అమృత వర్షిణి
సంగీతకోవిదులు.. త్యాగరాజవంద్యులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలక్షేపం కోసం పాడుకునే గాయకులకూ, పాండిత్యమే ప్రధాన లక్ష్యంగా సాధనా బలంతో రసజ్ఞులను మెప్పించే విద్వాంసులకూ తేడా ఉంటుంది. సంగీతం విద్యగా భావించి సద్గురువుల సామీప్యంలో దేహంలోని శక్తినంతటినీ కరగించి కష్టించి కఠోర సాధనతో సంగీతమే ప్రాణంగా భావించి పాడేవారి ప్రతిభా సామర్థ్యాలు అందరూ గుర్తించలేరు.
కళల పట్ల అభిమానమున్న ప్రతి మనిషీ సహృదయుడని నమ్మటానికి వీలు లేదు. ‘సహృదయమనే’ మాటకు అర్థం.. చిత్ర విచిత్ర విన్యాసాలతో అప్పటికప్పుడు సృష్టించి పాడే సృజనాత్మకతకు స్పందించ కలిగే రసజ్ఞత. రసికత లేనివాడి ముందు సంగీతం, చెవిటివాడికి శంఖమే. అందరికీ పాడగలిగే శక్తి లేకపోవచ్చు. కానీ జన్మతః సిద్ధించేది మాత్రం వినగలిగే సంస్కారం. ముఖ్యం - రసికులు కానివారికి కవిత్వం వినిపించే ప్రారబ్దం తనకు రాకూడదని మహాకవి కాళిదాసు లాంటి వాడు భావించటానికి ఇదొక్కటే కారణం - సంగీత కచేరీలకు జనం వస్తూంటారు. ఒకపక్క ప్రాణం పెట్టి పరవశమై గానం చేస్తోంటే పక్కవాడితో బాతాఖానీకి దిగుతూంటారు - వారివల్ల లోకానికి ఒరిగే ప్రయోజనం సున్నా.
వెనకటి తరంలోని మహావిద్వాంసులు ఆత్మగౌరవానికే ఎక్కువ విలువ నిచ్చేవారు. రసికత లేని వారి చోట పొరబాటున కూడా పాడే ప్రయత్నం చేసేవారు కాదు.
రసజ్ఞులైన శ్రోతలకు మాత్రమే తమ గాంధర్వ గానాన్ని తనివితీరా వినిపించి మహారాజుల సైతం మెప్పు పొందటమే కాదు - వారు పొందే సన్మాన సత్కారాలతో తృప్తిగా వెళ్లేవారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఇంగ్లీషు పాలెంలో పుట్టి పెరిగిన గరికపర్తి కోటయ్య దేవర (1861-1924) అనే మహా విద్వాంసుడుండేవాడు.
ఎక్కడ నేర్చుకున్నాడో ఏమో కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం రెంటిలోనూ పండితుడే. ‘జంగం కోటయ్య’ అని పిలిచేవారట. 1903లో ఆనాటి మద్రాసు బ్రిటీష్ గవర్నర్ ‘యాంపిల్ ప్రభువు, బందరు అధికార పర్యటనకు వచ్చినప్పుడు’ ఈ కోటయ్య దేవర సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఉభయ బాణీల్లో అనర్గళంగా పాడిన కోటయ్య దేవరను ఎంతో మెచ్చుకున్నారు. నాలుగు గంటలసేపు అఖండధారగా సాగిన ఆ సంగీతం విన్న ప్రభువు సైగ చేసి దగ్గరకు రమ్మని, ‘ఎంత బాగా పాడావయ్యా! నీకేం కావాలి?’ అనడిగితే, వెంటనే రెండు చేతులూ జోడించి ‘ఇక్కడ మా వాళ్లు బెజవాడ వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నార’నే ఆవేదన వ్యక్తపరిచాడు. అంతే అడిగిన ఉత్తర క్షణంలో బెజవాడ - బందరు రైల్వే లైను మంజూరు చేసినట్లు పెద్దలు చెప్తారు.
స్వార్థమెరుగని కోటయ్య దేవర లాంటి వాళ్లెవరైనా ఈ రోజు కనిపిస్తారా మనకు? ఒకవేళ ఆయన కోరే వుంటే అప్పటికప్పుడు ఆ గవర్నరు ఏ జాగీరో, ఈనామో మంజూరు చేసి వుండేవాడు. కోటయ్య దేవర, నాదస్వరం, వయొలిన్ వాద్యాలు వాయించటంలో అఖండ జ్ఞానమున్నవాడు. స్వార్థమెరుగని విద్వాంసుడు.
ఆ రోజుల్లో బందరు, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో తిరుగుతూ దేవదాసీ నృత్యాలు చేసేవారికి జావళీలు నేర్పేవాడు. తోట్లవల్లూరు, చల్లపల్లి జమీందారుల సంస్థానాల్లో ఆస్థాన విద్వాంసుడు. ఆ రోజుల్లోనే బందరులో ఒక సంగీత కళాశాల నెలకొల్పి అనేక మంది విద్వాంసులను తయారుచేశాడు. ఒకప్పుడు బందరు మున్సిపాలిటీ వారు కోటయ్య దేవర కాపురముండే వీధికి ఆయన పేరు పెట్టారు. రసజ్ఞతకు నిజమైన అర్థం ఇదే. ‘నాకు సంగీతమంటే చాలా పిచ్చి. వినకుండా ఒక్కరోజుండలేను. నమ్మండి’ అంటూంటారు కొందరు. మరి కొందరు సంగీతం పాడకపోయినా గాయకుడి సమర్థతను కొలుస్తూంటారు. వీరిలో సోత్కర్ష, పరనిందలే ఎక్కువ. కొందరు సంగీతపు లోతులు ఎరక్కపోయినా ఉపన్యాసాలు మాత్రం దంచేస్తూంటారు. మరికొందరు అత్యద్భుతంగా పాడేవారి సంగీతం మెచ్చుకోలేకపోగా లోపాలెక్కడైనా దొరుకుతాయా? అని ఎదురుచూస్తూ ఏ చిన్న లోపం కనిపించినా చాలు. పని మాని, పది మందికీ చెప్పి, చాటేసి ప్రచారం చేసేంతవరకూ నిద్రపోరు. అదో బలహీనత. ఇంకొందరున్నారు. వీరి ధోరణి మరీ విచిత్రం. సంగీత కచేరీ వింటూంటారు. మహావిద్వాంసులు తమ అపారమైన మనోధర్మంతో ఎప్పటికప్పుడు కొత్తకొత్త సంగతులతో, చిత్రవిచిత్ర విన్యాసాలతో ఎదురుగా కూర్చున్న శ్రోతలను రంజింప చేయటమే లక్ష్యంగా గానం చేసే గాయకుణ్ణి పరిశీలిస్తూ, ముఖంలో ఎటువంటి ప్రతిస్పందనా లేకుండా, ఏదో పోగొట్టుకుని వచ్చి తప్పనిసరై బలవంతంగా వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తూంటారు. ఏమి వింటారో తెలియదు. ఆ గాయకుడి పరిస్థితి అప్పుడెలా ఉంటుందో మీరే ఊహించండి. ఇందుకే చాలామంది విద్వాంసులు కళ్లు మూసుకునే పాడుతూ కనిపిస్తారు. వింటే వినండి! లేదా నిష్క్రమించండి అన్నట్లుగానే ఉంటుంది. మీరు గమనించే వుంటారు. నిజానికి తాదాత్మ్య స్థితిలో పాడేవారికి లోకంతో పనిలేదు. నా గురువు వోలేటి వెంకటేశ్వర్లు గానం అలాగే వుండేది. దక్షిణాది విద్వాంసులలో ధనమ్మాళ్ అనే గొప్ప వైణికురాలి పేరు చాలా ప్రసిద్ధం. ఆదర్శవంతమైన సంప్రదాయానికి మారుపేరుగా ధనమ్మను భావిస్తారు. సుఖమైన వాద్యానికి చిరునామా వీణ ధనమ్మాళ్ అని ఆ రోజుల్లోనే ప్రతీతి.
ఇరవయ్యో శతాబ్ది మొదటి భాగంలో అంటే 1900-1930 మధ్యకాలం అప్పటి మద్రాసు నగరంలోని జార్జిటౌన్‌లో ఒక చిన్న సన్నని వీధిలో మంద్రస్థాయిలో వినిపించే వీణానాదంతో, శుక్రవారాల్లో ప్రతి సాయంత్రం, నిశ్శబ్దం ఆవరించేది. వీధుల్లో జనం గోల వినిపించేది కాదు. విమల గాంధర్వ గానం కోసం కేవలం సంగీత జ్ఞానం తెలిసిన రసికులు, విద్వాంసులే వెళ్లి కూర్చుని వినేవారు. వీణావాద్యం తృప్తిగా వింటూ ఆనందించి నిష్క్రమించటమే తప్ప అభిప్రాయాలు పంచుకోవడం, శభాష్‌లతో చప్పట్లు కొట్టడం లాంటి హడావుడి ఏమీ వుండేది కాదు. పొరబాటున ‘ఆహా! ఓహో!’ లాంటివి వినపడితే చాలు. అంతే సంగతులు. ఆ వీణావాద్యం ముగించి లోపలకు వెళ్లిపోయేది.
మన ప్రాంతంలోని సంగీత విద్వాంసులలో అగ్రగణ్యులైన ‘సంగీత కళానిధులు’ డా.శ్రీపాద పినాకపాణి, పద్మభూషణ్ ద్వారం వెంకటస్వామి నాయుడు లాంటి వారంతా ఆ వీణావాద్య నాద సౌరభాన్ని అనుభవించినవారే. అప్పటికే బాగా ప్రసిద్ధులైన ఆ విద్వాంసులు ఆమె వీణాగానంలోని సునిశితమైన సూక్ష్మాంశాలను మనసులో దాచుకుని, మననం చేసుకుంటూండేవారు. దక్షిణాదిలో ఎప్పుడూ సంగీతం వినే అలవాటున్న చాలామంది కేవలం వినికిడి జ్ఞానంతోనే విద్వాంసులైన వారున్నారు. కచేరీలు పాడకపోయినా, పుష్కలంగా సంగీత జ్ఞానం సంపాదించటమే వారి పరమావధి. మనవైపు ఇది దాదాపు మృగ్యం. 1985 ప్రాంతంలో నేను రేడియోలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో జరిగిన సంఘటన. ‘మీకో వ్యక్తిని పరిచయం చేస్తాను. చాలా బాగా పాడతాడు. స్టూడియోలోకి రండి’ అంటూ వోలేటిగారు నేనున్న వివిధభారతి స్టూడియోలోకి వచ్చి తీసుకెళ్లారు.
పెద్ద పారిశ్రామికవేత్తలా కనపడ్డ ఓ వ్యక్తిని పరిచయం చేశారు. ఆశ్చర్యమేసింది. ఈయనేమిటి? పాడటం ఏమిటని మనసులో అనుకుని నమస్కరించి నిలబడ్డాను.
కాసేపు వారిద్దరూ సంభాషించుకున్న తర్వాత వరుసగా, ఒక్కొక్క నిలయ విద్వాంసుడూ ఆయన్ని చూసేందుకు వస్తున్నారు. చిరునవ్వుతో పరిచయ వాక్యాలైన తర్వాత, వోలేటిగారు నాకేసి చూసి తంబురా తెమ్మన్నట్లుగా సైగ చేశారు.
శృతిపక్వంగా తంబురా మీటుతున్నాను. ‘మాళవి’ రాగంలో ఆయన స్వీయ రచన ‘నీదాసుడనే కదా! రామా! రక్షింప రారాదా?’ అద్భుతంగా పాడి వినిపించారు. మాళవి రాగం చిన్నరాగమే అయినా ఎంతో రక్తియైన రాగం. ఈ రాగంలో వాగ్గేయకారులెవరూ ఎక్కువగా కీర్తనలు చేయలేదు. ఆవేళ వేణుగోపాల్ పాడిన కీర్తన ‘మాళవి’లో ‘నెనరుంచినాను యిది న్యాయమా’ వంటి కొన్ని కీర్తనల కంటె భిన్నంగా కనిపించింది. బహుశా ఏ శ్యామశాస్ర్తీయో, ముద్దుస్వామి దీక్షితుల వారో ఇలాగే పాడి ఉండి ఉంటారేమో? అనిపించింది నాకు. ‘లా’ చదువుకుని ఒక బహుళ జాతి సంస్థకు చైర్మన్‌గా ఉన్న వ్యక్తికి సంగీతం పట్ల వున్న అభిరుచి స్థాయికి ఆశ్చర్యం కలిగింది.
దక్షిణాదిలో సాధారణంగా సంగీత కచేరీలు వినని వారు ఎవరూ ఉండరు. రోజూ సంగీతం వినే ఇళ్లకు వెళ్తారు. దశాబ్దాలుగా ఎప్పుడూ విన్న కీర్తనలే వింటారు. విన్న రాగాలే వింటూంటారు. కానీ, వాటిలో కొత్తదనాన్ని వెదుకుతూంటారు - ఎంత విన్నా విసుగనిపించదు వారికి. గాయకులలో నవ్యత, నాణ్యత ఆశిస్తూంటారు.
అక్కడ వినేవారి స్థాయిని బట్టి పాడేవారి స్థాయి ఉంటుంది.
వినేవారి అభిరుచిని బట్టే పాడేవారి సామర్థ్యం, పెరుగుతుంటుంది. శ్రోతల స్థాయికి దిగిపోయి పాడరు. వారి స్థాయిని పెంచుతూ ఉన్నత స్థితిలో ఉత్తమ ప్రమాణాల కోసం వెంపర్లాడే దక్షిణాది విద్వాంసుల గౌరవాన్ని అందుకున్న వేణుగోపాల్ సంగీత నేపథ్యమే ఆయనను వాగ్గేయకారుణ్ణి చేసింది.
సంగీత కచేరీలు చేయకపోయినా, మహావిద్వాంసులతో సమాన స్థాయిలో జ్ఞానాన్ని సొంతం చేసుకున్న అరుదైన వ్యక్తి. కర్ణాటక సంగీత విద్వాంసులలో అద్భుతమైన మనోధర్మంతో పాడగలిగిన వారిలో రామ్నాడ్ కృష్ణన్ ఒకరు. పి.ఎన్.రాఘవరావు, ఎన్.ఎం.నారాయణ్ వంటి అత్యుత్తమ సంగీత రసికుల సాహచర్యం వేణుగోపాల్‌ను గాయకుణ్ణి చేసింది. కేవలం సంప్రదాయ సంగీతం మాత్రమే వినే రసికులు మద్రాసు మహానగరంలో ఓ చోట చేరి, విద్వాంసుల్ని పిలిచి, వయొలిన్, మృదంగ సహకారాలేమీ లేకుండా పాడే సంప్రదాయం ఉంది. రామ్నాడ్ కృష్ణన్ ఇంట్లో జరిగే ఛాంబర్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చుని ప్రముఖుల గానం వినే అలవాటుతో స్వయంగా కీర్తనలు రాసుకుని పాడే స్థాయికి చేరుకున్నారు.
వేణుగోపాల్‌కు అలా పరిచయమైన వారిలో ‘సంగీత చూడామణి’ వోలేటి మఖ్యుడు.
దక్షిణాదిలో ఆ రోజుల్లోనే వేణుగోపాల్ కీర్తనలు ముచ్చటపడి పాడిన వారిలో ‘్భరతరత్న’ శ్రీమతి సుబ్బులక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి, డి.కె.పట్టమ్మాళ్, డి.కె.జయరామన్, లాల్‌గుడి జయరామన్, నారాయణ స్వామి, టి.ఎం.త్యాగరాజన్, బృంద ముఖ్యులు.
వీణధనమ్మాళ్ సంగీత సంప్రదాయంలో బృంద, ముక్తలు, తరుచుగా, సంగీత సమావేశాలు నిర్వహిస్తూ వోలేటిని ఆహ్వానించి గంటల తరబడి వినేవారు. వేణుగోపాల్ గానశైలిని విన్న సంగీత కళానిధి డా.పినాకపాణి కావాలని ముచ్చటపడి ఆ కీర్తనలకు స్వరలిపి రాయటం విశేషం.
సంగీతమూర్తి త్రయం - త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, దీక్షితులు మువురూ వారి రచనలకు రాగ నిర్ణయం చేసుకుని పాడారు. ఏయే సంగతులకు ఏయే మాటలు బాగా అమరి ఆనందాన్నిస్తాయో, భావాన్ని వ్యక్తీకరిస్తాయో తెలిసిన మహానుభావులు.
దశాబ్దాలుగా వింటున్నా విసుగు తెలియని కీర్తనలవి - కల్యాణి, కాంభోజి, ఖరహరప్రియ, తోడి, శంకరాభరణం లాటి ప్రధాన మేళకర్త రాగాల్లో ఈ మహానుభావుల కీర్తనలు పాడుకోవటానికి ప్రధాన కారణం, ఆయా రాగాలకున్న అపరిమితమైన విస్తృతి - పరుసవేదిలా ఈ రాగాలు ఎంత పాడినా యింకా పాడాలనిపించేలా వుంటాయి. ఒక కీర్తనకూ మరొక కీర్తనకూ సంబంధం వుండదు. ప్రతి కీర్తనా ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందుకే తృప్తిపడని ఆ వాగ్గేయకారులు, ఒకే రాగంలో లెఖ్కకు మించి, కీర్తనలు రాసి పాడుకున్నారు. అంతేకాదు, ఒకే మూసలో కీర్తనను బిగించేసి పాడేస్తే అందులో నవ్యత, నాణ్యత రెండూ వుండవు. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా పాడిందే పాటలా వుంటే అసలుకే ఎసరై సంగీతమే విసుగు తెప్పిస్తుంది. పాడటంలో కొత్తదనం కనిపించాలనే భావంతో వ్యక్తిగత మనోధర్మానికి అవకాశం కలిగిస్తూ, స్వేచ్ఛగా పాడుకునే సదుపాయాన్ని సంగీతమూర్తులు ముగ్గురూ ఈ సంగీత లోకానికిచ్చిన పెద్ద వరంగా ప్రసాదించారు.
ఏమి పాడినా, ఎలా పాడినా భావమే అంతిమ లక్ష్యంగా ఆ గానం ఉండాలి. ఆవేదనా భరితమైన కీర్తన పాడి ‘నువ్వా నేనా?’ అనే రీతిలో నెరవు పాడేసి, చిత్తం వచ్చిన పద్ధతిలో మృదంగ విద్వాంసుడి కోసమో ఉపప్రక్క వాద్యాల సమ్మేళనంతో కుస్తీలు పట్టినట్లుగా రకరకాల విన్యాసంతో స్వరకల్పనతో చిత్రవధ చేసేసి పాడేస్తే వాగ్గేయకారుడి మనోగతం మరుగున పడి విన్యాసాలొక్కటే మిగుల్తాయి. ఇనుము అమ్మే దుకాణాల్లో ఈగలుంటాయా? అనుభవం పండిన జ్ఞానంతో రాగ భావం తెలిసి, దానికి తగ్గ సాహిత్యాన్ని తయారుచేసుకుని, విద్వత్ ప్రకాశంతో నాదమయ లోకంలో విహరిస్తూ హాయిగా పాడేలా వుండే వేణుగోపాల్ కీర్తనలు ఎన్నో విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన ‘సంగీత శిక్షణ’ కార్యక్రమంలో (లైవ్) వోలేటి అధ్యాపకుడై నేర్పారు.
ఏ వాగ్గేయకారుడికీ తీసిపోని స్థాయిలో అత్యంత రాగవైభవాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఆయన కీర్తనలు, దేనికదే సాటి. భైరవి రాగంలో శ్యామశాస్త్రుల వారి స్వరజతికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో వేణుగోపాల్ శ్రీకామాక్షి కీర్తన వోలేటి నిర్వహణలో ఆయనకెదురుగా కూర్చుండి నేర్చుకున్నాను.
మాళవి, నాగస్వరావళి, బేగడ, షణ్ముఖప్రియ, తోడి రాగాలలోని వేణుగోపాల్ కీర్తనలన్నీ ఆయా రాగ సౌందర్య వైవిధ్యమైన రీతిలో వుండటం గమనార్హం. దక్షిణాదిలో మహావిద్వాంసులెందరో ఈ కీర్తనలకు ప్రాణం పోసి పాడుతున్నారు. అపర ‘త్యాగరాజని’ పేరు - శ్యామశాస్ర్తీ, ఆయన పుత్రుడు సుబ్బరాయ శాస్ర్తీ వంటి వారి శైలిలో సాగే వేణుగోపాల్ కీర్తనలన్నీ సర్వ గమక సహిత సౌందర్యంతో నిండి సంగీత ప్రియులకు లభించిన దివ్యమైన ‘సుస్వర నిఘంటువులు’ సుమధుర నాద సుధా బిందువులు. విద్వాంసులకే విద్వాంసుడైన ‘సంగీత కళానిధి’ డా.శ్రీపాద పినాకపాణి వేణుగోపాల్ కీర్తనలకు స్వరలిపి తయారుచేయటం ఆయనకు ఈ కీర్తనల పట్ల గల గౌరవానికి చిస్నం.
సునిశితమైన పరిశీలన, సంప్రదాయ సంగీతం పట్ల సదవగాహన, మరో విద్వాంసుణ్ణి మెచ్చుకోగల హృదయగతమైన సంస్కారంతో ఉత్తమ వాగ్గేయకారుడైన వేణుగోపాల్ సంగీత లోకంలో గుర్తింపు తెచ్చుకోవటం అరుదైన విషయం.