సబ్ ఫీచర్

‘జై తెలంగాణ’ నుంచి ‘జై భారత్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జై తెలంగాణ’ నుంచి ‘జై భారత్’ నినాదానికి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఆసక్తికరం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో కొందరు చిన్నచూపు చూశారు, వెకిలి మాటలు మాట్లాడారు. ఇప్పుడు సరిగ్గా అలాగే ఎకసెక్కపు మాటలు! తెరాస ఏర్పడినపుడు రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉండేవో, ఇప్పుడు దేశంలో అలాగే ఉన్నాయి. ‘తెలంగాణ వాదం’ కేసీఆర్ తెరాసను ఏర్పాటు చేసిన రోజునే పుట్టిందని, తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయ అవగాహన లేని కొంతమంది నిశ్చితాభిప్రాయం. కేసీఆర్ కన్నా ముందు నుంచే ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో బలంగా ఉండేది. తెరాస ఆవిర్భావానికి ఐదారేళ్ల ముందే వరంగల్‌లో లక్షలాది మందితో తెలంగాణ కోసం భారీ బహిరంగ సభ జరిగింది. అంతకన్నా ముందే మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి తెలంగాణ పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేసి జిల్లాల్లో తిరిగారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దాస్యం ప్రణయ భాస్కర్ తెలంగాణపై ఉద్యమించనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఇవన్నీ తెరాస పుట్టకముందు జరిగినవే. ప్రజల్లో తెలంగాణ కావాలనే కోరిక ఉన్నా, అది సాకారం అయ్యేందుకు సరైన నాయకుడు లేడు. 2001లో కేసీఆర్ తెరాసను ఏర్పాటు చేసి ఉద్యమానికి నాయకత్వం వహించారు. సరిగ్గా ఇప్పుడు దేశంలో అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, భాజపా వ్యతిరేక శక్తులు ఎక్కడికక్కడే తమ తమ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రాలకే పరిమితమైన ఈ శక్తులను ఏకం చేసే బాధ్యతను తన భుజానికి ఎత్తుకోవడానికి కేసీఆర్ ముందుకు వచ్చారు.
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణానికి, ప్రత్యామ్నాయ శక్తులకు నాయకత్వం వహించేందుకు తాను సిద్ధమేనని కేసీఆర్ చేసిన ప్రకటన సహజంగానే విస్తృత చర్చకు దారితీసింది. ప్రజల్లో ఆకాంక్ష ఉంటేనే సరిపోదు. సరైన సమయం, సరైన నాయకత్వం అవసరం. తెలంగాణ అంశంలో కేసీఆర్ చేసింది అదే. తెలుగువారు రాష్టప్రతి, ప్రధానమంత్రి పదవులు చేపట్టారు. ‘్థర్డ్ ఫ్రంట్’కు నాయకత్వం వహించారు. ఇలాంటి అవకాశం కేసీఆర్‌కు రాకూడదా? కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నమేమీ దేశద్రోహం కాదు కదా!
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలైంది. ముఫ్ఫై ఏళ్ల తరువాత మోదీ నాయకత్వంలో దేశంలో తొలిసారిగా బిజెపి సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. వ్యాపారంలో గుజరాతీల ముందు ఎవరూ నిలువలేరు. మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ వారి వ్యాపార మెళకువల ముందు ఎవరూ నిలువలేరు. గుజరాత్‌కే చెందిన నరేంద్ర మోదీ దేశ రాజకీయాలను సైతం వ్యాపారంలానే నడిపిస్తున్నారు.
అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ‘కేంద్రం మిధ్య’ అన్నారు. రాష్ట్రాల సమూహమే కేంద్రం. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుసుకోవాలంటే కొనే్నళ్ల పాటు నిరీక్షించాలా? పూర్తి మెజారిటీతో కేంద్రంలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తే సుస్థిర పాలన వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుందని అంతా భావించారు. కానీ, అది నియంతృత్వానికి దారి తీస్తుందని మోదీ ఆచరణలో చూపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయమని ప్రధానిని అడిగేందుకు ముఖ్యమంత్రులు అపాయింట్‌మెంట్ కోసం ఏళ్లతరబడి నిరీక్షించాలా? పూర్తి మెజారిటీ ఉందని కేంద్రం ఎలా వ్యవహరించినా రాష్ట్రాలు నోరు మూసుకొని ఉండాలా? పక్కా వ్యాపారవేత్తలా మోదీ సొంత పార్టీలో తన రాజకీయ గురువు అద్వానీని సైతం పక్కన పెట్టారు. దేశ రాజధానిలో భాజపా పరువు తీసేలా ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ఉనికిని మోదీ సహించలేక పోతున్నారు. ఓ సమావేశంలో మిగతా సీఎంలను పలకరిస్తూ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా మోదీ పట్టించుకోక పోవడం అందరికీ తెలిసిందే. విభజన హామీల కోసం మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు బాబు కేంద్రంలో చక్రం తిప్పిన ఘనుడే. కేజ్రీవాల్‌తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఎప్పటి నుంచో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు. నిజానికి అప్పుడు మోదీపై జనంలో పెద్ద వ్యతిరేకత లేదు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డా- నల్లధనం నిర్మూలనకు చేసిన మంచి పనిగానే చాలా మంది ప్రజలు భావించారు. మోదీ ప్రధానిగా ఏవో అద్భుతాలు చేస్తారనే ప్రచారం బలంగా జరిగింది. ‘లీటర్ పెట్రోల్ 30 రూపాయలే.. పేదరికం ఇక మటుమాయం..!’ అన్నట్టుగా ఆ ప్రచారం జరిగింది. కానీ, క్రమంగా మోదీపై జనంలో ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఏదో ఒక కూటమే అధికారంలోకి వస్తుంది కానీ బిజెపి సొంత బలంతో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పాతిక లక్షల ఓటర్లున్న త్రిపుర మొత్తం దేశంలోని ‘మూడ్’ను ప్రతిబింబించలేదు. కచ్చితంగా బిజెపి సీట్లు గణనీయంగా తగ్గుతాయని, ఏ స్థాయిలో తగ్గుతాయో చూడాల్సి ఉందని విశే్లషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల సంగతి ఎలా ఉన్నా, నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ‘మేం ఇది సాధించాం..’ అని చెప్పుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడితే చీకటి తప్పదు, వ్యవసాయానికి విద్యుత్ ఉండదు అనే ప్రచారం నుంచి- నాలుగేళ్లలోనే 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చే స్థితికి చేరుకుంది. నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, ఆసరా వంటి పథకాలు చెప్పుకోవడానికి ఉన్నాయి. ‘కేంద్రం మోసం చేసింది.. ఉన్నంతలో అభివృద్ధి సాధించాం.. నా వల్లనే రాజధాని నిర్మాణం సాధ్యం..’ అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు అవకాశం ఉంది.
మోదీ అధికారంలోకి రాగానే పాకిస్తాన్ తోక ముడుస్తుందని, యుద్ధంలో దాయాది దేశాన్ని ఓడిస్తాం అన్నట్టుగా ప్రచారం చేశారు. అలాంటిదేమీ జరగలేదు. రామాలయ నిర్మాణం జరగలేదు. పాకిస్తాన్ కాల్పులు ఆగలేదు. మరోసారి గెలవాలనుకుంటే ఎన్నికల నాటికి పాకిస్తాన్‌తో యుద్ధం ప్రకటించడం మినహా బిజెపికి పెద్దగా సానుకూల అంశాలేమీ కనిపించడం లేదు. కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉండడం ఒక్కటే బిజెపికి కలిసొచ్చే అంశం. లోక్‌సభలో ఇప్పుడు 40 సీట్లున్న కాంగ్రెస్ రెట్టింపు సీట్లు సాధించగలిగితే గొప్ప, రెండు వందల సీట్లు సాధిస్తుందని అనుకుంటే అత్యాశే అవుతుంది. ఇదే సమయంలో బిజెపి కనీసం వంద స్థానాలనైనా కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఎవరు తిరిగి అధికారంలోకి రావాలన్నా ప్రాంతీయ పార్టీల సహకారం అనివార్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి నామమాత్రమే. తెలుగు రాష్ట్రాలకు బెంగాల్ తోడవుతుంది. మరో రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు సాధిస్తే తృతీయ ఫ్రంట్ 2019లో కీలక పాత్ర వహిస్తుంది. ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈ కూటమి మద్దతు తప్పని సరి. తృతీయ కూటమి ఏర్పాటులో గతంలో వామపక్షాలు కీలక పాత్ర వహించేవి. ఇప్పుడవి నిర్వీర్యంగా మారాయి. గత నాలుగేళ్ల పరిస్థితులను పరిశీలిస్తే దేశ రాజకీయాల్లో దక్షిణాది ఇప్పుడున్నంత బలహీనంగా ఎప్పుడూ లేదు.
తెలంగాణకు ఇప్పుడు విభజన కాలం నాటి సమస్యలు లేవు. తన ‘వాణి’ని బలంగా వినిపించే అవకాశం కేసీఆర్‌కు లభించింది. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం, ఉద్యమ నాయకుడిగా దేశంలోని దాదాపు అన్ని పార్టీలతో పరిచయం, నాలుగేళ్ల తెలంగాణలో సాధించిన విజయాలు, ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించే అవకాశాలు కేసీఆర్‌కు ప్లస్ పాయింట్లు. మోదీకి ముఖ్యమంత్రులు అంటే లెక్కే లేదు. ప్రాంతీయ పార్టీలను, సీఎంలను గత నాలుగేళ్లలో పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు, ఇప్పుడు జరిగే రాజకీయం వేరు. సరైన సమయంలో తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించిన కేసీఆర్ ఇప్పుడు సరైన సమయంలో జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. కేంద్రంలో తెలంగాణ కీలక పాత్ర వహించనుంది. విపరీతమైన ఆశలు కల్పించి బిజెపి సొంతంగానే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేదు. నలుగురిని కూడగట్టగలవారే ఇప్పుడు కేంద్రలో కీలక పాత్ర వహించగలరు. ఇప్పుడు నవ్వులాటగా అనిపించవచ్చు. కానీ 2019 ఎన్నికల ఫలితాలు ఈ వాస్తవానే్న చెబుతాయి.

-వౌర్య