తెలంగాణ

నేడే ప్లీనరీ... ఏర్పాట్లు భారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీని బుధవారం ఖమ్మంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరానికి సమీపంలోని చెరుకూరి తోట వద్ద 4వేల మందితో ప్రతినిధుల సభను నిర్వహించేందుకు గానూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు మంగళవారం సాయంత్రానికే ఖమ్మం చేరుకున్నారు. వారందరికి ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ప్లీనరీని హైదరాబాద్‌లో జరుపుకున్న టిఆర్‌ఎస్ రెండవ ప్లీనరీని ఖమ్మంలో జరుపుకోవడం గమనార్హం. పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి పార్టీకి సంబంధించిన ఏ ప్రధాన కార్యక్రమం ఖమ్మంలో జరగలేదు. ఆ దృష్టితో ఖమ్మంలో జరిగే ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సభ ప్రాంగణంలో నాలుగు వేల మంది సులభంగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ వేదికపై 24మంది నేతలు మాత్రమే కూర్చోనున్నారు. ఈ సభలోనే 15ప్రధాన అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. కరవు, తాగునీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంశాలతో పాటు రాజకీయ తీర్మానాలను కూడా చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా సాయంత్రం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ సభా వేదిక 250మంది నేతలు కూర్చునేలా నిర్మించారు. పాలేరు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బహిరంగ సభనే ప్రచార వేదికగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ప్రచారానికి ముఖ్యమంత్రి మరోసారి వచ్చే అవకాశం లేకపోవడంతో ఖమ్మం జిల్లాకు ఈ సభపై నుంచే హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభ ద్వారానే ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ బలమైన పార్టీగా ఉందనే విషయాన్ని ప్రత్యర్థులకు తెలియజెప్పనున్నారు. ఇదిలా ఉండగా ప్లీనరీకి వచ్చే నేతలకు భారీ స్వాగత ఏర్పాట్లను చేశారు. ప్రధాన వీధులన్నింటిలోనూ భారీ ఫ్లెక్సీలను, ముఖ్యమంత్రి, తుమ్మల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్లీనరీ సభ జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా రోడ్లను వేశారు.
ప్రతినిధులతో, కార్యకర్తలు, ప్రజలతో నిర్వహించే ప్లీనరీ సభ, భారీ బహిరంగ సభలకు జిల్లా నేతలు అదే రీతిలో స్టేజీలను రూపొందించారు. ప్లీనరీ సభ వద్ద 7 అడుగుల ఎత్తు, 30 తి 60 అడుగుల స్టేజీని నేతలు ఏర్పాటు చేశారు. ఈ స్టేజీపై ముఖ్యమంత్రితో సహ మరో 24 మంది నేతలు ఆశీనులు కానున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే పార్టీ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో సహా 250 మంది స్టేజీపై ఆశీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. 100 తి 40 అడుగులతో ఈ స్టేజీని నిర్మించారు. స్టేజీపై ఆశీనులైన వారికి ప్రత్యేకంగా ఏసిలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించిన ఏసిలతో పాటు జంబో కూలర్లను ఈ వేదికలపై ఏర్పాటు చేశారు.
టిఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలకు పోలీస్‌లు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్లీనరీ, బహిరంగ సభల బందోబస్తులో ఏఎస్పీలు మగ్గురు, డిఎస్పీలు 17 మంది, సిఐలు 60 మంది, ఎస్‌ఐలు 125 మంది, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్ళు 245 మంది, మహిళా పోలీస్ కానిస్టేబుళ్ళు 145 మంది, పోలీస్ కానిస్టేబుళ్ళు 900 మంది, ఏఆర్ ఫోర్స్ నాలుగు ప్లాటూన్స్, హెచ్‌జిఎస్ 450 మంది, స్పెషల్ పార్టీలు 12 పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు బస చేసే హోటల్స్, అతిధిగృహాలను, ప్లీనరీ, బహిరంగ సభల వేదికలను, మైదానాలను పోలీసులు మంగళవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్లీనరీ ప్రాంతంలో, బహిరంగ సభ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలు మోహరించి వాహనాల తనిఖీ చేపట్టారు. నగరాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల నిబంధనలకు నగర, పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని డిఎస్పీ సురేష్‌కుమార్ సూచించారు. కాగా ప్లీనరీ దృష్ట్యా ఖమ్మం వచ్చి, పోయే వాహనాలను దారి మళ్లించారు.

చిత్రం... ప్రతినిధుల సభ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్రాంగణం ...