అమృత వర్షిణి

అరుదైన సంగీత రత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్యం తెలియటం, కమ్మగా పాడాలనిపించడం, బొమ్మలు వేయటం మనిషికి సహజంగా పుట్టే లక్షణాలే. ఎరువు తెచ్చుకునేవి కావు.
కళ కళ కోసమే అనే భావన వుంటే, భౌతిక బలమే తప్ప, ఆధ్యాత్మిక బలం వుండదు.
సహజంగా అబ్బిన ఈ అపురూపమైన ప్రజ్ఞ దైవపరం చేస్తే ఇహపర సౌఖ్యాలు రెండూ లభిస్తాయి.
ఈ భూమీద వ్యక్తులెవ్వరూ కలకాలమూ ఉండకపోయినా, వారి జ్ఞాపకాలు నిలిచిపోవడానికి కారణం దైవమే.
ఆంధ్రదేశంలో లబ్దప్రతిష్టులైన విద్వాంసులు లౌకికమైన కోరికలేమీ లేకుండా, వారికి లభించిన ప్రజ్ఞాపాటవాలు సద్వినియోగం చేసుకుని, పాడి వెళ్లిపోయారు. కళ కోసమే బ్రతికారు. వారికున్న పాండిత్యమే వారి ఐశ్వర్యం. అందుకే కాసుల కోసం వెంపర్లాడలేదు. అజ్ఞాత కళాకారులై మిగిలిపోయారు. రాజోలు తాలూకా తాటిపాకలో ‘కొచ్చెర్లకోట రామరాజు’ అనే వయొలిన్ విద్వాంసుడుండేవాడు (1875 - 1946) సాధారణంగా వయొలిన్ కమాను కుడిచేత్తో వాయిస్తూ ఎడమ చేతి వేళ్లతో స్వరాలను పలికిస్తారు. ఈ రామరాజు ఎడమచేత్తో కమాను పుచ్చుకుని కుడిచేతి వేళ్లతో వయొలిన్ వినిపించిన ఘనుడు. కొచ్చెర్లకోట రామరాజు సోదరుడైన రామదాసు గారింట్లో వివాహం సందర్భంగా హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు ఆ వూళ్లో రుక్మిణీ కల్యాణం హరికథ చెప్పినప్పుడు రామరాజుగారి వయొలిన్ వాద్య విశేషాన్ని ప్రత్యక్షంగా తిలకించి ఆ మహా విద్వాంసుణ్ణి మనసారా అభినందించాడు. గజారోహణం చేసినంత సంబరపడిపోయాడు. జీవితం ధన్యమైనట్లు భావించాడు. 15వ ఏట కొచ్చెర్లకోట రామరాజు మచిలీపట్నంలో వుండే చేబ్రోలు వెంకటరత్నం అనే గురువుని ఆశ్రయించి, సంగీతాభ్యాసం చేశాడు. వెంకటరత్నం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, గరిగపర్తి కోటయ్య దేవర శిష్యుడు. ఉభయ భాషా ప్రావీణ్యుడై, సరళీ స్వరాలు నుండి పల్లవి గానం వరకూ నేర్చుకోతగిన అభ్యాస సంగీత విషయాలను వెలువరించి ‘గాయక మనోరంజని’ గ్రంథాన్ని రాశాడు. ప్రధాన మేళకర్త రాగాల్లో వర్ణాలు, స్వరజతులు మరెన్నో కృతులూ రచించిన తెలుగు వాగ్గేయకారుడు. డొక్కా శ్రీరామమూర్తి, నడింపల్లి వెంకట నరసరాజు, బాలమురళీకృష్ణ తండ్రిగారైన మంగళంపల్లి పట్ట్భారామయ్య, మొదలైన వారెందరో రామరాజు గారి శిష్యరికం చేయటం గమనార్హం.
రామరాజుకు సమకాలికుడైన మరో మహా విద్వాంసుడు పట్రాయిని సీతారామశాస్ర్తీ (1900-1957) విజయనగరం సంగీత కళాశాలలో సంగీతాధ్యాపకుల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఒకరు రామరాజు శిష్యుడు డొక్కా శ్రీరామమూర్తి, మరొకరు సీతారామశాస్ర్తీ. 1936లో విజయనగరం కళాశాల ప్రిన్సిపాల్ ఆదిభట్ల వారు, పట్రాయనిని ఎంపిక చేశారు.
సాలూరు చిన గురువని పిలిచేవారు. సంగీత పాఠాలు చెప్పి అందరికీ సుపరిచయమైన వ్యక్తి. సీతారామ శాస్ర్తీ కేవలం గాయకుడే కాదు. మంచి రచయిత, కవి. ఘంటసాల వెంకటేశ్వర్రావుకు గురువుగానే చాలామందికి ఈయన పేరు ప్రసిద్ధం. భారతీతీర్థ సభ వారు 1939లో ‘సంగీతభూషణ’ బిరుదుతో సత్కరించారు. సీతారామ శాస్ర్తీ సంగీతానికి ఒక ప్రత్యేకత వుంది. మాటల చుట్టూ అల్లుకున్న రాగసౌందర్యం ఎలా వుంటుందో చెప్పగలిగి, నాదంలోని రుచి తెలిసిన విద్వాంసుడు కాబట్టే ఘంటసాల లాంటి గాయకుణ్ణి తయారుచేయగలిగాడు.
డిప్లొమాలతోనూ, డిగ్రీలతోనూ ఏ అధ్యాపకుడూ విద్యార్థులను విద్వాంసులుగా తయారుచేయలేరు. లక్ష్య లక్షణాలు తెలియాలి. సోదాహరణంగా పాడి చెప్పగలగాలి.
సీతారామశాస్ర్తీ సహజ కవి. తండ్రి నరసింహశాస్ర్తీ, తల్లి సూరమ్మ. ఇంట్లో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు చాలా బాగా పాడేవారు.
సంగీత కుటుంబం అవ్వటం వల్ల తండ్రిని సాలూరు పెద్ద గురువుగారనీ, సీతారామ శాస్ర్తీని ‘సాలూరు చిన్న గురువ’నీ పిలుస్తూండేవారు.
ఆర్థికంగా ఇబ్బందులున్నా సంగీతం మాత్రం ఉచితంగానే చెప్పేవారు. పట్రాయని శాస్ర్తీ హార్మోనియం వాయించటంలో సిద్ధహస్తుడు. రంగస్థల నాటకాలకు సంగీతం సమకూరుస్తూ, హార్మోనియం సహకారం అందించే వాడు. సీతారామ శాస్ర్తీ సంగీతానుభవంతో వెలువరించిన రచనలన్నీ ఒక ఎతె్తైతే, లలిత రాగంలో ఆయన స్వరపరచిన స్వీయరచన. స్వరజతికి ముగ్ధుడైన ఘంటసాల వెంకటేశ్వర్రావు ‘సారంగధర’ చిత్రం టైటిల్ సంగీతం, ఈ స్వరజతినే వాడారు. సీతారామశాస్ర్తీ కుమారుడైన సంగీతరావు కూడా గొప్ప సంగీత వేత్త. హార్మోనియంలో నిష్ణాతుడు. గురువుగారి పట్ల గల కృతజ్ఞతకు నిదర్శనమా అన్నట్లుగా సంగీతరావును, ఘంటసాల తన వద్దే వుంచుకుని ఆదరించిన మహామనిషి.
ఏ సాహిత్యానికి ఎటువంటి రాగం నప్పుతుందో కూడా తెలియాలి. రాగజ్ఞానం పుష్కలంగా ఉండాలి. ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసేలా ‘సంగీత సాహిత్య సమ్మేళనం’ అనే గ్రంథాన్ని సంగీత లోకానికి అందించిన జ్ఞానిగా కీర్తి సంపాదించిన సీతారామశాస్ర్తీ రచనలు హైదరాబాద్, విశాఖపట్నం రేడియో కేంద్రాల నుండి భక్తిరంజనిలో ప్రసారవౌతూనే వున్నాయి. ఆంధ్రదేశంలో ఉభయ గోదావరి జిల్లాలూ, గుంటూరు, కృష్ణా జిల్లాలూ ఎందరో నటీనటులకు, రంగస్థల కళాకారులకు, మహా విద్వాంసులకూ పుట్టిల్లు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు సమీపంలో జయంతిపురంలో పిరాట్ల శంకరశాస్ర్తీ అనే మహా విద్వాంసుడొకాయన వుండేవాడు. ఆయన పాట ఎలా ఉండేదో, ఎవరికీ ఇప్పుడు తెలిసే అవకాశం లేదు. రికార్డింగ్ సౌకర్యాలేమీ లేని రోజులవి.
సంగీత సంప్రదాయం తెలిసిన కుటుంబంలో పుట్టిన శంకరశాస్ర్తీ (1884-1951) త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన విద్వాంసుడు. 18వ ఏట మద్రాసు వెళ్లి త్యాగరాజు శిష్యుడై వీణకుప్పయ్యర్ పుత్రుడైన తిరువత్తియూర్ త్యాగయ్యర్ దగ్గర సంగీతాభ్యాసం చేశాడు. వీణ, వయొలిన్, మృదంగ విద్యాలు కూడా వాయించగల సామర్థ్యాన్ని సంపాదించిన వాగ్గేయకారుడు. ‘నాదయోగి’ శంకర శాస్ర్తీ దక్షిణాది బాణీని సొంతం చేసుకున్న ఈ సంగీత విద్వాంసుడు రచించిన వర్ణాలు, కృతులు ఎన్నో వున్నాయి. సంగీతం ఆత్మోద్ధరణకు మాత్రమే అని గాఢంగా నమ్మి, చివరి శ్వాస వరకూ గానం చేసి ధన్యుడైన ఆంధ్ర వాగ్గేయకారుడు అద్భుతమైన గాన గంధర్వుడు పిరాట్ల శంకరశాస్ర్తీ. మనసు యొక్క పోకడ, అంటే చిత్తవృత్తిని నిరోధించటమే యోగం. నాదయోగ సిద్ధి లభించటమే ఒక యోగం. ఆ స్థితిలో ఉత్తములైన వారు తమకు లభించినది, పది మందికీ పంచాలనే ఆలోచన తప్ప లౌకికమైన కోరికలు కోరరు. తావివ్వరు. సద్భక్తి, సంగీత జ్ఞానం అనే రెండూ మోక్ష మార్గానికి సుళువైనవని త్యాగయ్య చెప్పినట్లుగా జీవితాలను ధన్యం చేసుకున్న మరో సంగీత విద్వాంసుడు కాకినాడకు చెందిన గాయక సామ్రాట్ మునుగంటి వెంకట రామపంతులు (1902-1964). కాకినాడలో శ్రీరామ సమాజం స్థాపించి అర్హులైన వారికి భోజన వసతి సదుపాయాలన్నీ కల్పించి, సంగీత విద్యాదానం చేసిన మహనీయుడు. ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్ర్తీ, ఆ రోజుల్లో జానపద సంగీతంతో యావత్ భారతావనిలోన ఎనలేని ఖ్యాతిని పొందిన సీత అనసూయలు, కర్ణాటక సంగీత విద్వాంసులలో అగ్రగణ్యులైన వోలేటి వెంకటేశ్వర్లు, పంతులుగారి శిష్యులే.
మునుగంటి వెంకట్రావుగారి సంగీత శాస్త్ర పాండిత్యం ఒక మహాసముద్రం. స్వయంకృషితో, సాధనతో, సంగీత బోధనా పద్ధతులలో, వైవిధ్యాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి.
సాధారణంగా మన జ్ఞాతులలో ఎవరైనా కాస్త పచ్చగా వుంటే, బంధువర్గంలోనే ఈర్ష్య, అసూయలు పుట్తాయి. కానీ ఈ అజ్ఞాత వాగ్గేయకారులందరూ సంగీతం కోసమే బ్రతికారు. అర్హులైన వారికి అందించారు. ఇంతకు మించి ఎటువంటి గుర్తింపు కోసమూ వెంపర్లాడలేదు. అందుకే వారు అజాతశత్రువులు. చరిత్ర ప్రసిద్ధులైన ఈ మహనీయులను తలుచుకోవడం మన కనీస విధి. తిన్నారో లేదో తెలియదు. కుటుంబాలు ఎలా సాగించేవారో తెలియదు. సంగీతమే పరమావధిగా భావించిన ఈ మహనీయుల జీవితాలు ఏ ఒడిదుడుకులూ లేకుండా గడిచిపోయా యనుకోవడానికి వీలులేదు. వారికి సంగీతం ఒక్కటే బలహీనత. మరే బలహీనతలూ లేవు. అందులోనే ఏదో తృప్తిని అనుభవించారు. చివరి రోజుల్లో కొందరు వాగ్గేయకారులు ఆర్థికపరమైన చిక్కులు కూడా ఎదుర్కొన్నారు. కానీ వారి లక్ష్య సాధనకు అవేమీ ప్రతిబంధకంగా పరిణమించక పోవటమే ఆశ్చర్యం.

- మల్లాది సూరిబాబు 90527 65490