ఆంధ్రప్రదేశ్‌

25 నుంచి విశాఖ ఉత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: ప్రపంచ దేశాల్లో విశాఖ కీర్తిని మరింతగా పెంచే లక్ష్యంతో విశాఖ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి మరింత వైభవంగా దీనిని నిర్వహించి విశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో దీనిని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. విశాఖతోపాటు అరకు ఉత్సవ్‌ను ఒకేసారి నిర్వహించదలిచామన్నారు. ముందుగా అరకు ఉత్సవ్‌ను నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాలతో అది సాధ్యపడలేదన్నారు. అయినా ఇపుడు ఈ రెండు ఒకేసారి జరుగుతాయన్నారు. విశాఖ ఉత్సవ్‌కు ప్రధాన వేదిక ఆర్‌కె బీచ్ కానుందని, కార్నివాల్‌తో ఇది ప్రారంభమవుతుందన్నారు. వుడా, మధురవాడ జాతర, ఆర్‌కె బీచ్, కైలాసగిరి, అరకు ప్రాంతాల్లో విశాఖ ఉత్సవ్‌కు సంబంధించిన కార్యక్రమాలుంటాయన్నారు.

నాగార్జున ఇన్‌చార్జి విసిగా కుమార్
నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 4: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నాగార్జున వర్సిటీ వీసీగా బెంగళూరుకు చెందిన నేషనల్ లాయూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్ వెంకట్రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా ఆయన ఈ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కుమార్‌కు ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలను అప్పగించింది. శుక్రవారం ఉదయం 11గంటలకు వర్సిటీలోని వీసీ ఛాంబర్‌లో పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం వర్సిటీ వీసీ కమిటీ హాలులో వర్సిటీ ఉన్నతాధికార్లతో ఇన్‌చార్జి వీసీ సమావేశమయ్యారు.

నన్నయ వర్శిటీ విసిగా ముత్యాలనాయుడు
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆచార్య ఎ ముత్యాల నాయుడు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్ ధనంజయరావు నుండి అయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ముత్యాల నాయుడును పలువురు అభినందించారు.

25 జిల్లాల ఏర్పాటుకు సిఎం కృషి: గాలి
మదనపల్లె, డిసెంబర్ 4: రాష్టవ్రిభజనతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాలను పార్లమెంట్ సెగ్మెట్‌లను జిల్లా కేంద్రాలుగా విభజన చేయడానికి సిఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. జనచైతన్యయాత్రలలో భాగంగా మదనపల్లెలో పర్యటిస్తు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలోఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 25పార్లమెంట్‌ల నియోజకవర్గాలను జిల్లాకేంద్రాలుగా విభజన చేస్తే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని, ప్రజలకు మరింత సేవలు అందుబాటులో ఉంటాయని సిఎంకు లేఖ ద్వారా వివరించామన్నారు.

తిరుపతి-న్యూఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు
తిరుపతి, డిసెంబర్ 4: తిరుపతి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే సూపర్ స్పెషల్ ప్రత్యేక రైలు(02621)ను ఏర్పాటు చేసినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉమాశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరైలు శనివారం ఉదయం 6.30గంటలకు తిరుపతిలో బయలుదేరి ఆదివారం సాయంత్రం 4.30గంటలకు న్యూడిల్లీకి చేరుకుంటుందని పేర్కొన్నారు. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ , బలార్షా , నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ మీదుగా న్యూఢిల్లీకి చేరుకుటుందన్నారు. 24 కోచ్‌లున్న ఈరైల్లో ఒక ఫస్ట్‌క్లాస్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు, టు టైర్ ఏసి కోచ్‌లు మూడు, త్రి టైర్ ఏసి కోచ్‌లు రెండు, 13 స్లీపర్ కోచ్‌లు, 2 జనరల్, సెకెండ్ క్లాస్, 1 ప్యాంట్రీకార్, 2 లగేజీ కం బ్రేక్‌వాన్ కోచ్‌లు ఉంటాయన్నారు.

సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
ఉరవకొండ, డిసెంబర్ 4: సబ్‌జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. చెనే్నకొత్తపల్లి మండలం పత్తికుంటపల్లికి చెందిన పఠాన్‌షేక్ షామీర్ ఖాన్(36) ఉరవకొండ సబ్‌జైలులోని మరుగుదొడ్డితో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, జైలు అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో నివసిస్తున్న షామీర్‌ఖాన్‌పై కర్నాటక, చిత్తూరు, అనంతపురం జిల్లాలో దాదాపు 33 కేసులు ఉన్నాయి. ఇంట్లో చోరీ కేసులో 2014లో షామీర్‌ను తొలిసారి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. ఉరవకొండ సబ్‌జైలులో షామీర్ శిక్ష అనుభవిస్తుండగా కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కేసులపై విచారించారు. అనంతరం గురువారం ఉదయం ఉరవకొండ సబ్ జైలు అధికారులకు అప్పగించారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో షామీర్‌ఖాన్ మరుగుదొడ్డిలో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏసిబి వలలో పంచాయతీరాజ్ ఏఇ
పిసిపల్లి, డిసెంబర్ 4: ప్రకాశం జిల్లా పిసిపల్లిలో శుక్రవారం ఒక కాంట్రాక్టర్ నుంచి 10వేల రూపాయలు లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఇ వీరయ్య ఎసిబికి చిక్కారు. చినవరిమడుగు పంచాయతీ భవనం ప్రహరీగోడ నిర్మాణం చేపట్టిన స్థానిక సర్పంచ్ భర్త వేమూరి శ్రీను బిల్లు కోసం ఎం బుక్ చేయమని అడగగా పంచాయతీరాజ్ ఏఇ వీరయ్య దానికి 10వేలు రూపాయలు చెల్లించాలని లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం ఎసిబి డిఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి నేతృత్వంలో నిఘావేయగా కాంట్రాక్టర్ నుంచి ఎఇ వీరయ్య పదివేలు సొమ్ము తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.