకాయ దుకాణాల్లో కొని వాళ్ల చేతే పార్సిళ్లు పంపడమే గొప్ప అనుకుని మురిసిపోతున్నారు అమ్మమ్మలూ, బామ్మలూ! ఇప్పుడు చెప్పండి.. మారింది మనుషులూ, వారి అలవాట్లూ, ఆహార వ్యవహారాలా? కాలమా? అంతెందుకు? ఇప్పుడైనా పంపులేని ఇంట్లో, బావిలోని నీళ్లు తోడుకుంటూ గ్యాస్‌స్టౌ లేకుండా , బొగ్గుల పొయ్యిమీదో కట్టెల పొయ్యిమీదో వండుకునే ఇళ్లు ఎక్కడైనా ఉన్నాయా? అలా వుంటే ఆ ఇంట్లో ఆ ఇంటివాళ్లే వుండలేరు, అద్దెవాళ్లెవరైనా వస్తారా? ఎంత మంచి బావి నీళ్లైనా? రోటి పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు రుబ్బగలమా? ఇవన్నీ ఆలోచిస్తే, మనకి తెలీకుండా మనమే మారిపోయాం కదూ? పాత జ్ఞాపకాలు కర్పూరదం డలా సుగంధాల పరిమళా న్ని గుర్తుచేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఒక రోజు ఒక చోటికి గ్రామంలో, ఒక పిక్నిక్‌లా వెళ్లి ఆ గుర్తు లు తలుచుకుంటూ అలా గడపగలిగితే చాలు. మార్పు సహజమే కదా! ఆనందంగా స్వీకరించుదాం!
..................
మారింది మనుషులూ, వారి అలవాట్లు. నేడు అందరూ ఉద్యోగస్థులే! భార్యభర్తలు మాట్లాడుకోవాలన్నా, పిల్లలతో సరదాగా గడపాలన్నా కుదరని వ్యవహారం. హడావుడి జీవనయానం. దానికితోడు ఎక్కడా ఉమ్మడి కుటుంబాలు లేవు. అమ్మా నాన్నలు ఒక ఊళ్లో, పిల్లలు మరొక ఊళ్లో..!
...............

- శారదా అశోక్‌వర్థన్