మెయిన్ ఫీచర్

లేత మెరుపు తీగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలిపి ప్రశ్న.
కథానాయిక అలియాస్ హీరోయిన్ అంటే ఎవరు? అర్థ తాత్పర్యములతో వివరించుము. ఒకనాటి మాటేమోగానీ- తాజా పరిస్థితుల్లో మనకున్న కొద్దిపాటి సినీ పరిజ్ఞానానిక్కూడా అంతగా పదును పెట్టాల్సిన అవసరం లేదు. అతిగా చించుకోవాల్సిందీ.. చింతించాల్సిందీ అంతకన్నా లేదు. టూ మార్క్స్ క్వొశ్చన్ కింద తెగ్గొట్టేయ్యొచ్చు. కథానాయిక అంటే కథతో సంబంధం లేనిదని అర్థం. ఉన్నపళంగా -ఏ రీజనింగూ లాజిక్కూ లేకుండానే -హీరో అనబడే కథానాయకుడి ‘లవ్’ బురదలో ఇట్టే చిక్కి.. ఇంటర్వెల్‌కి ముందో తర్వాతో -హీరోతో గొడవ పడి... అపార్థం చేసుకొని మనసు విరిచేసుకొని.. క్లైమాక్స్‌లో తన తప్పు తెలుసుకొన్నట్టు నటించి ‘శుభం’ కార్డులో కలిసిపోయేదే కథానాయిక.

ఇక్కడ ఓ సందేహం కలగాలి. హీరోయిన్‌కి వ్యక్తిత్వం ఉండదా? గాలి ఎటువీస్తే అటు మనసు మళ్లించేసుకుంటుందా? హీరోయిన్ హృదయంతో సినిమాలోని ప్రతి ఒక్కరూ చెడుగుడు ఆడేస్తూంటారా? ఏ డ్రైవర్‌కో.. లారీ క్లీనర్‌కో.. మెకానిక్‌కో.. ఎటువంటి కారణం లేకుండానే.. మనసిచ్చి పారేస్తుందా? కథతోపాటు ఈవిడగారెందుకు నడవదు? కథ ఓ ట్రాక్‌లో నడుస్తుంటే.. ఎప్పుడూ సైడ్ ట్రాక్‌లో ఎందుకు ఉండిపోతుంది? ఇత్యాదివన్నీ అడక్కూడని ప్రశ్నలు. కాకపోతే- హీరోతో స్టెప్పులెయ్యటానికీ.. రొమాన్స్ చేయటానికీ.. లవ్‌ట్రాక్‌లో తిరగటానికీ.. హీరోయిన్ అనబడే మెటీరియల్ కావాలి కనుక.. నేటి సినీ వ్యవస్థలో ఈ క్యారెక్టర్ జొరబడి.. తనకంటూ ఓ మనసుందనీ.. వ్యక్తిత్వంలాంటి పెద్ద పెద్ద మాటలెందుకనీ.. ఏదో అలా జీవితాన్ని వెళ్లదీసేస్తోంది సినీ హీరోయిన్.

కథానాయికకి కేరాఫ్ అడ్రస్ లేకపోయినా -ప్రస్తుతానికి ఆ కథానాయికగా తళుకులీనేందుకు... మెరుపులు మెరిపించేందుకూ సెల్యులాయిడ్‌పైకి వస్తూన్న అమ్మాయిల్ని ఒక్కసారి పరికించి చూద్దాం. 2016 మరో నెలలో వెళ్లిపోతూండగా- ఇప్పటివరకూ అంటే గత జనవరి నుంచీ ఈ నవంబర్ వరకూ సినీ కాన్వాస్‌ని అలరించిన హీరోయిన్ల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ.. -దాదాపుగా అందరూ కూడా ఒకటీ అరా సినిమాల్తోనే సరిపుచ్చుకున్నారు. ఏ కొద్దిమందో తప్ప -మళ్లీ వెనక్కి తిరిగి చూళ్లేదు.
నటనాపరంగా- ఏ ఒక్కరినీ వెనక్కి పెట్టాల్సింది లేదు. వీళ్లంతా ఏ నటనా స్కూల్‌లో శిక్షణ తీసుకోలేదు. ‘మోడల్’గా రాణిస్తూనే.. పూర్తిస్థాయి నటనవైపు దృష్టి మళ్లించిన వారే ఎక్కువ. ఒక్కో సందర్భంలో వీళ్లు ఇంతలా జీవించేస్తున్నారేమిటి? ఎక్కడ పట్టేశారివన్నీ అనిపిస్తుంది. ఆ అల్లరి.. ఉడుకుమోతుతనం.. పొగరుబోతు మనస్తత్వం.. వొకింత అమాయకత్వం -బుంగమూతి పెట్టి అలకలొలికే జాణతనం -ఉక్రోశం కొద్దీ ఏదైనా అంటే- ఆ కాసేపు అలిగేసి మరికాసేపట్లో చెంతకి చేరిపోయే సర్దుకుపోయే మనసు.. ఇలా -ఏ కోణంలోంచి చూసినా -ఆయా చూపులు వెంటాడేట్టు చేస్తూంటాయి. కొత్తదనం తాలూకు అనుభూతుల తెరల్ని సెల్యులాయిడ్‌పై చూపించేసి.. ఏ పక్కింటి అమ్మాయిలానో.. ఎదురింటి క్లాస్‌మేట్‌లానో -ముద్దుల మరదలిగానో.. ఫ్రెండ్‌లానో -ఇలా ఏ దృష్టితోచూస్తే అలా కనిపించటం వీరి ప్రత్యేకత. ఎంతలా అంటే- మనక్కూడా అటువంటి అమ్మాయితో పరిచయం ఉంటే బావుణ్ణు అనిపించేట్టు. పక్కన నడుస్తూంటే- ఫీలయ్యే గర్వం తాలూకు తీయదనం.. ఫ్రెండ్స్‌లో ఈర్ష్యా చూపులు -ఆ అమ్మాయి కోసం ఎన్ని సంద్రాలైనా దాటేందుకు సిద్ధం అనేట్టుండే ధీరోదాత్తత. -ఒకటేమిటి ఎనె్నన్నో అనుభూతుల సంద్రాలు. భావాల్ని పలికించటానికి కనులు చాలు.. చిట్లించిన నొసలు చాలు.. ఆ లేత పెదాలపై చిరునవ్వులు చాలు అన్నట్టు అందంగా వొలికించేసి.. మార్కులు కొట్టేస్తున్నారు.
ఇక -కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే.. ఏ డ్రస్ వేసినా అదరహో. పల్లెటూరి అందాల్తో లంగా ఓణీలో వయ్యారించినా.. జీన్స్ టీ షర్ట్‌లో టీనేజీ చందాల్ని పలకరించినా.. పంజాబీ కాస్ట్యూమ్‌లో కాలేజీ అమ్మాయిలా వొదిగిపోవటం నేటితరం హీరోయిన్ల తాలూకు కొత్త సోయగం. హీరోయిన్ అంటే -ముద్దుముద్దుగా నాలుగు మాటలు మాట్లాడేసి.. రొమాంటిక్ చూపుల్తో హీరోని బుట్టలో పడేసి.. ఆనక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి.. క్లైమాక్స్‌లో తండ్రిని ఎదిరించి హీరోని పెళ్లి చేసుకోవటం.. మధ్యమధ్యలో కథకి రిలీఫ్ కోసం అన్నట్టుగా- స్టెప్పులేసేసి.. అవి నడకలో.. డ్రిల్ డాన్సులో అర్థంకానంతగా చేసేసి.. హీరోయిన్ నామధేయానికి సార్థకత తేవటం ఒక్కటే కాదు- అవకాశం ఇస్తే.. ఆస్కార్ లెవల్‌లో నటించి లేదా జీవించి చూపించగల సత్తా మాలో ఉందని చెబుతున్నారీ నేటితరం కథానాయికలు.
ఇప్పటి వరకూ కథతో హీరోయిన్‌కి సంబంధం లేదని అన్నాంగానీ.. టాలెంట్ లేదని అనలేం. కథానాయిక కాలేజీ అమ్మాయైనా.. మధ్యతరగతి అమ్మాయైనా.. హైక్లాస్ భామ అయినా.. ఫారిన్ రిటర్న్ అయినా.. ఆయా పాత్రల తాలూకు స్వరూప స్వభావాల్ని ఆకళింపు చేసుకొని -అందంగా వొదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేకూరుస్తున్నారు. అయతే- ఇక్కడ ఒక మైనస్ పాయింటూ వీరికి అశనిపాతంలా తగులుతోంది. వారికున్న టాలెంట్‌ని మొత్తం ఒక్క సినిమాలోనే ప్రదర్శించటంతో కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఆ హీరోయిన్ రెండో సినిమాకే పాతబడిపోతోంది. ఎన్ని హొయలు, ఎన్ని సొబగులద్దినా -తీసికట్టు అవుతోంది.
ఈ ఏడాది ప్రేక్షకులకు పరిచయమై.. చేసింది కొన్ని సినిమాలే అయినా.. లేదా ఒకటి అరా అయినా -ఎవరీ కొత్త అమ్మాయి అని ఆలోచించేట్టు చేయటంలో సిద్ధహస్తులయ్యారు. వారిలో కొందరిని పలకరించి చూద్దాం. ఇప్పటివరకూ ఏ కొద్దిమందికో తప్ప -వాళ్ల వాళ్ల ప్రొఫైల్ ఏమిటో తెలీని వారికి ఇలా పరిచయమవుతున్నారు.
పల్లాక్ లాల్వానీ
-అబ్బాయితో అమ్మాయిగా తెరంగేట్రం చేసిన పల్లాక్ పోస్టర్లపై ఎంతో అందంగా పరచుకొంది. కోటేరు ముక్కు.. తీర్చిదిద్దినట్టుండే కనులతో -ఏ భావాన్నైనా మరింత అందంగా ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ -ఆ సినిమా తర్వాత మళ్లీ కనిపించటానికి ఎంత టైం పడుతుందో తెలీదు.
కీర్తి సురేష్
-‘నేను-శైలజ’ అంటూ వచ్చిన ఈ అమ్మాయి కొన్నాళ్లపాటు మనసులో ఉండిపోవటానికి కారణం ఆ చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనే తార్కాణం. కుర్రాళ్లు ఎలాంటి అమ్మాయినైతే కోరుకుంటారో.. మనసిచ్చి మురిసేందుకు ముందంజ వేస్తారో -ఆయా కోణాలన్నీ ఉన్న కీర్తి ప్రొడ్యూసర్ సురేష్‌కుమార్ కుమార్తె. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించి.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి.. నటనను పూర్తిస్థాయి మజిలీగా మలచుకొంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ బానే ఉంది. ఈమె అక్క రేవతి సురేష్ ‘విఎఫ్‌ఎక్స్’ స్పెషలిస్ట్. తండ్రి నిర్మాత కావటంవల్ల చైల్డ్ ఆర్టిస్ట్‌గా సొంత బ్యానర్‌లోనే నటించి మెప్పించింది. నటన పట్ల ఆసక్తితోనే కెరీర్‌ని ఆరంభించినప్పటికీ.. మరోవైపు ఫ్యాషన్ డిజైనింగ్‌నీ వదిలిపెట్టడం లేదు. కీర్తి నవ్వులో పల్లపర్చుకున్న మెత్తటి అందానికి పరిశ్రమ -్ఢమాల్న పడిపోయింది. అందుకే -వద్దంటే ప్రాజెక్టులు ఆమె గ్లామర్‌మీద ఓట్టేసి మరీ వాలిపోతున్నాయి.
సురభి
-ఇమాగో యాక్టింగ్ స్కూల్‌లో నటనలో శిక్షణ పొంది టాలీవుడ్‌లో ‘బీరువా’ ఓపెన్ చేసింది. తరువాత ఎక్స్‌ప్రెస్ రాజాతో తెరతీసింది. అప్పటికే ఢిల్లీలో ఫైన్ ఆర్ట్స్ చేసి మోడలింగ్ రంగం వైపు దృష్టి సారించింది. 2013లో విడుదలైన తమిళ చిత్రం ‘ఇవాన్ వెరమాతిరి’ ఈమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘ఆమె నవ్వులో ఖైదు కావటం బాగుంటుంది’ అని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అమాయకపు చూపులు.. పెదవులపై వసివాడని చిరునవ్వుతో జనాన్ని కట్టిపడేసింది. ఆ చిత్రానికిగాను బెస్ట్ ఫిమేల్ అవార్డు కొట్టేసింది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చూసిన వారెవరూ ఆమెని అంత తేలిగ్గా మర్చిపోరు. ఈమధ్యే నానితో ‘జెంటిల్‌మెన్’ చేసినా -టైం’టేబుల్‌లో వేగం మాత్రం లేదు.
సోనాల్ చౌహాన్
-2005లో మిస్ వరల్డ్ టూరిజం అవార్డు సాధించిన ‘సోనాల్’ ఫ్యాషన్ మోడల్‌గా, గాయనిగా, నటిగానే కాదు -పలు బ్యూటీ కాంటెస్ట్‌ల్లో అవార్డులు కైవసం చేసుకొన్న సన్నజాజిలా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఫస్ట్ స్క్రీన్ అప్పియరెన్స్ -‘జన్నత్’. బాలకృష్ణ ‘డిక్టేటర్’ ఆమెని తెలుగు తెరకి పరిచయం చేసింది. ‘పండుగ చేస్కో’ ‘సైజ్ జీరో’ చిత్రాల్లో కనిపించినా -ఆ అపజయాలు మళ్లీ కనిపించకుండా చేసేశాయి.
సోనారికా బడోరియా
-ఈమెని ‘సోనారికా’గా పలకరిస్తే -ఎవరికీ తెలీకపోవచ్చు గానీ, ‘పార్వతీదేవి’ అంటే ఇట్టే తెలిసిపోతుంది. ముంబైవాసి. తండ్రిది కన్‌స్ట్రక్షన్ బిజినెస్. మోడల్‌గా ఎదగటానికి ఆయన ప్రోత్సాహం ఉందంటోంది. ఈ ఏడాది ‘ఈడో రకం -ఆడో రకం’లో కనిపించింది. అంతకుముందు ‘స్పీడున్నోడు’తో పరిగెత్తింది. ఇటు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ- కెరీర్‌ని నెమ్మదిగా కొనసాగిస్తోంది.
నికితా నారాయణ్
-సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో బాచిలర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేసి.. బిజినెస్ ఎనలిస్ట్‌గా స్థిరపడదామనుకొన్నప్పటికీ.. నటనారంగం తనని చిటికెన వేలు పట్టుకుని లాగటంతో ‘వెనె్నల్లో హాయ్‌హాయ్’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని వెంటాడింది. పదేళ్ల వయసులో రాజీవ్ మీనన్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన నికితా -కొన్నాళ్లపాటు ‘ఫెయిర్ అండ్ లలీ’కి మోడల్. ‘మిస్ బ్యూటీఫుల్ ఐస్’ టైటిల్ సైతం ఈమె ఖాతాలో ఉంది. 2011లో మధుర శ్రీ్ధర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘మై లవ్ స్టోరీ’ ఈమెకి అంతగా పేరు తేలేదు. తర్వాత ‘రేస్’, ఒక తమిళ, మరాఠీ.. చిత్రంలో నటించినప్పటికీ... సరైన ఛాన్స్‌లు రాలేదు. ‘తను మొన్ననే వెళ్లిపోయింది’ చిత్రం ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలీదు. అలా తన ‘చిత్ర’ జీవితాన్ని గడిపేస్తోంది.
నిక్కీ గల్రానీ
-నటిగా తమిళంలో తెరంగేట్రం చేసిన ‘నిక్కీ’ ఫ్యాషన్ డిజైనర్ కూడా. ఇటు మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది ‘కృష్ణాష్టమి’ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నిక్కీ.. ఇప్పటికీ అనేక అవార్డులు గెలుచుకొంది. ‘కోచి టైమ్స్’ నిర్వహించే ‘25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2015’లో 5వ స్థానాన్ని కొట్టేసింది. ‘కృష్ణాష్టమి’ చిత్రం అంతగా ఆడకపోవటంతో -నిక్కీకి తెలుగులో సరైన అవకాశాలు పడలేదు.
రశ్మి గౌతమ్
-‘జబర్దస్త్’తో అమాంతం పేరు గడించేసిన యాంకర్ ‘రశ్మి’ 2010 నుంచీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. అడపాదడపా కొన్ని చిత్రాల్లో చేసినా.. కమర్షియల్‌గా హిట్ కొట్టినా.. రశ్మికి అవకాశాలు రావటంలేదు. తనదైన స్టయిల్‌లో పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది.
మెహ్రీన్ పిర్జాదా
-మోడల్‌గా తన కెరీర్‌ని ఆరంభించి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెరకి పరిచయమైన మెహ్రీన్ -రాజస్థాన్‌లోని అజ్మీర్ అమ్మాయి. చిన్నతనం నుంచీ సాహసాలంటే ఇష్టమని చెప్పే ఈమె డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఫర్ అడ్వంచర్ అండ్ ట్రెక్కింగ్‌లో శిక్షణ పొంది అనేక సాహస పోటీల్లో పాల్గొని మెడల్స్ గెల్చుకుంది. ఈమె ప్రీ నేషనల్ ఎయిర్ పిస్టల్ షూటర్ కూడా. ‘మిస్ పర్సనాలిటీ ఆఫ్ సౌత్ ఏషియా కెనడా-2013’ కిరీటాన్ని కైవసం చేసుకొని.. ‘వీర ప్రేమగాథ’తో మార్కులు వేయంచుకుంది.
మాళవికా నాయర్
-‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ద్వారా మంచి మార్కులు కొట్టేసిన మాళవికా నాయర్ చైల్డ్ ఆర్టిస్ట్. అనేక మలయాళ చిత్రాల్లో నటించింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో తెలుగులో తన నటనా కెరీర్‌కి బాటలు వేసుకొని.. కళ్యాణ వైభోగమేతో ఫిక్సయిపోయింది. మైనర్ సపోర్టింగ్ రోల్స్‌తోనూ.. చిన్నచిన్న హాస్య ప్రధాన పాత్రల్లో కనిపించిన మాళవిక ‘బ్లాక్ బటర్‌ఫ్లై’ ద్వారా వెలుగులోకొచ్చింది.
నందితా రాజ్
-తేజ దర్శకత్వంలో ‘నీకు నాకు డాష్‌డాష్’ చిత్రం ద్వారా పరిచయమైన నందిత ‘ప్రేమ కథా చిత్రం’తో తనదైన ప్రతిభను కనబర్చింది. ఇటీవల విడుదలైన ‘సావిత్రి’ చిత్రం ఆమె నటనకి చక్కటి మజిలీ.
హెబా పటేల్
-తమిళ రొమాంటిక్ చిత్రం ‘తిరుమనం ఎనుం నిఖా’తో పరిచయమైన హెబా ‘ఈడోరకం ఆడోరకం’తో తెలుగు తెరపై తళుక్కున మెరసింది. ‘కుమారి 21ఎఫ్’ చిత్రం ఈమెని గుర్తుపెట్టుకొనేలా చేసింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘నాన్నా నేను నా బాయ్‌ఫ్రెండ్’ చిత్రాలతోపాటు రాబోయే మరో రెండు చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకోనుంది.
నీహారిక కొణిదెల
-‘ముద్దపప్పు.. ఆవకాయ’ వెబ్ సిరీస్ ఫిల్మ్‌తో కెరీర్ ప్రారంభించి.. తనదైన శైలితో కుర్రాళ్లని ఆకట్టుకొంది. ఎనె్నన్నో ఆశలతో ఎదురుచూసిన ‘ఒక మనసు’ కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. నీహారిక నటనకు చక్కటి ప్రశంసల జల్లు కురిసింది.
* * *
ఇంకా ఇలా ఎంతోమంది -ఈ ఏడాది తెలుగు తెరని ఆవిష్కరించారు. పోటీపడ్డారు. గెలుపు కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయా తారల్లో కొంతమంది ఒక్కో చిత్రంతో సరిపెట్టుకుంటే.. మరికొంతమంది మరో రెండు చిత్రాల్తో ముందుకెళ్లారు. ఏది ఏమైనప్పటికీ -కొత్తవాళ్లకి అవకాశాలు వెల్లువ ఉంటుందనీ.. తెలుగు తెర ‘కొత్తదనాన్ని’ ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటుందనటానికి ‘తారల’ తెరంగేట్రమే తార్కాణం.
హీరోయిన్ అంటే ఉన్న కొత్త అర్థాన్ని తిరగరాసి.. మేం కూడా ‘కథ’లో నాయికలమే అని చాటి చెబుతూనే తమ సత్తాని చాటుకొంటున్నారు.

-నిరీక్షణ