తెలంగాణ

పంచలోహ విగ్రహాల దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 26: పంచలోహ విగ్రహాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సుప్రసిద్ధ మల్లూరు నర్సింహస్వామి ఆలయం నుండి విగ్రహాన్ని చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో కోటి రూపాయల విలువ గల శ్రీకృష్ణ పంచలోహ విగ్రహం, పంచలోహ సుదర్శన చక్రంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే విగ్రహాలతో పాటు నిందితులను అరెస్టు చేశారు. ఆలయంలో విగ్రహాలు చోరీ అయినట్లు ఆలయ నిర్వాహకులకు కూడా తెలియకముందే పోలీసులు దొంగలను అరెస్టు చేయడం విశేషం. బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన దాసి ప్రవీణ్, భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన జంగా మధూకర్‌గా పోలీసులు ఈ దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం విగ్రహాల విలువ తెలుసుకునేందుకు హన్మకొండకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ములుగురోడ్ సమీపంలోని పెద్దమ్మగడ్డ బ్రిడ్జిపై సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీచేస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయ. వారిని విచారించగా మల్లూరు నర్సింహస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడినట్లుగా ఒప్పుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన క్రైం ఏసిపి ఈశ్వర్‌రావు, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్, ఏ ఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రాజు, కానిస్టేబుల్ మహ్మద్‌అలీ, రవి, జంపయ్య, రాజులను కమిషనర్ సుధీర్‌బాబు అభినందించి వారికి రివార్డులు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ విగ్రహాలను ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే సమాచారం అందించాలని కోరా రు. విగ్రహాల చోరీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటా మని, వారిపై పిడి యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ప్రత్యేక హైకోర్టు
ఏర్పాటు చేయాలి
లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ గుత్తా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: తెలంగాణకు తక్షణం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లవుతున్నా, హైకోర్టు ఏర్పాటు విషయంలో తాత్సారం ఏమిటని ప్రశ్నించారు. సిఎంలు, హైకోర్టు సిజెతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామంటూ కేంద్ర న్యాయ మంత్రి గతంలో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ సాగుతోందంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినా పని కావటం లేదని ఎద్దేవా చేశారు. ఇకమీదట ఎలాంటి జాప్యం లేకుండా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

రేపు రాత్రి ‘పేట’లో
సిఎం కెసిఆర్ బస
మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంట్లో ఏర్పాట్లు
సూర్యాపేట, ఏప్రిల్ 26: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం రాత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రాత్రి బస చేయనున్నారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పట్టణంలో బుధవారం జరిగే ప్లీనరీ, బహిరంగసభల్లో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి ఇక్కడి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసంలో రాత్రిబస చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బహిరంగసభ అనంతరం సిఎం నేరుగా ఇక్కడకు చేరుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. సిఎం బస చేయనుండడంతో పట్టణంలోని విద్యానగర్‌లో గల మంత్రి నివాసంలో ప్రత్యేక ఏర్పాట్లను చేపడుతున్నారు. సిఎంతోపాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులకు రాత్రి భోజన ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటిస్తుండడంతో పట్టణంలో భారీఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కొత్తబస్టాండ్ నుండి మంత్రి నివాసం వరకు రోడ్డు ఇరువైపుల భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు గులాబీ తోరణాలను అలంకరించారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. టిఆర్‌ఎస్ నేతలు మాత్రం సిఎం ఇక్కడే రాత్రి బస చేయనున్నారని చెబుతున్నారు.

కరీంనగర్‌లో
భారీ వర్షం
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, నిలిచిపోయన సరఫరా
విరిగిన చెట్లు, కొట్టుకుపోయిన రేకుల షెడ్లు
పలు మండలాల్లో నేలరాలిన మామిడికాయలు
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఏప్రిల్ 26: ఎండ ప్రచండంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయాన ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవడంతో కాస్తంత వాతావరణం చల్లబడగా, కొంతమేర బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడగా, పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. సుమారు గంట పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడంతో మూడు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని మల్లాపూర్, గొల్లపల్లిలో భారీ వర్షం పడగా, సారంగపూర్, జగిత్యాల, మల్యాల, పెగడపల్లి, సిరిసిల్ల, గంగాధర, గంభీరావుపేట, చొప్పదండి, కమాన్‌పూర్ తదితర మండలాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వరకు పడింది. మల్యాల, గంగాధరతోపాటు పలు మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులతో వాన పడటంతో పలు ప్రాంతాల్లో మామిడికాయలు నేలరాలాయి. సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు విపిఆర్ ఒబి కాంట్రాక్ట్ కంపెనీలో మంగళవారం రాత్రి పిడుగు పడ్డ ప్రమాదంలో ఆపరేటర్ సింగయ్య (40) మృతి చెందగా, నలుగురు డోజర్ ఆపరేటర్లు తీవ్రంగా గాయపడ్డారు. గంభీరావుపేట మండలంలో కోళ్లమద్ది గ్రామంలో పిడుగుపాటుకు అదే గ్రామానికి చెందిన అగ్గతి నారాయణ (55), మల్లాపూర్ మండలం గొరెపల్లి గ్రామానికి చెందిన బొడ సుక్యనాయక్ (50) అనే ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు. 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఒక చెట్టుపై పిడుగు పడగా, ఆ చెట్టుకు కట్టేసిన రెండు ఎద్దులు మృతి చెందాయ. గంగాధర మండలం గట్టుబూత్కూర్‌లో మరో ఎద్దు మృతి చెందింది.

ఛత్తీస్‌గఢ్‌లో మావోల స్థూపాన్ని
ధ్వంసం చేసిన పోలీసులు
ఎదురుకాల్పుల ఘటనలో జవానుకు గాయాలు
చింతూరు, ఏప్రిల్ 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసు బలగాలు మావోయిస్టుల స్థూపాన్ని ధ్వంసం చేయగా, ఎదురుకాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. వివరాలిలావున్నాయి... సిఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ ఫోర్సు బలగాలు గంగులూరు పోలీసు స్టేషన్ పరిధిలోని దండకారుణ్యంలో మంగళవారం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలకు మావోస్టులకు చెందిన 20 అడుగుల స్మారక స్థూపం కనబడింది. దీంతో పోలీసు బలగాలు ఈ స్థూపాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కాగా బీజాపూర్ జిల్లా బాసాగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 204 కోబ్రా బెటాలియన్ కువర్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో దీపుదాస్ అనే జవానుకు బులెట్ గాయాలైనట్టు ఆ జిల్లా ఎస్పీ ఇందిరా కల్యాణ్ తెలిపారు. గాయపడిన జవానును హెలికాఫ్టర్ ద్వారా రాయపూర్ తరలించి, వైద్యసేవలందిస్తున్నామని ఎస్పీ తెలిపారు.