అమృత వర్షిణి
‘గ్రహబలమేమి! మనసా!’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలదండ పరిపీడిత జానుం
కామితార్థ ఫలద కామధేనుమ్॥
కాలచక్ర భేద చిత్రభానుమ్॥
కల్పిత ఛాయాదేవి సూనుమ్॥
శనీశ్వరుడిపై దీక్షితుల వారి కృతిలోని చరణం ఇది. సంగీత మూర్తి త్రయంలో ముఖ్యుడు ముద్దుస్వామి దీక్షితులు. గురుగ్రహ దోషం వల్ల తన శిష్యుడు శూలనెప్పితో బాధపడుతూంటే చూడలేక ‘బృహస్పతే తారాపతే’ అనే కృతి 40 రోజులు పాడుకోమనగానే ఆ నెప్పి తొలగిపోయి ఆరోగ్యవంతుడయ్యాడు.
శిష్యుల కోరికపై మిగిలిన అన్ని గ్రహాలపై కృతులు రచించారు దీక్షితులు. అవగాహనా రాహిత్యం, అపనమ్మకంతో తెలియక చాలామందికి ‘శని’ అనగానే ఖంగారు, ఆదుర్దా, భయం ఆవరిస్తాయి. నిజంగా ‘శని’ తలుచుకుంటే అందలమెక్కించి గజారోహణతో సమానమైన సత్కారమైనా చేయగలడు. నానా కష్టాలూ పెట్టి అధః పాతాళానికైనా తొక్కేయగలడు - అని జ్యోతిషులు వల్ల చెవిన బడి చెప్పే మాట. త్యాగరాజు, శ్యామాశాస్ర్తీ, దీక్షితులు సంగీతానికి మూల విరాట్టులు. మూర్తి త్రయంలోని ఈ ముగ్గురూ ప్రాణము, శరీరము, హృదయం లాంటివారు.
ఏ సంగీత కచేరీ అయినా ఈ ముగ్గురి రచనలూ పాడితేనే ఆ కచేరీ పరిపూర్ణమై అలరారుతుంది. రక్తి కట్టుతుంది. సంస్కృతంలో ఉండే దీక్షితుల వారి కజతులు సంగీతపరంగా ఎంతో ఉన్నతమైనవి.
ముగ్గురిలోనూ దీక్షితర్ చిన్నవాడు. అఖండ విద్యా పారంగతుడు. ఆయన కృతులన్నీ బీజాక్షర సహితంగా శక్తివంతంగా ఉంటాయి. వేదవేదాంగాలూ తెలిసినవాడు.
సర్వశాస్త్ర జ్ఞాన సంపన్నుడు. విశేషించి జ్యోతిషం కూడా తెలిసిన వాడు. నవగ్రహ పూజ లేకుండా సాధారణంగా ఏ శుభ కార్యమూ ఆరంభించరు.
మన ఇళ్లల్లో ఏ సత్యనారాయణ వ్రతమో నూతన గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలలో నవగ్రహ పూజ తప్పనిసరి.
ఆయా గ్రహాధి దేవతలను ఆహ్వానించటం ప్రత్యేకంగా పూజించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం కూడా.
ఏలినాటి శని, అష్ట గ్రహ కూటమి నవగ్రహాల మహిమ, ఇంట్లో సమస్యలకు గ్రహ శాంతి, సర్వసాధారణమే.
ఒక్కోసారి ఒక్కో గ్రహం అనుకూలంగా, మరోరోజు ప్రతికూలంగానూ ఉండవచ్చు. ఇదంతా సామాన్యంగా ఆలోచించేవాడి గొడవ.
కొందరికి వాస్తు గ్రహ దోషాల చింత ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంటిని ఒకటికి పదిసార్లు చూసుకుంటూ మురిసిపోతే మనకు అభ్యంతరం ఉండదు. వాస్తు తెలిసిన వారిని చీటికీమాటికీ ఇంటికి రమ్మంటారు కొందరు. ఇక్కడే ఉంది పెద్ద చిక్కు. నమ్మకం పిచ్చిగా మారకూడదు. ఆ పేరు చెప్పి నిక్షేపంలా ఉన్న గట్టి గోడలను పగలగొట్టేయటం, ఉన్న కిటికీల స్థానంలో గుమ్మాలు, గుమ్మాల స్థానంలో కిటికీలు మాటిమాటికీ మార్చేస్తూ అల్లకల్లోలం చేసేస్తూంటారు. ఇంటి ఇల్లాలు ఒకవైపు గోల చేస్తున్నా వినరు. దీనికీ ఒక హద్దుండాలి మరి. గ్రహపీడలను తప్పించుకోలేమని అనుభవజ్ఞులు చెప్పిన మాటే.
అంతెందుకు? అంతరిక్ష ప్రయోగాలు విజయవంతమయ్యేందుకు, పెద్దపెద్ద తలలు పండిన శాస్తజ్ఞ్రులు సైతం గ్రహదోషాలేమీ లేకుండా పూజాదికాలు నిర్వహించటం లేదా? వెళ్లి తిరుపతి క్షేత్రంలో ఏడుకొండలవాడి చెవిలో వేయటం లేదా? అందుకే అతీత శక్తిని నమ్మాలి. కానీ నిజానికి బాహ్య శత్రువుల కంటే చాలా బలమైనవి అంతశ్శత్రువులు.
అందరికీ తెలిసేలా బాహాటంగా పైకి ఏమీ కనిపించవు. లోపల దుర్మార్గపు ఆలోచనలు.. పైకి చిరునవ్వులు.. జీవితమంతా దీనికే సరిపోయె. స్వచ్ఛమైన గాలి, వెలుతురూ కావాలి. కానీ బుద్ధి స్వచ్ఛంగా ఉండదు.
ఇంక గ్రహాలూ గ్రహస్థితిపై ఏడవటమెందుకు? ప్రాయశ్చిత్తమెందుకు? గుళ్లూ గోపురాలూ తిరగటమెందుకు? నిగ్రహం లేని వాళ్లు లోపల బోల్డంత కల్మషం పెట్టుకుని ఏమీ తెలియనట్లుగా కనిపించే ప్రతి విగ్రహానికి మొక్కుతూ తిరిగితే మిగిలేది అలసట, ఆయాసం, బి.పి.
నా కనిపిస్తుంది, బహుశా త్యాగయ్య ఈ బాపతు మనుషుల్ని చూసే వుంటాడు. మనసులో ఉన్నది బయటకు రాకుండా ఉంటుందా? తన చుట్టూ తిరిగిన వాళ్ల మనస్తత్వాలు తెలిసి, దుష్టగ్రహాల బాధ బాగా అనుభవించి, ఈ కీర్తన పాడుకుని ఉంటాడు.
గ్రహబలమేమి? శ్రీరామానుగ్రహ బలమే బలము
గ్రహబలమేమి? తేజోమయ వి
గ్రహమును ధ్యానించే వారికి నవ ॥
గ్రహ పీడల, పంచ పాపముల నా
గ్రహములు గల కామాది రిపులని
గ్రహము సేయు, హరిని భజించే త్యా
గరాజునికి, రసికాగ్రేసరులకు ॥
కళ్లు మూసుకుని ఏకాగ్ర బుద్ధితో శ్రుతి లయ సమన్వితంగా రాగార్చన చేసిన త్యాగయ్య ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఈ కీర్తన. రేవగుప్తి రాగంలోది.
ఈ వేళ మహావిద్వాంసులకు సైతం ఈ దుష్ట గ్రహ బాధ లేకపోలేదు.
బాగా పాడేవారిని చూస్తే అసూయ, ద్వేషం, బాగా పాడలేనందుకు రోషం, ఈర్ష్య. దుష్టగ్రహాలు చేసే పని వీరూ చేస్తారు. రాహు కేతువుల్లా పీడిస్తూంటారు.
అవతలి వాడికి ఉందనే ఏడుపు ఒకవైపు. మరోవైపు తనకు లేదని ఏడుపు. ఒకటి ఫరవాలేదు. రెండూ మనిషి తట్టుకోవటం కష్టం. అదలా వుంచండి. ఏడ్చేవాళ్ల నెవరూ బాగు చేయలేరు. మరే గ్రహమూ రక్షించలేదు. మనిషి వయస్సు ఈ అనంతమైన కాలంలో వందేళ్లు అని భావిస్తే పుట్టిన ప్రతి ప్రాణికీ, ఆ మాటకొస్తే ఈ చరాచర విశ్వానికే ఉదయాస్తరూప సౌర చలనంతోనే ఈ కాల నిర్ణయం ఉంటుంది. అందుకే సూర్యుణ్ణి కాలమనీ, కాలుడనీ పిలుస్తారు. అయినా కామితార్థాలనిస్తాడు. సూర్యశక్తిని ఎంతని వర్ణిస్తే సరిపోతుంది? మనం కొలిచే దేవుళ్లందరూ మనకు కనపడకుండానే తమ బలం చూపిస్తారు. ఈ సూర్య చంద్రులిద్దరూ మనకు ప్రత్యక్షంగా, నిండుగా కనిపిస్తూ ఫలితాన్నిస్తూంటారు.
వారి గతులలో మార్పు వల్ల మన గతులలో మార్పు తీసుకు వస్తూంటారు.
ఖగోళశాస్త్ర రీత్యా చంద్రుడు స్వయం ప్రకాశుడు కాకపోయినా, సూర్యుడికి ఆ ఇబ్బంది లేదు. పగలు కావలసినంత వెలుగునిస్తాడు. రాత్రుళ్లు కిరణ పరావర్తన వల్ల పరోక్షంగా రక్షకుడౌతున్నాడు. అదే మనకు ఆరోగ్యం ఇస్తోంది. అన్ని గ్రహాలకూ అధిపతి సూర్యుడు. సర్వాధికారి. మీకు కోపం వస్తే ఎవరినీ శని పేరు జోడించి తిట్టకండి. శాపనార్థాలు పెట్టకండి. మీ మధ్యలో ఆయనె్నందుకు లాగడం? రవిని ఆత్మకారకుడుగానూ, శని ఆయుషారకుడుగానూ చెప్తుంది జ్యోతిషం.
‘నవగ్రహ స్వరూపుడౌ నారాయణునకు
నతులు శివుండు బ్రహ్మయును తానె
సృష్టి స్థితి లయకారుడు॥
అని ఓ కీర్తన 1977 ప్రాంతంలో బాలాంత్రపు రజనీకాంతరావుగారు రాశారు. రేడియో కోసం పాడాను.
సహస్ర కిరణాల తేజోమూర్తి సూర్యుడు. ఎన్నో సౌరమండలాలున్నాయి. ద్వాదశాదిత్యులున్నారు. ఇదంతా అర్థం చేసుకోటానికి సామాన్య బుద్ధి సరిపోతుందా? అన్నిటికీ ఒక్కటే మార్గం. ఈ కవిలో గ్రహబలం కంటే రామానుగ్రహమే శరణం. యోగవాసిష్టం చెప్పినట్లు ‘మన పూర్వజన్మ కర్మ’ ప్రస్తుతం మన చేసే పనులూ.. రెండూ పొట్టేళ్లలా దెబ్బలాడుతూంటాయి. ఏది బలమైతే అదే నెగ్గుతుంది. అదే మన జాతకం.
సకల గ్రహ బలనీనె సరసిజాక్ష
నిఖిల వ్యాపక నీనె విశ్వరక్ష అన్నాడు, త్యాగరాజు కంటే ముందు పుట్టిన పురందర దాసు. భాషలు వేరైనా భావాలొక్కటే. ప్రాంతాలు వేరైనా స్వరాలొక్కటే.