తెలంగాణ

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ద్విముఖ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడే పోలింగ్..అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 1110మంది ఓటర్లు

నల్లగొండ, డిసెంబర్ 26: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య ద్వి ముఖ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నెలకొంది. కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో ఉన్న సుంకరి మల్లేశ్‌గౌడ్ టిఆర్‌ఎస్‌లో చేరి తేరాకు మద్దతు ప్రకటించడంతో ఆయన పోటీ నామమాత్రమైంది. స్వతంత్య్ర అభ్యర్థిగా ఎంపిటీసి మిట్టా పురుషోత్తంరెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తం 1110మంది ఓటర్లు నేటి పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇందులో 833మంది ఎంపిటీసిలు, 59మంది జడ్పీటిసిలు, 210మంది కౌన్సిలర్లు, 8మంది ఎక్స్‌అఫీసియో సభ్యులైన ఎంపి, ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్నారు. జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకుని నోటిఫికేషన్ మొదలుకుని తేరా చిన్నపరెడ్డి గెలుపు కోసం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నామినేషన్‌కు ముందే వారిని క్యాంపులకు తరలించారు. 600మంది స్థానిక ఓటర్లు వారి క్యాంపుల్లో ఉన్నట్లుగా ప్రచారం చేశారు. నిజానికి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల వారి బలాబలాలు చూస్తే కాంగ్రెస్‌కు 546మంది స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆరుగురు ఎక్స్‌అఫీసియో ఓటర్లు ఉన్నారు. టిడిపికి 190, టిఆర్‌ఎస్‌కు 138, సిపిఎంకు 57, బిజెపికి 35, సిపిఐకి 29, వైకాపాకు 12, ఎంఐఎంకు 3, స్వతంత్రులు 94మంది ఉన్నారు. విపక్షాల నుండి గత ఏడాదిన్నర కాలంగా పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌లోకి వలసలు సాగడంతో బలాబలాలు తారుమారయ్యాయి. అయితే పార్టీలు మారిన వారు చేసే క్రాస్ ఓటింగ్ సైతం ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం తన గెలుపు పట్ల ధీమాగా ఉన్నారు. తెలంగాణ కోసం చేసిన పోరాటం, మెజార్టీగా ఉన్న కాంగ్రెస్ స్థానిక ఓటర్ల బలం తనను గెలిపిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఆయన సోదరుడు సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా రాజగోపాల్‌రెడ్డి ఓడితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని, టిఆర్‌ఎస్ ఓడితే సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలంటూ సవాల్ విసరడంతో నేడు జరిగే పోలింగ్ రెండు పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకమైంది. ముఖ్యంగా ఇదే జిల్లాకు చెందిన పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత కె.జానారెడ్డికి, ఎంపిలు పాల్వాయి, గుత్తా, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిలకు ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. ఇతర జిల్లాల్లో అన్ని ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌ను సొంత జిల్లాలో ఎలాగైనా గెలిపించి కారు జోరుకు అడ్డుకట్ట వేయడంతో తమ సత్తా చాటుకోవాలని వారు గట్టిగానే ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఎంతమేరకు సఫలీకృతమవుతాయన్నదీ ఆసక్తికరం.
కాంగ్రెస్ గుర్తుపై నెగ్గిన వారంతా తమకే ఓటు వేస్తారని, సిపిఐతో పాటు ఇతర విపక్షాల స్థానిక ఓటర్ల మద్దతుతో గెలుస్తామని రాజగోపాల్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. గెలుపు కోసం అభ్యర్థులు చిన్నపరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు ఇద్దరూ కూడా సర్వశక్తులొడ్డటంతో ఎన్నికల ఖర్చు ఏకంగా వంద కోట్లు దాటిందని ప్రచారం చోటుచేసుకుంది. ఒక్కో స్థానిక ఓటరు రెండు వైపులా నుండి 10లక్షలకు పైగా లబ్ధి పొందినట్లుగా తెలుస్తుండగా డబ్బుల పందేరంగా మారిన ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానిక ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది నేటి పోలింగ్‌లో తేలనుంది.