అమృత వర్షిణి

‘ధర్మజీవనానికి దారి.. ఒక్కటే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి అనేక ఒత్తిడులకు గురవుతూ బ్రతుకుతున్నాడు. అన్ని భౌతిక, మానసిక ఒత్తిడులూ ఏదో ఒక రూపంలో బయటపడుతున్నాయి.
రక్తపోటు (Blood Pressure), నరాల బలహీనతలు (cardio vascular diseases), ఉబ్బసం (Asthama) మొదలైనవన్నీ మానసిక చింతలు, ఆతృతలు, ఒత్తిడుల కారణంగానే పుడుతున్నాయంటున్నారు డాక్టర్లు.
శరీరానికి ఒక పరిధి ఉంది. పరిధి దాటితే శక్తి సన్నగిల్లి చేసే పనుల్లో సమతూకం దెబ్బతింటుంది.
ప్రపంచంలో దాదాపు నూటికి నూరు శాతం మానసికమైన ఒత్తిడికే లోనవుతున్నారనేది అధ్యయనంలో తేలిన విషయం. కారణం ఇరుకైన ఆలోచనలు - ఠీవిగా నడవలేని మార్గాలు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ చింతించటం, లేదా జరగబోయే దాన్ని ఊహిస్తూ ఏడవటం లాంటి మనో వ్యాకులతలు పెరిగిపోతాయని అనుభవజ్ఞులు చెప్పే మాట.
సామాజిక జీవన విధానంలోని మార్పులు, బుద్ధికి తోచి చేసే పనులు, ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం లేకపోవటం మూడు కారణాలు.
దీనికి పరిష్కారం లేదా బయటపడే మార్గాలేమైనా ఉన్నాయా?
మనసు నిల్ప శక్తి లేకపోతే
మధుర ఘంట విరుల పూజేమి చేయును?
అన్నాడు త్యాగరాజు. మాయంతా మనస్సుతోటే..
‘తిరుగు ప్రయాణం టిక్కెట్ వెయిటింగ్‌లిస్టులో ఉంది. దర్శనమై దిగి తిరుపతికి రాగానే టిక్కెట్ నిర్ధారణ కాకపోతే వెళ్లేదెలా? ఉండిపోయి చేశేదేమిటి? అనే వ్యాకులతే గాఢంగా బుర్రలో ఉంటే తిరుపతి క్షేత్ర దర్శనంలోని ఆనందం రవ్వంతైనా మిగులుతుందా! చెప్పండి?
మా బంధువు ఒకాయనున్నాడు. ఆహార విహారాలలో అత్యంత నియమనిష్టలతో నడిచేవాడు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా వాటికి ఏమాత్రం ఆ నియమాల్లో తేడా వచ్చినా, భంగం కలిగినా తట్టుకోలేకపోయేవాడు. అనుకూలమైన భార్యను చిత్రవిచిత్రంగా ఇబ్బంది పెడుతూ, తను చెప్పిందే వేదమంటూ మూర్ఖంగా వాదించేవాడు. ఆయన బాధపడలేక ఆమె ఆరోగ్యం పాడైపోయిందే తప్ప ఆయనలో కించిత్ మార్పు లేదు. ఆయన దృష్టి అంతా ఆహార విహారాలపైనే ఉండేది ఇంకెందుకా క్షేత్ర దర్శనం? ఏం ప్రయోజనం?
నేను నమ్మినదే సిద్ధాంతమంటారు కొందరు. నువ్వు సత్యంగా నమ్మినంత మాత్రాన అసత్యం సత్యమై పోతుందా? మనం మాట్లాడే మాటల్లోని లోపం నిజానికి మనకే తెలుస్తుంది.
కానీ స్వీకరించటానికి అహం అడ్డు వస్తుంది. నలుగురు ముందు అవమానమని భావిస్తారు. అందుకే కొందరు అబద్ధాన్ని నిజమని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
ఆస్కార్ వైల్డ్ ప్రపంచంలోని మనుషులను రెండు రకాలుగా విభజించి చెప్పాడు.
తాము ఎక్కడుంటే అక్కడికే వచ్చి తమతో సత్యం నిలబడాలనే వారు మొదటి రకం. వీరే ఎక్కువ. ఇక రెండవ రకం ‘సత్యం ఎక్కడుంటే అక్కడే నిలబడాలని భావించేవారు. ప్రపంచంలో వీరి సంఖ్య చాలా తక్కువ.
వరసగా ఉపవాసాలు చేస్తూ పోతే నాలుగైదు రోజులకు అసలు ఆకలే ఉండదు. దాని గోడు మనం వినకుండా ఉంటే చాలు.
కొన్నాళ్లకు అదీ రాజీకొచ్చేస్తుంది. శుద్ధమైన మనసు కోసం, శుద్ధాచరణతో తృప్తి పడి పరమాత్మ ధ్యానంలో ఆకలినే పోగొట్టుకున్న సాధకులున్నారు లోకంలో.
మాయ మాటలు, మాయ జీవనం, మిధ్యావాదంతో బ్రతికినన్నాళ్లూ బ్రతుకుతారు. వల్లకాని పరిస్థితులు ఏర్పడిన తరువాత చతికిల పడి నవ్వుతూ చూస్తూ ... వేదాంత వచనాలు మాట్లాడుతారు.
‘‘అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల?’’ ఉత్తమ పురుషులనిపించుకోవటానికి ఈ రోజుల్లో సాధన చేస్తే సాధ్యం కాదు.
మనకేదైనా తాళంచెవి దొరికిందనుకోండి. అది ఏ తాళం తెరవటానికి ఉపయోగపడుతుందో మనకు తెలియదు.
అది భూగృహంలో ఉన్న పెద్ద ఖజానాకు వేసిన తాళం కావచ్చు లేదా డబ్బు, నగా నట్రా దాచిన ఇంటివి కావచ్చు. తెలియనంత వరకూ ఆ తాళం చెవి మన దగ్గర ఉన్నా ప్రయోజనం సున్నా.
సంగీత విద్వాంసులెందరో ఉన్నారు. త్యాగరాజస్వామి ఆదిగా గల మహా వాగ్గేయకారుల కీర్తనలు పాడుతున్నారు. ఆ వాగ్గేయకారులకు లభించిన నాదానందంలోని సుఖం పాడే విద్వాంసులందరికీ లభిస్తోందా? త్యాగరాజ కీర్తనలైతే బాగా దంచి పాడగలం. కానీ ఆయనలా జీవించలేం.
త్యాగయ్య వద్దనున్న తాళం చెవితో ఆనందసాగరం మీద గల శక్తి ఆయనకు కైవసమైంది.
కానీ భరించే మార్గాన్ని తెరవగల తాళాలు సంగీత విద్వాంసులందరి దగ్గరా ఉండవు.
ఎవరెస్టు శిఖరం అత్యంత ఎత్తయినదని అందరికీ తెలుసు.
ఆ శిఖరాన్ని సమీపించే మార్గాలనేకం. సాధకులు చేసే సాధన బట్టే, ఫలితం దక్కి తిన్నగా వెళ్లి త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. మిగిలిన వారు దణ్నం పెట్టి ఊరుకుంటారు. సంగీత శిఖరమైనా అంతే.
జీవనయానమైనా... అంతే.
ఇలా నడవమనీ, ఇలా జీవించమనీ చెప్పడానికే మహా పురుషులు పుట్టారు.
రాజమార్గాన్ని ఎంచుకుని, అలాగే నడవమన్నారు. తెలివైన వారు ఆచరించే ప్రయత్నం చేస్తారు. లేని వారు ఇతరులను చూసైనా నేర్చుకుంటారు. రెండూ సాధ్యం కాని మిగిలిన వారు కర్మ భ్రష్టులై దేనికీ చెందకుండా మిగిలిపోతారన్న ఉపదేశంతో.
త్యాగయ్య మనస్సంబోధన చేసుకున్న కీర్తన
‘‘చక్కని రాజమార్గమే యుండగ
సందుల దూరనేల ఓ మనసా’’
రాజమార్గాన్ని వదిలి వెళ్లే వారికి నడిచే వారికి కనిపించే మార్గాలన్నీ ఎగుడుదిగుడుగానే ఉంటాయి.
అ॥ చిక్కని పాలు, మీగడ యుండగా
ఛీ యను గంగా సాగరమేలే॥ చక్కని
(గంగా సాగరమంటే కల్లు లేదా మద్యం)
చ॥ కంటికి సుందర కరమగు రూపము ము
క్కంటికి నోట చెలగే - నామమే త్యాగరా
జింటనే నెలకొన్న - దైవమే ఇటు
వంటి శ్రీ సాకేత - రాముని భక్తియనే॥
చక్కని రాజమార్గమే యుండగ
సందుల దూరనేల మనసా॥
శంకరుణ్ని మాత్రమే తలిస్తే శైవం. విష్ణుమూర్తిని తలిస్తే వైష్టవం. నుదుటిపై ఒకరికి విభూతి రేఖలు.. మరొకరికి తిరునామం... ఇందులో రహస్యం ఒకటుంది. శంకరుడి జిహ్వాగ్రంపై ఉండేదీ, నిలుపుకునేదీ... రామ నామం.
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయగ్‌ం శివః॥
ఇప్పుడు చెప్పండి ఇంక మతబేధాలకు తావెక్కడ?
చక్కని రాజమార్గాన్ని వదలనేల? ఇరుకు సందుల్లో తిరుగనేల?
* * *
చక్కెర మాని వేము తినజాలినకైవడి మానవాధముల్
పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లుకాదయ
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ రుూవలెన్
దక్కిన మాటలేమిటికి దాశరథీ! కరుణా పయోనిధి?
భక్తులు, భావాలు పంచుకుంటారనేందుకు ఉదాహరణగా నిలిచే దాశరథీ శతకంలోని పద్యం ఇది.
బ్రతుకు తెరువు మార్గాన్ని బాగా బోధించిన భద్రాచల రామదాసు త్యాగయ్యకు ఆదర్శమవటంలో ఆశ్చర్యమేముంది?

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656