అమృత వర్షిణి
నరులను నమ్మితె నరజన్మమీడేరునా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భద్రాచల రామదాసు 387 జయంతి సందర్భంగా..
*
ఈ కాలంలో పొరబాటునో, గ్రహపాటునో చెఱసాల పాలై దారీ తెన్నూ తెలియని సమయంలో ఒక్కసారిగా వైరాగ్యమావరించి పరమభక్తులైపోవటం చాలా అసాధారణం. పైగా ఈ కలియుగంలోనా? అసలూహించలేం.. కానీ అలాంటివారు ఈ పుణ్యభూమిలోనే పుట్టారు. చరిత్ర పురుషులై కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా జీవించారు. జీవన్ముక్తులై చిర యశస్సుతో నిలిచిపోయారు.
భద్రాచల రామదాసు ఆ కోవకు చెందిన రామభక్తుడు. త్యాగరాజాది వాగ్గేయకారులందరి కంటే ముందరి వాడు. త్యాగయ్య తల్లి, నిత్యం రామదాసు కీర్తనలు పాడేది. త్యాగయ్యను పాడమనేది. తెలిసీ తెలియని వయస్సులోనే రామభక్తిని ఒంట పట్టించుకున్న త్యాగయ్యకు స్ఫూర్తినిచ్చినవాడు భద్రాచల రామదాసు.
గొప్పతనము మనదని మదమెప్పటికిని తలకెక్కి
తప్పు పలుకులాడుచు తానుప్పతిల్లుచు
తెప్పున ఇంగిత మెరుగక మెప్పులకాసించే యా
చప్పని ప్రభువుల కడకును- త్రిప్పటవేలరాయనుచును
గట్టిగాను నను చేయి పట్టేదెన్నటికో
అని ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకున్నాడు.
భద్రాచల రామదాసు చేసిన ఆర్థిక నేరాలు లాటివేమీ త్యాగయ్య చేయలేదు. రాముడికి గుడికి కట్టాలన్న బలమైన కోరిక, ప్రభువుల దృష్టిలో నేరమేగా? అనువుగాని చోట అధికులమనకూడదని భావించలేకపోయాడేమో! పరిస్థితులు అటు ప్రభువులకూ, యిటు రామదాసుకూ కూడా అనుకూలించలేదు. చెఱసాల తప్పలేదు. ఏ కారణం వల్ల తాను బందిఖానాకు పరిమితమవ్వవలసినదో, దానికి మూలకారణాన్ని పట్టుకున్నాడు. రామదాసు దృష్టిలో అది నేరంలా కనబడలేదు. వైరాగ్యం ఆవరించింది. నిజం తెలిసింది. జైలు జీవితం తప్పదనుకున్నాడు. పరీక్షిత్తులా తరించే మార్గాన్ని పట్టుకున్నాడు.
కలడందురు దీనుల యెడ
గలడందురు పరమయోగి గణముల పాలన్
గలడందురన్ని దిశలను గలడు
గలండనెడు వాడు.. గలడో లేడో..
అనే సందేహంగానీ, అనుమానం గానీ ఏమీ లేకుండా గట్టిగా ఆ రాముణ్ణే నమ్ముకున్నాడు. జైలులో భటులందించే చిప్పకూడు తిన్నా తినకపోయినా రామధ్యానతత్పరుడై, హాయిగా అంతర్ముఖుడై పాడేసుకుంటూ బ్రతికాడు. రామనామగానమే జీవితంగా సాగుతుండగా ఆయన ‘ఆర్తి’ ఎవరికి చేరాలో వారికే చేరింది. విముక్తడయ్యాడు. ఆయన సంగీత విద్వాంసుడా? కాదా? అనే మీమాంస కాదు.. దివ్యమైన సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని, సర్వస్య శరణాగతితో తిన్నగా మోక్షమార్గాన్ని చేరుకున్నాడు.
దీనస్థితిలో ఎలా చెఱసాలలో ప్రవేశించాడో, అదేస్థితిలో రామ కథా సుధారస పానంతో పునీతుడై, రామనామ స్మరణ చేస్తూ విడుదలై బయటకు వచ్చాడు. ఆయన కళ్ళలో ఆనంద భాష్పాలే తప్ప మరే వికారాలు లేవు. భక్తి భావం ఉట్టిపడేలా, పరమ భక్తాగ్రేసరుడై కనిపించాడు.
అంతేకానీ, అదేదో.. దిగ్విజయ యాత్రను ముగించుకుని వచ్చే వీరునిలా జయ సంకేతంతో రెండు చేతులూ ఊపుతూ అభివాదాలు చేసుకుంటూ కాదు. తప్పుచేశాడని నిరూపితమై బందిఖానాలో కూర్చుంటే రావలసినది దుఃఖం లేదా పశ్చాత్తాపం. సిగ్గు, లజ్జ సహజం. పొరబాటున వైరాగ్యం ఏర్పడితే అదో శుభ పరిణామం. కానీ నవ్వుతూ, నలుగురికీ అభివాదం చేస్తూ వస్తే మాత్రం ఆశ్చర్యం, లోక విరుద్ధం. అక్రమంగా నడిచినా, తప్పుడు పనులు చేసినా నిర్భీతిగా నడవమని చెప్పే సంకేతమన్నమాట. పరమ భక్తుడైన భద్రాచల రామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న మన రాష్ట్రం వాడే. ఓ సంస్థానంలో అధికారిగా పనిచేసినవాడే. కానీ ఎందరికి ఆదర్శంగా నిలిచాడో ఒక్కసారి ఆలోచిస్తే.. నామ జపానికున్న విలువ ఏమిటో తెలుస్తుంది. రామచంద్రుని దర్శన భాగ్యం కోసం త్యాగయ్య 96 కోట్ల రామనామ జపమే చేశాడు. అది మంత్రం కాదు. భద్రాచల రామదాసు..
శ్రీరామ నీ నామమేమి రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
అన్న రామనామ స్మరణతోనే తరించాడు.
మంత్రానికి నిష్టకావాలి. నామజపానికి నిర్మలమైన మనస్సు చాలు.
తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
మీఱిన కాలుని దూతల పాలిటి మృత్యువెయని నమ్మర యన్నా॥
అనుకుంటూ ఆ రామచంద్రుణ్ణి తన హృదయంలోనే స్థిరంగా నిలుపుకుని నిశ్చింతగా జీవించాడు ఆ మహానుభావుడు.
తక్కువేమి మనకూ రాముండొకడుండువరకూ.. ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియై సాకుచుండగ అనే ధైర్యంతోనే బ్రతికాడు.
రామదాసులాంటి రామభక్తునికి సంభవించిన కష్టాలకు తోటి జనం దుఃఖించారు. రామదాసు చరిత్ర అనే పేరుతో వెలువడిన యక్షగానాలు లేక హరికథలలో కలిసిపోయి ఆయన కీర్తనలన్నీ బహుళ ప్రచారమయ్యాయి. రామదాసుకు సమకాలికుడూ, శిష్యతుల్యుడూ అయిన భద్రగిరి యాదవ దాసు, ఆ తర్వాత వచ్చిన కృష్ణదాసు, తూము నరసింహదాసు, శింగరి దాసులు, రామదాసుగారి మార్గంలోనే కీర్తనలు రాశారు. భద్రాచల రామదాసుకు రాముని సన్నిధి, రూపగుణ స్తుతులు అంతిమ ధ్యేయమైతే రామదాసును స్ఫూర్తిగా తీసుకున్న త్యాగయ్యకు నాదం బ్రహ్మమూ, రెండూ రామచంద్రుని ప్రతిరూపాలు.
రామమందిరం లేని గ్రామం గానీ, రామదాసు కీర్తనలు పాడలేని భజన బృందాలుగానీ, ఎక్కడా ఉండవు. రామదాసు పుట్టి నేటికి కొన్ని శతాబ్దాలు గడిచినా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఆయన కీర్తనలు. ఏమాత్రం కనీస సంగీత జ్ఞానం ఉన్నా, లేకున్నా ఆర్తిగా గొంతువిప్పి పదిమందితో గొంతుకలిపి పాడుకో తగ్గ కీర్తనలు రామదాసువి.
‘సంగీత కళానిధి’ డా॥ నేదునూరి కృష్ణమూర్తి స్వరపరిచి ఎంపిక చేసిన తొమ్మిదింటిని రామదాసు నవరత్న కీర్తనలుగా వందలాది కళాకారులు, విద్వాంసులు కలిసి ఆలపించే తరుణం మరో నాలుగు రోజుల్లో రాబోతోంది. నేండ్రగంటి కృష్ణమోహన్ అనే మరో రామభక్తుడు తన భజస్కంధాలపై ఉంచుకుని నిర్వహించే బృహత్తర కార్యక్రమం రామదాసు జయంతి. గత పదిహేను సంవత్సరాలుగా భద్రాచలంలోని శ్రీ సీతారామ దేవస్థానం, చిత్రకూట మండపంలో రాష్ట్రం నలుమూలల నుండి వందలాది సంగీత విద్వాంసులు సమిష్టిగా ఈ భద్రాచల రామదాసు కీర్తనలు గానం చేయటం, విశేష తిరుమల, తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయటం మరో విశేషం. దీనాతిదీనుడైన ఏ భక్తుడైనా తన దురవస్థ నుంచి తప్పించమని శ్రీ రామచంద్రునికి చేసుకున్న విన్నపాలు సంగీతం, రాగం, రామదాసును దైన్య సముద్రం నుండి గట్టెక్కించేందుకు ఉపయోగపడిన తెప్పలు. సంగీత విద్వాంసులు ఈ కాస్త రహస్యం తెలుసుకుంటే చాలు. సంగీత పరమావధి బోధపడుతుంది. భక్త్భివంతో అందరూ గొంతెత్తి పాడితే చాలు.. అదే రామదాసుకు మనమివ్వగలిగే అసలైన నివాళి.