తెలంగాణ

మేడిగడ్డకు నేడు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 1: ఒకప్పుడు ‘మావో’లకు అది పెట్టని కోట. అలాంటి తూర్పు డివిజన్‌లోని దండకారణ్యంలో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం అడుగుపెట్టబోతున్నారు. మేడిగడ్డ (కాళేశ్వరం) ఆనకట్ట శంకుస్థాపన సందర్భంగా తూర్పు డివిజన్‌లో సిఎం పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్ ఆదివారం రాత్రి 7:40గంటలకు కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికారు. సిఎం రాత్రి ఇక్కడే బస చేసారు. సోమవారం ఉదయం 6గంటలకు ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరానికి బయలుదేరి వెళతారు. కాళేశ్వరంలో దిగిన తరువాత గోదావరి నదిలో సిఎం సతీసమేతంగా పవిత్ర స్నానాలాచరించి కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని బంగారు కిరీటాన్ని బహుకరిస్తారు. పూజల అనంతరం ఇక్కడి నుంచి కనె్నపల్లికి చేరుకుని ఉదయం 7:25 నుంచి 8 గంటల వరకు పంప్‌హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. తదుపరి ఇక్కడి నుంచి తిరిగి 8గంటలకు హెలికాప్టర్‌లో 8:10 గంటల వరకు కాళేశ్వరం చేరుకుని అల్పహారం తీసుకుంటారు. అనంతరం 9:30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 9:40గంటల వరకు అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ ప్రతిపాదిత స్థలానికి చేరుకుని 9:50గంటలకు భూమి పూజ, పునాది రాయి వేస్తారు. ఇక్కడ కార్యక్రమాలు ముగిసిన తరువాత 10:35గంటలకు అంబట్‌పల్లి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. సిఎం పర్యటనలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం హెలికాప్టర్‌లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలు కరీంనగర్‌కు చేరుకున్నారు. వీరికి కలెక్టరేట్ హెలిప్యాడ్‌లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ స్వాగతం పలికారు. కాగా, తూర్పు డివిజన్‌లో సిఎం తొలిసారిగా పర్యటిస్తున్న సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను జిల్లా పోలీస్ శాఖ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాత్రి సిఎం బస చేసే తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌ను పోలీసులు ఒకరోజు ముందుగానే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే కాళేశ్వరం, కనె్నపల్లి, అంబట్‌పల్లి, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజాప్రతినిధులకు పాసులను జారీ చేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఎస్పీ జోయల్ డేవిస్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. సిఎం పర్యటించే ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. సుమారు 400 మంది వరకు పోలీసు సిబ్బందిని బందోబస్తు చర్యలకు నియమించారు.