క్రీడాభూమి

భళా ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 22: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌శ్లామ్ మ్యాచ్‌లలో 300 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా అతను రికార్డులకు ఎక్కాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం మెల్బోర్న్‌లో ఉత్కంఠ భరితంగా జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో బల్గేరియాకు చెందిన 27వ సీడ్ ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్‌ను ఓడించి ఈ మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ 17 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించి మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఫెదరర్ 160 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో 6-4, 3-6, 6-1, 6-4 తేడాతో దిమిత్రోవ్‌ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. తద్వారా ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఐదో టైటిల్ సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేయడంతో పాటు గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ మ్యాచ్‌లలో 306 విజయాలతో అలనాటి మేటి క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా నెలకొల్పిన రికార్డుకు మరో ఆరు విజయాల దూరంలో నిలిచాడు. తదుపరి రౌండ్‌లో ఫెదరర్ బెల్జియంకు చెందిన 15వ సీడ్ ఆటగాడు డేవిడ్ గోఫిన్‌తో తలపడనున్నాడు.
ఆరంభ విజయం కూడా ఆస్ట్రేలియాలోనే!
కాగా, అచ్చం తనకు మాదిరిగానే ఆడుతూ ‘బేబీ ఫెదరర్’గా పేరు తెచ్చుకున్న దిమిత్రోవ్ మూడో రౌండ్ పోరులో చక్కగా ఆడాడని ఫెదరర్ ప్రశంసించాడు. దిమిత్రోవ్ గట్టి పోటీతో తనను కాస్త ఇబ్బందుల్లోకి నెట్టాడని అంగీకరించి ఫెదరర్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలుపొంది గ్రాండ్‌శ్లామ్ మ్యాచ్‌లలో 300 విజయాల మైలురాయిని చేరడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఫెదరర్ తెలిపాడు. 1999లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్‌లో మైఖేల్ చాంగ్‌ను ఓడించి గ్రాండ్‌శ్లామ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న తాను ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లోనే 300 విజయాల మైలురాయిని చేరుకోవడం కాకతాళీయమేనని ఫెదరర్ పేర్కొన్నాడు. ‘కెరీర్‌లో నేను గత ఏడాది 1000 విజయాల మైలురాయిని చేరుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది. ఇప్పుడు సాధించిన విజయం కూడా అటువంటిదే. ఇది కాస్త ప్రత్యేకమైన విజయమే కావచ్చు. కానీ ఇన్ని విజయాలు సాధించాలని నేను ఎన్నడూ లక్ష్యంగా నిర్ధేశించుకోలేదు’ అని ఫెదరర్ స్పష్టం చేశాడు.
నాలుగో రౌండ్‌కు జొకోవిచ్
కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుక్రవారం పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన ఇతర మ్యాచ్‌లలో సెర్బియాకు చెందిన టాప్ సీడ్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌తో పాటు ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 14వ సీడ్ గిలెస్ సైమన్ కూడా మూడో రౌండ్‌ను అధిగమించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న జొకోవిచ్ 6-1, 7-5, 7-6 తేడాతో 28వ సీడ్ ఆండ్రెస్ సెప్పీని మట్టికరిపించగా, బెర్డిచ్ 6-3, 6-4, 1-6, 6-4 తేడాతో 29వ సీడ్ నిక్ కిర్గియోస్‌పై, గిలెస్ సైమన్ 6-3, 6-2, 6-1 తేడాతో ఫెడరికో డెల్బోనిస్‌పై విజయం సాధించారు. అయితే క్రొయేషియాకు చెందిన 12వ సీడ్ మారిన్ సిలిక్‌కు మూడో రౌండ్‌లోనే చుక్కెదురైంది. 24వ సీడ్ ఆటగాడు రాబెర్టో బటిస్టా అగట్ 6-4, 7-6, 7-5 తేడాతో సిలిక్‌ను ఓడించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు.