అమృత వర్షిణి
అనుసరణ - అనుకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అన్ని విద్యల కంటే సంగీతమే కాస్త విచిత్రంగా కనిపించి అయోమయంగా ఉంటుంది. అంతా తెలిసినట్లే ఉంటుంది. దిగితే తప్ప లోతు తెలియదు. తెలియని విషయాలేవో అలా మిగిలిపోతూనే ఉంటాయి. తెలుసుకోవటానికి ఒక్క జీవితకాలం సరిపోదు. సాధారణంగా లోకంలో సంపూర్ణ మానవుడెలా కనపడడో సంపూర్ణ సంగీత విద్వాంసుడు కూడా వుండడు. సంగీతమే ఓ అర్థంకాని భాష. బాగా తెలిసిన మాతృభాషలో మాట్లాడటమే కష్టమై పోతున్న రోజుల్లో తెలియని భాష నేర్చుకోవాలంటే ఇంకా శ్రమ పడాలి. ఈ వేళ ప్రతీ విషయం శ్రమ పడకుండా రావాలనే ధ్యాస పెరిగింది. అనుకరించటంలో ఆరితేరిపోయి విన్నది విన్నట్లుగా పాడగలిగే ప్రజ్ఞను ఆసరా చేసుకుని, సంగీతాన్ని ఆపోశన పట్టి, అంతా తెలిసిపోయినట్లుగా భావించే వీర గాయకులకు ఈవేళ లోటు లేదు.
నాకంటే బాగా పాడే విద్వాంసులుండవచ్చు. కానీ నాలా పాడగలిగే వారుండరు అని ఘంటాపథంగా చెప్పిన కర్ణాటక సంగీత విద్వాంసుడు డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఇది ఆయనకే చెల్లు.
రాగాల సృష్టికర్త, రచయిత, సంగీత దర్శకుడు, సర్వ స్వతంత్రుడు, వాగ్గేయకారుడు, సినీ గాయకుడు అపరిమిత మనోధర్మం కలిగిన బాలమురళీ మాట సత్యదూరం కాదు. ఒకప్పుడు బాలమురళీకృష్ణను రోల్ మోడల్‌గా భావించిన కర్ణాటక సంగీత విద్వాంసులున్నారు. కానీ బాలమురళీకృష్ణలా పాడతాడనే విమర్శలు వినగానే క్రమక్రమంగా స్వశక్తితో సంప్రదాయాన్ని దాటకుండా గానం చేయటం మొదలుపెట్టి కృతకృత్యులయ్యారు. యోగ్యత ఒక్కటే కాదు. యోగం కూడా ఉండాలి. ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతూ ‘మీరు సంప్రదాయం కంటే కాస్త భిన్నంగా పాడతారనుకుంటూంటారు చాలామంది. దానికి మీరేం చెబుతార’ని విలేకరులడిగారు. ‘సంప్రదాయమనేది అలవాటుగా వచ్చేది. నేను మరొకరిని అనుసరించను. నేను పాడిందే సంప్రదాయం. మీరెలా భావిస్తే అలా. ఇది శాస్ర్తియమూ కాదు. లలితమూ కాదు. లలిత శాస్ర్తియమూ కాదు. ఇది నా సంప్రదాయం. అందరూ వేరు. నేను వేరు. నా మనోధర్మం వేరు. ఇది నా సంగీతం. బాలమురళీ సంగీతం’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన విద్వాంసుడు డా.మంగళంపల్లి.
దేనికైనా విలువ కట్టవచ్చు కానీ మనసులను దోచేసే మంచి సంగీతానికి నిర్వచనం చెప్పలేం. ఎంత చెప్పినా తక్కువే. రెండు చేతులూ ఎత్తి ఒక్కసారి నమస్కారం చేయటం మినహా ఏమీ చేయలేం. ఎలా పాడారు? ఏం పాడారూ? గురువు ఎవరు? ఎంతకాలం నేర్చుకున్నారనేది వినేవారికి అనవసరం. విన్నదే ప్రధానం,
సంగీత సుధ గ్రంథంలో గోవిందదీక్షితులు వాగ్గేయకారుల, గాయకుల లక్షణాలు చెప్పాడు. గాయకునికి మధురమైన కంఠం వుండాలి. ఉచ్చారణ స్పష్టంగా, నిర్దుష్టంగా ఉండాలి. మూడు స్థాయిల్లోనూ అంటే మంద్ర మధ్యమ తారస్థాయిల్లో, మూడు కాలాల్లో అవలీలగా, గానం చేయగలిగి ఉండాలి. గమకాలపై పూర్తి అధికారం ఉండాలి. పట్టుండాలి. రాగాంగ, భాషాంగ, క్రియాంగ, ఉపాంగ, ఘన రాగాల జ్ఞానం కలిగి ఉండాలి. సంప్రదాయం చెప్పిన దానికి అనుగుణంగా నిత్య నూతన కల్పనా శక్తితో రాగాలు పాడగలిగే శక్తి వుండాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న వారు ఉత్తమ గాయకులు. ఈ లక్షణాలు లేనివారు అధమ గాయకులు. కొన్ని మాత్రమే వున్నవాడు మధ్యమ గాయకుడు. సంగీతరంగాలు వేరైనా, పాడినంత కాలం పసందుగా పాడేసి వెళ్లిపోయిన కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ -సినీ, సంగీత రంగంలో ప్రముఖుడైన గాయకుడు ఘంటసాల - ఈ ఇద్దరూ ఏ కోవకు చెందుతారో వేరే చెప్పనక్కరలేదు. ఎవరికి వారే గొప్ప.
కర్ణాటక సంగీతానికి సినీ గ్లామర్ తెచ్చిన గాయకుడు డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సినిమా సంగీతానికి సంగీత గౌరవం తెచ్చినది ఘంటసాల వెంకటేశ్వర్రావు. మళ్లీ అటువంటి వైభవం ఈ రెండు రంగాల్లో కనిపించటం కష్టమే. ఇటువంటి గాయకులు సమీప భవిష్యత్తులు పుట్టకపోవచ్చు.
ఉత్తమ గాయకులకుండ వలసిన లక్షణాలు చెప్పిన గోవింద దీక్షితులు -గాయకులలో 5 రకాల వారుంటారని చెప్పాడు. వీరిలో 1.శిక్షాకారుడు (క్రమపద్ధతిగా సుశిక్షితుడైన సంగీత బోధకుడు)
2.అనుకారుడు (మరొకరిని అనుసరిస్తూ తన సంగీతాన్ని దిద్దుకునేవాడు)
3.రసికుడు (తన సంగీతంలో రసానికీ మాధుర్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పాడేవాడు.)
4.రంజకుడు (తన గానంతో శ్రోతల హృదయాలను రంజింప చేయటంలో ప్రజ్ఞ గలవాడు.
5.్భవకుడు (అద్భుత కల్పనా ప్రావీణ్యంతో శ్రోతలను క్షణక్షణం ఆశ్చర్యపరుస్తూ ఆకట్టుకునే గాయకులు). అంతేకా రకరకాల అవలక్షణాలతో పాడే గాయకుల్ని పాతిక రకాలుగా చెప్పాడు. దమ్ము పట్టలేనివారు, మాటలను మింగేస్తూ పాడేవారు, సభా పిరికితనంతో పాడేవారు, రాగ స్వరూపం తెలియకుండానే పాడేవారు, ఆరోహణ, అవరోహణ కలగాపులగం చేసేస్తూ పాడేవారు. శ్రుతిశుద్ధత, గాత్ర మాధుర్యం లేకపోయినా గొంతు చించుకుని పాడేవారు, ఇలా రకరకాల గాయకులను ‘సంగీత సుధ’ గ్రంథంలో వివరించాడు.
సంగీతంలోనే కాదు - ఏ విషయంలోనూ సాధారణంగా ఎవరికి వారు వారిలోని లోపాలను, వెంటనే గుర్తించలేరు. అసలున్నాయనే తెలియదు. చెబితే కిట్టదు. సంగీతంలో ఇది సహజం. అందుకే ఎదురుగా గురువుండాలి. సాధారణ గురువు భాస్కరుడితో సమానం. మన ముఖం అద్దంలోనే కనిపిస్తుంది. సద్గురువు అద్దం లాంటివాడు. శిష్యుడు నమ్మితే పర్వత శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోతాడు. అనుమానిస్తే ఉండేది అధః పాతాళమే. గురువు చెప్పకపోయినా తెలియాల్సినవి చాలా వుంటాయి. వాటికోసం ప్రయత్నం చేయరు. డిగ్రీలు డిప్లొమాలు మాత్రమే పాట పాడించేస్తే ఈపాటికి ప్రతి వీధీ, విద్వాంసులతో నిండిపోయి వుండేది. డిగ్రీలు, డిప్లొమోలు ఫొటోలు కట్టించుకుని గోడలకు తగిలించుకునేవే - ఏదో పాడేసి ఎలాగో అలా జనం వినేస్తారనుకోవటం భ్రమ. మహాభక్తులకూ, వాగ్గేయకారులకు డిగ్రీలూ, డిప్లొమోలు ఇచ్చేదెవరు? ఇవ్వగలిగేదెవరు?
24 గంటలూ, సంగీతమే జీవితంగా బ్రతుకుతూ, ‘క్షణక్షణమూ దైవ చింతనతోనే వున్న భక్తుల లక్ష్యశుద్ధే వారి జీవితాలను నడిపింది. లక్ష్యశుద్ధి లేని సంగీతం లక్షణంగా ఉండదు. నిజానికి మనలోనే వున్న పరమాత్మ మెచ్చే కలియుగం కదా! దిక్కుమాలిన అనుమానాలన్నీ మనకే. మహాపురుషులెప్పుడూ సంశయాత్ములు కారు. వారు నిశ్చయాత్ములు. నీవే తప్ప ఇతః పరంబెరుగనని భీష్మించుకుని కూర్చుని ధ్యానమగ్నులై అన్నీ మరచి గానం చేసిన భక్తులకు ఒక్కసారైనా ‘తన రూపం చూపించాలనీ, ఒక్క మాటైనా మాట్లాడితే, సంతోషిస్తాడని ఆ దైవం’ ఒక్కసారైనా భావించకుండా ఉంటాడా.
నిర్వికల్ప సమాధిలో, దైవాన్ని ఆ మహనీయులు దర్శించే వుంటారు. అందుకే మహా పురుషులయ్యారు. వారికి కావలసినది దొరికింది. దాని పేరే మోక్షం.
* * *
లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించటం భావన. రవి గాంచనిచో కవి గాంచునంటారు. నవరసాలను మెప్పించగల నటులుండవచ్చు. కానీ ఆ నటులే పాడుతున్నారనే భావన కలిగించేలా తెర వెనక వుండి పాడటం చాలా జటిలమైన విషయం. స్వేచ్ఛ ఉండదు. స్వతంత్రం ఉండదు. కానీ నిండైన కంఠంతో, ప్రస్ఫుట భావ ప్రకటనతో సుస్వర మాధుర్యంతో ఆయా నటుల్ని తారస్థాయిలో ఉంచిన ఘనత ఘంటసాలకు చెందుతుంది. అదలా ఉంచండి. అసలు సినిమాతో సంబంధం లేకుండా ఎదురుగా ఏదో సన్నివేశాన్ని చూసిన అనుభూతిని తన గానంలో చూపించటం చిన్న విషయమనుకోకండి. పాట వేరు. పద్యగానం వేరు. గాయకులందరికీ పద్యం లొంగదు. తెలుగు భాషలోని తియ్యదనం తెలిసి కమ్మగా పాడిన గాయకుడు, తెలుగు పద్యం ఇలా పాడాలని చెప్పాడు ఘంటసాల. తర్వాత మళ్లీ పద్యానికి ఆ వైభవం తేగలిగిన సమర్థులైన గాయకులున్నారా? అంటే సమాధానం చెప్పటం కష్టం. ఘంటసాల పద్యాలు గురించి పి.బి.శ్రీనివాస్ ‘ఆయన పాడే ఒక్కో గమకానికీ ఒక్కో లక్ష ఇవ్వచ్చుననేవాడు’. ‘అదియొక రమణీయ పుష్పవనము. ఆ వనమందొక మేడ, మేడపై అదియొక మారుమూల గది, ఆ గది తల్పులు తీసి మెల్లగా పదునైదేండ్ల రుూడు గల బాలిక, పోలిక రాచపిల్ల, జంకొదవెడు కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగాన్’ ఈ పద్యంలోని మజా చదివితే తెలియదు. అసలైన సౌందర్యం పాడితేనే తెలుస్తుంది.
నన్నయ నుండి నేటి వరకూ సాగే కవితా స్రవంతిలో తెలుగుదనం కనిపించేది పద్యంలోనే. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ అంతరాత్మ ఆయన కవిత్వంలో ప్రతిధ్వనిస్తే వెళ్లి ఘంటసాల గొంతులో మధురగానమై నిలిచిపోయింది.
ఓ రోజు శాస్ర్తీగారు గుంటూరు అరండల్‌పేటలోని ఒక వీధిలో నడిచి వెళ్తోంటే పసిపిల్లవాణ్ణి ఒళ్లో పెట్టుకుని ఒక తల్లి మెలమెల్లగా అడుగులేస్తూ మేడ మెట్లు దిగి వస్తూ కనపడింది. చుట్టూ విరబూసిన పెద్ద పూలవనం. ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డ కరుణశ్రీ మనసులో ఒక పద్యం పుట్టింది. ‘కుంతీకుమారి’ పద్యకావ్యమయింది. ఆ ప్రేమమూర్తి ఒక్కో మెట్టూ దిగే సన్నివేశం చూడగానే స్ఫురించిన ఈ పద్యాన్ని ఘంటసాల ఖమాస్ రాగంలో చక్కగా మలిచి, తన శ్రావ్యమైన కంఠంలో ఎలా పలికించారో వినే వుంటారు.
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఈ ‘కుంతీకుమారి’ పద్యాలపై ఓ ప్రత్యేక కార్యక్రమం చేశాను కూడా. ‘ఎప్పుడో మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ ఈ పద్యాలు పాడి ప్రసిద్ధుడయ్యాడు. సంగీత కచేరీలో ఈ పద్యాలు అడిగి మరీ పాడించుకుని, ఏడుస్తూ ఇళ్లకు వెళ్లేవారట. ఆ శాస్ర్తీని ఆదర్శంగా తీసుకుని తానే ‘కుంతీకుమారి’గా పరకాయ ప్రవేశం చేసి ఘంటసాల ‘కుంతీకుమారి’ పద్యాలు పాడి పద్యగాన ప్రక్రియలోని అందచందాల్ని సంపూర్ణంగా ఆవిష్కరించి పాడేశాడు. ఈ పద్యంలోని ప్రతి మాట ప్రతి అక్షరం ఖమాస్ రాగంతో నిండి ఉంటుంది. గమనించండి. ఎక్కడ ఏ మాట దగ్గర ఆగినా, ఖమాసే కనిపిస్తుంది - ఘంటసాల గానంలో. ఎక్కడ చూసినా అకారమే గాని, మరే వికారమూ కన్పించదు. ఆయన ఎవరినో అనుకరించే కనక పాడి వుండి వుంటే ఈ వేళ ఇన్ని సంగీత కళాశాలల అవసరం లేదు.