అమృత వర్షిణి

విశ్వదాభిరామ.. వినురవేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత నేర్పు తోడ నేమేమి చదివినఁ
జింతలేని విద్య చిక్కఁబోదు
పంతగించి మదిని పరికించి చూడరా!
విశ్వదాభిరామ వినురవేమ!
పుస్తకంలోని విషయాలను మెదడులోకి మక్కికి మక్కిగా ఎక్కించుకుంటే లాభం లేదు. అలాటి చదువు వప్పజెప్పటానికే పనికొస్తుందే కాని శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి ఏమీ ఉపయోగపడదు. శాస్త్ర విషయాల్లోని లోతైన విషయాలు అర్థం కావాలంటే తెలివిగా, యుక్తియుక్తంగా, విమర్శ చేసుకుంటూ చదివిన వాటిని ఎప్పటికప్పుడు మననం చేయాలి. అంతవరకూ శాస్తజ్ఞ్రానం ప్రకాశించదు.
భగవద్గీత, రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను అచ్చువేసే వారికి అందులోని విషయాలన్నీ తెలిసిపోతున్నాయా? అందంగా అచ్చు వేసేవరకే వారి పని. అదో యాంత్రికమైన విద్య. కానీ సంగీతం యాంత్రికం కాదు.
ఎవరో పాడేసిన పాటను ముక్కున పట్టేసి ఊదేస్తే, సంగీత జ్ఞానమంతా తెలిసినట్లు కాదు.
అందుకే వేమనంటాడు..
‘గురుని శిక్ష లేక గురుతెట్లు కల్గునో
అజునికైన వాని యబ్బకైన
తాళపు చెవిలేక తలుపెట్టులూడునో
విశ్వదాభి రామ! వినురవేమ!
వేమన పేరు తెలియని ఆంధ్రుడుండడు. ప్రజలతో మమేకమిన ఆ కవిని ఆకాశానికి ఎత్తేసిన మహాపురుషుడు బ్రౌన్ అనే ఓ పాశ్చాత్యుడు.
ప్రఖ్యాత విమర్శకుడు, కవి పండితుడు జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ గారి పుణ్యమా యని ‘వేమన’ గురించి నాకు తెలియని విషయాలు ఎన్నో తెలిశాయి. ఆ పద్యాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం.
మూఢాచారాలు, మూఢ నమ్మకాలను నిరశించి, నిజాన్ని నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టి చెప్పి మరీ వెళ్లిపోయాడు. వాటి సారాంశం ‘విన్నవాడిదే అదృష్టం. వినకపోతే వాడి ఖర్మం’ అన్నట్లుగానే ఉంటాయి. ఆయన పద్యాలన్నీ యోగి వేమన పాత్రలో ‘చిత్తూరు నాగయ్య’ నటించిన 1947 నాటి చిత్రం ఎంత కీర్తిని సంపాదించిందో మనందరికీ తెలుసు.
కె.వి.రెడ్డిగా బాగా ప్రసిద్ధుడైన కదిరి వెంకటరెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఆ చిత్రంలో నాగయ్య నటన గొప్పదా? సంగీతం గొప్పదా? అని తేల్చి చెప్పలేం. సాహిత్యం ద్వారా మనసుకు అందించలేని విషయ సంగీతం వల్లనే పూర్తిగా తలకెక్కుతుందనే సత్యాన్ని తన గానంతో నిరూపించి పరిపూర్ణత్వాన్ని తెచ్చిన ఘనత నాగయ్యదే.
ఒకవైపు సముద్రాల రాఘవాచార్య, మరోవైపు ఓగిరాల రామచంద్రరావులు కలిసి ఆ చిత్రం తాలూకు జ్ఞాపకాలు మాయమవ్వకుండా చేయటంలో కృతకృత్యులయ్యారు. నాగయ్యతో సమానంగా నువ్వా? నేనా? అని నటించిన ముదిగొండ లింగమూర్తిని ఎలా మరచిపోగలం. అటువంటి నటుల్ని ఈ వేళ వెదకాలంటే మనకున్న చేతివ్రేళ్లు ఎక్కువే.
నిశితంగా గమనిస్తే శృతిలయలు ఒక్క పాటకేగాదు, మాటల్లో కూడా ఉదాత్త అనుదాత్తాలుంటాయి. అందుకే వాళ్లు మహానటులయ్యారు. హావభావ ప్రకటనతో వెలువడే వారి మాటలే మధురంగా ఉంటాయి.
- ఎవరు నాయనా నువ్వు?
- ఎందుకింత ఆవేదన పడుతున్నావు?
- జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి చెందుతున్న అంధుణ్ణి.
- జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకున్నావా?
- లేదా స్వామీ?
వేద వేదాంగాలూ తెలిసిన మహర్షులూ, దేశ దేశాలూ జయించిన చక్రవర్తులూ పుట్టి, పెరిగి మరణించి వెళ్లిపోతున్నారే?
వీరంతా ఏవౌతున్నారు స్వామీ?
- పిచ్చివాడా? లోకంలో అందరూ ఈ శరీరంతో జీవించి సుఖించాలనీ, భోగాలనుభవించాలనుకుంటూ వుంటే మరణించిన తర్వాత ఏవౌతారనే తాపత్రయం నీకెందుకు? ఆ తాపత్రయం వదులుకో - ఇదిగో? చూడు! నీకు అష్ట ఐశ్వర్యాలు లభించే మార్గం అనుగ్రహిస్తాను. హాయిగా అనుభవించు.
- వద్దు స్వామీ! వద్దు. అవన్నీ ఎప్పుడో అనుభవించేశాను. అంతా క్షణికమని తెలుసుకున్నాను. వాటిపై వాంఛలేదు. నాకున్నదొక్కటే సందేహం. మనం ఎక్కడ నుండి పుట్తున్నాం? ఎక్కడికి మళ్లీ వెళ్లిపోతున్నాం?
- ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే. మానవులైన మీకెలా సాధ్యమవుతుందయ్యా?
- అన్నీ తెలిసిన మీ వంటి మహానుభావులే అలాగంటే మాబోటి వారికి ఇంక దిక్కెవరు స్వామీ?
ఈ జనన మరణ ప్రభావంలో కొట్టుకు పోవలసిందేనా స్వామీ! తరించే మార్గం లేదా? అంటూ వేసిన ప్రశ్నలకు ఒక పరమ గురువు వల్ల జ్ఞానోదయమైన వేమన పాత్రలో నాగయ్య పలికిన ఆ మాటల్లోనే సంగీతం ధ్వనిస్తుంది బాగా గమనించి వింటే.. అందుకే మాట్లాడే ప్రతి మాటకూ ఒక శ్రుతి ఉంది. దాన్నిబట్టే భావం ఏర్పడేది. ఇంక వేలాదిగా పుట్టుకొచ్చిన వేమన పద్యాలలో వేదాంత సాధనకు తోడ్పడేవి అనేకం.
నా చిన్నతనంలో పల్లెటూళ్లలోని పాఠశాల గోడల మీద ఈ పద్యాలను రాసి ఉంచేవారు.
చీకట్లో చిరుదివ్వె కనిపిస్తే ఎలా వుంటుందో ఈ పద్యాలు చదువుతోంటే అలా ఉండేది.
మనకు తెలియకుండానే బాల్యం నుంచి అలవోకగా అలా అలవాటైన జ్ఞానోపదేశాలే ఈ వేమన పద్యాలు. కూర్చోపెట్టి, ప్రత్యేకంగా బోధించవలసిన అవసరం లేని మంత్ర సమానమైన మాటలు.. అటువంటి వాతావరణం ఈ వేళ దాదాపు మృగ్యం. నాలుగు సార్లు చదివితే చాలు. పిల్లలకు శాశ్వతంగా గుర్తుండిపోయే ఈ పద్య సాహిత్యానికి, వాళ్లను చాలా దూరం చేసేశాం. తెలుగు భాషకు వనె్నలద్దిన శతక సాహిత్యం వంటిది ఏ ఇతర భాషల్లోనూ కనపడదు. పద్యం తెలుగువారి ఆస్తి. వేదాంతిగా యోగి వేమనను అర్థం చేసుకోవడానికి ప్రజలలో వాడుకలో వున్న కొన్ని కథలే కారణం. చిన్నతనంలో వనంలో ఏ లక్ష్యం లేకుండా వేవన జీవితం చాలా బాధ్యతారహితంగానే తిరిగేవాడు. వేశ్యాలోలుడై తిరిగేవాడు.
తల్లిగా ప్రేమించే ఒక్క వదినగారు తప్ప మరెవ్వరూ వేమనను శాసించేవారు లేకపోయేవారు. చివరకు మాయా నాటకం వల్ల వేశ్యా వ్యామోహం నుంచి బయటపడ్డాడు.
రాజదర్బార్‌లో కాలక్షేపానికి జవహరీ, బంగారు నగలకూ సంరక్షకుడిగా ఉండేవాడు. అక్కడున్న వారిలో ముఖ్యుడు అభిరాముడు అనే స్వర్ణకారుడు.
యితను మంచి యోగ సాధకుడు. ఓ మహనీయుడైన గురువుగారి సేవలో నిత్యమూ నిమగ్నుడై వుండేవాడు. ఒకరోజు ఈ అభిరాముడు దివాణానికి రావడంలో ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందని వేమన నిలదీశాడు. గురువు దగ్గర ఆలస్యమైందని చెప్తాడు. గురువు, గురువంటాడేమిటి? ఎవరీ గురువు? అసలు గురువు అవసరం ఏముంది? వెంటనే వేమనలో, ఉత్సుకత బాగా పెరిగింది. గురువంటే ఎలా ఉంటాడో? చూడాలనిపించింది. రహస్యంగా ఒక రోజు అభిరాముణ్ణి వెంబడించాడు. సొరంగం లాంటి గుహలో ప్రవేశించాడు. అంతా చీకటి.
అక్కడ వృద్ధుడైన గురువుకు అభిరాముడు పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. అంతా గమనిస్తున్నాడు వేమన.
అభిరాముడితో, ‘నాయనా! ఇన్నాళ్లూ నాకు నిష్కల్మషంగా నన్ను సేవించావు. ఈ రాత్రి నేను ఈ శరీరాన్ని త్యిజించి వేస్తాను. అర్ధరాత్రి నా దగ్గరకు రా. నీకు ఉపదేశమిస్తాను’ అన్నాడు. వేమనలో ఆసక్తి పెరిగింది. ఉపదేశం అంటే? అది స్వీకరిస్తే ఏవౌతుంది. ఎలా తెలుసుకోవడం? ఆ ఉపదేశం తనకే లభిస్తే బాగుణ్ణు, అనుకున్నాడు. రాత్రంతా అభిరాముడు దివాణంలోనే ఉండి పనిచేసేట్లుగా, తన వదిన కోసం ఒక నగను అత్యవసరంగా చేయాలని బలవంతపెట్టి, అభిరాముడి స్థానంలో తాను వెళ్లి ఆ యోగిని దర్శించి, నమస్కరించి నిలబడ్డాడు... అభిరాముడి స్థానంలో కనిపించిన వేమనకే ఉపదేశం చేసి, శరీర త్యాగం చేశాడు ఆ యోగి.
ఆ మహనీయుని ఉపదేశం వేమన కళ్లు తెరిపించి, యోగి వేమనగా మారిపోయాడనేది ఒక కథ. వేమన మాత్రం తన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ‘అభిరాముడి’ పేరు కూడా లోకంలో నిలిచేలా చేయాలని సంకల్పించి, తన పద్యాలలో చాలా వాటికి ఈ ‘విశ్వదాభిరామ వినుర వేమ’ మకుటంగా ఇచ్చాడు.

- మల్లాది సూరిబాబు 90527 65490