అమృత వర్షిణి

గతం నాస్తి కాదు.. అనుభవాల ఆస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎంచగ భూమియొక్కటే ఏలిన రాజులెందరో’ అంటాడు అన్నమయ్య.
పంచభూతాలకేలాటి మార్పూ వుండదు. ఈ భూమ్యాకాశాలకు లేదు మార్పు - వున్న తేడా అంతా మనిషికే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధన’ అన్నారు.
గొప్పగొప్ప వాళ్లంతా కూడా ఉత్క్రమణానికి బాధపడలలేదు. దానికి బదులు ధర్మసాధనమైన శరీరం లేకుండా పోతోందే అని తపించారట. కాలస్య కుటిలా గతిః అంటాడు వాల్మీకి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కాలం మారిపోతుంది.
ఒక స్థలం ఒక కాలంలో మహాస్వర్గంలా కనిపిస్తుంది.
అదే ఇంకో సమయంలో నరకమై పోతోంది. నరకం అంటే అశాంతి. స్వర్గం అంటే ప్రశాంతి. నిద్రబోతూ కలలు కనేవాడికీ, మతిపోయి పిచ్చిగా తిరిగేవారికీ వైరాగ్య నైరాశ్యాల మధ్య నలిగిపోయే వారికీ కాలం ఒకలా గడవదు. కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు. కానీ మనసును నిరోధించి, నిగ్రహిస్తే చాలు. కాలం స్వరూపం దాని అర్థం తెలుస్తుంది. అప్పుడు మనిషి చేయలేనిది, సాధించలేనిదంటూ ఏదీ వుండదు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఓసారి తన తమ్ముడు ఇంట్లో వివాహం నిమిత్తం ఎట్టయాపురం సంస్థానానికి బయలుదేరారు. సరిగ్గా ఆ సమయంలో కరువు కాటకాలతో వుంది. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు, ఆకలికి మాడుతున్న ప్రజలు దర్శనమిచ్చారు. ఆయన హృదయం ద్రవించింది. చెట్టు క్రింద కాస్సేపు కూర్చుని తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి ధ్యానించి ‘అమృతవర్షిణి’ రాగంలో, ఆనందామృతవర్షిణి, అమృతవర్షిణి అనే కీర్తన గానం చేయటం ఆరంభించారు. అప్పటివరకూ ఒక్క మబ్బు కూడా లేని ఆకాశం కాస్తా కారుమేఘాలతో నిండిపోయింది. కుండపోతగా వర్షం కురవడం ఆరంభమైంది. ఆ నాదామృతంలో చుట్టూ ప్రకృతి పరవశించిపోయింది.
అంతే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పుడు చెప్పండి. కాలం ఎవరి చేతిలో వుంది? ‘ఉపాసన’ అంటే దగ్గరగా వెళ్లి కూర్చోవడం. ఉప అంటే సమీపంలో, అస అంటే కూర్చోవడం. ఉపాసన అంటే తాను పొందతలచిన వ్యక్తి, వస్తువు లేదా శక్తికి సమీపంలో కూర్చుని చూడటమే. క్రమంగా దానితో సామీప్యత వల్ల ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమలో అహంకారం కరిగిపోతుంది. అహంకారమనే గోడ పడిపోతే, కళ స్వయంగా మనలో ప్రవేశిస్తుంది.
అంతేగానీ, తర్కం వల్ల విశే్లషించటం వల్ల గానీ కాదు.
మహత్వ కాంక్ష, సన్మాన దృష్టి, కీర్తికండూతి లాంటివి లేనివాడు సాధించే విజయాలన్నీ అలాగే వుంటాయి.
కళోపాసన చేసేవాడి దృష్టి ఎప్పుడూ కళాసృజనత్వం మీదే ఉంటుంది. ఆనంద రసాస్వాదనంలో భగవంతుడితో ఏకమై పోతాడు - అంతే. తను కోరుకున్నది, భగవత్సంకల్పమై కలుగుతుంటుంది.
నిజానికి సంగీతానికున్న అద్భుతమైన శక్తి అదీ. అటువంటి మహత్తరమైన దాన్ని ఒక కాలక్షేప వస్తువుగా భావించి తృప్తి పడుతున్నాం. 15వ శతాబ్దంలో గిరినార్ ప్రక్కనే వున్న జూనాగఢ్ (పాతకోట) గ్రామంలో సంత్ నర్నీ మెహతా జన్మించాడు. ఆయన గుజరాతీ.
మహాత్మాగాంధీకి బాగా ఇష్టమైన భజన్ ‘వైష్ణవ జనతో తేనే కహియే’ ఆయన రచనే!
కాలయవనుడి గుహలో దహించిన ముచికుందుడే (మాంధార పుత్రుడు) ఈ కలికాలంలో సంత్ నర్నీ మెహతాగా పుట్టాడంటారు. యిప్పటికీ గిరినార్ ప్రాంతంలో దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్రాంతం ముచికుంద గుహ ఉంది. సంగీతం వల్ల సాధ్యం కానిదేమీ లేదు. సంగీత శాస్త్ర జ్ఞానం సంపాదించుకోవడమంటే ఆనందసాగరాన్ని ఈదడమే. దానివల్ల లభించే బ్రహ్మానందాన్ని పొందలేని జన్మ నిరర్థకం. భూమికి భారమంటాడు త్యాగయ్య.
ఉపాధి కోసమో, కడుపు కోసమో అరవై నాలుగు కళలూ నేర్చినంత మాత్రాన స్థాయి పెరగదు. సింగరి అనే మునీశ్వరుడు పెద్ద నువ్వుల గుట్టను కోరి సంపాదించుకున్నాడు. అయితే దాన్నంతా తినగలిగాడా? విభీషణుడు అన్న చేత అవమానం పొంది రాముడి శరణు కోరాడు. గానీ, హనుమంతుడిలా శరణాగతి బుద్ధితో కాదుగా? లంకానగరం మీద ఆశతోనే.
శ్రీరాముడి రూపాంతరమైన రంగనాథుణ్ణి లంక వరకూ తీసుకుపోగలిగాడా? ఉభయ కావేరీల మధ్య అతుక్కుపోయి కదల్లేదు. అందుకు కారణం భక్తిలోపమే. శరణాగతి లేనప్పుడు కళలన్నీ వ్యర్థమే. సంగీత విద్వాంసులు చేసే సంగీత కచేరీలన్నీ నాదోపాసనే ధ్యేయంగా ఉండవు.
వారి దృష్టి శ్రోతలు విని ఆనందించి కరతాళ ధ్వనులు చేస్తారా లేదా అనే దాని మీదే ఉంటుంది. వారు ఒక్కరే ఇంట్లో కూర్చుని పాడుతూ వుంటేనే ఈ నాదానుభూతి తెలుసుకునే అవకాశముంది.
ఏది రాగమో, ఏ తాళమో తెలియకపోయినా ఆనందించటంలో ప్రవృత్తి ఉంటుంది. తెలిసి ఆనందించటంలో మేథ వుంది. అంటే ‘ఇంటెలెక్ట్’. మొదటిది సంశే్లషణ. రెండోది విశే్లషణ. కళను ఆస్వాదించడానికి దాన్ని తెలుసుకోగల బుద్ధి, జ్ఞానం అవసరం లేదు. స్పందించగల హృదయ సంస్కారమే కావాలి. తలకాయలూపేస్తూ వినేవారందరికీ సంగీత జ్ఞానముండకపోవచ్చు. సంస్కారమూ లేకపోవచ్చు. వౌనంగా వినే కొందరికే అది సాధ్యం. నిత్యమూ పోతన భాగవత పారాయణం చేసే త్యాగయ్యకు కనిపించిన మహానుభావులు ఎందరో వున్నారు. పరమ భాగవతులైన దేవతలు, మునులు, కిన్నరులు, కింపురుషులు, విజ్ఞానధనులు.
వీరంతా ఆనందానుభవంతో విజ్ఞానమయ కోశాన్ని సంపూర్ణం చేసుకున్న మహానుభావులు. వారందరికీ భక్త్భివం స్థిరమై అనుభవంగా మారింది. త్యాగయ్య గానం చేసినప్పుడల్లా ఈ మహానుభావులంతా ఆయనకు దర్శనమిచ్చారు.
అటువంటి తెలివిగల మహానుభావులకు ఎవరితోనూ శతృత్వముండదు.
అటువంటి వారి తపోబలం వల్లనే ఈ భూమి ఆధారపడి నడుస్తోంది. వారికి మన, తన అనే తేడా లేదు. అందరూ వారికి స్వజనులే.

- మల్లాది సూరిబాబు 90527 65490