అమృత వర్షిణి

‘హింసానాదాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచీ, చెడూ, కష్టం సుఖం, లాభం, నష్టం, సుఖం దుఃఖం, ధర్మం అధర్మం, నీతి అవినీతి- ఇలా ద్వంద్వాలతోనే జీవితమైపోతుంది. ఎవ్వరికీ కలకాలం ఏ ఒక్కటీ నిలకడగా నిలవదు. అదే విచిత్రం. ఈ జంటల్లో ఏ ఒక్కదాని యొక్క పర్యవసానం తెలిసినా చాలు. మనిషికి సుఖ సంతోషాలు రెండూ లభిస్తాయి. కానీ మాయామోహం కదా? తెలుసుకోనివ్వదు. బుద్ధిపుట్టనివ్వదు. పుడుతూనే జన్మరాహిత్య మార్గాలు వెతుక్కునే బుద్ధిమంతులు ఏ నూటికో కోటికో ఒకరో ఇద్దరో అవతరించి మనకు మార్గాన్ని చూపే ప్రయత్నం చేస్తారు. అర్థమై అనుసరించేవారు బహు అరుదు. పరులు ఏ అపకారం చేస్తే మనకు బాధ కలుగుతుందో, ఆ పని మనం ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకంటే ఉత్తమమైన శ్రేయోమార్గమని నమ్మిన మహాపురుషులు ఈ పుణ్యభూమిలో పుట్టారు కాబట్టే ఇంకా ఈ మాత్రమైనా సుఖ శాంతులతో జీవితాలు సాగుతున్నాయి.
ఎంత వెలుగుంటే అంత చీకటి తప్పకుండా ఉంటుంది. ఎంత ధనవంతుడైతే, అంత ఆపద పక్కనే తొంగి చూస్తూంటుంది. బాగా స్థితిపరులైన కోటీశ్వరులంతా ప్రశాంతంగా హాయిగా సుఖంగా తిని నిద్రబోతున్నారంటారా? కష్టం, సుఖం రెండూ పడుగూ పేకల్లా వుంటాయి జీవితంలో.
స్వరాలలోనూ తేడాలున్నాయి. సప్త స్వరాలలో షడ్జ పంచమాలు రెండూ మినహాయిస్తే మిగిలిన స్వరాలన్నీ ఒకేలా ఉండవు. అందుకే వీటికి కోలాహల సప్తస్వరాలని పేరు పెట్టారు త్యాగయ్య. నదులన్నీ సముద్రాల్లో కలిసినట్లుగా అన్ని స్వరాలూ వెళ్లి షడ్జస్థానంలో కలుస్తాయి. ప్రవహించే నీటికి సముద్రమే గమ్యం. పాడే పాటకు షడ్జం.. గమ్యం. షడ్జంలో కలవని పాటలంటూ ఉండవు. కలిసి తీరాలి. లేకపోతే వినేవారిలో రక్తపోటు పెరిగిపోతుంది. కొన్ని కొన్ని వివాద స్వరాలున్నాయి. అంటే, మెలోడీ పుట్టించలేని వికృతి స్వరాలన్నమాట. ఈ స్వరాలతోనూ కొన్ని రోగాలు, కీర్తనలూ ఏర్పడ్డాయి. కానీ ఎక్కువసేపు వినలేరు. అందుకే నాదయోగులైన వాగ్గేయకారులు సైతం ఈ రాగాల్లో ఎక్కువ కీర్తనలు రాయలేదు. కొన్ని కొన్ని స్వరాలు చెవుల్లో పడిన క్షణం భయం, అలజడి ఆవహిస్తుంది. బుర్రతోచదు. పిచ్చెక్కిపోయేలా ఉంటాయి ఆ స్వరాలు.
ఇప్పుడొస్తున్న ఆడువారి టీవీ సీరియల్స్ నేపథ్యమంతా రణగొణధ్వనుల అల్లరేగా? ఏ సన్నివేశమైనా చూడండి- ఆనందంగా ఆహ్లాదకరమైన దృశ్యాలు అసలుండవు. బోరున ఎక్కెక్కి ఏడ్చే ఏడుపులూ పెడబొబ్బలూ. సంతోషంగా నవ్వుతూ సాగే సీన్లుండవు. రోడ్లపై నిత్యం తిరిగే వాహనాలకు అమర్చే హారన్‌లు సుస్వరాలతో ఉండవు. కాబట్టే కంగారుగా పక్కకు తప్పుకుంటారు. ధ్వని వేరు, సునాదం వేరు. రణగొణ ధ్వనులమధ్య ఆధునికత పేరుతో చాలావరకూ ఈవేళ వినబడే సినిమా పాటల్లో వినిపించేది ధ్వనే. సుస్వరంతో కూడిన సునాదం ఎపుడో 1975 నుంచే గాడి (దారి) తప్పింది. సినీ రంగంలో విషాదాన్ని సూచించే స్వరాలతో హుషారైన పాటలు చేసిన సంగీత దర్శకులున్నారు. చిత్రమేమో? ఎడబాటునీ, విరహాన్ని, వైరాగ్యాన్ని ప్రతిబింబించే పాటలే సాధారణంగా వినేందుకు ఇష్టపడతారు. గమనించండి.. నిజమైన సంగీత దర్శకుల ఆత్మ అటువంటి పాటల్లోనే ఆవిష్కృతమవుతుంది.
ప్రతి శబ్దానికీ భావం వుంటుంది. లేకపోతే నోరు లేని వాద్యాలకు చోటేదీ? మృదంగం, తమబలా,డోలు, డోలక్ మొదలైన మన వాయిద్యాలతో బాటు డప్పు, భేరీ, నగారా, తూతూ బాకా లాంటివి మొత్తం గాలించి చూస్తే 300 దాకా ఉంటాయి. ఇంకా మనకు తెలియని వాయిద్యాలెన్నో ఎక్కడెక్కడో వున్నాయి. పాశ్చాత్య సంగీతంలో పాటకన్నా వాయిద్యానికే ప్రాధాన్యత. సింఫొనీ, సొనాటా, కనె్సర్టో, కారాత్ మొదలైన వాద్య సంగీత రచనలున్నాయి. ప్రతి వాద్యానికి ఓ ప్రత్యేకత వుంటుంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నియంతలు హిట్లర్, స్టాలిన్ సంగీత ప్రియులంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ నిజం. హిట్లర్‌ని గురించిన చేదు సంఘటనలు తలుచుకుంటేనే భయమేస్తుంది. హిట్లర్ మంచి వక్త. నెమ్మదిగా అనునయింపు మాటలతో ప్రారంభిస్తూ తన ఉపన్యాసాన్ని ఏకపాత్రాభినయాలుగా తీర్చిదిద్దుకుని బయలుదేరేవాడుట.
మన దేశంలో సాధారణంగా ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పిందే చెప్పి విసిగిస్తారు. హిట్లర్ పద్ధతి చాలా వేరు. అతనికి వేగ్నర్ వాద్య బృంద రచనలంటే ప్రాణం. అతని ప్రతిమాటా ఉద్వేగంతోనిండి వింటావా లేక చస్తావా అనేలాగా వుండేవట. క్రమంగా ఉపన్యాసంలో కంఠస్వరం తీవ్ర స్థాయిలో రౌద్రంగా మారిపోవటంతో జనం బెంబేలెత్తిపోయేవారట. అన్నిటికంటే ఉపన్యాసం మొదలయ్యేముందు వేగ్నర్ వాద్య బృందంలో డ్రమ్ బీట్స్ వినిపించిన తర్వాత స్టేజీ ఎక్కేవాడట. అతని ఉపన్యాసాలు ఆ రోజుల్లో యువతను వెర్రెత్తించేవి. హిట్లర్ బాగా ఇష్టపడిన వేగ్నర్ వాద్య బృందం సంగీతమే దేశం మొత్తం వినిపించేది. ఆ సంగీతం వినే యూదులకు వణుకు పుట్టేది. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. కొనే్నళ్లకు యూదులు స్వతంత్రదేశం ఇజ్రాయేలు స్థాపించుకున్నారు. కానీ ఈ వేగ్నర్ సంగీతం మాత్రం యూదులకు ఓ పీడకలలా మిగిలిపోయింది.
అమెరికాలో వుండే జుబెన్ మెహతా అనే ప్రఖ్యా వాద్య బృంద నిర్వాహకుడు (మ్యూజిక్ కండక్టర్) ఓసారి తన వాద్య బృందంతో ఇజ్రాయిల్ పర్యటించాడు. అక్కడ ప్రదర్శనలో వేగ్నర్ సింఫొనీ ఒకటి వాయించడం ప్రారంభించేసరికి ప్రేక్షకులలో ఒక వ్యక్తి కేకలేస్తూత ఆపండి! ఆపండి! అంటూ స్టేజీమీదకు దూసుకువెళ్ళాడు. చొక్కా విప్పి వీపు చూపిస్తూ హిట్లర్ మమ్మల్ని చిత్రహింసలు పెడుతోంటే ఈ సంగీతమే వినిపించేది. అంత క్రూరమైన సంగీతాన్ని మళ్లీ ఈ దేశంలో వినిపించడానికి మీకు మనసెలా ఒప్పిందని జూబెన్ మెహతాపై విరుచుకుపడ్డాడు. ఆర్కెష్ట్రా బిత్తరపోయింది.
ఒక్కో వాద్య సంగీతానికి ఒకొక్కరు ఎలా స్పందిస్తారో చూడండి. జర్మన్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి సంగీతానే్న ఊతంగా తీసుకున్నాడు హిట్లర్.
ఒక అవసరానికి, లేదా ఒక అత్యవసర పరిస్థితుల్లో ప్రజల్ని జాగృతం చేయడానికీ, వాళ్ళ రక్తం ఉడికించేలా రణరంగంలో దూకేలా చేసే సంగీతం మనకు నిజానికి అవసరం లేదు. మన ఆయుధాలూ, మన స్వభావం శాంతి అహింసలే కదా? యుద్ధానికి ఉసిగొలిపే పరిస్థితులెందుకుంటాయి? మన తత్వానికి వ్యతిరేకమైనదిమన సంగీతంలో ఎక్కడ పుట్టుకొస్తుంది? కానీ దేశభక్తిని పెంచే వాతావరణం మాత్రమే లేదు.
సినిమాలలో హీరోలు, విలన్లు గొడ్డళ్ళతోనూ, వేట కొడవళ్ళతోనూ ఆ పాత్రల్లో జీవించి దర్శనమిస్తూ హింసా ప్రవృత్తి, దుర్మార్గ స్వనావాన్ని ప్రేరేపించే నేపథ్య సంగీతంతో పిచ్చెక్కిస్తోంటే ఇంకెక్కడ దేశభక్తి. నిలదీసే ప్రభుత్వ వ్యవస్థ లేదు. అదే మన దౌర్భాగ్యం. ఇంగిత జ్ఞానమున్న ఏ వ్యక్తీ దీన్ని సహించడు. నెత్తురు చిమ్మిన ముఖాలతో రోడ్లపై దర్శనమిచ్చే వాల్‌పోస్టర్లే దీనికి సాక్ష్యం. నిజ జీవితంలో యిటువంటి హింసాత్మక దృశ్యాల ప్రభావం మనుషులపై ఉండదా? కడిగిన ముత్యాల్లా, బుద్ధిమంతుల్లా ఉండాలనుకోవటం అత్యాశ కాదా? శాంతి కాముక దేశాల్లో మన దేశానికి ఎప్పుడూ మొదటి స్థానమే. ‘యుద్ధం’ జీవితంలో ఒక భాగంగా బతికే దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు యువకులందరికీ మిలటరీ శిక్షణనిచ్చే కాలేజీలున్నాయి. యుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సంగీతం కూడా వుంది. యుద్ధ సంబంధమైన సంగీతం మనకు అవసరం లేదు.
పాటల్లో లయ ప్రధానంగా దేశభక్తిని ప్రచోదనం చేసే దిశలో సాహిత్యముంటుంది. దేశభక్తిని పెంచే పాటలు పాడించే అలవాటే మృగ్యం. గౌతమబుద్ధుడి మొదలు మహాత్మాగాంధీ వరకూ అహింసా మార్గానే్న పట్టుకున్న ఈ దేశంలో రౌద్ర భావాలకు, దుర్మార్గమైన అరాచకశక్తులను ప్రోత్సహించే సంగీతానికి సన్నివేశాలకూ తావే లేదు. మూసలో పోసినట్టు అలాంటి సినిమాలే తయారౌతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అజమాయిషీ అదుపూ లేదు. ఇంక పిల్లలకైనా పెద్దలకైనా దేశభక్తి భావాలెక్కడినుండి ఊడిపడతాయి.
మన దేశానికి ఒక ప్రత్యేకత వుంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు పదిమందీ కలిసికట్టుగా చెయ్యవలసిన అవసరమున్న ఏ బృహత్తర కార్యక్రమమైనా ఇక్కడ సవ్యంగా జరుగదు. ఒకవేళ ప్రారంనించినా అడుగు పడదు, అవాంతరాలె ఎక్కువ.
మనకు పెద్ద పెద్ద వాద్య బృందాలు లేవు. కనీసం ఓ పాతికమందైనా హాయిగా కలిసి పిల్లలచేత పాడించగలిగే ఒక్క పాఠశాలైనా కనపడదు. కొన్ని పాఠశాలల్లో సంగీతం టీచర్లున్నా వారితో సంగీతం మినహా మిగిలిన పనులు చేయిస్తారు. పాశ్చాత్య దేశాల్లో పదివేల జనాభా కలిగిన చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఒక్కో ఆర్కెష్ట్రా వుంటుది. దాని పోషణ భారం ఆ ఊరి పౌరులే వహిస్తారు. అది గౌరవంగా భావిస్తారు. సుమారు 150 మంది వాద్య నిపుణులు పాల్గొనే వాద్య బృంద ప్రదర్శనలు, ఆ జాతి సంస్కృతిని ఔన్నత్యాన్నీ సూచిస్తాయి. పండుగలకు పర్వదినాలకూ, ప్రభుత్వ కార్యకలాపాలకూ ఈ వాద్య బృందరచనలు ప్రధాన ఆకర్షణగా వుంటాయి.
ఒకప్పుడు మనకూ ఆకాశవాణి వాద్య బృందాలుండేవి. అనిల్ బిస్వాస్, పన్నాలాల్ ఘోష్, పండిట్ రవిశంకర్, టి.కె.జయరామయ్యర్, కామశాస్ర్తీ, ఈమని శంకరశాస్ర్తీ, విజయ రాఘవరావు వంటి సంగీత స్రష్టలు ఎంతో కృషిచేసి వాద్య బృందాలకు పునాదులు వేశారు. అకారణంగా అర్థంతరంగా వీటిని ఎందుకో మూసివేశారు. ఈ దుస్థితి ఎందుకు కలిగింది? సామూహికంగా కలిసి పాడాలనే భావం ఎక్కువ క్రైస్తవ దేవాలయాల్లో కనిపిస్తుంది చూడండి. ఇంకా యిప్పటికీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు నలుగురు విద్వాంసులు ఎప్పుడు గానం చేసినా నాలుగు రకాలుగా వినిపిస్తూంటాయి. అయినా చిరునవ్వులొలికిస్తూ చిద్విలాసంగానే పాడేస్తూంటారు.

- మల్లాది సూరిబాబు 90527 65490