ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చాలా కాలం తరువాత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు ఉభయ సభలు చాలా సంవత్సరాల తరువాత సజావుగా కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు గత వారం 23 తేదీ ప్రారంభమైన నాటి నుండి అత్యంత ముఖ్యమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంతోపాటు ఇతర అన్ని కార్యకలాపాలు వాడి,వేడి చర్చలతో ముందుకు సాగటం ముదావహం. గత మూడు, నాలుగు సంవత్సరాల నుండి పార్లమెంటు ఉభయ సభలు సజావుగా జరగటం లేదు. రెండు సభలు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానే ఏదోఒక మిషపై వాయిదా పడటం ఆనవాయితీగా మారిపోయింది.
లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్షం సభ్యులు తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలి, దీని కోసం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ పోడియం వద్దకు దూసుకు రావటం, నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేయటం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షం గొడవ మూలంగా రెండు సభలు పలు మార్లు వాయిదా పడటం చివరకు మరునాటికి వాయిదా పడిపోవటం అనేది ఒక రివాజుగా మారిపోయింది. పార్లమెంటు సజావుగా జరిగేందుకు ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని అఖిల పక్ష సమావేశంలో ఇచ్చే హామీని ప్రతిపక్షాలు ఆ తరువాత ఉల్లంఘించటం సర్వసామాన్యమైపోయింది. అధికార, ప్రతిపక్షం మధ్య నెలకొన్న రాజకీయ వైరానికి ఉభయ సభల్లోని ప్రశ్నోత్తరాల కాలం పూర్తిగా బలైపోయింది. అందుకే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ దాదాపు రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మధ్యాహ్నం పనె్నండు గంటలకు మార్చివేసి జీరో అవర్‌ను పదకొండు గంటలకు చేపట్టటం ద్వారా పరిస్థితిని చక్క దిద్దేందుకు ప్రయత్నించారు.అయితే హమీద్ అన్సారీ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఇరుపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ గొడవల మూలంగా ఉభయ సభల పూర్తి సమయం వృధా కావటంతో రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సమయాన్ని మార్చినా ఫలితం కనిపించ లేదు.
ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఇచ్చిన మాట మేరకు ఉభయ సభలు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వంతో సహకరిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఉభయ సభల ప్రశ్నోత్తరాల కార్యక్రమం అత్యంత సజావుగా జరుగుతూ ఐదారు ప్రశ్నలపై చర్చ జరపటం అభినందనీయమైన అంశం. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా జరిగి ఐదారు ప్రశ్నలపై చర్చ జరిగితే దేశ ప్రజలకు సంబంధించిన పలు సమస్యలపై దృష్టి సారించేందుకు ఇటు ప్రభుత్వానికి అటు సభ్యులకు వీలు కలుగుతుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా జరగటం వలన ప్రజలకు సంబంధించిన పలు సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తోంది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, ఢిల్లీలోని జవాహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం సంఘటనలకు బడ్జెట్ సమావేశాలు బలైపోతాయని అందరు భయపడ్డారు. అందుకే నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత మొదటిసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగేందుకు తోడ్పడాలని ప్రతిపక్షాన్ని పదే,పదే కోరారు. రోహిత్ వేముల, జె.ఎస్.యు సంఘటనలపై పారదర్శక చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంటూ హామీ ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూసేందుకు తమ వంతు కృషి చేశారు. వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రతిపక్షం సహకారం కోరారు. ఇంత కాలం ప్రతిపక్షం పట్ల చిన్న చూపు చూసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగేందుకు ప్రతిపక్షాన్ని కలుపుకుపోయేందుకు చొరవ చూపించటం గమనార్హం. వీరందరి కృషి ఫలితంగా పార్లమెంటు సమావేశాలు పలు సంవత్సరాల తరువాత ఇప్పుడు సజావుగా జరుగుతున్నాయి.
ఉభయ సభలు స్తంభించిపోకుండా అన్ని అంశాలపై వాడిగా,వేడిగా చర్చించుకోవటమే సజావుగా జరగటం అని అర్థం. సజావుగా జరగటం అంటే వాదోపవాదాలు లేకుండా జరగటం కాదు. రోహిత్ వేముల ఆత్మహత్య, జె.ఎన్.యు సంఘటనలపై లోక్‌సభ, రాజ్యసభలో అత్యంత వాడి,వేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, మొత్తం మీద ఎవరి వాదన వారు వినిపించుకున్నారు. ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపించటం ద్వారా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తే అధికార పక్షం తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందనేని నిరూపించేందుకు ప్రయత్నించింది. సభను స్తంభింపజేసి వాయిదా పడేందుకు దారి తీయకుండతా ఇరుపక్షాలు ఎంత వాదించుకున్నా, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నా దానిని అందరు స్వాగతించాలి తప్ప తప్పుపట్టకూడదు. పార్లమెంటరీ ప్రజస్వామ్యంలో వాదోదవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అత్యంత సహజం. ఇలా జరిగితేనే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వైషమ్యాలకు ఉభయ సభలు బలికావటంతో దేశ ప్రజలు, ముఖ్యంగా యువతకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది. పార్లమెంటు సమావేశాల్లో ఇరుపక్షాలు బాహా,బాహీ కుస్తీ తప్ప దేశం, ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగదని ప్రజలు భావించే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగ జరగటం ఎంతో హర్షణీయమైన విషయం.