తెలంగాణ

విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చలో కేశవరావు పాల్గొన్నారు. బయ్యారం ఉక్కు కార్మాగారాన్ని ఇంత వరకు ఎందుకు చేపట్టలేదని కేశవరావు నిలదీశారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం చేపట్టని పక్షంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వమే దీనిని చేపడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనికి తగు సహాయం చేస్తే సరిపోతుందని సూచించారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే తామీ రోజు ధైర్యంగా మా వాటా గురించి ఆడగగలుగుతున్నామనీ, మా హక్కుల కోసం పోరాడగలుగుతున్నామని కేశవరావు అన్నారు. రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకునేందుకు కేంద్రం ఉదారంగా సహాయం చేయాలని కేశవరావు కోరారు. ప్రత్యేక హైకోర్టు తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనమని, తక్షణం ఏర్పాటుచేయాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణాలో తాగునీటి కొరతను తీర్చేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
రెండేళ్లు అవుతున్నా హైకోర్టులు ఏర్పాటుచేయరా?: మహమ్మద్ అలీఖాన్
తెలంగాణ రాష్ట్రం కోసం గత అరవై సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సఫలం చేశారనీ, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల కలలను పండించారని కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ ప్రశంసించారు. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను కూడా డిమాండ్ చేశానని ఖాన్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఏ.పి.కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు. రెండేళ్లు పూర్తవుతున్నా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయకపోవటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయలేని వారు ఇతర హామీలను ఎలా పూర్తిచేస్తారని ఖాన్ ఎద్దేవా చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.