మెయిన్ ఫీచర్

చలో.. హాలీవుడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ఇంటర్వ్యూతోనైనా -పలకరించి.. నెక్ట్స్ టార్గెట్ ఏమిటని ప్రశ్నించి పుణ్యం కట్టుకున్నారా?... ఠక్కున ‘హాలీవుడ్’ అని ముక్తాయింపు పలుకుతాయి బాలీవుడ్ సినీ పక్షులు. పర‘దే’శ దవారాలన్నీ -వీళ్ల కోసం తెరచి సుస్వాగతం పలుకుతున్నట్టు
బిల్డప్‌ల మీద బిల్డప్‌లు. అదే టాలీవుడ్
నటీమణులను ప్రశ్నించారా? అధాటున
‘బాలీవుడ్’ అంటూ బాజాభజంత్రీలతో కబుర్లు చెప్పేస్తారు.
పొరుగింటి పుల్లకూర సామెత.
దృష్టంతా పక్క రాష్ట్రాల మీద, పక్క దేశాల మీద.

ఎదగటంలో తప్పులేదు గానీ.. ఉన్న ఊరిని వదిలి.. పరాయి దేశానికి వెళ్లి.. ఎంతవరకూ సక్సెస్ సాధించారన్నది ప్రశ్నార్థకం. ఆఖరి ప్రశ్నలో వెలిబుచ్చే కోర్కెల మేళాలో బాలీవుడ్ నటి అయితే హాలీవుడ్.. టాలీవుడ్ ఐతే బాలీవుడ్... కొన్ని ఉదాహరణ సమేతంగానూ చెప్పేస్తారు. టాలీవుడ్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో చెలరేగి దశాబ్ద కాలంపాటు వెలుగొందిన శ్రీదేవి, జయప్రదలాంటి పేర్లు వినిపిస్తారు. తర్వాత్తర్వాత అలా తళుక్కున్న మెరిసే ఛాన్స్ తమకే ఉందని భజాయిస్తారు. బాలీవుడ్‌లోనూ హాలీవుడ్ తంతు ఇదే రీతిన కొనసాగుతూనే ఉంటుంది. టాలీవుడ్ నుంచీ బాలీవుడ్‌కి వెళ్లిన వారి సంఖ్య అరకొరగానే ఉంది. ఐతే- బాలీవుడ్ టు హాలీవుడ్ యాత్రా ప్రస్థానం గత కొన్నాళ్లుగా ఏ తీరుగ సాగుతోందో ప్రస్తావిద్దాం.
ఓవైపు ప్రియాంక చోప్రా.. మరోవైపు దీపికా పదుకొనే ‘హాలీవుడ్’లో అడుగు పెట్టింత్తర్వాత.. తాజాగా హుమా ఖురేషి (గ్యాంగ్స్ ఆఫ్ వసెపూర్ ఫేం) ‘ది మమీ’ సీక్వెల్‌లో కనిపించబోతోందని వినికిడి. టామ్ క్రూసీ -సోఫియా బౌటెల్లాతోపాటు హుమా’ నటించటానికి ఒప్పందం కుదిరిందనీ.. ఆడిషన్స్ జరుగుతున్నాయన్నది వార్త. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసెపూర్’తో నటిగా తానేమిటో సత్తా చాటిన హుమా.. తనకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తూ కోటి కాంతులను కళ్లలో నింపుకొంది.
నిజానికి -2016 బాలీవుడ్ టు హాలీవుడ్‌కి బాటలు వేసిందన్నది నిర్వివాదాంశం. ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రంతో దీపికా పదుకొనె వేసిన అడుగుజాడల్లోనే -ఇప్పుడు రాణీ ముఖర్జీ, షాహిద్ కపూర్ నడుస్తున్నారు. ‘దిల్ బోలె హడిప్పా’ పాట ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ ‘లిమిట్‌లెస్’లో ఈ పాట తరచూ కనిపించటం.. అమెరికన్ కొరియోగ్రాఫర్ ఈ పాటని డిజైన్ చేయటం.. కాస్ట్యూమ్స్ ఇండియన్ స్టైల్‌లో ఉండటం చూస్తే.. హాలీవుడ్ జనాలకు ఈ పాట ఎంతగా ఎక్కిందో అర్థమవుతుంది. త్వరలోనే ‘రాణీ-షాహిద్’లు ఏ హాలీవుడ్ చిత్రంలో కనిపిస్తారో వేచి చూడాల్సిందే.
దీపిక ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని.. జాక్వెలిన్ కూడా అటువైపు అడుగు వేసింది. వార్నర్ బ్రదర్స్ ప్రాజెక్ట్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు స్టేట్‌మెంట్ ఇచ్చింది. అదే ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’. ఇంటర్నేషనల్ టీవీ షో ‘క్వాంటికో’తో గ్లోబల్ ప్లాట్‌ఫాం మీదికి వచ్చిన మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా.. యుఎస్., లాస్‌ఏంజెల్స్ వేదికలపై అలరిస్తోంది. హాలీవుడ్‌లో ప్రియాంక అంటే తెలీని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
‘త్రిదేవ్’ ‘చాందినీ’ ‘డాడీ’ ‘1942-ఎ లవ్ స్టోరీ’ ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ లాంటి లెక్కకు మించిన చిత్రాల్లో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించి.. కేరెక్టర్ యాక్టర్‌గా బాలీవుడ్‌లో సుస్థార స్థానాన్ని ఏర్పరచుకొన్న అనుపమ్‌ఖేర్ ‘ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైస్’తో హాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ‘సిల్వర్ లైనింగ్ ప్లేబుక్’ చిత్రంలో బ్రాడ్లే కూపర్, జెన్నిఫర్ లారెన్స్‌తో నటించిన అనుపమ్.. ఈ చిత్రం ‘ఆస్కార్ బెస్ట్ పిక్చర్’గా నామినేట్ కావటంతో ఖేర్ హాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చంటున్నారు.
ఇర్ఫాన్‌ఖాన్ - టెలీవిజన్‌లో ‘చాణక్య’ ‘్భరత్ ఏక్ ఖోజ్’ ‘సారా జహా హమారా’ ‘బనేగీ అప్నీ బాత్’ ‘చంద్రకాంత’ సీరియల్స్‌తో కెరీర్‌ని స్టార్ట్ చేసి అనతి కాలంలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ‘ఇర్ఫాన్’ -‘సలామ్ బాంబే’తో తెరంగేట్రం చేశాడు. ఐతే -ఆ చిత్రంలోని తన పాత్ర ఎడిటింగ్‌లో పోయినప్పటికీ.. నిరాశ చెందక.. ‘ఏక్ డాక్టర్ కీ వౌత్’ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత విశాల్ భరద్వాజ్ ‘మక్బూల్’ చిత్రంతో మరో అడుగు వేసినప్పటికీ.. అవకాశాలు అంతగా లభించలేదు. ఐతే- ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ అతడి కెరీర్ గ్రాఫ్‌ని కొద్దిగా మార్చింది. హాలీవుడ్ ఎ-లిస్ట్ నటి ఏంజెలీనా జోలె సరసన ‘ఎ మైటీ హార్ట్’ చిత్రంతో నటించి.. హాలీవుడ్‌లో పునాదులు వేసుకొన్నాడు. హెచ్‌బిఓ సిరీస్ ‘ఇన్ ట్రీట్‌మెంట్’తో విమర్శకుల ప్రశంసలు పొందాడు కూడా. ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్’ చిత్రంలో విలన్‌గా, ‘లైఫ్ ఆఫ్ పై’లోనూ నటించాడు. తాజాగా సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ ‘డెవలప్‌మెంట్ ఆఫ్ జురాసిక్ వరల్డ్’ జురాసిక్ పార్క్ ఫిల్మ్ సిరీస్‌తో ముందంజ వేస్తున్నాడు.
-ఎల్’ఒరియల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందేం లేదు. ఎందుకంటే- హాలీవుడ్‌లో కమెడియన్ స్టీవ్ మార్టిన్ సరసన ‘ది పింక్ పాంథర్-2’ నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వచ్చిన ‘బ్రైడ్ అండ్ ప్రెజ్యుడిస్’ ‘మిస్ట్రెస్ ఆఫ్ స్పైస్’ ‘ప్రొవోక్డ్: ఎ ట్రూ స్టోరీ’ ఇలా లెక్కించ తగ్గ మోతాదులో హాలీవుడ్ చిత్రాల్లో నటించి.. నటిగా తనకి తిరుగులేదన్న ఖ్యాతిని సుస్థిరం చేసుకొంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఆమె మకుటం లేని మహారాణి. తన సెక్స్ అప్పీల్‌తో మిలియన్ల హాలీవుడ్ జనాలను మంత్రముగ్ధుల్ని చేసి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది.
‘స్లమ్ డాగ్ మిలియనీర్’లో అనిల్ కపూర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ.. ఆ పాత్రలో అతను ఎంతగా వొదిగిపోయాడోనని ముచ్చటపడతారు. అంతర్జాతీయ వేదికపై ఆ చిత్రం సంపాదించుకొన్న ప్రశంసలలో అనిల్‌కపూర్‌కీ వాటా ఉంటుంది. దీంతో అతగాడు కూడా హాలీవుడ్ వైపు తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఇంటర్నేషనల్ హిట్ టీవీ సిరీస్ 24లో -ఒమర్ హసన్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఆ తర్వాత ‘మిషన్ - ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రొటోకాల్’తో, ‘సిటీస్’తో నటుడిగా హాలీవుడ్‌లో స్థిరపడ్డాడు.
-హిందీ సినీ ఇండస్ట్రీలో విలన్‌గా, కేరెక్టర్ యాక్టర్‌గా అమ్రీష్‌పురి వేసిన పునాదిని ఎవ్వరూ మర్చిపోరు. ఆయన నటనకు ముగ్ధులైన హాలీవుడ్ నిర్మాతలు 1984లో ‘టెంపుల్ ఆఫ్ ధూమ్‌దత్’తో ఆహ్వానం పలికారు. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు హేరిసన్ ఫోర్డ్‌తో పాటు, అమ్రిష్‌పురి నటించాడు. ‘గాంధీ’ చిత్రంలో బెన్‌కింగ్‌స్లేతోపాటు నటించిన సంగతి ఎవ్వరూ మర్చిపోరు.
-వివాదాస్పద నటిగా పేరుగాంచిన మల్లిక షెరావత్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తను ధరించే కాస్ట్యూమ్స్ మొదలుకొని.. కెరీర్ పరంగా.. లైఫ్‌పరంగా అనుక్షణం వార్తల్లో ఉంటూనే వస్తుంది. టీవీ యాడ్స్‌తో మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించిన ఈ హర్యానీ భామ ‘ఖ్వాయిష్’ చిత్రంతో బాలీవుడ్‌లో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత ‘మర్డర్’ చిత్రంతో సెక్సీ సిరెన్ ఇమేజ్‌ని సొంతం చేసుకొన్న ఈ అమ్మడు -జాకీ చాన్ ‘ది మైత్’ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘పాలిటిక్స్ ఆఫ్ లవ్’ ‘అకా లవ్’ ‘బారాక్’ ‘ఖుదోస్’ చిత్రాల్తో హాలీవుడ్‌లో తన కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
‘చాచీ-420’ ‘చాందినీ బార్’ చిత్రాల ప్రస్తావన వస్తే.. టబుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మల్టీ టాలెంటెడ్ నటి తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, బెంగాలీ చిత్రాలలో నటించి.. ఆపైన ‘నమ్‌సాకె’ చిత్రంతో హాలీవుడ్‌లో ప్రవేశించింది.
అమ్రిష్‌పురితోపాటు తొలినాళ్లలో హాలీవుడ్ వైపు అడుగులు వేసిన నటుడు ఓంపురి. ‘వైట్ టీత్’ అనే బ్రిటీష్ టెలివిజన్ డ్రామా సిరీస్‌లో సమద్‌మియా ఇక్బాల్ నటించిన ఓంపురి -ఆనక ‘ది పెరోల్ ఆఫీసర్’ ‘ది మిస్టిక్ మాసిర్’ ‘ది ఘోస్ట్ అండ్ ది డార్క్‌నెస్’ ‘సిటీ ఆఫ్ జాయ్’ చిత్రాల్లో నటించి తూర్పు పడమరకు అనుసంధానం అయ్యాడు.
అర్థవంతమైన చిత్రాల్లో మాత్రమే నటించేందుకు ఉత్సాహం చూపించే.. నసీరుద్దీన్ కొద్దిపాటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. సీన్ కానరీ చిత్రం ‘ది లీగ్ ఆఫ్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ జెంటిల్‌మెన్’లో కనిపించారు. -ఇలా వేళ్ల మీద లెక్కపెట్టగల నటీనటులు మాత్రమే హాలీవుడ్‌లో అడుగుపెట్టి మరింత మందికి స్ఫూర్తిదాతలవుతున్నారు. ఇక -ఇంకెంతమంది హాలీవుడ్‌లో ప్రవేశించనున్నారో వేచి చూద్దాం.

-అనిల్