అమృత వర్షిణి

మంత్రవౌ మాట.. హృద్యవౌ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో వాక్కును తపస్సుగా వినియోగించిన మహాపురుషులైన వారున్నారు. సర్వసంగ పరిత్యాగులైన యోగుల భాష వౌనమే. అదే వారి బలం. మాటే మన బలహీనత. అందుకే యోగులు ఒక్కసారి తేరిపార మనవైపు దృష్టి సారిస్తే చాలు. మన జాతకాలు చెప్పేయగలరు.
కంచి పరమాచార్యులు, భగవాన్ రమణ మహర్షి వంటి యోగులెప్పుడైనా, చేతికి మైక్ దొరికిందని గడగడా ఉపన్యాసాలు చెప్పగా విన్నామా? అవసరం లేదు. చెప్పరు. వారి దర్శనం ఒక్కటే చాలు. సారాంశాన్ని ఒకటి రెండు మాటల్లో ముగించేసి, చిరునవ్వుతో నిష్క్రమించమంటారు. జాతిపిత మహాత్ముడు కేవలం తన ప్రవర్తనతో, ఈ జాతిని ఎలా సంస్కరించాడో ఎలా నిలబెట్టాడో, వ్యవహారాన్ని ఎంత చాకచక్యంగా నిర్వహించాడో తెలియని వారెవరు? ఆచరణ యోగ్యమైనవే చెప్పాడు. చెప్పిందే చేశాడు. ఖద్దరు కట్టాడు. జనులంతా ఖద్దరు కట్టనారంభించారు. రాట్నం పట్టాడు. జనమంతా రాట్నం పట్టారు. సత్యాగ్రహమన్నాడు. స్వదేశీ ఉద్యమమన్నాడు. ఏ విషయంలోనైనా బలహీనపడ్డాడా? మనకెందుకులే అనుకుని తప్పుకున్నాడా? వ్యవహారం తేలేవరకూ నిద్రపోలేదు - ఎదురొడ్డి పోరాడాడు. జనం నమ్మారు. పాలముంచినా, నీట ముంచినా నీదే భారమని ప్రజలంతా ఆయన మాటకు విలువనిచ్చారు. బ్రహ్మరథం పట్టి ఆయన మనోరథాన్ని నెరవేర్చారు. అందరూ ఏకతాటిపై నిలిచారు. స్వరాజ్యం సిద్ధించింది. ఒక మంచి పనికి విఘాతాలెప్పుడూ ఉంటాయి. విమర్శలూ తప్పవు. కానీ యోగ్యులైన పెద్దలు ఏం చెబుతారో ఏం చేస్తారో ఇతరులు కూడా వారినే అనుసరిస్తారన్న గీతాకారుడి మాటకు సాక్షి మహాత్మాగాంధీ. సమస్యలన్నీ దాటి జాతి బట్టగట్టింది. మనుషులెన్నాళ్లుంటారు? ఆయన తప్పుకోగానే జాతి జారపడటం ప్రారంభించింది. ఎలా? నాలుగు రోడ్ల కూడలిలో కానిస్టేబుల్ రావటం కాస్త ఆలస్యమైతే, మనుషులెలా ప్రవర్తిస్తారో అలా? సన్మార్గంలో నడిపించగల పెద్దలైన వ్యక్తులు జోక్యం చేసుకోకపోయినా పర్యవసానం అదే. దృఢమైన, నిశ్చితమైన, హృదయగతమైన నిజాయితీతో, చెప్పే విషయాలపై లోతైన అవగాహన వుండి కూడా పెద్దలనబడేవారు ఏమీ పట్టించుకోకుండా నిర్లిప్తతా భావంతో వుంటే సమాజం బాగుపడేదెప్పుడు? మనుషులు ఉద్ధరించబడేదెప్పుడు? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం
యథార్థం కొంచెం కటువుగా వున్నా చెప్పే ధోరణి బాగుంటేనే ఫలితం దక్కుతుంది. జన జీవనం జవసత్త్వాలతో వుంటుంది. సత్త్వ రజస్తమో గుణాలు మాటల్లోనే కాదు పాటల్లోనూ ఉంటాయి. పెద్దలైన వారి సుద్దులన్నీ ప్రమాణాన్ని ఆశ్రయించే వుంటాయి. గాలి కబుర్లుండవు, కప్పదాటులు కనిపించవు. అవతల వారి హితం కోరి చెప్పటం వారి ధర్మం. వినకపోతే మన ఖర్మం. జనం సుఖసంతోషాలతో జీవించాలంటే ముఖ్యం నడవడి. ఆశయాలకు తగ్గ ఆచరణ. ప్రాణం పోయినా ఫరవాలేదు. మాటే ముఖ్యం. పరువు మర్యాదలు ముఖ్యం అంటూ చెవిని ఇల్లు కట్టుకుని చెప్పే పెద్దల మాటలకు విలువలుండేవి, ఒకప్పుడు. కుటుంబాల్లో ఏపాటి చిన్నచిన్న తగాదాలు తలెత్తినా, పెద్దల ముందు నిలబడి సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయముండేది. వాళ్లల్లో వాళ్లే సద్దుకుని హుందాగా మళ్లీ యథాస్థితికి వచ్చేస్తూండేవారు. కారణం పెద్దలే. వారి వాక్కే. రైల్లో వెళ్తూంటాం. అక్రమంగా సీట్లను ఆక్రమించి, వెకిలిగా వాగుతూ పక్కవాడు కూర్చునే అవకాశం లేకుండా చేస్తూంటారు. రిజర్వేషన్ చేసుకున్నా కూర్చోలేని ప్రయాణికుణ్ణి గమనించిన, పెద్దలు జోక్యం చేసుకుని చెప్పి చూస్తారు. వినరు. పద్ధతిగా చెప్పినా వినకపోతే లేచి హెచ్చరించి భయపెట్తారు. దారికి రారా మరి? అంతే. కాస్సేపటికి సమస్య సద్దుమణుగుతుంది. అప్పటివరకూ ఇరుకు ఇరుకుగా కూర్చున్న ఆ నలుగురూ ముసిముసి నవ్వులు చిందిస్తూ మరి కాస్సేపట్లో దిగిపోతారు. యథార్థంగా చెప్పాలంటే సమాజంలో జరగవలసిన మార్పు ఇలాగే. కానీ జరగదు. పెద్దలనబడేవారూ, ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారూ చాటుగా బ్రతకవలసిన స్థితి దాపురించబట్టే న్యాయస్థానాలకు పని ఎక్కువై పోయింది. ‘వక్తా శ్రోతా చ దుర్లభా’ వినేవాడికి చెప్పేవాడి పట్ల గౌరవముండాలి. చెప్పేవాడికి వినేవాడిలో వినయం కనబడాలి. వినాలనే సంస్కారముండాలి. సమస్యను ఇచ్చి, దాన్ని తోచిన వృత్తంలో, పూరించే కార్యక్రమం సరసవినోదిని, విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రసారవౌతూండేది. ఇందులో శ్రోతలు పంపిన పద్యాలు చదివేవారు. ఓసారి సరస వినోదిని నేనే చదవాల్సి వచ్చింది. కాస్త సంగీతం మీద దృష్టి ఎక్కువై ఒక పద్యంలో తప్పుగా పాడాను. ప్రత్యక్ష ప్రసారం కదా! సవరించుకునే వీలు లేదు. ఇంట్లో కూర్చుని వింటున్న బాలాంత్రపు రజనీకాంతరావు ఫోన్ చేసి, ‘చూడు! పొరబాటుగా తప్పు పాడితే, మళ్లీ వెంటనే ఒప్పు పాడేసి వుండాల్సింది. అప్పుడు నీ దోషం ఉండదు’ అని సుతిమెత్తగా చెప్పి ఫోన్ పెట్టేశారు. తర్వాత మీటింగ్‌లో మాట్లాడుతూ నాలుగు గోడల మధ్యా కూర్చున్నాం. మనకేం భయం! అనుకోకండి. వినే శ్రోతలకేమీ తెలియదని భావించవద్దు. వాళ్లకంతా తెలుసు సుమా! మనకు తెలిసినది వారితో పంచుకోగలగటమే బ్రహ్మవిద్య - అంటూండేవారు. అధికారి అంటే అందర్నీ తనతోబాటు అందరితోనూ కలుపుగోరుతనంతో కలిసిమెలిసి నడిచేవాడనే అర్థం చెప్పుకుంటే లోక క్షేమం. జనక్షేమం.. పెద్దలనబడే వారెప్పుడూ ప్రమాణాలే ఆదర్శంగా మాట్లాడుతారు. త్యాగరాజంటారు, ‘ఎందుకు పెద్దలవలె బుద్ధీయవు, ఎందుబోదురా రామయ్యా! అందరివలె దాటి దాటి వదరితి.. అందరాని పండాయె గదరా!’ ఈ వేళ లోకంలో ‘పెద్దలు’ అంటే పెడర్థాలు తీసేవారెక్కువయ్యారు. యథార్థాన్ని గ్రహించే వారు తగ్గిపోతున్నారు. వినాలనే బుద్ధి అంటూ వుంటే చెప్పేవారెవరో వుంటూనే వుంటారు. సంగీతమే చూడండి. గతంలో కంటే ఇప్పుడు సంగీతం పాడేవారెక్కువయ్యారు. ఎలాగో అలా పాడేసి పేరు తెచ్చేసుకోవాలనే ఉబలాటం పెరిగింది. నేర్చుకునే అవకాశాలు కూడా పెరిగాయి. కానీ ఏం పాడుతున్నాం? ఎలా పాడుతున్నాం? పెద్దలు, ఈ పాటను అంగీకరిస్తారా? అనే ధోరణి లేదు. ఆత్మవిమర్శ లేదు. ఏమీ నేర్వకుండా పాడేయాలి. సంప్రదాయ సంగీతానికి శాస్తమ్రే ప్రమాణం. సంప్రదాయానికి అనుసరించటం వేరు. తాను పాడిందే సంప్రదాయ మనటం వేరు. రుచికరమైన వంటకు ప్రమాణాలున్నట్లే సంగీతానికీ నిర్దిష్టమైన విధానాలున్నాయి.
శ్రుతిలయలు తెలిస్తేనే సంగీతమవ్వదు. అదో ప్రాథమిక అర్హత మాత్రమే. పొయ్యి మీద పెట్టి ఉడకేసి కాస్త ఉప్పూ కారం చల్లేసి, తినమంటే అది షడ్రసోపేతమైన భోజనమవుతుందా? కడుపు నిండుతుందా? సంగీతమైనా అంతే. పాటకు కూడా అటువంటి హంగులున్నాయి. హద్దులున్నాయి. నియమాలున్నాయి. గొంతులో అందరూ అన్నీ పలికించలేరు. పలికించగలిగిన వాటితో తృప్తి పడి పాడే నేర్పు ఉండాలి. మాటల చుట్టూ ఏర్పడే స్వర వలయంతోనే రాగం ఏర్పడుతుంది.. ‘స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గపవర్గమంటాడు’ త్యాగయ్య.
ఈ రహస్యం తెలిసి పాడాలి. తాళం లేకుండా కీర్తన పాడితే, అదే రాగవౌతుంది. సముద్రం నుంచి వచ్చే కెరటాల్లా రాగ సముద్రంలో నుంచి వెడలి వచ్చేవే మహావాగ్గేయకారుల కీర్తనలు. ఈ వేళ వినబడే ఏ ఒక్క సినిమా పాటైనా, తాళం లేకుండా పాడి చూస్తే చాలు. అందులోని రాగం శాతం ఎంతో తెలిసిపోతుంది. తోడి, ఖరహరప్రియ, కల్యాణి, కాంభోజి రాగంలో ఏ కీర్తనైనా చూడండి. రాగభావం లేకుండా ఒక్క మాట ఉండదు. రాగమే కీర్తన రూపంలో వుంటుంది. రాగం ఏర్పడని పాటకూ మతిలేని మాటకూ పెద్ద తేడా ఉండదు. అందుకే పైడాల గురుమూర్తి శాస్ర్తీ అనే మహానుభావుడు ఏకంగా వేయి గీతాలు సంగీత లోకానికి అందించి, ‘వేయి గీతాల గురుమూర్తి శాస్ర్తీ’గా ప్రసిద్ధుడయ్యాడు. స్వరాలతో ఏయే రాగం ఎలా ఏర్పడుతుందో, ఆరోహణ, అవరోహణ క్రమం ఎలా, ఏయే గమకాలతో కనిపిస్తుందో చెప్పేది గీతం. ఇందులో రాగముద్ర కూడా కలిసి ఉంటుంది. ఒక్కో మాటకు ఎనే్నసి స్వరాలు పాడుతూ పొదగవచ్చునో తెలిపేవి వర్ణాలు. అందుకే వీటిని తాన వర్ణాలన్నారు. త్యాగరాజ కీర్తనలన్నీ సరళమైన తెలుగు భాషలో వున్నవే. వాటి చుట్టూ అల్లుకున్నది, అపారమైన రాగం. భాష తెలియకపోయినా ఆ రాగ మాధుర్యానికి మత్తిల్లిపోయిన వారంతా శిష్యులయ్యారు. తెలుగు నేర్చుకున్నారు. పాడారు. గమకశుద్ధిగా పాడగలిగే వారికి మాత్రమే త్యాగరాజ కీర్తనలోని సంగీత మాధుర్యం తెలుస్తుంది. ఎనే్నళ్లు గడిచినా నిత్య నూతనంగానే ఉండటానికిదే కారణం. వాటిని ఆశ్రయించుకున్న రాగదేవతలు ఆ కీర్తనలతోనే వుంటారు. స్వరానికి రంగుంటుంది. అందుకే స్వర వర్ణాలంటారు. కేవలం ఆరోహణ, అవరోహణలతోనే రాగం ఏర్పడదు. రాగానికుండే హద్దులు, తెలిపే మార్గం మాత్రమే. శారీరం అంటే నిఱ్గఉ, కంఠస్వరంలో త్రిస్థాయిలూ పలకగలిగే గాత్రాలుండి ‘అనుమంద్ర పంచమ స్వర ప్రయోగ స్థాయి’ నుంచి, అతి తారస్థాయి షడ్జ ప్రయోగ స్థాయి వరకూ పలకగలిగే వారివి ‘ఆదర్శ పురుష గాత్రాలు’. మిగిలిన వారివన్నీ మధ్యమస్థాయిలోనివే.
తారస్థాయిలో రాగసంచారం రాక్షసులకు మహా ఇష్టం. మంద్ర స్థాయి పాట మానవులకు ఉద్దేశించబడినది. మధ్యమ శ్రుతి గానం ‘దేవతల కోసమని’ యజుర్వేదం చెప్పిన మాట. వేదాధ్యయనం, సంగీతాధ్యయనం రెండూ పునశ్చరణ ప్రధానమైన విద్యలే.
ఎంత మాత్రమున ఎంతయు దలచిన అంత మాత్రమే నీవు - అని అన్నమయ్య అన్నట్లు ఎలా భావిస్తే, అలాగే వుంటుంది సంగీతం కూడా. ‘రాగ సౌందర్యాన్ని యినుమడింపజేసేవి గమకాలు’. ప్రచారంలో పాడే గమకాలు పది రకాలున్నాయి. కొందరు గాయకులకు కొన్ని గమకాలే పలుకుతాయి. ప్రతి కంఠంలోనూ ప్రతి గమకమూ పలకదు. బుడిబుడి నడకలతో పొడిపొడిగా పాడే ప్రసిద్ధమైన గాయకులూ లేకపోలేదు. వారికి తగ్గ శ్రోతలు వారికుంటారు. కానీ, కొందరి సంగీతం అధ్యయనం చేసి ఆచరణ యోగ్యమై ఉంటుంది. ఆ సంగీతానికి స్థిరత్వం ఎక్కువ. మరి కొందరి సంగీతం వినటానికి పరిమితమై ఉంటుంది. అంతకు మించిన ప్రయోజనమేమీ ఉండదు. చాలామంది గడిచిన తరంలోని సంగీత విద్వాంసులు గాత్ర సౌలభ్యం కలిగి, నేర్చుకోగలిగిన సత్తా వుండి మాత్రమే ఈ సంప్రదాయ సంగీతాన్ని ఆశ్రయించారు. అటువంటి వారి ఆదర్శప్రాయమైన సంగీతమే మరెందరో విద్వాంసుల్ని తయారుచేసి పెట్టింది. భావితరాలు బాగుపడేది ఆ సంగీతంతోనే. కంఠంలో గమకాలు పలకలేనివారు, దివ్యమైన సంగీతాన్ని చిన్నచూపు చూస్తే సంప్రదాయ సంగీతం పెరగదు, పెరగనివ్వదు. హృదయానికి చేరువై ఎన్నిసార్లు విన్నా, మళ్లీ వినాలనిపించే నాదానుభూతి మిగిల్చే పాటే నిత్యం, శాశ్వతం - అది దూరమవ్వరాదు.

- మల్లాది సూరిబాబు 90527 65490