మెయిన్ ఫీచర్

అతికి పోతే.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేకింగ్‌ను సీక్రెట్‌గావుంచి, సినిమా విడుదల సమయానికి హైపునివ్వడం తెలుగు
చిత్ర పరిశ్రమలో లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది. మోషన్ పిక్చర్ పోస్టర్‌తోనో.. ఫస్ట్‌లుక్
టీజర్‌తోనో హైపునకు తెరలేపుతున్నారు. మేకింగ్ వీడియోస్ పేరిట హడావుడి
సృష్టిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, హైప్ మోజును వ్యాపారానికి జత చేసి -ఆ క్రేజ్‌లో క్యాష్ చేసుకోవాలనుకునే సంస్థల హడావుడీ ఇటీవల ఎక్కువైంది. అగ్ర హీరోల సినిమాలకు ఈ స్ట్రాటజీ కలిసొస్తుండటంతో
-విడుదలకు ముందే మంచి బిజినెస్
అయిపోతుంది. తీరా విడుదలయ్యాక
బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టి హైప్ కాస్తా ఫ్లాప్‌గా మారితే -అభిమానులకు నిరాశ
మిగులుతుంది. బయ్యర్లకు చుక్కలు
చూపిస్తుంది. ఇదీ ప్రస్తుతం
ఇండస్ట్రీలో లేటెస్ట్ ట్రెండ్.

దక్షిణాది సినిమాల్లో ‘బాహుబలి’ చేసిన హడావుడి ఇంతాఅంతా కాదు. మొత్తానికి సాదా సీదా కథే అయినప్పటికి కాపీ టెక్నికల్ వాల్యూస్‌తో గట్టెక్కింది. నిర్మాతలకే సరైన అంచనాలు అందకపోవడంతో బయ్యర్లు బాగానే లాభపడ్డారు. ఇప్పుడు వారంతా పార్ట్-2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఇంకా భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయం. అయితే, ఈసారి ఫలితం ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేం. బిజినెస్ 400 కోట్లు పైబడి జరిగే ఛాన్స్ ఉందన్నది అంచనా.
బాలీవుడ్ చిత్రాలు మేకింగ్ పరంగా వంద కోట్లను అవలీలగా ఖర్చు చేసి -మొదటివారంలోపే డబుల్, ట్రిపుల్ అవౌంట్‌లు లాగేస్తున్నాయి. ఈ కోవలో ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ముందంజలో ఉంటే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వందకోట్ల క్లబ్‌ని దాటిన నటీమణిగా కంగనారనౌత్ పేరుబడింది. ఇలాంటి సినిమాల ప్రసారాల విషయంలో గుత్తంగా ఒకే హీరో సినిమాలు కొనేయడం కూడా ఛానల్స్ చేసేస్తున్నాయి. ‘సల్లూభాయ్’ పది చిత్రాల హక్కులను ఓ ప్రముఖ ఛానల్ వెయ్యి కోట్లకు కొనేయడం గమనార్హం! ఈ తీరు చూస్తుంటే -పైకి కనిపిస్తున్న కొమ్ములను చూసి నీటిలోవున్న గేదెను బేరమాడుతున్నారని అనిపిస్తోంది.
***
పబ్లిసిటీ విషయంలో నిర్మాతలు మేకింగ్‌కు మించి వెచ్చిస్తున్నారు. ఈమధ్యే విడుదలైన ‘బిచ్చగాడు’ ప్రమోషన్ కోసం మొదట 50 లక్షలు కేటాయించారు. ప్రచారం బాగా జరిగి సినిమా వౌత్ టాక్‌తో హిట్ సాధించడంతో -ఆ సినిమా ప్రమోషన్ ఖర్చును రెండు కోట్లకు చేర్చారు నిర్మాతలు. ఇలాంటి ప్రచార వ్యూహంలో ఛానల్స్ కూడా -సినిమాకు సంబంధించి రోజుకో వార్తను వండివార్చి ప్రేక్షకులకు వడ్డిస్తుంటాయి. బాహుబలి విడుదలకు ముందు సమయాన్ని గుర్తు చేసుకుంటే -ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బాహుబలి సమయంలో చూపించిన క్లిప్పింగ్‌నే చూపిస్తూ, దాదాపు ఏడాదిపాటు చానల్స్ తమవంతు కృషి చేసాయి. విడుదలకు ముందు రోజుల్లో మరీ హడావుడి చేసేశాయి. ఎంతచేసినా ప్రేక్షకుడు ఓటేస్తేనే హైప్ నిజంగా పెరుగుతుందనేది నగ్న సత్యం.
‘కబాలి’ విషయంలో దక్షిణాది చిత్రాల హైప్ కొత్తపుంతలు తొక్కింది. ఏకంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు సినిమా కోసం సెలవులు ప్రకటించడం ఒక ఎత్తయితే, పుదుచ్ఛేరి, తమిళ ప్రభుత్వాలు సినిమా టికెట్లను ప్రోత్సాహకాలుగా ఇవ్వడం మరో ఎత్తు. కబాలి హైఫ్ ఏకంగా ఎగిరి ఎయిర్‌వేస్ స్థాయికి వెళ్ళడం మరింత ఉత్సుకత రేపింది. చాక్‌లెట్ కంపెనీలు, ముత్తూట్ వంటి ఆర్థిక సంస్థలు -‘కబాలి’ ప్రమోషన్‌కు కృషి చేస్తూనే.. రజనీ ఇమేజ్‌ను వ్యాపార ధోరణిలో వాడుకుంటూ -పరస్పరం కోట్ల రూపాయల వ్యాపారానికి తెరలేపాయన్న వార్తలొచ్చాయి. ఈ మధ్యకాలంలో ప్రతి అగ్ర హీరో సినిమా ప్రమోషన్‌ను బిజినెస్ సంస్థలు వాడుకోవడం కామనైంది. అయితే సినిమా హిట్‌కాక ఫట్ అయితే బిజినెస్ క్రేజ్ ఏమిటన్న సంగతికంటే రిలీజ్‌కి ముందు సంగతినే సంస్థలు లెక్కల్లోకి తీసుకుంటున్నాయి.
సినిమాకు హైప్ పెరిగిందంటే అనువాద వర్షన్ రేటు కూడా అదిరిపోతుంది. ఒకప్పటి ‘శివాజీ’.. ‘అపరిచితుడు’ రేట్లను చూసి ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఆశ్చర్యపోయారు. తెలుగు నిర్మాతలు సైతం ఖంగుతిన్నారు. ఇప్పుడు ఏకంగా 40కోట్లు ఆఫర్‌తో ‘కబాలి’ రైట్స్ తెలుగులో తీసుకోవడం సినిమాకు మరింత హైప్ తెచ్చింది. ఈ పెట్టుబడితో క్రేజీ కుర్ర హీరోలతో ఒకటి రెండు స్ట్రయిట్ సినిమాలు నిర్మించొచ్చు. కాని అనువాద వర్షన్‌కే ఇంత ఆఫర్ చేయడంతో -డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొనడం.. బయ్యర్లు షేర్ గ్యారెంటీలు పెట్టి సినిమాను వేయడం జరుగుతుంది. తీరా ఫలితం వచ్చాక కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
‘కొచ్చాడియన్ (విక్రమసింహ).. ‘లింగా’ సినిమాలతో దెబ్బతిన్న బయ్యర్లకు ‘కబాలి’ మరోమారు చుక్కలు చూపనుంది. కబాలి విడుదలకుముందే ‘లింగా’ బయ్యర్లు కోర్టును ఆశ్రయించడం తెలిసిందే! ఇదేవిధంగా దాదాపు 100 కోట్లతో నిర్మితమైన ‘బ్రహ్మోత్సవం’ బయ్యర్లకు.. అభిమానులకు మనస్తాపాన్నిచ్చింది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సైతం మంచి హైపుతోవచ్చి తేలిపోయింది. హైపు భారీగా పెరగడానికి ప్రధాన కారణం భారీ గ్యాప్‌లు పాటించడమే. సినిమా నిర్మాణం కోసం కూడా లాంగ్ టైమ్ తీసుకోవడం... సీక్రెసీగా నిర్మాణ విశేషాలు ఉంచటం.. ఆ తర్వాత ఫేక్ న్యూస్‌లు.. వాటి ఖండనలు.. చిన్న చిన్న క్రేజీ న్యూస్‌లతో విడుదల తేదీ వచ్చేవరకు హైప్ క్రియేట్ చేయడం నేడు కామనైపోయింది.
హైప్ పెరగడానికి క్రేజీ హోరోలు, క్రేజీ కాంబినేషన్లు ఒక కారణమైతే, క్రేజీ దర్శకులు, టెక్నికల్ టీం మరో కారణం. మొత్తానికి హైప్ మాటున బయ్యర్లు మునిగిపోతుంటే అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సినిమా నిర్మాతలు మాత్రం వారంలోనే అసలు మూటకట్టుకోవడం.. లాభాలు పండించుకోవడం జరుగుతుంది. హైప్ మాటున విజయాలకంటే పరాజయాలు ఎక్కువ పలకరిస్తే బయ్యర్లు.. అభిమానులు.. ప్రేక్షకులు సినిమాలకు కాస్త దూరం జరగడం ఖాయం.
నేడు సినిమా ఎల్లలు బాగా విస్తరించాయి. ప్రాంతీయ భాషాచిత్రాలు సైతం స్ట్రయిట్‌గా, అనువాదంగా ప్రపంచమంతా హల్‌ఛల్ చేస్తున్నాయి. పైరసీ పుణ్యమా అని వంద రోజుల మాటపోయి 10 రోజుల్లోనే కలెక్షన్లు కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే అగ్ర హీరో సినిమా ఎన్ని భాషల్లో విడుదలవుతుందో.. ఎన్ని ప్రదేశాల్లో విడుదలవుతుందో.. లెక్కలు చెప్పిమరీ రెచ్చగొడుతున్నారు. అక్కడ విడుదలకు సిద్ధవౌతున్న సినిమాలు వెనక్కి జరిగి మరీ స్క్రీన్స్‌ని అందిస్తున్నాయి. పెద్ద సినిమా త్వరగా ఖాళీ అయిపోతేనే -వెనక్కి జరిగిన సినిమాలు వరుసగా వస్తున్నాయి. అంటే -ఒకరకంగా అండర్ స్టాండ్ బిజినెస్ జరుగుతుంది. కబాలి విషయంలో తెలుగు స్క్రీన్‌పై అదే డేట్‌కి రావాలని నిర్ణయించుకున్న సునీల్ జక్కన్న వెనక్కి జరిగడం, వారం తిరక్కుండానే విడుదలైపోవడం ఒక ఉదాహరణ.
అగ్ర హీరో సినిమా అంటే వేల స్క్రీన్‌లు సందడికి సిద్ధమవుతాయి. ఆన్‌లైన్ బుకింగ్ వచ్చాక టికెట్లను కొనడానికి ప్రేక్షకులూ ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్.. థియేటర్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్‌లతో వందల థియేటర్లు వారంపాటు ఫుల్‌బోర్డులు పెట్టేస్తున్నాయి. ఇక్కడే సినిమా నిర్మాణ వ్యయంలో 75 శాతం వచ్చేస్తుంది. ఇది వర్కవుట్ అవ్వాలంటే -ప్రేక్షకులను విపరీతంగా భ్రమింపజేయాలి. దానికోసం సదరు యూనిట్ రకరకాల ఫంక్షన్లు.. స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ హైప్‌మాటున ప్రేక్షకులు.. బయ్యర్లు దోపిడీకి గురౌతున్నారు.
***
సినిమాకు లాభాలువస్తే నిర్మాతకు అదనంగా ముట్టజెప్పని బయ్యర్లకు నష్టాన్ని పూడ్చమనే అధికారం లేదనేది ఇండస్ట్రీ వాదన. లోఫర్ సినిమా విషయంలో నైజాం బయ్యర్లు పూరీ జగన్నాథ్‌పై దాడిచేసినట్టు వార్తలు విన్నాం. బయ్యర్ల మాట ఎలావున్నా ‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అన్నందుకు ప్లాప్ తగిలితే క్రేజీ దర్శకులపై అదే బ్యానర్ నిర్మాతలు ఒత్తిడి చేసే అవకాశం కూడా వుంది. ‘అఖిల్’ ఫ్లాప్ విషయంలో వినాయక్ మరో సినిమా అదే బ్యానర్‌కి చేస్తున్నాడని వార్తలు హల్‌ఛల్ చేశాయి. హైప్‌ను క్రియేట్ చేయడానికి హీరో.. దర్శక.. నిర్మాతలు పర భాషా ప్రాంతాల్లోనూ బాగానే హడావుడి చేస్తున్నారు. ఈ విషయంలో బాహుబలి బడా పోస్టర్ విడుదలను ప్రస్తావించొచ్చు.
బడ్జెట్ విషయానికొస్తే నేడు క్రేజీ హీరో చిత్రమంటే దక్షిణాదిన 50-100 కోట్ల మధ్య ఉంటుంది. ఆఖరికి చిన్న చిత్రం అని చెప్పుకునే సినిమా కూడా 2 కోట్ల వరకూ ఖర్చు చేయిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రంగా ప్రచారంతో హైప్‌కు తెరతీయడం నేడు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తయ్యాకా లెక్కతేలేవి.. ఇప్పుడు ముందు లెక్కలతోనే మొదలు పెడుతున్నారు. బడ్జెట్‌లో క్రేజీ హీరో.. హీరోయిన్.. దర్శకుడు కలిపి 40 శాతం లాగేస్తున్నారు. మిగతా 60 శాతంలో ఇతర కాస్టింగ్.. మేకింగ్ ఖర్చులు ఉంటున్నాయి. కొన్ని సినిమాలు బడ్జెట్ విషయంలో అదుపుతప్పుతుంటే.. మరికొన్ని అన్ లిమిటెడ్ పేరుతో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనా బడ్జెట్ నిర్మాతల పాలిట వరమా? శాపమా? అనేది తెలియకుండా ఉంది. క్రేజీగా కోట్లు కొల్లగొట్టిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నిర్మాత పవన్‌కళ్యాణ్‌కు బ్యాలెన్స్ ఎందుకు చెల్లించలేదు? ఈ విషయంలో ఎందుకు రచ్చ జరిగింది అంటే సమాధానం వుండదు.
నిజానికి కలెక్షన్ల ద్వారా వచ్చిన సొమ్ముకు ఇన్‌కమ్‌టాక్స్ ఎంతవరకు.. ఎంతమంది చెల్లిస్తున్నారు? అనేది ప్రశ్న. ఎందుకంటే కలెక్షన్లు అనేవి పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేస్తారు. ఇది వాస్తవమా? అంటే వారికే ఎరుక. కలెక్షన్ల హంగామా కూడా హైప్ క్రియేషన్‌లో ఓ భాగమే. మరైతే నిజమేమిటి? ఆ దేవుడుకే ఎరుక. సినిమా విషయం లేకపోతే చేసిన హైప్‌కు ప్రేక్షకులు తిట్టుకుంటారు. ఇదో రకంగా ప్రేక్షకులను మోసం చేయడమే.. మోసపూరితమైన దోపిడియే! కానీ సినిమా కళాత్మక వ్యాపారంగా నానాటికీ కొత్తపుంతలు తొక్కుతుంది. కాబట్టి లాభ నష్టాలను ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు పంచుకోక తప్పదు.
కోట్లు ఖర్చుచేసి తమ ప్రాడెక్ట్‌లకు క్రేజీ హీరోలను పెట్టుకునే కంటే ఆ సినిమాను ఉపయోగించుకుని ప్రమోట్ చేసుకోవడం బెటర్ అని వాణిజ్య సంస్థలు భావిస్తున్నాయి. అందుకే ఈ తరహా పబ్లిసిటీ బాగా పెరిగింది. ఇది నిర్మాతకు ఫ్రీ పబ్లిసిటీతోపాటు హైప్‌ని క్రియేట్ చేయడం.. కొంత డబ్బును తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇదికాక సినిమా పేరుతో ప్రాడెక్ట్‌లను.. గేమ్‌షోలను తయారుచేసి మార్కెట్ చేసుకుంటున్నారు. సినిమాకు అవార్డులు.. రివార్డుల కంటే హైప్ ముఖ్యమని నిర్మాతలు భావిస్తున్నారు. హైప్ జరిగితే కలెక్షన్ల వర్షం.. లాభాల పంటలు ఖాయం. హైప్ ఫ్లాప్‌గా మారితే జరిగే డామేజ్ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పటికే రజనీకాంత్ వరసగా విక్రమసింహ.. లింగా.. కబాలితో రుచి చూసాడు. పెద్ద హీరోల విషయంలో హైప్ ఫ్లాపుగా మారినా మళ్ళీ హైప్ క్రియేటయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకరకంగా హైప్ ఒక అడ్వాంటేజ్.. ఒక డిసప్పాయింట్‌మెంట్.

కత్తి పదునెంత?
చిరంజీవి తన 150వ చిత్రం గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. కథను మార్చామన్నారు. డైరెక్టర్లను మారుస్తూ వచ్చారు. కథ, డైరెక్టర్ కుదిరాక వీరుకాదు వారు అంటూ హీరోయిన్ల ఎంపికపై హైప్ క్రియేట్ చేశారు. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదనీ అంటున్నారు. టైటిల్ దగ్గరా పేచీ ఆగలేదు. ఇవన్నీ చూస్తుంటే, అంచనాల్ని పెంచుతున్న వ్యవహారంలాగే కనిపిస్తుంది. ఆసక్తి రేపేందుకు సినిమాట్రిక్స్ ప్రయోగిస్తున్నారనీ అనిపిస్తుంది. అయితే అతి ప్రచారంవల్ల సర్దార్, బ్రహ్మోత్సవం తాజాగా కబాలి బకెట్ తనే్నశాయని గుర్తించాలి. అతి చేసేకంటే కాస్త ప్రచారం తగ్గించి ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరిస్తే బెటర్. చిరు అభిమానులకు కొదవేం లేదు. సినిమా బావుంటే, వాళ్లే పైకి లేపుతారు 150వ చిత్రాన్ని. లేకుంటే కబాలికి పట్టిన గతే కత్తికీ పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
-హితీక్ష, పాఠకురాలు, రమణయ్యపేట

-బాసు