సబ్ ఫీచర్

మనకేదీ.. ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లాస్ ఏంజిల్స్’ నగరంలో ఫిబ్రవరి 24న 91వ ఆస్కార్ అవార్డుల సంబరం జరుగనుంది. ప్రపంచ సినీ రంగ ఉత్తములకు పట్టంకట్టే పండుగ. పలు దేశాల ఉత్తమ సినిమాల ప్రతిభను గుర్తించి అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ కళాకారులు అంచెలంచెలుగా తమ ప్రతిభను చాటుకుంటూ ‘గ్రామి అవార్డులు’, ‘ఎమ్మి అవార్డులు’, ‘గోల్డెన్ గ్లోబ్’, ‘బాఫ్టా’ అవార్డుల స్టేజిని దాటుకుంటూ ‘ఆస్కార్ అవార్డుల’కై నమ్మకంతో ‘లాస్‌ఏంజల్స్’కు పయనం సాగించనున్నారు. ప్రపంచ చలనచిత్ర రంగాలకు, వాటి ప్రతిభకు కొలమానం ఈ ఆస్కార్. ప్రతి కళాకారుడు జీవితంలో ఒక్క ఆస్కారైన అందుకోవాలని ఉబలాటపడతాడు. అదే వారి జీవితాశయం కావొచ్చు కూడా. ఎర్ర తివాచీపై నడుచుకుంటూ డయాస్ ఎక్కి అవార్డు అందుకుని ముద్దాడాలని కలలుకంటుంటారు. నామినేషన్ దక్కినా జన్మ ధన్యమైనట్టేనన్నవాళ్లూ లేకపోలేదు. ఆ దినం ప్రపంచ నలుమూలల నుండి హేమాహేమీల్లాంటి కళాకారులు వేడుకకు రావడం జరుగుతుంది. లక్షల, కోట్ల ఖర్చుతో వజ్ర వైడూర్యాలు పొదిగిన, పసిడి మిళితమై సరికొత్త వస్త్రాలు ధరించి హీరోయిన్లు వయ్యారం వొలకబోస్తూ, ఎర్ర తివాచిపై వివిధ భంగిమలతో కనిపిస్తూ మీడియాకు అభిమానులకు ఫోజులిస్తూ, సెల్ఫీలు దిగుతూ ఆర్భాటం చేస్తుంటారు. పోటీలో పది నామినేషన్లు పొందిన ‘రోమా’, ‘ది పేవరేట్’ చిత్రాలకు అవార్డుల పంట పండబోతుంది. ఎనిమిది నామినేషన్లు పొందిన ‘ఎ స్టార్ ఈజ్ బర్న్’, ‘వైస్’ చిత్రాలు గట్టి పోటీయివ్వనున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా విజయఢంకా మ్రోగిస్తూ వసూళ్ల చరిత్ర సృష్టించుచున్న ‘బ్లాక్ పాంథర్’ చిత్రాన్నీ ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. పై చిత్రాలను అధిగమించి ‘బ్లాక్ పాంథర్’ చిత్రం అవార్డులను ఎగరేసుకుపోయినా ఆశ్చర్య పడనక్కర లేదు. ఆస్కార్ బరిలో ఈ చిత్రం ప్రత్యేకం అనుకోవలసిందే. పోతే ఉత్తమ నటుల నామినీలుగా ‘క్రిస్టియన్ బాలె, బ్రాడ్లికూపర్, విలియం డపో, రమిమలేక్, విగ్గో మార్టెన్ సేన్’లు బరిలో ఉన్నారు. అలాగే ఉత్తమ నటిగా నామినీ పొందిన ‘యలిట్జు అపరిసియో, గ్లెన్‌క్లోజ్, ఒలివియా కోల్‌మెన్, మెలిస్కా మెక్ కెర్తి, లేడిగాగా’ బరిలో వున్నారు. సినీ విశే్లషకులు మాత్రం అటు ‘బ్రాడ్లికూపర్’ (నటుడు), ఇటు లేడీ గాగా (నటి)లే ఆస్కార్ ప్రతిమను ముద్దాడనున్నారని జోస్యం చెబుతున్నారు. కార్యక్రమానికి ‘హోస్ట్’గా గౌరవం అందుకున్న నటుడు ‘కెవిన్ హార్ట్’ (ఆఫ్రికన్- అమెరికా జాతి నటుడు) వేదికపై నవ్వుల పువ్వులు పూయిస్తూ, జోక్స్ కట్ చేస్తూ, హాస్య చలోక్తులు విసురుతూ, పొగడ్తలతో ఆహ్వానిస్తూ అందర్ని అలరించగల దిట్ట. మన దేశ సినీ రంగ కళాకారులకు ఆస్కార్ అందని ద్రాక్షే అనుకోవాలి. ఆ వేదికపై గర్వంగా ఆస్కార్ ప్రతిమను అందుకుని ముద్దాడే అవకాశం మన వారికి కనుచూపు మేరలో లేదన్నది అక్షరసత్యం. అతి కొద్దిమంది కళాకారులకు (బాలీవుడ్) ప్రేక్షక ఆహ్వానం అందుతుంది. ఏ ఒక్కరికో ఇద్దరికో ఆస్కార్ ప్రతిమను అవార్డు గ్రహీతకు ప్రదానం చేసే అవకాశం దక్కవచ్చు. కార్యక్రమానికి ప్రేక్షక ఆహ్వానం, అవార్డు ప్రదానం చేసే అవకాశం మన కళాకారులకు రాగానే ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం, చంద్రమండలంపై పాదం మోపినంత సంతోషం, అవార్డు అందుకున్నంతగా పొంగిపోతారు. ఎర్ర తివాచిపై క్యాట్‌వాక్ చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, హొయలు పోతూ, ఫ్యాషన్ డిజైనంటూ ఆ పూటకోసం, ఆ కార్యక్రమం కోసం లక్షలు వెచ్చించి శృంగార భంగిమలతో వింత వస్త్రాలతో అభిసారికల్లా కనిపిస్తుంటారు. భారతదేశ సినీరంగం నుండి ఏమైనా నామినేట్ అయ్యాయా? నామిని ఛాన్స్ ఎవరికైనా వుందా? అని ఇతర కళాకారులు ప్రశ్నిస్తే మన కళాకారులు ఏం జవాబిస్తారు? తల వంచుకోవలసిందేనా? అవమాన భారం మోయవలసిందేగా? మరి వెళ్లడం దేనికి? ప్రపంచ సినీ రంగ చరిత్రలో సంఖ్యాపరంగా ఎక్కువ చిత్రాలు నిర్మించేది మన దేశమే, అయినా ఆస్కార్ తొలి వడబోతలో రాలిపోయే చిత్రాలే మనవి. ఆస్కార్ ఎంపికకు కావలసిన సత్తా మన చిత్రాలకు లేదనుకోవచ్చు, ప్రాథమిక అర్హత సైతం సాధించలేవు మన చిత్రాలు. ఇన్ని వేల థియేటర్లలో మా చిత్రం విడుదల, తెలుగు, తమిళం, హిందీ, కన్నడం ఇలా పలు భాషల్లో మా చిత్రం నిర్మిస్తున్నాం, భారీ బడ్జెట్ పెట్టాము, భారీ తారాగణం (మల్టీ స్టారర్) వున్నారు, విదేశాలలో కనక వర్షం కురిపిస్తుంది. అయిదు వందల కోట్ల క్లబ్బులో మా చిత్రం చేరింది అంటూ ఊకదంపుడు స్టేట్‌మెంట్లు యివ్వడం మన వారి కలవాటే. కనీసం మన చిత్రాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోలేదన్నది వాస్తవం, ఆ యోగ్యత లేదు. చివరగా మన టాలీవుడ్ రంగానికి వద్దాం. మనం గుర్తుంచుకోవలసింది, చెప్పుకోవలసింది ‘స్వర్ణయుగం’ గురించే. అది జరిగిపోయిన యుగం. ఆ కథ. ఆ నటన, సాహిత్యం, గాత్రాలు, దర్శకత్వం ఇక మరచిపోవలసిందే. మన కళాకారులకు ‘హీరో, స్టార్, కింగ్’ లాంటి పెట్టుడు బిరుదులే గొప్ప. అలాగే చానల్స్, సంస్థలు, మరెవరో యిచ్చే అవార్డులే గొప్ప. రెండువేల థియేటర్లు, అభిమానుల అదుర్స్, ఆహా.. ఓహోలు, వందకోట్ల మార్క్‌లవరకే మన సత్తా.అందులో నటవారసుల అరంగేట్రంతో టాలీవుడ్‌కున్న కాస్త గౌరవం మంటకలిసిపోతుంది. అందరూ పులులు, సింహాల పేర్లు పెట్టించుకున్నంత మాత్రాన నటన సంక్రమిస్తుందా? వస్తుందా? మన చిత్రాలకు పరోక్షంగా ఆకాశానికి ఎత్తి వాటి పరాజయాలకు కారణం మన ‘మీడియా’ అనుకోచ్చు. మహారధి కర్ణుని చావుకు పలు కారణాలనుకున్నట్లు, మన టాలీవుడ్ రంగ దిగజారుడుకు కారణాలెన్నో? మనం పరుగెత్తలేకపోయినా ‘బోల్ట్’ను చూసి ఆనందించినట్లు, ఆస్కార్ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలను చూసి సంతోషిద్దాం. ఎంతైనా ఆస్కార్ మనకు అందని ద్రాక్షే అనుకుందాం. అంత స్థాయి, అర్హత, యోగ్యత మనకెక్కడిది!

-మురహరి ఆనందరావు