మెయిన్ ఫీచర్

జీవించేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి హీరోయిన్..
ట్రెండ్ మార్చేసింది. కేవలం అందాన్ని చూపించి ఆకట్టుకునే తంతుకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. గ్లామర్‌గా కనిపిస్తూనే.. పాత్రలో జీవించేందుకు ప్రయత్నిస్తోంది. తను పోషించాల్సిన పాత్రకు ఒకింత ఔన్నత్యం ఉండేలా చూసుకుంటోంది. హీరో సరసన అందాలూరించే అపరంజిలా గంతులేయడానికో.. హద్దుదాటే రొమాంటిక్ సన్నివేశాలతో ఆడియన్స్‌ని మురిపించడానికో పరిమితమయ్యే పాత్రలు వస్తుంటే -వద్దని నిర్మొహమాటంగా తిప్పికొడుతున్న కథానాయికల సంఖ్య పెరుగుతోంది. గ్లామర్ పాత్రలకు నిత్యమీనన్ నో చెప్పిందనో.. ఫలానా సినిమాలో ప్రాధాన్యత లేని పాత్రను సమంత కాదనుకుందనో
అప్పుడప్పుడు వినిపించే కథనాలు -ఇప్పుడు చాలామంది హీరోయిన్ల నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవానికి అలాంటి సినిమాలను వదిలేసుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగింది కూడా. మొత్తంగా హీరోయిన్ ట్రెండ్ మార్చింది. ఇంకా మారుస్తోంది.

1950-60 దశకంలో హీరోయిన్ -ముఖ్యమైన పాత్ర
1970-1980 దశకంలో హీరోయిన్ -కథలో ఓ పాత్ర
1990-2000 దశకంలో హీరోయిన్ -జస్ట్ గ్లామర్ గాళ్
2000-2010 దశకంలో హీరోయిన్ -పీలికల దుస్తులు, బికినీలు
2010-2016 హీరోయిన్ కొత్త ట్రెండ్ -గ్లామర్‌తో కూడిన నటన

మన హీరోయిన్లు చాలా మారిపోయారు. స్క్రిన్ షోకి, లిప్‌లాక్‌లకి ఏమాత్రం ఇబ్బంది లేదంటూ నిన్నమొన్నటి వరకూ తెగింపును ప్రదర్శించిన హీరోయినే్ల.. ఇప్పుడు నటనలో సత్తా చాటుకునే సినిమాలను వెతుక్కుంటున్నారు. అందుకోసం ప్రయోగాలకూ సిద్ధమవుతున్నారు. హీరోయిన్‌గా సత్తా చాటుకునేందుకు -లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కొందరు తమను తాము ప్రూవ్ చేసుకుంటుంటే.. -హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే కాల్షీట్లు ఇస్తామంటూ డిమాండ్ చేసే స్థాయికి ఇంకొందరు ఎదిగారు. అంటే -నిన్న మొన్నటి వరకూ స్కిన్‌షోతో అదరగొట్టిన ముద్దుగుమ్మలే ఇప్పుడు కథలో కీలకమైన పాత్రలు పోషిస్తూ హీరోలతో సమానస్థాయిని కోరుకుంటున్నారు.
సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సమంత -సైలెంట్‌గానే తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఒప్పుకుంటున్న ప్రాజెక్టుల్లో తన పాత్రకు ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తపడుతోంది. కేవలం గ్లామర్ ప్రదర్శనకే సమంత సినిమాలు చేయదన్న టాక్ తెచ్చుకుంది. సమంత చేసిన సినిమాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌కు ప్రాధాన్యత ఇచ్చిందే లేదు. తన కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ‘అఆ’ అంటూ సమంతే చెప్పుకొచ్చింది. ఆమె కోసమే దర్శకుడు త్రివిక్రమ్ ఆ పాత్రను మలిచాడన్నది ఇండస్ట్రీ టాక్. అత్తారింటికి దారేదిలో సమంతను కొంచెం గ్లామర్ కోణంలో చూపించిన త్రివిక్రమ్, అఆలో వైవిధ్యమైన పాత్రగా మలిచాడు. తనదైన అభినయాన్ని ప్రదర్శించి సమంత మెప్పించింది కూడా.
అమ్మ మాట వినకతప్పని కొంటె పిల్లలా, తనకు స్వేచ్ఛ లేదని బాధపడే అమ్మాయిలా, ఇష్టంలేని పెళ్లిని కాదనే ధైర్యంలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పిరికిదానిలా, అత్తయ్య కుటుంబాన్ని, ఆ కుటుంబంలోని బావ ఆనంద్ విహారిని ఇష్టపడే సగటు పట్నంపిల్లలా... కథానుగుణంగా పాత్ర మార్పులకు అనుగుణమైన అభినయాన్ని ప్రదర్శించి మెప్పించింది. తనదైన నటన, అందులో కొంచెం చిలిపితనాన్ని రంగరించి -గ్లామర్‌కు కొత్త అర్థాన్ని ఇవ్వగలిగింది సమంత.
గ్లామర్ ఎక్స్‌పోజింగ్ పాత్రల ప్రాజెక్టులతో కాల్షీట్ల కోసం నా దగ్గరకు రావొద్దు -అంటూ ఖరాకండిగా చెప్పే హీరోయిన్ల లిస్టులో నిత్యమీనన్‌ను కూడా చెప్పుకోవాలి. అందమైన శిల్పం లేకున్నా ఆహార్యంతో కట్టిపడేసే నటనానుభవాన్ని సంపాదించిన నిత్య -గ్లామర్ డాల్‌గా కనిపించే పాత్రలను నిర్మొహమాటంగా తిప్పికొడుతుంది. తన పాత్రకు ప్రాధాన్యంతోపాటు, ఆ కథలో తన పాత్రకు ఔన్నత్యాన్ని కూడా వెతుక్కుంటోంది. ప్రతి సినిమాలోనూ ఫ్రెష్‌నెస్‌ని ప్రజెంట్ చేయగల సత్తాతో దూసుకుపోతున్న నిత్య -కొన్ని పాత్రలు ఆమె మాత్రమే చేయగలదన్న నమ్మకాన్ని సంపాదించుకుంది. స్టార్ హీరోలతోనే చేయాలన్న పరిమితులు పెట్టుకోకుండా -చిన్న హీరోలతో సమాన స్థాయి కలిగిన హీరోయిన్ పాత్రలను ఎంచుకుంటున్న తీరు అభినందనీయమే.
ఇక తొలి సినిమాతోనే వైవిధ్యమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కీర్తి సురేష్. రామ్ హీరోగా నేనుశైలజ చిత్రంతో తెలుగు స్క్రీన్‌కు పరిచయమైన కీర్తి -హీరోతో సమాన ప్రాధాన్యం కలిగిన పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్కిన్‌షోకి ఎక్కడా తావివ్వకుండా -నిండైన నటనతో, పాత్రకు తగిన అభినయంతో మెప్పు సంపాదించింది. నిజానికి ఏ హీరోయిన్ అయినా తొలి సినిమాకు గ్లామర్ మంత్రం పటించక తప్పని రోజులివి. కానీ ఈ మలయాళీ అందం మాత్రం పాత్ర ప్రాధాన్యత మేరకు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కుర్రకారుకు గాలం వేయగలిగింది. ఎమోషనల్ సన్నివేశాల్లో పరిణితిని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. తండ్రి ప్రేమకి దూరమై, మనసు భావాలకి మాటనివ్వలేని ఇంట్రావర్ట్ శైలజగా కీర్తిసురేష్ మంచి పేరే కొట్టేసింది.
గ్లామరస్ హీరోయిన్‌గానూ, పాత్రోచిత ప్రాధాన్యతను కనబర్చే కథానాయికగా దూసుకుపోతోంది రకుల్‌ప్రీత్ సింగ్. తక్కువ సినిమాలతోనే టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కూ లేని క్రేజ్ సంపాదించేసింది. మోడలింగ్ ఫీల్డ్‌నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాల్లో గ్లామరస్ డాల్‌గానే కనిపించినా... ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో క్యారెక్టర్‌కు కొత్త మేకోవర్ ఇచ్చింది. ఈ చిత్రంలో గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్‌కూ ప్రాధాన్యత చూసుకుంది. ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం రకుల్ కమిట్‌మెంట్‌కి నిదర్శనం. ఇక మొన్నటి అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠినీ ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. తొలి సినిమాలోనే నటనతో ఆకట్టుకున్న లావణ్య, తరువాత దూసుకెళ్తా చిత్రంతో మంచిపేరు కొట్టేసింది. అందులోనూ ఆమె పాత్రచుట్టే కథ తిరగడం, స్కిన్‌షోకు తావివ్వని పాత్ర కావడం ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. తరువాత వచ్చిన భలేభలే మగాడివోయ్‌లో సెటిల్డ్ క్యారెక్టర్ చేసిన లావణ్య, ఈ ఏడాది ఆరంభంలో ‘సోగ్గాడే చిన్నినాయన’తో తనెంటో నిరూపించుకోగలిగింది. కొంచెం గయ్యాళితనం, మరికొంచెం గడుసుతనం.. రెండూ కలగలిపిన పాత్రను అలవోకగా పోషించిన లావణ్య, ఒక కోణంలో హీరో నాగార్జునతో పోటీ పడిందనే చెప్పాలి. బోల్డ్ గ్లామర్‌కు తావివ్వకుండా -ఒక డాక్టర్ వైఫ్‌గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.
నానికి జోడీగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో ఎంట్రీ ఇచ్చిన మాళవికానాయర్ సైతం ఇదే స్ట్రాటజీని ప్లే చేస్తోంది. గ్లామర్‌కన్నా పెర్ఫార్మెన్స్‌కే ఎక్కువ మార్కులు సంపాదిస్తోంది. ఆ తరువాత ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో మరోసారి మంచి పాత్ర పోషించి శభాష్ అనిపించుకుంది. ఫారిన్లో ఎండీ చదవాలని కోరుకుంటున్న అమ్మాయిని, తల్లిదండ్రులు పెళ్లికోసం తొందర పెడతారు. తనను పెళ్లిచేసుకున్న అబ్బాయి కూడా తన టైపే కావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని, తరువాత విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవుతారు. ఈ ప్రాసెస్‌లో వీళ్లిద్దరి మధ్యా నిజంగానే ప్రేమ పుడుతుంది. అలాంటి దివ్య పాత్రలో మాళవిక నాయర్ అదరగొట్టేసింది. అందం అభినయం రెండింటితోనూ ఆకట్టుకుంది.
అప్పుడప్పుడు గ్లామర్ ఫొటో షూట్‌లతో రెచ్చగొట్టే ఆదాశర్మ, ఈ ఏడాది ఓ మంచి పాత్రతో ‘క్షణం’ సినిమాలో మార్కులు కొట్టేసింది. ప్రియుడికి దూరమైన అమ్మాయిలా.. బిడ్డ కోసం తపనపడే తల్లిలా.. తనను నమ్మని జనంనుంచి, లోకంనుంచే వెళ్లిపోయిన అబలలా.. వైవిధ్యమైన పాత్రలో ఒదిగిపోయిన ఆదా పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అప్పుడే తల్లి పాత్రలా? అన్న ఆంక్షలు పెట్టకుండా, నచ్చిన పాత్రకు నూరు శాతం న్యాయం చేసి ఔరా! అనిపించింది ఆదాశర్మ.
తాజాగా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది హీరోయిన్ అయిపోయింది మలయాళీ భామ నివేదా థామస్. జెంటిల్‌మన్ సినిమాలో హీరో నానికి జోడీగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పక్కా థ్రిల్లర్ మూవీగా జనాన్ని ఆకట్టుకున్న జెంటిల్‌మన్‌లో నానికంటే నివేదకే ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు ఆడియన్స్. రూపలావణ్యాలతో ఆకట్టుకుంటూనే, కేథరిన్‌గా పాత్రకు తగిన అభినయాన్ని ప్రదర్శించి మార్కులు కొట్టేసింది నివేద. జెంటిల్‌మన్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న నివేదకు మంచి ఆఫర్లే వచ్చిపడుతున్నాయి. పేర్లు ప్రస్తావించకున్నా -ఈ తరహా ఆటిట్యూడ్ చాలామంది హీరోయిన్లలో కనిపిస్తోంది. అంటే కొత్త హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారన్న మాట. ఇప్పటి వరకూ వచ్చిన హీరోయిన్లు చూపించింది చాలు.. ప్రేక్షకులకు సైతం అందాల ఆరబోత మీద బోర్ కొట్టేసింది. ఇకనైనా మమ్మల్ని నటించనివ్వండి. అందుకు ఔన్నత్యమున్న, ప్రాధాన్యత కలిగిన పాత్రలను డిజైన్ చేయండి అంటూ దర్శకులు, రచయితలకు మెసెజ్ పంపుతున్నారు. ఈ విషయంలో ప్రయోగాలకైనా సిద్ధమేనంటూ -తల్లి పాత్రలు, గుడ్డిపాత్రలకు సైతం సై అంటూ సవాల్ చేస్తున్నారు. మంచి పాత్ర, పేరు తెచ్చే పాత్రా అనుకుంటే -ఎక్కువ కాల్షీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతోంది నేటి హీరోయిన్. అందుకే సినిమాలో హీరోయిన్, అలాంటి హీరోయిన్ చేస్తున్న సినిమా -ప్రేక్షకుడికి కొత్తగా కనిపిస్తోంది.

-శ్రీనివాస్